
అధికారులపై..‘ఆంధ్రా’ వ్యాపారుల జులుం
వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించకుండా ఆంధ్రా పత్తివ్యాపారులు జులుం ప్రదర్శిస్తున్నారు.
వాడపల్లి(దామరచర్ల) : వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించకుండా ఆంధ్రా పత్తివ్యాపారులు జులుం ప్రదర్శిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో సేల్‌టాక్స్ చెల్లించమంటూ జబర్‌దస్తీగా వేబిల్లులు ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన అధికారులపై ఏకంగా దాడిచేసేందుకే యత్నిం చారు. ఈ ఘటన రాష్ట్ర సరిహద్దు దామరచర్ల మండలం వాడపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. తెలంగాణ నుంచి వెళ్లే పత్తిలోడు లారీలు వాణిజ్య పన్నుల శాఖకు సేల్ టాక్స్ రూపేణా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే అధికారుల ఉదాసీన వైఖరిని ఎండగడుతూ ఇటీవల ‘సాక్షి’ మినీలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో తేరుకున్న అధికారులు గురువారం ఉదయం నుంచే నాగార్జునసాగర్‌లో వాణి జ్య పన్నుల శాఖ అధికారులు మకాం వేశారు. అయితే పత్తివ్యాపారులు తమ లారీలను దారి మళ్లించి వాడపల్లి మీదుగా రాష్ట్ర సరిహద్దు దాటించాలని యత్నించారు. అప్రమత్తమైన అధికారులు వాడపల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.
చెక్‌పోస్టు అధికారులతో వాగ్వాదం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమైన చెక్‌పోస్టు అధికారులు శుక్రవారం ఉదయం వరకు 30 లారీలు సరిహద్దు దాటకుండా నిలిపారు. దీంతో డ్రైవర్లు తమ యజయానులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం వరకు అక్కడికి చేరుకున్న వ్యాపారులు వచ్చీరావడంతోనే చెక్‌పోస్టు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెల్లించిన సేల్స్ ట్యాక్స్ బిల్లులు ఉన్నాయి. లారీలను ఎలా ఆపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర బిల్లు ఉంటేనే సరిహద్దు దాటేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. లారీడ్రైవర్లు, యజమానులు దాదాపు వందమందికి పైగా ఉండగా, అధికారులు ముగ్గురే ఉన్నారు. దీంతో వ్యాపారులు జులుం ప్రదర్శించారు. చేసేదేమీ లేక ఏసీటీఓ వినోద్‌నాయక్ వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అటెండర్‌ను తీసుకుని వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చెక్‌పోస్టుపై దాడిచేసి వేబిల్లులను ఎత్తుకెళ్లారు. దాదాపు 20 లారీల వరకు అనుమతి లేకుండానే రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లిపోయాయి.