case Registration
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్‌టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్‌రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, సిరిగిరి అర్జున్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఇవ్వండి ఫిర్యాదు.. పెట్టేద్దాం కేసు
సాక్షి నెట్వర్క్: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిన ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెచ్చిపోతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశి్నస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను సోషల్ మీడియాలో ప్రశి్నంచారని ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశి్నంచడంతో ప్రభుత్వం పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. సోషల్ మీడియాలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కొందరి పేర్లను ఎంపిక చేసి పచ్చ పార్టీ కార్యకర్తల ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తోంది. ఫిర్యాదులు అందుకున్నదే తడవుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలో ముగ్గురిపై.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై రేపల్లె నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. షేక్ మహ్మద్ ఖాజా మొహిద్దీన్‌పై నగరం మండలానికి చెందిన ఐటీడీపీ కన్వీనర్ జుజ్జూరి బాలనరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవికి చెందిన టీడీపీ నేత శొంఠి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు జింకల రామాంజనేయులుపై కేసు నమోదైంది. దిండికి చెందిన టీడీపీ నేత నాగకిశోర్ ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీసు స్టేషన్లో బత్తులపల్లి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల అదుపులో సోషల్ మీడియా కన్వీనర్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కాపారపు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావును కలవగా.. రమణపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారని కుటుంబ సభ్యులు వివరించారు. దివ్యాంగుడి పైనా పోలీసు ప్రతాపం నరసాపురానికి చెందిన బుడితి సుజన్‌కుమార్ అనే దివ్యాంగుడు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ భీమవరం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తుల సాయం ఉంటేనే గానీ అడుగు ముందుకు వేయలేని సుజన్‌కుమార్‌ను స్టేషన్‌కు రావాలంటూ పోలీసుల నుంచి పదేపదే ఫోన్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సుజన్‌కుమార్ తండ్రి తహశీల్దార్‌గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి టీచర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సుజన్‌కుమార్‌కు పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. బాధితుడు సుజన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు భయపడి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. తనకు భీమవరం పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్సై ఫోన్ చేసి.. మీరు సోషల్ మీడియా కేసులో ఇరుక్కున్నారని చెప్పి స్టేషన్‌కు రావాలన్నారని తెలిపారు.స్థానికేతరులపై స్థానిక నేతల ఫిర్యాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన స్థానికేతరులపై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యద్దనపూడి గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీను విశాఖపట్నం జిల్లా యండాడ గ్రామానికి చెందిన బై జయంత్‌పై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన గొర్రెపాటి నాగదుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బూడి వెంకటేశ్‌పై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చినగంజాం గ్రామ సర్పంచ్, కూటమి నాయకుడు రాయని ఆత్మారావు, తుమ్మలపెంట సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన ఇందుకూరి శ్రీనివాసరాజుపై చినగంజాం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సత్యసాయి జిల్లా రొద్దం మండలం సోషల్ మీడియా కార్యకర్త ఎన్.బాలాజీరెడ్డి పోస్టులు పెడుతున్నారని నెల్లూరు టీడీపీ నాయకుడు షేక్ ముఫీద్ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్జీవీపై తుళ్లూరులో ఫిర్యాదు సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దున్నపోతులకు పవన్‌కళ్యాణ్, లోకేశ్ ఫొటోలు మారి్ఫంగ్ చేసి పెట్టడం, చంద్రబాబును పవన్‌కళ్యాణ్ ఎత్తుకున్నట్టు పెట్టిన పోస్టులపై తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి ఆయనకు నోటీసులు పంపినట్టు దర్యాప్తు అధికారి, ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్‌బాబు మంగళవారం తెలిపారు. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం పోలీసుస్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కనీ్వనర్ బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళి గతంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని బాడిత శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ప్రెస్‌మీట్ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కర్ణాటకలో నిర్మలపై కేసు
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.నిర్మల రాజీనామా చేయరా: సిద్ధుకేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
టార్గెట్ జోగి రమేష్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు తెరతీసింది. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసి, దానిని విక్రయించిన వ్యవహారంలో అక్రమ కేసు నమోదు చేసింది. పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేసిన ఓ భూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తోపాటు, చిన్నాన్న వెంకటేశ్వరరావును నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాక.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలతో పేరుతో హల్చల్ చేశారు. అనంతరం.. జోగి రాజీవ్‌ను ఎలాంటి నోటీసులివ్వకుండానే అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగి సతీమణి శకుంతల.. మా బిడ్డ ఏం పాపం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం.. ఏసీబీ కార్యాలయం వద్దకు జోగి రమేష్ చేరుకుని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నిజానికి.. గతంలో టీడీపీ నేతలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. ఆ ఉదంతంతో చంద్రబాబు అతనిపై కక్షగట్టి ఇప్పుడు వేధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక జోగి రమేష్ తనయుని అరెస్టు వార్త తెలియగానే వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, వెలంపల్లి, దేవినేని అవినాష్, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు, వైఎస్సార్సీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ ఆరెస్టులపై పోరాడతామని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులన్నీంటిని ఎదుర్కొంటామని చెప్పారు. తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. ఇందులో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగాదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్ విజయకుమార్, విజయవాడ రూరల్ తహశీల్దారు, నున్న సబ్‌రిజి్రస్టార్ ఉన్నారు. సీఐడీ కేసు విచారణలో ఉండగానే ఏసీబీ హడావిడిగా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దేదీప్యను విచారించారు. మరోవైపు.. గతంలో చంద్రబాబు ఇంటివద్ద నిరసన చేపట్టిన కేసులో జోగి రమే‹Ùకు మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు పలువురు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. అక్రమ కేసులపై పోరాటం చేస్తాంమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారని, అక్రమంగా అరెస్టులు చేస్తారన్నారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్ చేశారన్నారు. చంద్రబాబును నిలదీయకుండా వదలమన్నారు. జోగి రమేష్‌కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు.. కొనుక్కున్న వారు లేరు.. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా? అని ప్రశ్నించారు. ఈ తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారని నాని చెప్పారు. జోగి రమేష్ సతీమణి మాట్లాడుతూ.. అప్పటి సీఎం జగన్‌గారిని ఉద్దేశించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడడంవల్లే తన భర్త నిరసన తెలపడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లారని.. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీసీ అయిన జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీమంత్రి వెలంపల్లి అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. తాము పరామర్శకు రావొద్దా అని మాజీమంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అలాగే, జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. అందుకే జగన్ ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ చెప్పారు. 14 రోజులపాటు రిమాండ్ ఇదిలా ఉంటే.. జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి హిమబిందు ఎదుట హాజరుపర్చగా ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. నిందితుని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.మా నాన్నపై కక్ష తీర్చుకునేందుకే..నా తండ్రిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అక్రమ కేసులు పెట్టారు. ఈనాడులో ప్రకటన చూసే కొన్నాం.. అలాగే, ప్రకటన ఇచ్చే అమ్మాం. ఈ వ్యవహారాన్ని లీగల్‌గానే కోర్టులోనే తేల్చుకుంటాం. – జోగి రాజీవ్, జోగి రమేష్ తనయుడు నాపై కక్షతో నా కొడుకుపై కేసు.. మా అబ్బాయి మీద కేసు నమోదు చేయడం దుర్మార్గం. చంద్రబాబూ.. నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అటాచ్ అయిన అగ్రిగోల్డ్ భూములు ఎవరైనా కొంటారా? కావాలనే కక్షతోనే నా కొడుకుని అరెస్టుచేశారు. ఇది బలహీనవర్గాలపైన, గౌడ కులస్తుపైన దాడిగా నేను భావిస్తున్నా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పుచేసినట్లు రుజువుచేస్తే ఆత్మహత్య చేసుకుంటాం. – జోగి రమేష్, మాజీమంత్రి ఇద్దరిని అరెస్టు చేశాం విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న అవ్వా శేషనారాయణకు చెందిన అగ్రిగోల్డ్ భూమి కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùలను అరెస్ట్‌చేశాం. ఇందులో ఐదుగురు నిందితులను గుర్తించాం. తదుపరి విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టుచేస్తాం. – సౌమ్యలత, ఏసీబీ అడిషనల్ ఎస్పీ -
సుప్రీంకోర్టు వారించినా వినరా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేశ్ తయారు చేసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లు మరోసారి నిరూపితమైంది! ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కారు తాజాగా తప్పుడు కేసు నమోదు చేయడమే అందుకు తాజా నిదర్శనం. 2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. తాజాగా అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది. నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్లో ఫిర్యాదు చేయడం... ఆ వెనువెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.బెడిసికొట్టిన పన్నాగం.. రఘురామను హింసించలేదన్న వైద్య నివేదికలుసమాజంలో వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న కె.రఘురామకృష్ణరాజుపై సీఐడీ అధికారులు 2021 మే నెలలో కేసు నమోదు చేశారు. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసే సమయంలో సీఐడీ అధికారులపై దాడికి పాల్పడినా ఎంతో సంయమనం పాటిస్తూ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో రఘురామరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన ప్లేటు ఫిరాయించి గుంటూరు మెజి్రస్టేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో అసత్య ఆరోపణలు చేశారు. కస్టడీలో సీఐడీ అధికారులు తనను కొట్టారని... హింసించారని ఆరోపిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు తనను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించారని ఆరోపిస్తూ దానిపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఆయనకు వైద్యుల బృందంతో పరీక్షలు నిర్వహించి నివేదిక సమ ర్పించాలని గుంటూరు జీజీహెచ్ వైద్య అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో నలుగురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎక్స్‌రే, స్కాన్లు తీసింది.రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. సీఐడీ అధికారులు కస్టడీలో ఆయన్ను శారీరకంగా హింసించలేదని నిర్ధారించింది. అదే విషయాన్ని హైకోర్టుకు నివేదించింది. సీఐడీ అధికారులు నిజంగానే కస్టడీలో శారీరకంగా హింసించి ఉంటే అవి ఎక్స్‌రే, స్కాన్ రిపోర్టులలో బయటపడేవి. అలాంటిది ఏమీ లేకపోవడంతో వైద్య బృందంలోని నలుగురు డాక్టర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ నివేదిక సమర్పించారు. ఒకవేళ నలుగురు వైద్యుల్లో ఎవరైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉంటే మరోసారి వైద్య పరీక్షలు చేయాలని ఇతర ఆస్పత్రులకు హైకోర్టు అప్పుడే ఆదేశించి ఉండేది. ఈ నేపథ్యంలో రఘురామను సీఐడీ అధికారులు శారీరకంగా హింసించలేదని పూర్తి ఆధారాలతో వైద్యులు నిగ్గు తేల్చిన నివేదికను హైకోర్టు ఆమోదించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో రఘురామను జ్యుడిషియల్ కస్టడీ కోసం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడిని జైలుకు తరలించడంతో సీఐడీ / పోలీసు అధికారుల బాధ్యత ముగుస్తుంది. తరువాత పరిణామాలతో వారికి సంబంధం ఉండదు. సుప్రీం తీర్పులు పట్టవా? ఏదైనా కేసులో 77 రోజుల తరువాత సాక్షులను విచారించడం సరికాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. రఘురామ ఫిర్యాదు విషయంలో ఏకంగా మూడేళ్ల తరువాత... అదీ అప్పటికే ఆ ఆరోపణలతో దాఖలైన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాలతో చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల చర్య కచ్చితంగా కక్ష సాధింపేనని స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం కోర్టు ధిక్కారమేనని తేల్చి చెబుతున్నారు. ఆరోపణలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు తిరస్కరణహైకోర్టులో చుక్కెదురు కావడంతో రఘురామ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా జైలులో ఒక రోజు ఉన్న తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం అక్కడి నుంచి పోలీసుల వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లారు. రెండు రోజుల తరువాత ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను పోలీసులు కొట్టినట్టు ఆ వైద్య పరీక్షల్లోనూ వెల్లడి కాలేదు. అయితే సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించిన ఆయన.. సీఐడీ కస్టడీలో తనను గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామరాజు ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దాంతో రఘురామ ఎత్తుగడ బెడిసికొట్టింది. తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని, శారీరకంగా హింసించారంటూ రఘురామ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ అధ్యాయానికి తెర పడింది. కక్ష సాధింపుతో తప్పుడు కేసు.. ఒక రోజు ముందే పోలీసులకు ఉప్పు.. రెడ్ బుక్ రాజ్యాంగాన్నే తమ ప్రభుత్వం అనుసరిస్తుందని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. రఘురామను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించలేదని నిర్థారిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతర్ చేశారు. గుంటూరు జీజీహెచ్, హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యుల నివేదికలను బుట్ట దాఖలు చేస్తూ కేవలం కక్ష సాధింపే తమ విధానమని మరోసారి చాటుకున్నారు. 2021 మేలో తనను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించారని ఆరోపిస్తూ మూడేళ్ల తరువాత రఘురామరాజు ఈ ఏడాది జూన్ 11న పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని కోర్టులో పిటిషన్ వేసిన ఆయన.. ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం 2021లో సీఐడీ అదనపు డీజీగా ఉన్న పీవీ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు(వాస్తవానికి అప్పట్లో ఏసీబీ అదనపు డీజీగా ఉన్నారు)తోపాటు నాటి సీఎం జగన్‌ను నిందితులుగా పేర్కొనడం గమనార్హం. వారితోపాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతి, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై కూడా ఆరోపణలు చేశారు. మరో విచిత్రమేంటంటే రఘురామరాజు ఈ ఏడాది జూన్ 11న ఫిర్యాదు చేయగా అంతకు ఒకరోజు ముందే అంటే జూన్ 10నే ఆయన ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా కోరారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందో స్పష్టమవుతోంది. రఘురామ ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరపాలెం పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్, డాక్టర్ ప్రభావతిలతోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సోమిరెడ్డిపై కేసు నమోదు
పొదలకూరు: ఎన్నికల వేళ ప్రచారంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. మానవతా దృక్పథంతో సాయం చేశారంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తోసిపుచ్చారు. వీడియో విజువల్స్‌లో స్పష్టంగా సోమిరెడ్డి మహిళలకు నోట్లు ఇవ్వడం కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.దీనిపై కాకాణి పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి ప్రలోభాల పర్వంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చినఓబులేసు పొదలకూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్‌రెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు పంపిణీ చేశారు. సోమిరెడ్డి అనుచరులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దీనిపై మండలస్థాయి అధికారులతో విచారణ జరిపించి.. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు అందజేసినట్టు నివేదిక సమర్పించి మమ అనిపించారు. ఎట్టకేలకు కాకాణి హెచ్చరికలతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై ఐపీసీ 173–ఈ, ఆర్పీ యాక్ట్ 123 క్లాజ్–1 సెక్షన్ల కింద పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. -
టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: టీడీపీ ఎన్నికల అక్రమాలపై పోలీసు శాఖ కొరఢా ఝళిపించింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం తదితర అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో కేసు నమోదు చేసింది. ఏ1గా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు ఆయన చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ నెల 24న గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీలో నిర్వహించిన సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతించాలని పోలీసులు పర్చూరు మున్సిప్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల వినతిని పరిశీలించిన కోర్టు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారించేందుకు సోమవారం అనుమతి ఇచ్చింది. దాంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 123 (1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్ విత్ 120(బి), సీఆర్పీసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరితోపాటు పరారీలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు, ఆ కంపెనీకి చెందిన మరో ముగ్గురు ఉద్యోగులు, మరికొందరిని నిందితులుగా చేర్చారు. డీఆర్ఐ సోదాల్లో బయటపడిన అక్రమాలు జీఎస్టీ ఎగవేతను గుర్తించేందుకు గుంటూరులో ఉన్న ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు ఈనెల 24న సోదాలు నిర్వహించడంతో ఆయన పాల్పడ్డ ఎన్నికల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కార్యాలయంలో లభించిన ఓ డైరీలో కీలక విషయాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తెప్పించడం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించడం.. అందుకోసం ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్ బూత్‌లవారీగా నమోదు చేసి ఉన్నాయి. ఆ మేరకు ఖర్చు చేసిన నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే వివరాలు ఏవీ కంపెనీ రికార్డుల్లో లేవు. అంటే షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా నిధులు తరలించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టమైంది. దాంతో డీఆర్ఐ అధికారులు ఈ అంశాన్ని ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ ప్రధాన కార్యాలయాలకు నివేదించారు. ఎన్నికల అక్రమాలపై బాపట్ల పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి, తదితరులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు బాపట్ల న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజాస్వామ్యవాదుల హర్షం గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఏలూరిపై కేసు నమోదు కావడం పర్చూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేపై కేసు నమోదుకావడం పట్ల ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరిని పోలీసులు విచారించే క్రమంలో అవసరమైతే ఆయనను అరెస్ట్‌చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. తొలి నుంచీ అక్రమాలే.. నోవా అగ్రిటెక్ స్థాపించినప్పటి నుంచి ఏలూరి సాంబశివరావు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కంపెనీ తయారు చేసే నాసిరకం బయో మందులతో రైతులకు నష్టాలు మిగిలాయన్న ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో ఆ మందులను పెద్ద ఎత్తున విక్రయించి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయలు ఏలూరి దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు–చెట్టు కింద చెరువులు తవ్వాలని ఏలూరి పట్టుబట్టారు. దీనిని దళితులు వ్యతిరేకించారు. దళితులు– ఏలూరికి మధ్య గొడవ అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. మార్టూరు మండలంలో 250కి పైగా గ్రానైట్ పరిశ్రమలు ఉండగా ఇందులో 90 శాతం మంది యజమానులు ఒకే సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే బయటకు తరలిపోతుంది. ఇందుకు ఎమ్మెల్యే ఏలూరి సహకరిస్తుండటంతో ఆయనకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్ట చెబుతున్నారని తెలుస్తోంది. మరోపక్క ఎన్ఆర్ఐలు పంపించే నల్లధనాన్ని సైతం ఏలూరి ఎన్నికల అక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి 15 వేలకుపైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇటీవల సదరు దొంగ ఓట్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. డైరీ వెల్లడించిన ఎన్నికల అక్రమాలు.. ► పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ► మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ. 3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ. ► నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ. ► ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ. 15 లక్షలు పంపిణీ. ► పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ► ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. పర్చూరు ఎన్నికల అక్రమాల నిందితులు.. ఏ1: ఏలూరి సాంబశివరావు, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏ2: పుల్లెల అజయ్ బాబు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ3: అప్పారావు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ4: బాజి బాబు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ5: సాయి గణేశ్, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ6: ఇతరులు అక్రమాలపై లోతుగా విచారిస్తాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోవా అగ్రిటెక్ అక్రమాల వ్యవహారాన్ని లోతుగా విచారించాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు కంపెనీ ఉద్యోగులను విచారించాలి. ఇందుకోసం వారిపై కేసులు నమోదు చేశాం. ఈ మేరకు పర్చూరు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి తీసుకొని సోమవారం ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశాం. – వకుల్ జింధాల్, ఎస్పీ, బాపట్ల జిల్లా. -
అంబానీకి మళ్లీ బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్‌తో మరోసారి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు. అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ–మెయిల్ సరీ్వస్ ప్రొవైడర్ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్ ఐడీకి శుక్రవారం మెయిల్ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్ సారాంశం. దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి ఫోన్ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. -
ఐదెకరాల్లో గంజాయి పంట ధ్వంసం
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/అనకాపల్లి టౌన్: గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న ఐదు ఎకరాల్లోని గంజాయి పంటను ఎస్ఐ శ్రీనివాస్‌తో కూడిన బృందం మంగళవారం గుర్తించింది. గ్రామస్తుల సహకారంతో గంజాయి మొక్కలను ఒక చోటకు చేర్చి తగులబెట్టారు. పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాల కూడలిలో మంగళవారం 280 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంక్షన్లో ఎస్ఐ సింహాచలం వాహనాలను సాధారణ తనిఖీ చేస్తుండగా అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న కారులో గంజాయి బయటపడింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కారు డ్రైవర్ తూము బాలిరెడ్డిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.5.5 లక్షలు ఉంటుందని సీఐ దాడి మోహన్‌రావు చెప్పారు. -
అడ్డంగా బుక్కయిన చంద్రబాబు!
చిత్తూరు అర్బన్/బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దాడులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు. కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది. అంతా వ్యూహం ప్రకారమే.. ఈ నెల 4న ఉదయం 10:30 గంటలకు నాయన చెరువుపల్లెలో పనుల పరిశీలనకు రావాల్సిన చంద్రబాబు 12 గంటలు దాటాక చేరుకున్నారు. నేరుగా పనుల పరిశీలనకు వెళ్లకుండా షెడ్యూల్‌ను పక్కనపెట్టి ములకలచెరువులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడినుంచి నాయన చెరువుపల్లెకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బురకాయలకోటలో కారు ఫుట్ బోర్డుపైకి ఎక్కి రోడ్‌షో నిర్వహించారు. బి.కొత్తకోట మండలంలో హంద్రీ–నీవా కాలువను కొద్దిసేపు పరిశీలించారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్‌షో, ప్రసంగం లేదు. కానీ.. మసీదు వద్దకు రాగానే చంద్రబాబు తాను ప్రయాణించే కారుపై రోడ్‌షో నిర్వహించారు. నాయన చెరువుపల్లె, హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన మినహా షెడ్యూల్ మేరకు మిగతా ఏ కార్యక్రమం లేదు. కానీ.. ఆద్యంతం షెడ్యూల్‌కు భిన్నంగానే చంద్రబాబు పర్యటన కొనసాగించారు. ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు విధ్వంసక వ్యూహం ప్రకారమే వచ్చినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి హంద్రీ–నీవా కాలువ వద్ద రైతులతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. దానిని రద్దు చేసుకుని మరీ అంగళ్లు గ్రామానికి చేరుకున్న చంద్రబాబు మసీదు వద్దకు రాగానే కారుపై నిలబడి రోడ్‌షో ప్రారంభించారు. అంగళ్లులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. పిచ్చలవాండ్లపల్లె రిజర్వాయర్‌పై చంద్రబాబు కోర్టులో కేసు వేయించి పనులు అడ్డుకున్నందుకు నల్లకండువాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ గొడవకు ఉసిగొల్పారు. అంతటితో ఆగక ‘పుంగనూరులో ఆ పుడింగి సంగతి తేలుద్దాం.. పదండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో అప్పటికే ముందస్తు వ్యూహం ప్రకారం పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ మూక, అల్లరి మూక విధ్వంసకాండకు దిగారు. అంగళ్లులో చెలరేగిన టీడీపీ నేతల రౌడీయిజంలో వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు వద్ద మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలతో చేసిన దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ రణ«దీర్ ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయారు. డీఎస్పీ బాబుప్రసాద్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మహిళా ఎస్ఐ కరీమున్నీసా నడవలేని పరిస్థితి. -
సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. పోలీసుల తరపున దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్‌రెడ్డి వివరించారు. ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు. ఆ కాల్‌డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్‌ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
పెద్దల ముందే నరికి చంపాడు..
ఎల్కతుర్తి: తోడబుట్టిన అన్న ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆస్తిని వదిన తీసుకుంటే తనకు ఏమీ దక్కదని కక్ష పెంచుకున్న మరిది.. పంచాయితీ పెద్దమనుషుల సమక్షంలోనే ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. ముల్కనూర్‌కు చెందిన పురాణం స్వరూప (35) భర్త జంపయ్య గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆస్తి విషయంలో భర్త తమ్ముడు సమ్మయ్యతో గొడువలు జరుగుతున్నాయి. ఆస్తిలో వాటాల విషయమై మాట్లాడటానికి స్వరూప తన తమ్ముడు మౌటం గురువయ్య, అతడి భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం పెద్దమనుషుల సమక్షంలో కూర్చుని మరిది సమ్మయ్యను పిలిపించింది. ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే సమ్మయ్య వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో వదిన స్వరూపపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. పెద్దమనుషులు ఆపే ప్రయత్నంచేసినా వినకుండా స్వరూప మెడ, ఇతర శరీర భాగాలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
డైరెక్ట్ సెల్లింగ్ పేరిట రూ.1000 కోట్ల దందా!
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ప్రారంభమైన ఈ–స్టోర్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల దందా సాగించినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రెండు రకాలైన స్కీములతో అమాయకులను ఆకర్షించి భారీ స్కామ్‌కు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. డీసీపీ డాక్టర్ పి.శబరీష్, ఏసీపీ ఎన్.అశోక్ కుమార్‌లతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. యాక్సస్ ఈ–కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆయుర్‌కేర్ హెల్త్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ–స్టోర్ ఇండియాను నిర్వహిస్తోంది. దీనికి హిమాయత్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన మనీష్ కత్తి, సయ్యద్ అజ్మల్ సజ్జద్ మార్కెటింగ్ ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేసుకున్న యాక్సస్ ఈ కార్ప్ సంస్థ తమ స్కీమ్‌లకు ప్రభుత్వ అనుమతి ఉందని నమ్మబలుకుతూ నిరుద్యోగులకు ఎర వేస్తోంది. ఈ రెండు స్కీముల పేరుతో... ఇండివిడ్యువల్ డి్రస్టిబ్యూషన్ స్కీమ్ కింద అనేక మందిని ఈ–స్టోర్ ఇండియా సభ్యులుగా చేర్చుకుంది. ఎవరైనా రూ. 8,991 చెల్లించి సభ్యుత్వం తీసుకుంటే వారికి సంస్థ రూ. 9 వేల విలువైన ఆయుర్వేద ఉత్పత్తులు, కంపెనీ పేరుతో ఉన్న బోర్డు అందిస్తుంది. బోర్డును తమ ఇల్లు, దుకాణం ముందు తగిలించి ఆ ఫొటోను సంస్థకు పంపాలి. అప్పటి నుంచి కంపెనీ 36 నెలలపాటు నెలకు రూ. 1,100 చొప్పున ఇస్తామని చెప్పి పన్ను మినహాయింపుల తర్వాత రూ. 825 కొంతకాలం చెల్లిస్తుంది. ఈ సభ్యుడికి ఓ గుర్తింపు నంబర్ ఇచ్చి మరో రూ.9 వేల విలువైన ఈ–స్టోర్ ఉత్పత్తులను కొనేలా చేస్తుంది. అందుకు ప్రతిగా కొంతకాలం సభ్యుడికి చెల్లింపులు చేసి ఆపై బోర్డు తిప్పేస్తుంది. ఇక సూపర్ మార్కెట్ స్కీమ్‌లో పెట్టుబడి భారీగా ఉంటుంది. ఒక్కో వ్యక్తి రూ. 25 లక్షల చొప్పున చెల్లించి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అద్దె, మౌలికవసతులు, ఉద్యోగులను తామే ఏర్పాటు చేస్తామని కంపెనీ నమ్మబలుకుతుంది. వందల మంది నుంచి రూ. కోట్లు.. ఈ సంస్థ స్కీముల్లో చేరి దేశవ్యాప్తంగా అనేక మంది రూ. వందల కోట్లు నష్టపోయారు. ఇప్పటివరకు రూ. 1000 కోట్ల దందా చేసిన ఈ–స్టోర్ ఇండియా 300 మందిని ముంచింది. వారిలో రాష్ట్రానికి చెందిన 44 మంది కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించి మనీష్, అజ్మల్ సజ్జద్‌లను అరెస్టు చేశారు. -
ట్రంప్ అరెస్టయితే వాట్ నెక్ట్స్? అమెరికాలో కల్లోలం రేగుతుందా?
నన్ను అరెస్ట్ చేస్తారంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కల్లోలం రేగింది. శృంగార తారతో లైంగిక సంబంధాల్ని పెట్టుకొని 2016 ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరెత్తకుండా ట్రంప్ భారీగా డబ్బులు ముట్టజెప్పారన్న కేసును న్యూయార్క్ జ్యూరీ గత కొన్ని వారాలుగా రహస్య విచారణ సాగిస్తోంది. కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ఆయనపై నేరాభియోగాలు నమోదవుతాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ లైంగిక సంబంధాల ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2006 ఏడాదిలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ట్రంప్ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియెల్స్ ఒకప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. ట్రంప్ నిర్వహించే రియాల్టీ షో ‘ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించి తనతో గడిపారని ఆరోపణలు గుప్పించారు. అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసి హనీబంచ్ అని ముద్దుగా పిలిచేవారని చెప్పుకొచ్చారు. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆమె ఈ విషయాలపై నోరెత్తకుండా ఉండేందుకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పారట. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కొహెన్ తొలుత ఈ డబ్బులు డేనియెల్స్‌కు చెల్లిస్తే, ఆ తర్వాత ట్రంప్ మైఖేల్‌కి డబ్బులు ఇచ్చారు. మైఖేల్ తనకు డబ్బులు ఇచ్చినట్టుగా డేనియల్స్ చెబుతూ ఉంటే, అవి లాయర్‌కి ఫీజు చెల్లించినట్టుగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఏం జరగబోతోంది ? డబ్బులిచ్చి పోర్న్ స్టార్ నోరుమూయించారన్న ఆరోపణలపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఆధారాలన్నీ సేకరించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆయన మాజీ లాయర్ కోహెన్ సాక్ష్యమిచ్చారు. డేనియెల్స్‌కు డబ్బులు ఇచ్చినట్టుగా కోర్టు ఎదుట అంగీకరించారు. మైఖేల్ కోహెన్‌కు లీగల్ అడ్వైజర్‌గా పని చేసిన రాబర్ట్ కోస్టెల్లో ఇన్నాళ్లూ ట్రంప్‌కు వ్యతిరేకంగా జ్యూరీలో మాట్లాడి ఇప్పుడు ఎదురు తిరిగినట్టుగా తెలుస్తోంది. ట్రంప్‌కి అనుకూలంగా సాక్ష్యమిచ్చినట్టుగా సమాచారం. ట్రంప్ కోర్టుకి హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రాండ్ జ్యూరీ ఏం చెయ్యాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒక కేసులో నిందితుడిని దోషిగా లేదంటే నిరపరాధిగా తేల్చే అధికారం గ్రాండ్ జ్యూరీకి ఉండదు. కేవలం ఆధారాలు సేకరించి నేరాభియోగాలు మోపగలదు. అయితే మన్హటన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఆధారాలుంటే నిందితుడ్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసుని నమోదు చేస్తారు. అదే జరిగితే తొలిసారి క్రిమినల్ కేసులుఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ అవుతారు. ఈ అభియోగాలు రుజువై ట్రంప్ దోషిగా తేలితే నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడతానని ప్రకటించిన ట్రంప్ ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. దేశాధ్యక్షుడిగా పోటీ పడే వ్యక్తి నేరచరిత్ర, జైలు జీవితం వంటి అంశాలపై అమెరికా రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో జైలు శిక్ష అనుభవిస్తూ అధ్యక్షుడయ్యే అవకాశం అభ్యర్థికి ఉంది. సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఈ నేరారోపణలు నైతికంగా ట్రంప్‌ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి ఓట్లు అడగడం, చర్చా కార్యక్రమంలో పాల్గొనడం వంటివి ప్రజల ఎదుట ఆయన స్థాయిని తగ్గిస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ దాడుల్ని తలపిస్తాయా? ట్రంప్ అరెస్ట్‌యితే దేశంలో ఆయన అనుచరులు ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తారోనన్న ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ తాను అరెస్ట్ అవుతానని, అందరూ నిరసనలకు దిగాలంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అశాంతిని రేపుతోంది. దేశాన్నే చంపేస్తోంది. ఇదే తగిన సమయం. మనందరం మేల్కోవాలి. గట్టిగా నిరసనకు దిగాలి’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. 2021 జనవరిలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఎన్నికల్లో అక్రమాల కారణంగానే తాను ఓడిపోయాయని ట్రంప్ భావించడం, ఆయన అనుచరులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి, హింసాకాండతో దేశం అట్టుడికిపోయింది. ఈసారి ట్రంప్ అనుచరులు న్యూయార్క్ కోర్టుపై దాడులకు తెగబడతారన్న అనుమానాలున్నాయి. మన్హటన్ న్యాయవాది బ్రాగ్ న్యూయార్క్ పోలీసులతో మాట్లాడి కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత కలి్పంచాల్సిందిగా రాసిన లేఖ ఒకటి మీడియాకు లభ్యమైంది. కోర్టులు, ఇతర కార్యాలయాలపై ఎవరి కన్ను పడినా, వారిని పూర్తిగా విచారించే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఉంది. ట్రంప్ ఎదుర్కొంటున్న ఇతర కేసులు ♦ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ప్రభుత్వ రహస్య పత్రాలను ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తీసుకునివెళ్లారన్న ఆరోపణలపై కేసు విచారణ కొనసాగుతోంది. ♦ అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాతఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్అనుచరులు 2021 జనవరి 6నఅమెరికన్ క్యాపిటల్ భవనంపై దాడి చేసి హింసాకాండ సృష్టించిన కేసు. ♦ 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేలా ట్రంప్, ఆయన అనుచరులబృందం నడుచుకున్నట్టు నమోదైన కేసు. -
జడ్జినే బెదిరించాడు!
జైపూర్: మార్ఫ్డ్ ఫొటోలను పంపి రూ.20 లక్షలివ్వకుంటే వాటిని బయటపెడతామంటూ మహిళా జడ్జిని బెదిరించిన ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జడ్జికి ఫిబ్రవరి 7న ఒక పార్సిల్ వచ్చింది. జడ్జి పిల్లలు చదివే స్కూలు నుంచి వచ్చిందంటూ ఓ అగంతకుడు పార్సిల్‌ను కోర్టు స్టెనోగ్రాఫర్‌కు ఇచ్చాడు. పేరు అడగ్గా చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ పార్సిల్లో కొన్ని స్వీట్లతోపాటు అభ్యంతరకరంగా ఉన్న జడ్జి ఫొటోలు కనిపించాయి. రూ.20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తాననే హెచ్చరికతో కూడిన ఉత్తరం ఉంది. జడ్జి చాంబర్‌లోని సీసీ కెమెరాలో ఓ 20 ఏళ్ల యువకుడు పార్సిల్ తెచ్చినట్లుగా రికార్డయింది. మరో 20 రోజుల తర్వాత జడ్జి ఇంటికి మళ్లీ ఒక పార్సిల్ వచ్చింది. ‘రూ.20 లక్షలు సిద్ధంగా ఉంచు. సమయం, ప్రాంతం త్వరలోనే చెబుతా’అంటూ లేఖ ఉంది. బాధిత న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేశారు. ఆగంతకుడిని గుర్తించామని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో ఓ కానిస్టేబుల్ పీకల దాకా మద్యంతాగి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. పోలీసులు,స్థానికులు తెలిపిన మేరకు..ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజమల్లయ్య (35) మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్వాల్‌గూడ ఔటర్‌రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డులో తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి డబ్బు వసూలుకు కూడా పాల్పడ్డాడని పేర్కొన్నారు. గచ్చిబౌలి నుంచి వస్తున్నఅశ్విన్ రెడ్డి దంపతులను కారు ఆపి అసభ్యకరంగా మాట్లాడడంతో వారు 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు. -
బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు
వించిపేట (విజయవాడ పశ్చిమ): టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోయింది. మహిళలన్న గౌరవం, విచక్షణ లేకుండా బరితెగించి లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ప్రజల్లో ఉనికి కోల్పోతున్నామనే అక్కసుతో ప్రశ్నించిన వారిపై మూకుమ్మడి దాడులకు దిగుతుండటం నిత్యకృత్యమైంది. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేయడమే టీడీపీ విధానంగా.. ఆ పార్టీ నేతలు బజారు రౌడీలను మించి కొట్లాటలకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తమ కుటుంబంలోని మహిళను ఎందుకు వేధించారని ప్రశ్నించిన పాపానికి విజయవాడలో టీడీపీ నేత ఒకరు ఏకంగా 20 మందికి పైగా అనుచరులతో కలిసి.. కత్తులతో ఆ మహిళ కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలిచింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. విజయవాడ నగరంలోని 55వ డివిజన్ (వించిపేట) టీడీపీ అధ్యక్షుడు వడ్డాది రమణ తమ్ముడు వడ్డాది నరేష్ నెల రోజులుగా స్థానికంగా నివసించే ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బయటకు వెళ్తున్న ఆమెపై చేతులు వేసి, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆమె అత్త, మామ, మరిది కలిసి టీడీపీ నాయకుడు వడ్డాది నరేష్ ఇంటి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు రమణ, నరేష్ ఇంటి వద్ద లేరు. జరిగిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పి.. మరోసారి ఇలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించి వచ్చేశారు. మా ఇంటి వద్దకే వస్తారా.. బాధితులు తమ ఇంటి వద్దకు వచ్చి వెళ్లారనే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వడ్దాది రమణ, నరేష్.. 20 మంది అనుచరులతో కలిసి వివాహిత ఇంటిపైకి దాడికి వెళ్లారు. ‘మా ఇంటికే వచ్చి హెచ్చరిస్తారా.. మీకెంత ధైర్యం.. ఇప్పుడు మీకు ఎవరు అడ్డువస్తారో చూస్తాం..’ అని బూతులు తిడుతూ వివాహిత మామ ఏడుకొండలు, అత్త భారతి, మరిది అరుణ్‌కుమార్‌తో పాటు స్థానిక యువకుడు హేమంత్పై కత్తులతో దాడి చేశారు. అరుణ్‌కుమార్‌కు పొత్తి కడుపులో, మిగలిన వారి ఒంటిపై పలు చోట్ల గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు వడ్డాది రమణ, వడ్డాది నరేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ కత్తులు పట్టుకుని ఇలా ఇంటి పైకి రావడం దారుణం అని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మెహుల్ చోక్సీపై తాజా కేసు
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంను రూ. 55.27 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై సీబీఐ తాజా ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. చోక్సీ, చేత్నా ఝవేరి, దినేష్ భాటియా, మిలింద్ లిమాయేసహా గతంలో గీతాంజలి జెమ్స్‌లో భాగమైన డిడామస్ జ్యువెలరీగా పిలవబడే బెజెల్ జ్యువెలరీ, దాని పూర్తికాల డైరెక్టర్లపై 2021 ఆగస్టు 30న బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అనంతరం దాదాపు ఏడాది తర్వాత ఏజెన్సీ చర్య తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 22న అనుమతించడంతో సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముంబైలోని ఝవేరీ, భాటియా, లిమాయే నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జనవరి 2018లో చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోడీ చేసిన రూ. 13,000 కోట్ల భారీ మోసాన్ని వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. -
కాన్పూర్ హింస..800 మందిపై కేసులు
కాన్పూర్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వీరిలో 24 మందిని అరెస్ట్ చేసి, 12 మందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని గుర్తించామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ వీఎస్ మీనా వెల్లడించారు. బేకన్‌గంజ్ ఎస్‌హెచ్‌వో నవాబ్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ అసిఫ్ రజా ఫిర్యాదుల వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు సూత్రధారిగా అనుమానిస్తున్న మౌలానా మొహమ్మద్ అలీ(ఎంఎంఏ)జౌహార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్ చీఫ్ హయత్ జఫర్ హస్మితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తదితర సంస్థలతో లింకులున్నట్లు తేలితే కఠినమైన జాతీయ భద్రతా చట్టంతోపాటు గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ మీనా వెల్లడించారు. విదేశీ నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుట్రదారుల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇటీవల ఓ టీవీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం కాన్పూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దుకాణాలను మూసివేయించేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులు సహా మొత్తం 40 మంది గాయపడ్డారు. -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: ఉచిత హామీల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్ట జూస్తున్నాయంటూ రాజకీయ పార్టీలపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరిపే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు హిందూసేన ఉపాధ్యక్షుడు సుర్జీత్‌సింగ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్నందున దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరఫు న్యాయవాది ధర్మానానికి విన్నవించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇచ్చిన పలు ఉచిత హామీలతో తాను కలత చెందినట్టు పిటిషన్లో యాదవ్ పేర్కొన్నారు. దీన్ని అవినీతి చర్యగా, సదరు పార్టీల తరఫు అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాలను, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆప్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఉచిత హామీల బడ్జెట్ కొన్నిసార్లు అసలు బడ్జెట్‌నూ మించిపోతోందంటూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిల్‌పై కేంద్రానికి, ఈసీకి అంతకుముందు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
జేఎన్‌యూ విద్యార్థి ఇమామ్‌పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది. జామియా మిలియా ఇస్లామియాలో 2019 డిసెంబర్ 13న, అలీఘర్ ముస్లిం వర్సిటీలో 2019 డిసెంబర్ 16న ఇమామ్ మాట్లాడుతూ.. అస్సాంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని బెదిరించారని విచారణలో తేలిందంది. అంతకుముందు ఇమామ్ తానేం ఉగ్రవాదిని కాదని కోర్టుకు విన్నవించాడు. 2020 జనవరి నుంచి ఇమామ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం, ధిక్కారం పెరిగేలా ఇమామ్ ప్రసగించాడని, ప్రజలను రెచ్చగొట్టాడని, దీని వల్ల 2019 డిసెంబర్లో హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. -
పెళ్లి వేడుకలో వింత వేషధారణ
మంగళూరు: పెళ్లి వేడుకలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన ఓ ముస్లిం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువులపై కేసు నమోదైంది. బంట్వాల్ తాలూకా కొల్నాడు గ్రామంలో సాలెతూర్కు చెందిన అజీజ్ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు బాషిత్ అనే వ్యక్తి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తులునాడు ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఆరాధించే కొరగజ్జా అనే దేవుడి మాదిరిగా బాషిత్ తదితరులు దుస్తులు వేసుకుని, ఆ దేవుడిని అవమానించేలా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అతడి స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై బంట్వాల్ తాలూకా విట్లపడ్నూర్ గ్రామానికి చెందిన చేతన్ ఫిర్యాదు మేరకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు బంధువులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.