పవన విద్యుత్‌కు భారీ రాయితీలు | Huge subsidies for wind power | Sakshi
Sakshi News home page

పవన విద్యుత్‌కు భారీ రాయితీలు

Published Tue, Mar 1 2016 2:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

పవన విద్యుత్‌కు భారీ రాయితీలు - Sakshi

పవన విద్యుత్‌కు భారీ రాయితీలు

సాక్షి, హైదరాబాద్: పవన విద్యుదుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. విద్యుత్ సుంకం, స్టాంపు డ్యూటీ, వ్యాట్/ఎస్‌జీఎస్టీ పన్నులపై 100 శాతం రాయితీ ఇస్తామంది. సత్వర, సరళీకృత విధానంలో పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాచబాటలు వేసింది. తెలంగాణ పవన విద్యుత్ విధానం-2016 ముసాయిదాను తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) సోమవారం ప్రకటించింది.

ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ ముసాయిదాను సంస్థ వెబ్‌సైట్(www.tnredcl.telangana.gov.inలో ప్రదర్శన కోసం ఉంచింది. మార్చి 7లోగా సూచనలు, అభ్యంతరాలను తెలపాలని ఔత్సాహిక ఉత్పత్తిదారులను కోరింది. దేశంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 37,000 మెగావాట్లు కాగా, అందులో పవన విద్యుత్ వాటా 24,000 మెగావాట్లు. అదే విధంగా రాష్ట్రం 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ పవన విద్యుత్ సంస్థ జరిపిన ప్రాథమిక సర్వేలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2018-19 నాటికి కనీసం 2,000 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో నిర్దేశించిన సమయం లేక గరిష్టంగా 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తేనే రాయితీలు వర్తిస్తాయి. లేనిపక్షంలో రద్దవుతాయి.

 ముసాయిదాలో ముఖ్యాంశాలు..
► పవన విద్యుత్ ప్రాజెక్టులకూ సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు లభించనున్నాయి. దీనికోసం ‘విండ్ పాలసీ సెల్’ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టు డెవలపర్లే భూమిని సేకరించాల్సి ఉంటుంది. నిర్దేశిత రుసుం చెల్లిస్తే భూములను వ్యవసాయేతర కేటగిరీకి తక్షణమే మార్చనున్నారు. మరే ఇతర అనుమతులు అవసరం లేదు. భూములకు ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు లభించనుంది.
► గ్రిడ్ కోడ్ ప్రకారం అన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వం ‘మస్ట్ రన్’ హోదాను కేటాయించనుంది. కాప్టివ్, ఓపెన్ యాక్సెస్, షెడ్యూల్డ్ వినియోగదారుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులకు 100 శాతం విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది.
► డిస్కం లేక థర్డ్ పార్టీకి  విద్యుత్ విక్రయం, కాప్టివ్/గ్రూపు కాప్టివ్ వినియోగ అవసరాల కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు విద్యుత్ సుంకం మినహాయింపు.
► థర్డ్‌పార్టీ వినియోగదారుడికి విద్యుత్ విక్రయిస్తే ఐదేళ్ల వరకు 100 శాతం క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ మినహాయింపు.
► ఎకరాకు రూ.25 వేల చొప్పున అభివృద్ధి చార్జీలు, లే అవుట్ ఫీజులను చెల్లిస్తే గ్రామ పంచాయతీలు ప్రాజెక్టు ఏర్పాటుకు 14 పనిదినాల్లో అనుమతివ్వాలి.
► ఐదేళ్ల పాటు ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌పై 100 శాతం వ్యాట్/ఎస్‌జీఎస్టీ పన్నులను వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లించనుంది.
► గ్రీన్ ఎనర్జీలో భాగమైన పవన విద్యుత్ ప్రాజెక్టులకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్‌ఓసీ అవసరం లేకుండా మినహాయింపు.
► 10 శాతం మార్కెట్ ధరను చెల్లిస్తే ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను కేటాయించనున్నారు. ఆ ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలి. రెవెన్యూ, ప్రైవేటు భూముల్లో కలిపి నిర్మించే ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తిచేయాలి.
► రూఫ్ టాప్ బేస్డ్ విండ్, విండ్-సోలార్ హైబ్రిడ్ సిస్టమ్స్ నెట్ మీటరింగ్‌ను ప్రభుత్వం అనుమతించనుంది. టారిఫ్‌ను టీఎస్‌ఈఆర్‌సీ నిర్ణయించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement