ఇవ్వండి ఫిర్యాదు.. పెట్టేద్దాం కేసు | Another case against director Ramgopal Varma | Sakshi
Sakshi News home page

ఇవ్వండి ఫిర్యాదు.. పెట్టేద్దాం కేసు

Published Wed, Nov 13 2024 5:49 AM | Last Updated on Wed, Nov 13 2024 6:52 AM

Another case against director Ramgopal Varma

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర 

పచ్చ బ్యాచ్‌ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు 

దివ్యాంగుడినీ వదలని వైనం..

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై మరో కేసు 

జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసానిపైనా కేసు నమోదు

సాక్షి నెట్‌వర్క్‌: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ రాజకీయాలకు తెరతీసిన ప్రభుత్వం సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై రెచ్చిపోతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశి్నస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. 

ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను సోషల్‌ మీడియాలో ప్రశి్నంచారని ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశి్నంచడంతో ప్రభుత్వం పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. సోషల్‌ మీడియాలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కొందరి పేర్లను ఎంపిక చేసి పచ్చ పార్టీ కార్యకర్తల ద్వారా వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తోంది. ఫిర్యాదులు అందుకున్నదే తడవుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
 
రేపల్లె నియోజకవర్గ పరిధిలో ముగ్గురిపై.. 
సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై రేపల్లె నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి. షేక్‌ మహ్మద్‌ ఖాజా మొహిద్దీన్‌పై నగరం మండలానికి చెందిన ఐటీడీపీ కన్వీనర్‌ జుజ్జూరి బాలనరేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవికి చెందిన టీడీపీ నేత శొంఠి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు జింకల రామాంజనేయులుపై కేసు నమోదైంది. దిండికి చెందిన టీడీపీ నేత నాగకిశోర్‌ ఫిర్యాదు మేరకు నిజాంపట్నం పోలీ­సు స్టేషన్‌లో బత్తులపల్లి శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదైంది.  

పోలీసుల అదుపులో సోషల్‌ మీడియా కన్వీనర్‌ 
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కాపారపు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావును కలవగా.. రమణపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారని కుటుంబ సభ్యులు వివరించారు.  

దివ్యాంగుడి పైనా పోలీసు ప్రతాపం 
నరసాపురానికి చెందిన బుడితి సుజన్‌కుమార్‌ అనే దివ్యాంగుడు సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ భీమవరం పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తుల సాయం ఉంటేనే గానీ అడుగు ముందుకు వేయలేని సుజన్‌కుమార్‌ను స్టేషన్‌కు రావాలంటూ పోలీసుల నుంచి పదేపదే ఫోన్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. 

సుజన్‌కుమార్‌ తండ్రి తహశీల్దార్‌గా పనిచేసి రిటైరయ్యారు.  తల్లి టీచర్‌. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సుజన్‌కుమార్‌కు పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. బాధితుడు సుజన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు భయపడి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. తనకు భీమవరం పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఏఎస్సై ఫోన్‌ చేసి.. మీరు సోషల్‌ మీడియా కేసులో ఇరుక్కున్నారని చెప్పి స్టేషన్‌కు రావాలన్నారని తెలిపారు.

స్థానికేతరులపై స్థానిక నేతల ఫిర్యాదు 
సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన స్థానికేతరులపై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యద్దనపూడి గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీను విశాఖపట్నం జిల్లా యండాడ గ్రామానికి చెందిన బై జయంత్‌పై ఫిర్యాదు చేశారు. 

అదేవిధంగా మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన గొర్రెపాటి నాగదుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బూడి వెంకటేశ్‌పై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చినగంజాం గ్రామ సర్పంచ్, కూటమి నాయకుడు రాయని ఆత్మారావు, తుమ్మలపెంట సతీష్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన ఇందుకూరి శ్రీనివాసరాజుపై చినగంజాం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 

సత్యసాయి జిల్లా రొద్దం మండలం సోషల్‌ మీడియా కార్యకర్త ఎన్‌.బాలాజీరెడ్డి పోస్టులు పెడుతున్నారని నెల్లూరు టీడీపీ నాయకుడు షేక్‌ ముఫీద్‌ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్జీవీపై తుళ్లూరులో ఫిర్యాదు 
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో దున్నపోతులకు పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ ఫొటోలు మారి్ఫంగ్‌ చేసి పెట్టడం, చంద్రబాబును పవన్‌కళ్యాణ్‌ ఎత్తుకున్నట్టు పెట్టిన పోస్టులపై తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా.. రాంగోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించి ఆయనకు నోటీసులు పంపినట్టు దర్యాప్తు అధికారి, ఒంగోలు రూరల్‌ సీఐ ఎన్‌.శ్రీకాంత్‌బాబు మంగళవారం తెలిపారు.  

సినీ నటుడు పోసానిపై కేసు నమోదు 
విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని భవానీపురం పోలీసుస్టేషన్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన సెంట్రల్‌ ఆంధ్ర జోన్‌ కనీ్వనర్‌ బాడిత శంకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

పోసాని కృష్ణమురళి గతంలో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని బాడిత శంకర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అప్పటి ప్రెస్‌మీట్‌ వీడియోను ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని తెలిపారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement