కేంద్రం చోద్యం చూసిందే తప్ప..
హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సీఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాగర్ జలాల అంశం వివాదం కావడానికి కేంద్రం పట్టించుకోకపోవడమే కారణమన్నారు.
'సమస్య తీవ్రమవుతున్నా.. కేంద్రం చోద్యం చూసిందే తప్ప.. చేసిందేమీ లేదు. నీటి జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కంటితుడుపు చర్యలు కాకుండా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలి. సమస్యను మీరే పరిష్కరించుకోండని కేంద్రం అనడం బాధ్యతారాహిత్యం కాదా ? తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యుత్ వాటా దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. సాగర్ వద్ద జరిగిన పోలీసుల దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను' అని జానారెడ్డి అన్నారు.