Commercial Taxes Department
-
మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ను నమోదు చేయనుంది.ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్‌ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్‌ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్‌బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో పాటు ఐజీఎస్టీ, సెస్‌లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్‌కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
లక్ష్యం సాధించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదాయాన్ని ఆర్జించే శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖల పన్ను వసూళ్లపై సోమ వారం సచివాలయంలో రేవంత్‌రెడ్డి సమీక్షించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకు పైగా చెల్లించేదని, దాని గడువు ముగియడంతో ఆ నిధు లు ఆగడంతో వ్యత్యాసం కనిపిస్తోందని అధికా రులు వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి డిస్టిలరీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదాయం తెచ్చే శాఖలకు సొంత భవనాలు రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనికి స్పందించిన రేవంత్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆదాయం తెచ్చే శాఖలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. అక్రమాలకు చెక్‌పెట్టేలా ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు. వే బిల్లులు.. వాహనాల ట్రాకింగ్ ఇసుక సరఫరా వాహనాలకు వే బిల్లులతోపాటు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన పలు గనులపై జరిమానాలు విధించారని, ఆ జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. టీఎస్ఎండీసీతోపాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ .231 కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్/బోధన్: బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలైంది. 2017 నుంచి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తెలంగాణ సీఐడీ అధికారులు ఇటీవల కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 22 మంది వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అధికారులే.మొత్తం 123 మంది సాక్షులను విచారించినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. 68 రకాల సాఫ్ట్వేర్ మెటీరియల్‌తో పాటు 143 డాక్యుమెంట్లు, మూడు ఆడిట్ రిపోర్ట్‌లను సాక్ష్యాలుగా కోర్టుకు సమరి్పంచారు. ఈ కుంభకోణంలో నిందితులు మొత్తం రూ.231.22 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టినట్టు తేల్చారు. దీనికి సంబంధించి 2005 నుంచి 2016 వరకు బోధన్, నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అధికారుల వివరాలు సీఐడీ సేకరించింది. ఇలా దోచేశారు.. వాణిజ్య పన్నులశాఖ బోధన్ సర్కిల్లో జరి గిన నకిలీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పన్నులు చెల్లించకుండానే నకిలీ చలాన్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యాపారాలు చేసేవారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి చలానాకు ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఖజానా (ట్రెజరీ)లో ఈ నంబర్ వేయించుకుని ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులో పన్ను మొత్తాన్ని జమ చేయాలి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌లు బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. పన్నులు చెల్లించకుండానే చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించారు. కొంత మొత్తాన్ని చెల్లించి ఎక్కువ మొత్తంలో చెల్లించినట్టు చూపారు. ఒకరు చెల్లించిన చలానాతోనే పదుల సంఖ్యలో వ్యాపారులు, పలు వ్యాపార సంస్థలు చెల్లించినట్టుగా రికార్డులు సృష్టించారు. వ్యాపారుల సొమ్మును పక్కదారి పట్టించి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. ఎక్కడికక్కడ అధికారులను తమ దారికి తెచ్చుకుని ఏళ్ల తరబడి ఈ కుంభకోణం కొనసాగించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ సీటీఓ ఎల్.విజయేందర్ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2017 ఫిబ్రవరి 2న చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో ఉద్యోగుల అవినీతి బాగోతానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించాయి. ఫోర్జరీ, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరిత కుట్ర, లంచం తీసుకోవడం వంటి నేరాలు ఉండడంతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్.శ్యామ్ ప్రసాద్‌రావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసు నీరుగార్చే యత్నాన్ని బయటపెట్టిన ‘సాక్షి’.. ఈ భారీ కుంభకోణం దర్యాప్తులో ఆద్యంతం అనేక మలుపు చోటు చేసుకున్నాయి. చలాన్లు పెట్టేందుకే నిందితులు ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి నిండా చలాన్లు ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు దర్యాప్తును నీరుగార్చేందుకు ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరు ప్రయత్నించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాతే కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అనేకమంది అధికారుల పాత్ర వెల్లడైంది. ఈ క్రమంలో సీఐడీ విచారణాధికారికి కోటి రూపాయల ఎర వేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టు అయ్యింది వీరే.. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులుగా ఉన్న సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (ఏడాది క్రితం మరణించాడు), అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌లను సీఐడీ అరెస్టు చేసింది. వీరిద్దరు నిజామాబాద్ పట్టణంలో సేల్స్ ట్యాక్స్ ప్రైవేటు ఆడిటర్లుగా ఉంటూ ఈ కుంభకోణానికి తెగబడ్డారు. వీరితో పాటు వారి సిబ్బంది విశాల్ పాటిల్ అలియాస్ విశాల్ కాంతిపాటిల్, కమ్మర రామలింగం అలియాస్ రామ లింగడు, నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి, ఎన్.సత్యవెంకట కృష్ణకుమార్ అలియాస్ పంతులు, ఎం.మల్లేశ్, గంగొనే రాకేశ్, మడపల్లి రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్ నజీముద్దీన్ అలియాస్ అబీబుద్దీన్, అర్రోజుల రాజేశ్ కూడా ఉన్నారు. ఇక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశ్యానం వేణుగోపాల స్వామి, బి.హనుమంతు సింగ్, ధరణి శ్రీనివాసరావు, టి.పూర్ణచంద్రారెడ్డితో పాటు బోధన్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ఏసీటీఓలు) ఆర్.కిషన్, కె.నాగేశ్వర్రావు, కె.విజయకుమార్, ఎస్.రత్నకుమారి, బీఎన్ ఇందిర, జె.రాజయ్య, ఎస్.సాయిలు, సీనియర్ అసిస్టెంట్లు సి.స్వర్ణలత, కె. అరుణ్‌రెడ్డి, బి.పీరాజి, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, జూనియర్ అసిస్టెంట్లు చంద్రహాస్, ఆర్.వినోద్‌కుమార్, బి.రంగారావు, ఎల్.భజరంగ్, సి.శ్రీధర్‌లు కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. -
సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
సాక్షి, అమరావతి : వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కూడా కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైకోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి బుధవారం విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) కోర్టుకు తెలిపారు. సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏడీజే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది. పోలీసుల తరపున దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందున, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టు (ఏడీజే)కు లేదని, స్పెషల్ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. వాదనలు విన్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకుందో లేదో కూడా తేలుస్తానని న్యాయాధికారి చెప్పారు. అవినీతి కేసుల్లో నిందితులపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని, దాని ఆధారంగా సూర్యనారాయణపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని దుష్యంత్‌రెడ్డి వివరించారు. ఇందుకు పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారని తెలిపారు. పన్ను వసూలులో సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, రూ.7 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చి, రూ.90 వేలు మాత్రమే వసూలు చేసి వారిని వదిలేశారన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బు ఇస్తే నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాపారులకు చెప్పారని, ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించారని వివరించారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురితో సంబంధం లేదని సూర్యనారాయణ చెబుతున్నారని, వాస్తవానికి వారితో సూర్యనారాయణ ఈ రెండేళ్లలో 900 సార్లు మాట్లాడారని తెలిపారు. ఆ కాల్‌డేటాను ఆయన కోర్టుకు సమర్పించారు. ఖజానా ఆదాయానికి గండికొట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పిటిషనర్‌ది తీవ్రమైన నేరమని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని, అతని పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఆయనకు చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ లేదని, ఆ పదవిని అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. శాఖాపరమైన విచారణ ఉద్యోగుల వ్యక్తిగత పాత్రకే పరిమితం అవుతుందన్నారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మిగిలిన నిందితులకు, సూర్యనారాయణకు సంబంధం లేదన్నారు. వారు వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తుండగా, సూర్యనారాయణ మరో విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిపారు. పీసీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిందే : సుప్రీం కోర్టు బాలాజీ వర్సెస్ కార్తీక్ దేశారి కేసులో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై నమోదు చేసిన చార్జిషీట్లలో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి కేసుల్లో పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
Telangana: పన్నుల ఆదాయం రెండేళ్లలో డబుల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సొంత పన్నుల ఆదాయం వేగంగా పెరుగుతోంది. ఖజానాకు గణనీయంగా రాబడి సమకూరుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తొలి ఏడు నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం దాదాపు రెండింతలు కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) అన్నిపన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,846 కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది అదే సమయానికి రూ.40,788 కోట్లు సమకూరింది. నిజానికి గత ఏడాది (2021–22) నుంచే ఆదాయం పెరగడం మొదలైందని.. అదే ఒరవడి కొనసాగుతోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కన్నా ఈసారి అన్ని పన్నుల ఆదాయం సగటున 10 శాతం పెరిగిందని వివరిస్తున్నారు. వ్యాట్ నుంచి అధికంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రెండు రూపాల్లో సమకూరుతుంది. పెట్రో ఉత్పత్తులు, లిక్కర్లపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో, ఇతర అన్నిరకాల వ్యాపార లావాదేవీలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రాబడి వస్తుంది. ప్రస్తుతం వ్యాట్ కింద పెట్రోల్, లిక్కర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి రెండింతలకుపైగా ఖజానాకు సమకూరింది. 2020–21లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ద్వారా రూ.3,970 కోట్లురాగా.. ఈసారి ఏకంగా రూ.8,770 కోట్లకు చేరింది. లిక్కర్‌పై వ్యాట్ రాబడి కూడా 40 శాతం వరకు పెరిగింది. 2020–21 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.6వేల కోట్లు సమకూరగా.. 2021–22లో రూ.7,529 కోట్లు, ఈసారి రూ.8,384 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే 10 శాతం పెరిగింది. ఇక ఇతర వ్యాపార లావాదేవీలపై విధించే వ్యాట్ కలిపి ఈ ఏడాది మొత్తంగా రూ.17,560 కోట్లు ఖజానాకు చేరింది. ఇది 2020–21లో రూ.10,367 కోట్లు, 2021–22లో రూ.15,340 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. జీఎస్టీ పరిహారం రాకపోయినా.. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావడంతో ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని కేంద్రం నిలిపివేసింది. ఆ పరిహారం రాకపోయినా జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూసుకెళుతోంది. అక్టోబర్ చివరినాటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జీఎస్టీ రూపంలో రూ.21,322 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరింది. ఇందులో ఎస్జీఎస్టీ రూ.9,537.63 కోట్లుకాగా, ఐజీఎస్టీలో వాటా రూ.10,801 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్ను రాబడి 31 శాతం వృద్ధి చెందడం విశేషం. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ కలిపి 2020–21లో రూ.10,917 కోట్లు, 2021–22లో రూ.16,222 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రెండేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా వ్యాట్, జీఎస్టీ రెండూ కలిపి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుండటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలలతో పోలిస్తే.. ఈసారి జూలై, అక్టోబర్ నెలల్లో పన్ను వసూళ్లు కాస్త తగ్గాయని తెలిపారు. కానీ మిగతా ఐదు నెలల్లో అధిక వృద్ధితో మొత్తంగా పన్ను వసూళ్లు పెరిగాయని వివరించారు. -
పుంజుకుంటున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాల్లో భారీ వృద్ధి రేటు నమోదవుతుండగా, డీజిల్ అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ఆదాయంలో నమోదవుతున్న వృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్రో వ్యాట్ ఆదాయంలో 6.39 శాతం వృద్ధి నమోదు కాగా.. అక్టోబర్‌కల్లా 25.24 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.851.40 కోట్లుగా ఉన్న పెట్రో వ్యాట్ ఆదాయం.. ఈ ఏడాది 6.39 శాతం వృద్ధితో రూ.905.78 కోట్లకు చేరింది. అలాగే అక్టోబర్‌లో 25.24 శాతం వృద్ధితో రూ.750.35 కోట్ల నుంచి రూ.939.76 కోట్లకు చేరింది. లాక్‌డౌన్‌తో తొలి త్రైమాసికంలో 30 శాతం ఆదాయం నష్టపోగా రెండవ త్రైమాసికంలో కొద్దిగా కోలుకొని 3.76 శాతం వృద్ధి నమోదయ్యింది. పెరిగిన సొంత వాహనాల వినియోగం లాక్డౌన్ తర్వాత డీజిల్‌తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోందని పెట్రోలియం డీలర్లు పేర్కొంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కంటే సొంత వాహనాలకే వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాల్లో 20 శాతం వరకు వృద్ధి కనిపిస్తోందని ఏపీ పెట్రో డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. తాము ప్రతి నెలా సగటున 4,500 లీటర్ల పెట్రోల్ విక్రయిస్తుండగా గత రెండు నెలల నుంచి 4,700 లీటర్లు విక్రయిస్తున్నట్లు గుంటూరుకు చెందిన డీలర్ ‘సాక్షి’కి వివరించారు. ఇదే సమయంలో డీజిల్ అమ్మకాలు మాత్రం కోవిడ్ ముందు స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ, సరుకు రవాణా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాకపోవడం..డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా 8,000 లీటర్ల వరకు డీజిల్ విక్రయిస్తుండగా, ఇప్పుడది 7,000 లీటర్ల స్థాయికి చేరిందన్నారు. ఒకటి రెండు నెలల్లో డీజిల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలల్లో రూ.5,448.79 కోట్ల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.5,448.79 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఏప్రిల్–అక్టోబర్ కాలంలో ఈ ఆదాయం రూ.5,965.50 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో రూ.1,860.09 కోట్లుగా ఉన్న ఆదాయం ద్వితీయ త్రైమాసికానికి రూ.2,648.98 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికం రెండు నెలల్లో మంచి వృద్ధిరేటు నమోదు కావడంతో పూర్తి ఏడాది కాలానికి లాక్డౌన్ నష్టాన్ని పూడ్చుకొని వృద్ధి బాట పట్టగలమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
దుమ్ముదులిపిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు.. కోవిడ్ ప్రబలడానికి ముందునాటి పరిస్థితులకు చేరుకున్నాయి. జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2,480 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఈ స్థాయిలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1,975 కోట్లు. అదేనెలలో ఈ ఏడాది 26 శాతం వృద్ధితో రూ.2,480 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల్లో పేర్కొంది. దసరా పండుగకు తోడు కోవిడ్‌తో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థికరంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయని వాణిజ్యపన్నులశాఖ అధికారులు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వృద్ధిరేటు అధికంగా ఉండటమే దీనికి నిదర్శనమంటున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో 5 శాతం వంతున, తమిళనాడులో 13, ఒడిశాలో 21 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం వల్ల అక్టోబర్‌లో రూ.350 కోట్ల మేర అదనంగా వసూలైనట్లు చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ పీయూ‹Ùకుమార్ చెప్పారు. ఈ ఏడాది తొలిసారిగా కనీస రక్షిత ఆదాయానికి మించి: 2020–21 సంవత్సరానికి కనీస రక్షిత ఆదాయం నెలకు రూ.2,225 కోట్లుగా నిర్ణయించారు. ఇంతకంటే తగ్గిన ఆదాయం మొత్తాన్ని కేంద్రం పరిహారం రూపంలో చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా అక్టోబర్‌లో కనీస రక్షిత ఆదాయం మించి పన్ను వసూలైంది. ఏప్రిల్– సెపె్టంబర్ కాలానికి కనీస రక్షిత ఆదాయం కింద రూ.13,350 కోట్లు రావాల్సి ఉండగా రూ.8,850.62 కోట్లు మాత్రమే వచి్చంది. ఆరునెలల్లో రూ.4,499.38 కోట్ల మేర తక్కువ వసూలైంది. ఈ ఆరునెలల్లో సగటున నెలకు రూ.1,475.10 మాత్రమే జీఎస్టీ వసూలైంది. దేశంలో తొలిసారి లక్షకోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్కును అధిగమించాయి. అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,05,155 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ నెలలో వసూలైంది రూ.95,379 కోట్లు. వరుసగా రెండునెలల నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటం ఆరి్థకవ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్న సంకేతాలిస్తోంది. -
గ్రానైట్ వాణిజ్యంతో ఖజానాకు గండి
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నులశాఖలో క్రిందస్థాయి సిబ్బంది చేతివాటం ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. రాజధాని ప్రాంతంలో వసూలు కావాల్సిన లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. నగరం మీదగా వెళ్లే లారీలను తనిఖీ చేసి వేబిల్లులు సరిగా లేని, పన్నుల చెల్లించని లారీలపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు వేసేందుకు అధికారులు ప్రయత్నింస్తుంటే.. తమకున్న అనుభవంతో అధికారుల కళ్లు కప్పి లారీలను ఈశాఖలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లు తప్పిస్తున్నారు. రూ. 6 లక్షల గ్రానైట్ ఎగుమతి ఒంగోలు నుంచి మహారాష్ట్రకు గ్రానైట్ భారీగా ఎగుమతి అవుతుంది. ప్రతి నిత్యం పది నుంచి 15 లారీల్లో గ్రానైట్ రవాణా జరుగుతుంది. ఒక్కో లారీలో కనీసం రూ.6 లక్షలు విలువైన గ్రానైట్ రాళ్లు ఎగుమతి జరుగుతాయి. గ్రానైట్‌పై జీఎస్టీ 18శాతం. ఈ లెక్కన కనీసం ఒక్కో లారీకి రూ.లక్ష వరకు పన్ను వసూలు కావాలి . అయితే అంత పన్ను చెల్లించడానికి డీలర్లు సుముఖంగా వుండటం లేదు. దీంతో దొడ్డిదారిలో సరుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న గ్రానైట్ లారీలు (ఫైల్) ‘కోటీ’శ్వరుడు తలుచుకుంటే.... వాణిజ్యపన్నులశాఖలో అధికారులు వద్ద ఒక డ్రైవర్ ఎంతోకాలంగా పనిచేస్తున్నాడు. ఆయన డిపార్టుమెంట్లో తాత్కాలిక ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లతో ఒక టీమ్‌ను తయారు చేశారు. ఈ కోటీశ్వరుడు తలుచుకుంటే చాలు... గ్రానైట్ తో పాటు ఏ సరుకు రవాణా చేసే లారీనైనా సురక్షితంగా జిల్లాను దాటిస్తారని డీలర్ల నమ్మకం. ఒంగోలు, గుంటూరు మీదగా తాడేపల్లికి వచ్చే లారీల డ్రైవర్లు ముందుగా ఈ టీమ్‌లోని వారి సమాచారం అందిస్తారు. వారి ద్వారా టీమ్ లీడర్‌కు సమాచారం అందుతుంది. ఆ రోజు ఏ అధికారి ఎక్కడ వాహనాలు తనిఖీ (వీటీ) చేస్తున్నారో తెలుసుకుని ఆ మార్గంలో కాకుండా మరోక మార్గంలో లారీలను కంచికచర్ల, పెనుగంచిప్రోలు వరకు తప్పిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ రూట్లో మహారాష్ట్ర వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. తాడేపల్లి నుంచి ఒక్కక్క లారీని కాకుండా ఆరేడు లారీలను ఒకేసారి తీసుకువచ్చి తప్పిస్తారని ఆశాఖలోనే చర్చించుకుంటున్నారు. కాగా అధికారులు అనుమానం రాకుండా ఒకటి రెండు లారీలను ఈ రూట్లోకి పంపుతారు. మిగిలిన వాటిని మరో మార్గంలో తప్పిస్తారు. గతంలో ఇదే తరహాలో పట్టుకున్న వ్యాన్‌ను తప్పించగా.. ఆగ్రహించిన డీసీటీవో ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు కన్ను గప్పి తప్పిపోయిన వ్యాన్‌ను వెంటనే వెనక్కు రప్పించిన ఘనత ఈటీమ్ నాయకుడుకు ఉంది. లారీ యజమానులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి లారీని పట్టిస్తారని, అలాగే తప్పిస్తారని చెబుతున్నారు. ప్రతిదానికీ ఒకో రేటు ఒక్కో గ్రానైట్ లారీని సురక్షితంగా తప్పిస్తే రూ.5వేలు వరకు వసూలు చేస్తారు. ఈ విధంగా ఆ డ్రైవర్ ‘కోటీశ్వరుడు’ అయ్యారని వాణిజ్యపన్నులశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తన వద్ద టీమ్‌ను మెయిటెన్ చేస్తూ రోజుకు ఐదు నుంచి 8 లారీల వరకు తప్పిస్తారని చెబుతున్నారు. కేవలం గ్రానైట్ కాకుండా నగరానికి వచ్చే రెడీమేడ్, ఎలక్రిక్టల్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువుల లారీలను తప్పిస్తారు. అయితే ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. లారీలను అధికారులు పట్టుకున్నప్పుడు తక్కువ జరిమానాతో బయట పడే మార్గాన్ని చెబుతారని సమాచారం. తానే వీటీలు చేయిస్తూ.... అధికారులు అప్రమత్తంగా లేని సమయంలోనూ, నగరంలో వాహనాలు తనిఖీ(వీటీ)లు జరగనప్పడు ఆయనే ఒక మహిళను ఒక కారులో కూర్చుబోట్టి డీసీటీఓగా కారులో ఉన్నారంటూ లారీలను ఆపి తనిఖీలు చేసి వారి వద్ద మామూళ్లు తీసుకుని వదిలివేస్తారని సమాచారం. కాగా ఈ టీమ్‌లోని సభ్యుల ఫోన్ నెంబర్లు ట్రాకింగ్‌పెడితే అనేక వాస్తవాలు వెల్లడవుతాయని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. -
ఫంక్షన్..పన్ను టెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాళ్లు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. విందు, వినోదం.. కార్యం ఏదైనా ఫంక్షన్ హాల్లో జరిగితే ఇకపై పన్ను కట్టాల్సిందే. ఫంక్షన్హాల్లో ఏ కార్యం చేసినా బిల్లులో 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా ఫంక్షన్ హాల్ యాప్ రూపొందించింది. జీఎస్టీ వర్తించక ముందు ఫంక్షన్ హల్ బిల్లును సర్వీస్ ట్యాక్స్ ద్వారా చెల్లించేవారు. అయితే తాజాగా ఫంక్షన్ హాల్ సేవలతో పాటు వస్తువుల కేటగిరీలోకి రావడంతో జీఎస్టీ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తగా వార్షిక అద్దె రూ.20 లక్షల కన్నా ఎక్కువ ఉన్న అన్ని ఫంక్షన్ హాళ్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటివరకు ఫంక్షన్‌హాల్స్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా కూడా పన్నులు చెల్లించ ట్లేదని గ్రహించిన వాణిజ్య పన్నుల శాఖ.. ఈ నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఫంక్షన్ హాల్స్ అద్దెలు కూడా పెరగనున్నాయి. కేటరింగ్, డెకరేషన్, వినోదంతో పాటు అన్ని రకాల సేవలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆధునిక పరిజ్ఞానంతో.. పన్ను వసూళ్ల కోసం వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. ఇప్పటికే ఐఓసీ, ఆర్డీ యాప్‌లతో సిబ్బందికి టార్గెట్లు కేటాయించి పన్నుల బకాయిలు వసూలు చేస్తోంది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్‌లను జీఎస్టీ పరిధిలో తీసుకురావడానికి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫంక్షన్ హాల్లు పూర్తి సమాచారాన్ని కొత్త యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇంకా జీఎస్టీలో నమోదు చేసుకొని ఫంక్షన్ హాళ్లను యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఫంక్షన్ హాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్‌లో పొందుపరచడంతో అధికారులు, సిబ్బందికి రిజిస్ట్రేషన్ సులభమైందని అధికారులు చెబుతు న్నారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్స్, సొంతం ఎన్ని.. కంపెనీలు, పార్ట్నర్షిప్లో ఎన్ని ఉన్నాయనే వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. ఫంక్షన్ హాల్ వైశాల్యం తదితరాలతో పాటు పాటు ఉద్యోగుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు. ఫంక్షన్ హాల్లో సామగ్రిపై కూడా నజర్ వేస్తున్నారు. ఒకవేళ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు డీఆర్సీ ఫామ్–3 ద్వారా పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయించు కోకుండా పన్నులు ఎగ్గొడితే వడ్డీతోపాటు జరిమా నాతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫంక్షన్ హాల్ యాప్‌తో ఫంక్షన్ హాళ్లకు సంబంధించి పన్నుల వసూళ్లు సులభమవు తున్నాయని అధికారులు చెబు తున్నారు. -
పన్నుల శాఖలో ఎన్నికల లొల్లి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర పన్నుల శాఖలో కూడా ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం సారథ్యం కోసం జరగనున్న ఈ ఎన్నికలు ఆ శాఖలో అసలైన ఎన్నికల సెగ పుట్టిస్తున్నాయి. సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే ఆనవాయితీ ఉన్నా ఈ దఫా గెజిటెడ్ అధికారులు రెండుగా చీలిపోవడంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. తూకుంట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, సమస్యల పరిష్కారంలో తాత్సారం వహిస్తోందని ఆరోపిస్తూ కొందరు ప్రస్తుత కార్యవర్గాన్ని వ్యతిరేకించి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో కేవలం 350 ఓట్లే ఉన్నా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం (టీసీటీజీవోఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే, ప్రస్తుత కార్యవర్గం తమ పనితీరును సమర్థించుకుంటోంది. అటు ప్రభుత్వంతో, ఇటు ఉన్నతాధికారులతో సానుకూల దృక్పథంతో వెళ్తూనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని, కొన్నింటిని పూర్తిస్థాయిలో పరిష్కరించే దశకు చేరుకున్నామని సంఘం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలు పన్నుల శాఖలో వేడి పుట్టిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులే ఎజెండా.. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు జరిగేందుకు శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని, బదిలీలు సక్రమంగా జరగకపోవడంతో పదోన్నతులు కూడా నిలిచిపోయాయనే చర్చ శాఖలో జరుగుతోంది. అయితే టీసీటీజీవోఏ కార్యవర్గం మాత్రం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో చేయాల్సిందంతా చేశామని చెబుతోంది. డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ ఇవ్వనన్ని పదోన్నతులు సాధించామని, రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కేటగిరీల్లో 75 శాతం మంది ఉద్యోగులు కనీసం ఒక్క పదోన్నతి అయినా తీసుకున్నారని, గతం కంటే పారదర్శకంగా వ్యవహరించడం ద్వారానే ఇది సాధ్యమైందని అంటోంది. అసోసియేషన్ ఎన్నికలకు ఇప్పటికే 2 ప్యానెళ్లు నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల ఉపసంహరణకు నేడు తుది గడువు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ జరగకపోతే ఈ నెల 13న ఎన్నికలు అనివార్యం కానున్నాయి. పద్ధతిలో తేడా తప్ప పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో మా అసోసియేషన్ ఏర్పడింది. రాష్ట్ర అస్తిత్వం, మనుగడ, పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించాం. అధిక పనిభారం, ఒత్తిడితోపాటు శాఖాపరంగా ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు. కొత్త రాష్ట్రంపై తీవ్ర పోరాటాలు చేయలేం. శాంతియుత, ప్రజాస్వామిక, సమన్వయ పద్ధతుల్లోనే ఇది సాధ్యమవుతుంది. పోరాట పద్ధతుల్లో తేడా ఉంటుంది తప్ప పోరాటం ఆగదు. – తూకుంట్ల వెంకటేశ్వర్లు,టీసీటీజీవోఏ అధ్యక్షుడు -
ఆదాయం అదుర్స్
సాక్షి సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖ రాబడులు గణనీయంగా పెరిగాయి. ఉన్నతాధికారులు, సిబ్బంది సమష్టి కృషితో ఆ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.46 వేల కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే 18.20 శాతం వృద్ధి సాధించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల పన్ను వసూళ్లు జరగ్గా... ఈసారి రూ.46 వేల కోట్లు రావడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏటా వచ్చే పన్ను వసూళ్ల ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాన్ని 30శాతం పెంచి టార్గెట్ నిర్దేశించుకుంటారు. ఈ మేరకు 2018–19 లక్ష్యం రూ.52వేల కోట్లు కాగా... రూ.46వేల కోట్ల పన్ను వసూలు అయింది. 2018–19 అక్టోబర్‌లో అత్యధికంగా రూ.4,172 కోట్ల పన్ను రాబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో రూ.4,152 కోట్లు, జూలైలో రూ.4,006 కోట్ల ఆదాయం వచ్చింది. మేలో అత్యల్పంగా రూ.3,226 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆగస్టులో అత్యధికంగా 38.15 శాతం వృద్ధి సాధించగా... ఫిబ్రవరిలో అత్యల్పంగా 4.11 శాతం నమోదైంది. జీఎస్టీ వసూళ్లు రూ.1,275 కోట్లు కాగా ఎంట్రీ ట్యాక్స్, సీఎస్టీ డిమాండ్లు, లగ్జరీ ట్యాక్స్, వ్యాట్ ఆడిట్ డిమాండ్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌తో పాటు జీఎస్టీ పరిధిలోకి రాని పెట్రోలియం, ఎక్సైజ్, పొగాకు ద్వారా రూ.21,174 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ రెండింటి నుంచే 45శాతం.. ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో ఈ రెండింటి నుంచే ఎక్కువ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం పన్ను రాబడిలో ఎక్సైజ్, పెట్రోలియం నుంచే దాదాపు 45శాతం వచ్చిందని చెప్పారు. డీలర్లు, సంస్థలపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కఠిన వైఖరి అవలంబించడంతో ఆదాయం పెరిగిందన్నారు. 2018–19లో దాదాపు ఐదు వేల వాహనాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. వే–బిల్లు లేని వాహనాలను అదుపులో తీసుకొని జరిమానాలు విధించడంతో ఆదాయం పెరిగిందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే కొన్ని వస్తువులపై ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తుంది. 2018–19లో ఈ పన్ను రూ.800 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అధికారులు బాకాయిదారులపై దృష్టిసారించడంతో ఈ మేరకు ఆదాయం సమకూరింది. వాహనాల ఆకస్మిక తనిఖీలు, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం, బకాయిల వసూలుపై దృష్టిసారించడం తదితర చర్యలు చేపట్టారు. పన్నుల చెల్లింపులకు సంబంధించిన అన్ని లావాదేవీలను కంప్యూటరైజ్డ్ చేయడంతో పని మరింత సులభమైంది. జీఎస్టీ అమలు కూడా ఆదాయం పెరగడానికి దోహదపడిందని అధికారులు పేర్కొన్నారు. -
వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆదాయ రాబడిలో వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.45 వేల కోట్లు దాటిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్క మార్చిలోనే రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్టు తెలు స్తోంది. మార్చిలో ఎస్జీఎస్టీ కింద రూ.1,275 కోట్లు వచ్చింది. అయితే, ఇప్పటివరకు అత్యధికంగా ఫిబ్రవరిలో 1,041 కోట్ల ఆదాయం ఎస్జీఎస్టీ కింద రాగా, ఈ నెలలో అంతకు మించి ఆదాయం రావడం గమనార్హం. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చడంలో కృషి చేసిన శాఖ సిబ్బందిని, అధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభినందించారు. సమస్యలు పరిష్కరించండి: టీఎస్‌టీఈఏ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గత ఏడాది కన్నా 20 శాతం పెరగడంపట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాఖ సిబ్బంది, అధికారులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమయిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం (టీఎస్‌టీఈఏ) గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కె.ఎం.వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి అభినందనలు తెలిపారు. శాఖాపరంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించి మరింత ఆదాయం సమకూర్చేలా చేసి ఉద్యోగులు, సిబ్బందికి చేయూతనివ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సోమేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించినట్టు టీఎస్‌టీఈఏ నేతలు తెలిపారు. -
రేపు అర్ధరాత్రి వరకు విధుల్లోనే..
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల ముగిసేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ నిర్దేశిత టార్గెట్ పూర్తి కోసం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 31 అర్థరాత్రి వరకు అధికారులు విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు పలు బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి. బ్యాంకుల్లో జమ చేసిన, ఆన్లైన్లో చెల్లించిన పన్నుల లెక్కలు పూర్తి చేయడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పని చేయనున్నారు. ఇంకా 48 గంటలే మిగిలి ఉండటంతో అధికారులు టార్గెట్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఏ డీలర్ రిటర్న్స్ దాఖలు చేయలేదు.. ఎంత బకాయి ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని ఏ వాణిజ్య పన్నుల కార్యాలయానికి వెళ్లినా శుక్రవారం ఇదే సీన్ కనిపించింది. ఉన్నతాధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు యాప్‌ల్లో టార్గెట్లను నిర్దేశిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భారీగా పెరగనున్న పన్ను రాబడి... గత ఏడాది కంటే ఈసారి వాణిజ్య పన్నుల రాబడి పెంచడానికి ఉన్నతాధికారులు శ్రమిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ అనిల్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఎంట్రీ టాక్స్ ద్వారా రూ.800 కోట్లు వసూలు అయింది. గత ఏడాది మార్చి నెలలో రూ.923 కోట్లు వసూలు కాగా, ఈ సారి మార్చి నెల 25వ తేదీ నాటికి రూ.1,070 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన ఆరు రోజుల్లో ఇంకో రూ.300 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై 3 రోజుల క్రితం సోమేశ్‌కుమార్ 1,300 మంది సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
‘ఉన్నతం'గా దోచేస్తున్నారు !
సాక్షి సిటీబ్యూరో: వ్యాపారుల క్రయ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి వారి ద్వారా జరిగే వ్యాపారాలకు ప్రభుత్వం నిర్దేశించిన పన్నును వసూలు చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులే దానికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ అదాయాన్ని పెంచాల్సిన కొందరు అధికారులు వ్యాపారులతో కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. వాణిజ్య పన్ను చట్టాలను ఆసరాగా తీసుకొని వ్యాపారులకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి అనంతరం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఏడు డివిజన్లలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయ లు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల అక్రమ బాగోతంపై ‘సాక్షి’ ప్ర త్యేక కథనం.. ♦ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పంజగుట్ట డివిజన్, సోమాజిగూడ సర్కిల్లోని ఓ ప్రముఖ బంగారు నగల దుకాణానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.23 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. అయితే సదరు వ్యాపారి తన పలుకుబడిని వినియోగించి ఉన్నత అధికారులతో ఒప్పందం చేసుకుని కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించా డు. ఇందుకు గాను ఉన్నతాధికారులకు రూ.కోట్లల్లో ముడుపులు అందినట్లు సమాచారం. ♦ అబిడ్స్ డివిజన్, గౌలిగూడ సర్కిల్లోని ఓ రెడీమెడ్ షోరూంకు సంబంధించి షాప్‌లపై దాడులు నిర్వహించిన శాఖ అధికారులు రూ. 16 కోట్ల పన్ను చెల్లించనందుకుగాను జరిమానా విధించారు. సదరు వ్యాపారి ఉద్యోగుల అండదండలతో సదరు శాఖ ఉన్నతాధికారి సంప్రదించడంతో అతని కేసును పక్కన పెట్టేశారు. ♦ అబిడ్స్ డివిజన్, బషీర్‌బాగ్ సర్కిల్ పరిధిలోని ఓ భవన నిర్మాణ సంస్థకు సంబంధించి ఆడిట్ నిర్వహించిన సర్కిల్ అధికారులు రూ. 3 కోట్లు పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ షాకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు సంస్థ యజమాని కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారిని కలిసి సెటిల్మెంట్ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు రూ.10 లక్షల్లో సెటిల్ కానున్నట్లు తెలిసింది. కేవలం ఈ మూడు డివిజన్లలోనే కాకుండా గ్రేటర్‌పరిధిలోని చార్మినార్, బేగంపేట్, సరూర్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు హైదారాబాద్ రూరల్ ప్రాంతాల్లోనూ అధికారుల అక్రమాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి పడుతోంది. నిబంధనలకు నీళ్లు ప్రభుత్వ అధికారులు తాము పనిచేస్తున్న శాఖపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపార సంస్థలు, షాప్‌లపై తనిఖీలు నిర్వహించే అధికారులు వ్యాపార లావాదేవీల సమాచారం నిమిత్తం 304 నోటీసులు జారీ చేస్తారు. ఇందులో సేల్స్, కొనుగోలు బిల్లులు, స్టాక్‌తో పాటు లాభ నష్టాలకు సంబందించిన వివరాలు అందజేయాలని సూచిస్తారు. సదరు వ్యాపారి అకౌంట్స్ వివరాలు అందజేయకపోతే మూడుసార్లు 310 నోటీసులు జారీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అధికారులు అందుకు విరుద్ధంగా 305 ఏ చట్టం ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులను బెదిరిస్తున్నారు. సదరు వ్యాపారిని నేరుగా కార్యాలయానికి పిలిపించుకుని అతడితో బేరం కుదిరాక రూ.కోట్లలో ఉన్న మొత్తాన్ని రూ. లక్షలకు తగ్గించి 305 ఆర్డర్ ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉన్నా వారికి అందాల్సిన వాటా అందుతుండటంతో వారు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వైఖరి కారణం గా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నందున అధికారుల అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘాల నేతలు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడితేకఠిన చర్యలు డివిజన్ పరిధిలో సీటీఓల ద్వారా జారీ అయ్యే ప్రతి షోకాజ్ నోటీసుకు సంబంధించిన పన్నులు కచ్చితంగా వసూలు చేస్తాం. 304 నోటీసులతో వ్యాపారులు స్పందించకపోతే మూడు సార్లు 310 నోటీసులు ఇస్తున్నాం. అనంతర 305 ఏ నోటీసులు జారీ చేస్తున్నాం. వ్యాపారుల లావాదేవీలకు అనుగుణంగా ప్రభుత్వానికి రావాల్సిన అదాయాన్ని పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నాం. కింది స్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– కె. సీతాలక్ష్మి, జాయింట్ కమిషనర్ అబిడ్స్ డివిజన్ -
కొత్త పురపాలికల్లో బాదుడు షురూ!
సాక్షి, హైదరాబాద్: కొత్త మునిసిపాలిటీల్లో అప్పుడే బాదుడు ప్రారంభమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నులు మినహాయించి ఇతర పనులైన ఖాళీ స్థలాలపై పన్నులు, నల్లా చార్జీలు, మార్కెట్ ఫీజులు, పశు వధశాలల ఫీజులు, మునిసిపల్ భవనాలు/గదులు/ కార్యాలయ సముదాయాల అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, టౌన్ఫ్లానింగ్కు సంబంధించిన ఇతర ఫీజులు/చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఎంక్రోచ్మెంట్ ఫీజు, మ్యుటేషన్ ఫీజు, వినోద పన్ను, స్టాంపు డ్యూటీపై సర్‌చార్జీలను రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల మేరకు పెంచాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 25న సర్క్యులర్ జారీ చేశారు. 173 గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసి కొత్తగా 38 మునిసిపాలిటీల ఏర్పాటుతోపాటు పాత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మరో 131 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి చివరిలో పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1, 2వ తేదీల నుంచి 68 కొత్త మునిసిపాలిటీలు మనుగడలోకి రాగా, 131 గ్రామ పంచాయతీలు సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో విలీనమైపోయాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో వసూలు చేసిన పన్నులు, పన్నేతర చార్జీలు, ఫీజులను ఇకపై పురపాలక శాఖ చట్టాల ప్రకారం పెంచి వసూలు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నులను మాత్రం పెంచరాదని స్పష్టం చేశారు. మునిసిపాలిటీల చట్టం ప్రకారం కొత్త పురపాలికలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లోని ఖాళీ స్థలాలు/ప్లాట్లపై 0.22 శాతం మార్కెట్ విలువన ఖాళీస్థలం పన్నుగా వసూలు చేయాలని కోరారు. నల్లా చార్జీలకు రెక్కలు కొత్త మునిసిపాలిటీల్లో పాలక మండళ్ల తీర్మానంతో నల్లా చార్జీలను పెంచాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిబంధనల మేరకు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వేర్వేరు చార్జీలను నిర్ణయించాలని సూచించింది. చిన్న హోటళ్లు, వ్యాపార గృహా ల నుంచి కూడా వాణిజ్య కేటగిరీ కింద నీటి చార్జీలు వసూలు చేయనున్నారు. పైప్లైన్ల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యయాన్ని వాటర్ డొనేషన్ చార్జీల రూపంలో ఏకకాలం(వన్‌టైం)లో వసూలు చేస్తారు. కొత్త మునిసిపాలిటీల్లో నల్లా చార్జీలను పట్టికలో సూచించిన విధంగా నిర్ణయించి వసూలు చేయాలని పురపాలక శాఖ కోరింది. భవన నిర్మాణ అనుమతులు ఇక భారం.. కొత్త మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఇకపై భారం కానున్నాయి. ఇకపై మునిసిపల్ బిల్డింగ్ రూల్స్(జీవో 168) ప్రకారం భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం నామ మాత్రపు ఫీజులతో అనుమతులు జారీ చేస్తుండగా, ఇకపై మూడో శ్రేణి మునిసిపాలిటీలకు వర్తించే భవన అనుమతుల ఫీజులను కొత్త మునిసిపాలిటీల్లో దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన కౌన్సిల్ తీర్మానం చేయాలని పురపాలక శాఖ కోరింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సైతం.. కొత్త పురపాలికల్లో వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక, వినోద అవసరాలకు వినియోగించే భవనాలు, గృహాల నుంచి ఇక ముందు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయనున్నారు. కౌన్సిల్లో వివిధ రకాల ట్రేడ్లకు ఫీజులను నిర్ణయించాలని పురపాలక శాఖ ఆదేశించింది. మ్యుటేషన్ ఫీజులను సైతం కౌన్సిల్లో నిర్ణయించి వసూలు చేయాలని కోరింది. మునిసిపల్ చట్టాల ప్రకారం.. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వినోద పన్నులో 90శాతం వాటాతోపాటు ఆస్తుల క్రయ విక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేసే స్టాంపు డ్యూటీలో 2 శాతాన్ని సర్‌చార్జీగా మునిసిపాలిటీలు తిరిగి రాబట్టుకోవాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మార్కెట్, పశువధశాలల్లో ఫీజులు కొత్త మునిసిపాలిటీల్లోని మార్కెట్లో, పశువధశాలల్లో వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసే హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్‌కు ఫీజులు వసూలు చేసే హక్కులను అప్పగించాలని కోరింది. కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు కౌన్సిల్ తీర్మానంతో టెండర్ ప్రకటన జారీ చేయనున్నారు. మునిసిపాలిటీల స్వీయ నిర్వహణలో ఉన్న మార్కెట్లు, పశువధశాల ల్లో టికెట్ల ద్వారా ఫీజులు వసూలు చేయనున్నారు.మూడేళ్లకోసారి ఈ ఫీజులను పెంచనుంది. కొత్త మునిసిపాలిటీల యాజమాన్యంలోని ఖాళీ స్థలాలు, దుకాణాలు, గోదాములు, భవనాలను కౌన్సిల్ తీర్మానంతో కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలా నికి ఆయా మునిసిపాలిటీలు అద్దెకు ఇచ్చుకోవచ్చని పురపాలక శాఖ సూచించింది. మునిసిపాలిటీల చట్టం ప్రకారం అద్దెలు నిర్ణయించాలని తెలిపింది. -
రూ.1,100 కోట్ల అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పనితీరును కాగ్ నివేదిక తూర్పారబట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో ఏదో ఒక తప్పును గుర్తించిన కాగ్.. మొత్తం రూ.1,100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొంది. టర్నోవర్ లెక్కించడం నుంచి పన్ను వసూలు వరకు, పన్ను కట్టకపోతే జరిమానా విధింపు నుంచి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మంజూరు వరకు, టర్నోవర్ తేడాల నుంచి కొనుగోలు టర్నోవర్ ఎక్కువ చూపించడం వరకు.. ఇలా 1,055 కేసుల్లో తప్పులు జరిగాయని నిర్ధారించింది. పన్ను విధించక రూ.780 కోట్ల నష్టం 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 7 కేటగిరీల్లో అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా వస్తువులపై పన్ను విధించకుండా లేదా తక్కువ పన్ను వసూలు చేయడం ద్వారా రూ.780 కోట్ల అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. వర్క్ కాంట్రాక్టులకు తక్కువ పన్ను విధించడం ద్వారా రూ.19.57 కోట్లు, వడ్డీ జరిమానా విధించకపోవడం, తక్కువ విధించడం వల్ల రూ.26.02 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రూ.25.43 కోట్లు, కేంద్ర అమ్మకం పన్నులను విధించకపోవడం లేదా తగ్గించడం వల్ల రూ.79.98 కోట్లు, అమ్మకపు పన్ను వాయిదా వల్ల రూ.10.22 కోట్లు, ఇతర అవకతవకల వల్ల రూ.158.16 కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. అయితే విలువ ఆధారిత పన్నును వసూలు చేయని లేదా తక్కువ వసూలు చేసిన 312 కేసుల్లోనే రూ.780.91 కోట్ల తేడా వచ్చిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విషయానికొస్తే మొత్తం 359 కేసులకు రూ.42.06 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించింది. స్టాంపు డ్యూటీలు, ఫీజులు తక్కువగా విధించడం వల్ల రూ.36.99 కోట్లు, ఆస్తుల విలువ తక్కువ లెక్కించడం వల్ల రూ.4.29 కోట్లు, డాక్యుమెంట్లను తప్పుగా వర్గీకరించిన కారణంగా రూ.71 లక్షలు, ఇతర అవకతవకల వల్ల రూ.7 లక్షలు నష్టం జరిగిందని కాగ్ వెల్లడించింది. ఇందులో వ్యవసాయేతర భూముల (నాలా) రిజిస్ట్రేషన్‌కు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, భీమ్‌గల్, భైంసా, దేవరకొండ, ఘన్పూర్, జడ్చర్ల, జోగిపేట, జనగామ, కూసుమంచి, మధిర, మహబూబాబాద్, నర్సంపేట, నిర్మల్, వర్ధన్నపేటల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యా లయాలను పరిశీలించగా, అందులో 29 దస్తావేజులను వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని నాలా భూముల రిజిస్ట్రేషన్ చేశారని తేలిందని పేర్కొంది. ఇది రూ.2.04 కోట్ల తక్కువ డ్యూటీ, ఫీజు విధిం చడానికి కారణమైందని కాగ్ తెలిపింది. -
ప్రధాన ఆదాయ వనరుకు వ్యాపారుల చిల్లు..!
సాక్షి, హైదరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. జీఎస్టీ అమలుకు ముందు ఉన్న బకాయిలు చెల్లించేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వసూలయ్యే పన్నులు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి మొత్తం 12 డివిజన్లు, 232 సర్కిళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి రూ.39,261.40 కోట్ల పన్నులు విధించగా రూ.37,856.83 కోట్ల మేర వ్యాపారులు చెల్లించారు. ఇంకా రూ.1,404.56 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జీఎస్టీకి ముందు రాష్ట్రవ్యాప్తంగా 2,19,561 మంది డీలర్లు ఉన్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవ పన్ను(జీఎస్టీ)ని 2017, జూలై ఒకటి నుంచి అమలు చేస్తోంది. గతంలో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), టీఓటీ (టర్నోవర్ ట్యాక్స్), సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్‌లను ప్రభుత్వం వసులు చేసేవి. ఈ పన్నులన్నీ రద్దు చేసి కొత్తగా వస్తు సేవ పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని ఐదు శ్లాబ్లుగా విభజించారు. ఇందులో 5, 8, 12, 28, 40 శాతం పన్నులు ఉంటాయి. జీఎస్టీ విధానంతో వ్యాపారాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రతీ డీలర్ ఆన్లైన్లో అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రతినెలా 25న ఆన్లైన్లో వివరాలను పొందుపరిచి పన్నులు చెల్లిస్తున్నారు. నో రైడ్స్.. జీఎస్టీ అమలుకు ముందు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. దీంతో పాత బకాయిలు వసూలు కావడంలేదు. గతంలో పన్నులు చెల్లించకుంటే వ్యాపారస్తులకు సంబంధించిన సీ ఫాంలు నిలిపివేసేవారు. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండడంతో సీ ఫాంలు అవసరం లేకుండాపోయాయి. వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖకు ఎలాంటి పెత్తనం లేకపోవడంతో బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ప్రత్యేక బృందాలు.. పాత బకాయిలను వసూలు చేసేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. డివిజన్, సర్కిల్ స్థాయిల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మొండి బకాయిలను వసూలు చేయనున్నారు. -వరంగల్ రూరల్ నుంచి గజవెళ్లి షణ్ముఖరాజు -
అమల్లోకి ‘ఈ–వే’
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ‘ఈ–వే బిల్లు’ విధానం అమల్లోకి వచ్చిందని, పన్నుల ఎగవేతకు ఇక ముకుతాడు పడనుందని రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో మైలురాయి అని అభివర్ణించారు. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువుల రవాణాకు తప్పనిసరిగా ఈ–వే బిల్లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ–వే బిల్లు విధానం అమలుతో వస్తు రవాణా రంగంపై తొలిసారిగా సమగ్రమైన డేటాబేస్ (సమాచార నిల్వ వ్యవస్థ) తయారవుతుందని పేర్కొన్నారు. ఏ సరకు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా అవుతుందో తెలుస్తుందని వివరించారు. కంపెనీల నుంచి వస్తువులు ఎక్కడికి రవాణా అవుతున్నాయో, పన్నులు కట్టారో లేదో తెలుసుకోవడానికి ఈ సమాచార వ్యవస్థ ఉపయోగపడనుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్‌తో కలసి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడికైనా అనుమతి: ఒకే ఈ–వే బిల్లుతో దేశంలో ఎక్కడికైనా వస్తువుల రవాణాకు అనుమతి ఉంటుందని, అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు ఇకపై ట్రాన్సిట్ పాస్ అవసరం ఉండదని సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ట్రేడర్లకు వేధింపులు ఉండవ ని, ఈ–వే బిల్లులను సక్రమంగా తీసుకుంటున్నారో లేదో చెక్ చేస్తామని తెలిపారు. ఈ–వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తూ పట్టుబడితే ఎగ్గొట్టిన పన్నులతో పాటు సదరు పన్నులపై 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించా రు. ఈ–వే బిల్లు డేటాబేస్ ఆధారంగానే జీఎస్టీ వసూళ్లకు ఇన్వాయిస్లు రూపొందించే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తెలిపారు. ఈ–వే బిల్లును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, బిల్లు నంబర్ ఉంటే చాలన్నారు. జీ‘ఎస్’టీ!: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల సరళి సానుకూలంగా ఉందని, జీఎస్టీ అమలుల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జనవరిలోనే ఎక్కువ ఆదాయం వచ్చిందని సోమేశ్ కుమార్ తెలిపారు. జనవరిలో అత్యధికంగా రూ.1,656.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు. డిసెంబర్లో వచ్చిన రూ.1,493.50 కోట్ల పన్నులతో పోల్చితే జనవరిలో పన్ను వసూళ్లు దూకుడు ప్రదర్శించాయన్నారు. పన్ను వసూళ్లలో పెరుగుదల కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలుత రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, క్రమంగా పుంజుకుంటుండటంతోపాటు రాష్ట్రానికి నష్ట పరిహారం లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందుందని తెలిపారు. 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు: జీరో వ్యాపారాన్ని నిర్మూలించడానికి ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో తనిఖీలు నిర్వహించామని సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 786 వాహనాలను తనిఖీ చేశామని, పన్నులు చెల్లించకుండా వస్తువులు రవాణా చేస్తున్న 90 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేశామని తెలిపారు. జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయని 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
అవినీతి కొండ
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖలో భారీ తిమింగలం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు చిక్కింది. ఈడ్పుగల్లులోని ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) ఏడుకొండలును ఆయన కార్యాలయంలోనే ఐటీడీ సిమెంటేషన్స్ ప్రతినిధుల వద్ద లంచం తీసుకుంటుండగా శుక్రవారం అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కటంతో వాణిజ్యపన్నుల శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఉన్నతస్థాయి అధికారి చిక్కడం ఇదే ప్రథమమని చర్చించుకుంటున్నారు. గతంలో డెప్యూటీ కమిషనర్‌గా.. 2004–05లో విజయవాడ ఒకటో డివిజన్ డెప్యూటీ కమిషనర్‌గా ఏడుకొండలు పనిచేశారు. అంతకుముందు ఇక్కడే అసిస్టెంట్ కమిషనర్ (ఇంటెలిజెన్స్)లో పనిచేశారు. అప్పట్లోనే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్‌లో డెప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగిన భారీ కుంభకోణంలో ఏడుకొండలు హస్తం ఉందని ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన కారు బహుమతిగా పొందినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జాయింట్ కమిషనర్‌గా వెళ్లినా ఆయన పద్ధతులు మార్చకోలేదు. వాణిజ్యపన్నుల ఖలో పనిచేసే ఇతర అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏడుకొండలును అరెస్ట్ చేశారు. రిఫండ్స్ ఇవ్వాలంటే లంచాలు ముట్టజెప్పాల్సిందే.. కమిషనర్ కార్యాలయంలో రిఫండ్ ఫైల్ వచ్చిందంటే అధికారులకు పండగేనన్న ఆరోపణలు ఉన్నాయి. డీలర్లకు కోట్లలో రిఫండ్ ఇవ్వాల్సి రావడంతో లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని ముఖ్య అధికారులందరికీ ఇందులో వాటాలు ఉంటాయి. ఐటీడీ సిమెంటేషన్స్ రూ.4.6 కోట్ల వరకూ చెల్లించాల్సి రావడంతో ఏడుకొండలు రూ.23.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ సొమ్ము ఇవ్వడానికి ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధపడ్డారు. అయితే, ఆ శాఖలోని అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఏసీబీకి సమాచారం అందినట్లు తెలిసింది. కాగా, రూ.10 లక్షలలోపు రిఫండ్స్ డెప్యూటీ కమిషనర్, ఆపైన కమిషనర్ కార్యాలయానికి వెళ్తాయి. అయితే, పెద్ద మొత్తాల కేసులు కూడా సీటీవో స్థాయిలో పరిశీలించాకే ఉన్నతాధికారులకు పంపుతారు. దీంతో అందరినీ చేతులు తడపాలంటే కష్టంగానే ఉందని డీలర్లు వాపోతున్నారు. అంతాఅవినీతి వాణిజ్య సంస్థలపై సీటీవో స్థాయి అధికారులు దాడులు చేసి జరిమానాలు వేసినప్పుడు డీలర్లు సంతృప్తి చెందకపోతే డెప్యూటీ కమిషనర్ అపెలెంట్స్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అక్కడ అపెలెంట్ డెప్యూటీ కమిషనర్ జరిమానా వేసిన కేసులను కూడా కమిషనర్ కార్యాలయం అధికారులు తిరగదోడి చిన్నచిన్న తప్పుల్ని చూపించి భారీగా లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ శాఖలో ఉన్నతాధికారుల అవినీతి గురించి కథలుకథలుగా చెబుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖలోని ఒక ముఖ్య అధికారి విజయవాడలో సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని బినామీతో రూ.90లక్షలకు కొనిపించారు. ఆ ఇంట్లో తానే అద్దెకు ఉంటూ ఆ ఇంటిని కొనేందుకు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని, రూ.కోటి బ్యాంకు రుణం తీసుకున్నారు. దీనికి మరో కోటి వెచ్చించి మరమ్మతులు చేయించారు. అధికారులే అవినీతిపరులు కావడంతో కిందిస్థాయి అధికారులు చేసే అవినీతిని పట్టించుకోలేకపోతున్నారని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వాణిజ్య శాఖలో అతి పెద్ద అవినీతి చేప
సాక్షి, అమరావతి/కంకిపాడు(పెనమలూరు): వాణిజ్య పన్నుల శాఖలో అతి పెద్ద అవినీతి చేప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కింది. వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్ ట్యాక్స్) అదనపు కమిషనర్ యు.ఏడుకొండలు రూ.25 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకున్నారు. ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి దొరకడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే ప్రథమం. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణరంగ కంపెనీ ఐటీడీ సిమెంటేషన్స్ నుంచి శుక్రవారం విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లులో ఉన్న వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏడుకొండలును పట్టుకున్నట్టు తెలిపారు. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నిర్మాణాలకు సంబంధించి రూ.4.6 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ రిఫండ్ చెల్లింపులకోసం లంచం తీసుకుంటున్నట్లు వాణిజ్య పన్నులశాఖ వచ్చిన పక్కా సమాచారంతో ఈ అవినీతి అధికారిని పట్టుకున్నట్లు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం: ఏసీబీ డీజీ రిఫండ్ చెల్లింపులకోసం రూ.25 లక్షల లంచమివ్వడానికి హైదరాబాద్ నుంచి ఐటీడీ సిమెంటేషన్స్ కంపెనీ ప్రతినిధులు వస్తున్నట్లు సమాచారమందిందని, కానీ తమ దాడిలో రూ.23.3 లక్షల సొమ్ము మాత్రమే దొరికిందని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. మిగిలిన సొమ్ము ఎక్కడ ఉన్నదన్నది తనిఖీ చేస్తున్నామన్నారు. మిగిలిన సొమ్ము ఏమైంది? ఎవరెవరి హస్తముంది? అక్రమార్జన వ్యవహారాలపై తదుపరి దర్యాప్తు సాగుతుందని తెలిపారు. -
అవినీతికి అటెండర్
పేరు కొండపల్లి శ్రీనివాస్. చేసేది వాణిజ్యపన్నుల శాఖలో అటెండర్ ఉద్యోగం. అయితేనేం.. వన్‌టౌన్‌లోని వ్యాపారులను హడలెత్తిస్తాడు. కమర్షియల్ ట్యాక్ ఆఫీసర్ తరహాలో ఆయనే వాహనాలను తనిఖీ చేస్తాడు. జీరో వ్యాపారంపై దృష్టిపెట్టి వేలాది రూపాయలు ముడుపులు వసూలు చేస్తాడు. ఓ ఉన్నతాధికారి అండతో కోట్లకు పడగలెత్తి, వ్యాపారులను శాసిస్తున్న ఈ అటెండర్ బాగోతాన్ని కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాక్షి, విజయవాడ: దేశంలోని ప్రధాన నగరాల నుంచి రెడీమేడ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర లక్షల రకాల వస్తువులు రైలుమార్గంలోని విజయవాడ రైల్వే పార్సిల్ కార్యాలయానికి వస్తాయి. అక్కడి నుంచి ఆ వస్తువులు నగరంలోని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు చేరతాయి. ఈ సరుకులో ఎక్కువ భాగానికి వ్యాపారులు పన్ను చెల్లించరు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖలోని సిబ్బందికి బాగా తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ వన్‌టౌన్‌లో ఉండే కొండపల్లి శ్రీనివాస్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒంటరిగా తనిఖీలు వాణిజ్యపన్నుల శాఖలో వాహనాలు తనిఖీ చేయాలంటే జాయింట్ కమిషనర్ లేదా సీటీవో స్థాయి అధికారి ఆదేశాలతో డీసీటీవో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తారు. అయితే, కొండపల్లి శ్రీనివాస్ మాత్రం ఇవేం అవసరం లేదు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఒక్కడే వాహనాలు తనిఖీ చేస్తాడు. సరకుతో వెళ్తున్న రిక్షాలు, ఆటోలు, వ్యాన్లను ఆపి బిల్లులు తనిఖీ చేస్తాడు. బిల్లులో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే సరకు సీజ్ చేస్తానంటూ బెదిరిస్తాడు. చివరకు వ్యాపారి కాళ్లబేరానికి వస్తే ముడుపులు తీసుకుని వదిలేస్తాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నాడని సమాచారం. ఎవరైనా వ్యాపారులు గట్టిగా ప్రశ్నిస్తే, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారితో భారీగా జరిమానాలు వేయించగల సమర్థుడు. కేవలం అటెండర్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు డీసీటీవో స్థాయిలో తనిఖీలు చేయడం గమనార్హం. ఒక డివిజన్‌కు చెందిన డీసీటీవోలు మరో డివిజన్ పరిధిలోకి వెళ్లి తనిఖీలు చేయరు. అయితే, డివిజన్–2 పరిధిలోని ఉయ్యూరు సర్కిల్‌కు చెందిన శ్రీనివాస్, డివిజన్–1 పరిధిలోకి వెళ్లి వాహనాలను ఆపడం వ్యాపారులకు విస్మయం కలిగిస్తోంది. తనిఖీలపై వీడియో శ్రీనివాస్ వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కొంతమంది బాధితులు వీడియోలు, ఫొటోలు తీసి వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌తోపాటు జాయింట్ కమిషనర్లకు పంపారు. దీనిపై జాయింట్ కమిషనర్–2 రఘునా«థ్ స్పందిస్తూ ఈ వీడియోపై విచారణ చేయాలని ఉయ్యూరు సీటీవో విజయభాస్కర్‌ను ఆదేశించారు. రంగంలోకి ఉన్నతాధికారి శ్రీనివాస్‌కు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారితో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో డివిజన్–2 కార్యాలయంలో పనిచేశారు. ఆ అధికారిపై గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఆ అధికారి శ్రీనివాస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తామే తనిఖీలు చేయించామంటూ నివేదిక ఇవ్వాలంటూ డివిజన్–1 కార్యాలయానికి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. విచారణకు ఆదేశించాం కొండపల్లి శ్రీనివాస్ వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఎవరో నాకు వీడియో పంపారు. దాని గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఉయ్యూరు సీటీవోను ఆదేశించాను. ఆదేశాల మేరకే విచారణ చేశారా? ఎప్పుడు చేశారు? పక్కన ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? శ్రీనివాస్ ఒక్కడే తనిఖీలు చేశాడా? అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్‌ను విచారించి సీటీవో నివేదిక ఇస్తారు. అప్పుడే నిర్ణయం తీసుకుంటాను. – రఘునాథ్, జాయింట్ కమిషనర్ -
ఆడిట్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన నిధులను వాణిజ్య పన్నుల శాఖ చేతులారా పోగొట్టుకుంటోంది. ప్రణాళిక లేని పనులు, హడావుడి ఉత్తర్వుల ద్వారా కోట్లాది రూపాయల ధనాన్ని కోల్పోతోంది. పన్ను చెల్లించే రిజిస్టర్డ్ డీలర్ల వ్యాపార లావాదేవీలను ఆడిట్ చేసే ప్రక్రియలో అక్కరకు రాని పనులు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా గత ఆరునెలలుగా రూ.100 కోట్ల వరకు వాణిజ్య పన్నుల శాఖకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ఆడిట్ ప్రక్రియలో అవసరం లేని ‘స్క్రూటినీ’అనే విధానాన్ని చేర్చడంతో ఆడిట్లు ఓ పట్టాన పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, గత ఆరునెలల కాలంలో ఈ విధానం ద్వారా కనీసం 10 మంది డీలర్ల వ్యాపార లావాదేవీలను కూడా ఆడిట్ చేయలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడిట్.. కథా కమామిషు వాస్తవానికి, పన్ను చెల్లింపుదారుల కింద రిజిస్టర్ అయిన డీలర్లు ఏటా తమ వార్షిక టర్నోవర్ ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. ఇందుకు గాను అవసరమైన పత్రాలను ఆడిట్ చేయించి ప్రభుత్వానికి సమర్పి స్తారు. అయితే, వ్యాపారులిచ్చిన వివరాలు, వారి లావాదేవీలు సరిగా ఉన్నాయా లేదా తనిఖీ చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కూడా ఆడిట్లు చేస్తుంది. వ్యాపారులు ఏడాది పాటు ఎక్కడి నుంచి వస్తువులు కొన్నారు?, ఎంతకు అమ్మారు?, అందులో ఏ శ్లాబు పన్ను కిందకు ఏ వస్తువులు వస్తాయి? అసలు పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఆడిట్లో చూపించిన మొత్తం ఎంత? చెల్లించింది ఎంత? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఎంత క్లెయిమ్ చేసుకున్నారు? అనే వివరాలను వ్యాపారుల వద్ద ఉన్న రికార్డుల ద్వారానే తనిఖీ చేస్తారు. ఈ విధంగా ఆడిట్ చేయడం ద్వారా వ్యాపారాన్ని తక్కువ చూపించి పన్ను ఎగ్గొట్టే డీలర్ల నుంచి అదనపు పన్ను వసూలు చేస్తారు. ఇలాంటి ఆడిట్ ప్రక్రియలో కూడా ఏటా వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. కానీ, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆడిట్ ప్రక్రియలో స్క్రూటినీ అనే విధానాన్ని మన రాష్ట్రంలోనే కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం సదరు వ్యాపారి వద్ద తనిఖీ చేసిన ప్రతి రికార్డును ఇన్వాయిస్తో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తోంది. కాగా, ఆరేళ్లనాటి రికార్డులు కూడా పరిశీలించాలనడం.. అవి అందుబాటులో లేక, ఉన్నా సరిగా అప్లోడ్ చేయలేక ఆడిటింగ్ నత్తనడకన సాగుతోం దని అధికారులు వాపోతున్నారు. నెలలో చేయాల్సింది 1,500 పన్ను మదింపు అధికారం ఉన్న అధికారులు రాష్ట్రంలో 350 మంది ఉన్నారు. ఇందు లో డీసీటీవోలు 200 మంది, సీటీవోలు 110 మంది, అసిస్టెంట్ కమిషనర్లు 30 మంది ఉన్నారు. అంటే 350 మంది అధికారులు డీలర్ల వ్యాపారాలపై పన్ను మదింపు చేయవచ్చు. ఒక్కో అధికారి కనీసం నెలకు 5 కంపెనీల రికార్డులను ఆడిట్ చేసే వీలుంది. ఈ లెక్క ప్రకారం ప్రతి నెలా 1,500 వరకు చేయవచ్చు. అంటే ఆరు నెలలకు 9,000 ఆడిట్లు పూర్తి చేయొచ్చు. గతంలో ఉన్న పన్నుల శాఖ గణాంకాల ప్రకారం ఒక్కో ఆడిట్ ద్వారా సరాసరి రూ.2 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే 9,000 ఆడిట్లు చేయగలిగితే ఇప్పటికే ఈ ఆరునెలల్లో దాదాపు రూ.100 కోట్ల వరకు ఆదనపు ఆదాయం సమకూరేది. ఉదాహరణకు అక్టోబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు 18,442 ఆడిట్లకు ఆథరైజేషన్ ఇవ్వగా, 18,132 ఆడిట్లు చేశారు. దీని ద్వారా రూ.37 కోట్లు పెనాల్టీ, 13 కోట్లు పన్ను, ఇంకో 58 కోట్లు కేంద్ర అమ్మకం పన్ను కింద వచ్చింది. అంటే దాదాపు 108 కోట్ల వరకు ఆడిట్ల ద్వారా ఆదాయం సమకూరింది. కానీ, స్క్రూటినీ విధానంలో ఇప్పటివరకు కనీసం 10 ఆడిట్లు కూడా పూర్తి కాలేదు. దీంతో ఆ మేరకు నష్టం వాటిల్లుతోందని, అక్కరకు రాని ఇన్వాయిస్ల అప్లోడ్ లాంటి ప్రక్రియలను ఆడిట్ నుంచి పక్కన పెట్టాలని పన్నుల శాఖ అధికారులే అంటున్నారు. -
కోట్లు ఎగ్గొట్టి.. ఆపై హైకోర్టుకెక్కి..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ఓవైపు రూ. కోట్లలో పన్ను ఎగ్గొడుతూ మరోవైపు ప్రభుత్వాన్నే దోషిగా చూపేందుకు హైకోర్టుకెక్కిన ఓ ఘరానా వ్యాపార సంస్థ బాగోతం న్యాయస్థానంలోనే బట్టబయలైంది. వాణిజ్య పన్నులశాఖపై ఆ సంస్థ వేసిన కేసులో విచారణ సందర్భంగా దాని బండారం ప్రాథమికంగా రుజువు కావడంతో హైకోర్టు సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. పన్నులు ఎగవేసే ఇలాంటి వ్యాపార సంస్థలు ఎన్నున్నాయో దర్యాప్తులో నిగ్గు తేల్చాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఏమిటంటే... వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఎటువంటి మదింపు ఉత్తర్వులు జారీ చేయకుండానే తమ నుంచి రూ. 32.87 లక్షలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులను వసూలు చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్ ఫుడ్స్ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల చర్యను చట్ట విరుద్ధంగా ప్రకటించి తమ చెక్కులను వెనక్కి ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు చెల్లించాల్సిన పన్ను నిమిత్తం ఆ చెక్కులను నగదుగా మార్చామని వాణిజ్యపన్నులశాఖ అధికారులు కోర్టుకు నివేదించారు. అంతేగాక అయిల్ తరలింపు వాహనాలకు సంబంధించిన సీఎస్టీ వే బిల్లుల వ్యవహారంలో ఆకాశ్ ఫుడ్స్ చేసిన మోసాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించారు. పలు వాహనాలకు సంబంధించి ఆకాశ్ ఫుడ్స్ 106 వే బిల్లులు సంపాదించిందని, వాటి ద్వారా తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి అయిల్ వాహనాలు పంపిందన్నారు. దీనిపై మహారాష్ట్ర పన్ను అధికారుల సాయంతో విచారణ చేపట్టగా నాందేడ్‌లో ఆకాశ్ ఫుడ్స్ చూపిన ఆయిల్ డీలర్ల చిరునామాలన్నీ బోగస్‌వని తేలిందన్నారు. అలాగే ఢిల్లీలోని డీలర్ల బ్యాంకు ఖాతాల్లో భారీగా అవకతవకలు కనిపించాయని కోర్టుకు వివరించారు. ఆకాశ్ ఫుడ్స్ సమర్పించిన ఫోనిక్స్ ఇంపెక్స్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ. 1.05 కోట్లు చెల్లింపులు చేసినట్లు ఉంటే, ఆకాశ్ ఫుడ్స్ మాత్రం రూ. 7.77 కోట్లు చెల్లించినట్లు చూపిందన్నారు. తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం... పన్ను బకాయి కింద జమ చేసుకునేందుకు ఆకాశ్ ఫుడ్స్‌కు చెందిన చెక్కులను అధికారులు నగదుగా మార్చుకున్నం దున ఈ కేసును హైకోర్టు అక్కడితో మూసేయాల్సి ఉన్నప్ప టికీ... ఆకాశ్ ఫుడ్స్‌పై అధికారులు చేసిన ఆరోపణలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోట్ల రూపాయాల మేర పన్ను ఎగవేసేందుకు ఆకాశ్ ఫుడ్స్ ప్రయత్నించినట్లు ప్రా«థమికంగా నిర్ధారించి సంస్థ ఆర్థిక అవకతవకలపై సీబీసీ ఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తును ఈ కేసుకే పరిమి తం చేయకుండా పిటిషనర్లాగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకలా పాలు సాగిస్తున్న ఆయిల్ డీలర్లందరి విషయంలోనూ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై 3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వాలకు చురకలు... ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాలను ఉద్దేశించి హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంస్థ పన్ను ఎగవేతపై అధికారులు ఇప్పటివరకు ఫిర్యాదు లేదా దర్యాప్తు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పన్నులు ఎగవేస్తున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పన్నుల వసూలు, జరిమానాల విధింపుతోనే పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం సరికాదని, నీతినియమాలు లేనటువంటి వ్యాపారులపట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. -
ఆ చెక్‌పోస్టులు.. అంతేనా!
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులను ‘క్లియర్’ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తమ శాఖ ఆధ్వర్యంలోని 12 చెక్ పోస్టులను మూసేసి 5 నెలలవుతున్నా కోట్ల రూపాయల విలువ చేసే ఆ చెక్ పోస్టుల్లోని వస్తువులను మాత్రం వదిలేసింది. చెక్ పోస్టులను రద్దు చేయడానికి కొంతకాలం ముందే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, ఇతర సామగ్రిని కనీసం కాపలా లేకుండా గాలికొదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. చెక్‌పోస్టుల్లోని సామగ్రినే కాదు అక్కడ పనిచేసి వచ్చిన ఉద్యోగుల వేతనాల విషయంలోనూ గందరగోళ వైఖరిని అవలంబిస్తోంది. కనీస ‘చెక్’ లేదు వాస్తవానికి, జీఎస్టీ అమల్లోకి రాక ముందు రాష్ట్ర నలుమూలలా 12 చెక్ పోస్టులుండేవి. భైంసా, వాంకిడి, మద్నూరు, చిరాగ్పల్లి, జహీరాబాద్, కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, తుంగభద్ర, పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేటల్లో ఉన్న ఈ చెక్‌పోస్టులను జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై 1 అర్ధరాత్రి నుంచే మూసేశారు. వాణిజ్య తనిఖీలు జరిగే చెక్ పోస్టులను ఎత్తేయాలన్న కేంద్ర నిర్ణయంతో ఇక్కడ కూడా చెక్‌పోస్టులను మూసేశారు. అక్కడ వదిలేసి వచ్చిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, కుర్చీలు, బల్లలు, ఇతర ఫర్నిచర్ సరిచూసుకునేందుకు కూడా యత్నించకపోవడం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా నిలుస్తోంది. అక్కడ ఉండే జీపులను కూడా హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ మూలన పడేశారు తప్ప వాటిని వాడేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. మొత్తం వీటి విలువ రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసినా.. తిరిగి వాడుకునే వీలున్నా మూలన పడేయడంపై ఆ శాఖ వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిదీ అదే స్థితి చెక్‌పోస్టుల వద్ద పనిచేసే సిబ్బందికి వేరే విధులు కేటాయించారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడి సౌకర్యాలు, హెచ్ఆర్ఏ లాంటివి వర్తింపజేయకుండా పాత స్థానంలో ఉన్న సౌకర్యాలు, హెచ్ఆర్ఏలే ఇస్తుండటం గమనార్హం. అలా చెక్‌పోస్టుల నుంచి వచ్చిన సిబ్బందిలో ఐదుగురిని విలీనం చేసుకోకుండా డిçప్యుటేషన్ అంటూ విధుల్లో కొనసాగిస్తుండటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే వాహన భత్యం విషయంలోనూ వీరి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఓ సర్కిల్లో చెక్‌పోస్టుల నుం చి వచ్చిన ఓ అధికారికి వాహన భత్యం ఇవ్వాలా వద్దా అనే విషయంలో ప్రభుత్వానికి ఫైల్ పంపడం గమనార్హం. అదే సర్కిల్లో పనిచేస్తున్న మరి కొంతమందికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు లేవని, వాహనాల ఈసీ పుస్తకాలు లేవంటూ వాహన భత్యం నిలిపేశారని సమాచారం.