సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది.
పోలీసుల తరపున దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్‌రెడ్డి వివరించారు.
ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు.
ఆ కాల్‌డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్‌ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు.
శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు.
పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు
బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్‌లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment