పన్ను వసూళ్లు.. రూ. 32,492 కోట్లు
♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 96 శాతం లక్ష్య సాధన
♦ పన్ను వసూళ్ల వృద్ధిలో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం
♦ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పన్ను వసూళ్లలో గణనీయవృద్ధి సాధించి తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని వాణిజ్య పన్నుల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.33,965 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికిగానూ రూ.32.492 కోట్లు సమకూరిందని, 96 శాతం లక్ష్యసాధన అధికార యంత్రాంగం కృషి వల్లనే సాధ్యమైందని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరచడంతో 17.85 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. 2015-16 పన్ను వసూళ్లలో 30 శాతం వృద్ధి సాధించి బిహార్ తొలి స్థానంలో నిలవగా, 16 శాతం వృద్ధితో ఏపీ మూడోస్థానంలో ఉందని అన్నారు.
తెలంగాణ ఏర్పాటైన సమయంలో రూ. 18 వేల కోట్ల వార్షిక పన్ను ఆదాయం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లలోపే రూ.32 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూర్చుకోవడం విశేషమన్నారు. ఇదే స్ఫూర్తితో 2016-17 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం రూ.43,115 కోట్లుగా నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. డిఫర్‌మెంట్ టాక్స్‌ను ముందుగా చెల్లిం చిన వారికి రాయితీలు కల్పించడం, గుర్రపు పం దేలు, బెట్టింగ్ పన్నుల్లో చట్ట సవరణ, కేంద్రీకృత బిల్లింగ్ విధానం అమలు చేయడంతో పాటు శాఖలోని ఖాళీలను భర్తీ చేసి, పన్ను వసూళ్లను కట్టుదిట్టం చేయడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలోని 419 ఉద్యోగ ఖాళీల్లో 110 మంది ఏసీటీవో స్థాయి అధికారులను గ్రూప్-2 ద్వారా నియమించేందుకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. మార్చిలో 74 డీసీటీవో పోస్టులను ఏసీటీవోలకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు.
చెక్‌పోస్టుల ఆధునీకరణ.. అధికారుల పెంపు
రాష్ట్రంలోని 14 సరిహద్దు చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తలసాని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల కోసం రూ. 12 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ వ్యాపారాల ద్వారా రూ.1,657 కోట్ల టర్నోవర్‌కు సంబంధించి పన్ను ఎగవేతను గుర్తించి రూ.115 కోట్ల పన్ను వసూలుకు నోటీసులు జారీ చేసి, రూ.51 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వాహనాలను తనిఖీల ద్వారా రూ.9.70 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రతి జిల్లాకు ఓ డిప్యూటీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డివిజన్లలో అదనంగా డిప్యూటీ కమిషనర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు.