Minister Talasani Srinivas
-
పట్టణాల్లోనూ గొర్రెల పథకం
సాక్షి, జనగామ: పట్టణ, విలీన గ్రామాల్లోను సబ్సిడీ గొర్రెల పథకం అమలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జనగామ జిల్లాలోని పెంబర్తి, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో శనివారం చేప పిల్లలు, పాడి పశువులు, గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివాసంలో విలేకరులతో.. ఆ తర్వాత ఆయా సభల్లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రూ.80 కోట్ల విలువైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పాడి రైతులకు రూ. 4 ప్రోత్సాహకం, 50 శాతంపై పాడి పశువులను అందిస్తున్నామని వివరించారు. 70 లక్షల గొర్రెలు ఇస్తే 35 లక్షల పిల్లలు పుట్టాయన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు రూ. 4 వేల పంట పెట్టుబడి పథకం ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. కొన్ని రోజులు పాలు పోసి మానేసిన రైతులకు పాడి పశువులను అందించే విషయం ఆలోచిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కోదండరాం రాజకీయ నిరుద్యోగిగా మారి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఈసారి బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి జోస్యం చెప్పారు. ఔను బెదిరిస్తాం.. తప్పేముంది? దేవాలయం కట్టిస్తే కబ్జా చేశాడని, అధికారి ఇంటికి వెళితే బెదిరించారని ముత్తిరెడ్డిపై విమర్శలు చేయ డం సరికాదని తలసాని పేర్కొన్నారు. అవసరమైతే బెదిరిస్తామని అందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గొర్లకాపరుల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యలో హాకా ఏందీ?
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు విజయ సహా ఇతర సహకార డెయిరీల టెట్రా ప్యాక్ పాలను సరఫరా చేస్తామని హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం(హాకా) ప్రకటించడంపై విజయ డెయిరీ యాజమాన్యం మండిపడుతోంది. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని సెప్టెంబర్ నుంచి పాల సరఫరాకు హాకా ఏర్పాట్లు చేసుకుంటుండగా.. పాల సరఫరాకు తాము సిద్ధంగా లేమని డెయిరీ స్పష్టం చేసింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. విజయ డెయిరీ ఎండీ బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ వ్యాపార సంస్థలైన విజయ డెయిరీ, హాకాల మధ్య తీవ్ర అగాథం నెలకొంది. మాకు యంత్రాంగం ఉంది తాము అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 5 లక్షల లీటర్ల టెట్రా ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని, కావాలంటే అదనంగా కూడా సరఫరా చేయగలమని విజయ డెయిరీ యాజమాన్యం చెబుతోంది. తాము సరఫరా చేస్తున్నపుడు మధ్యలో హాకా జొరబడాల్సిన అవసరమేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమకు పూర్తి స్థాయి యంత్రాంగం ఉందని, హాకాకు అటువంటి పరిస్థితి లేదంటున్నారు. అంగన్వాడీలకు కాకుండా ఏదైనా కొత్త మార్కెట్ చూపిస్తే హాకాకు సహకరించేవారమని, కానీ తాము చేస్తున్న మార్కెట్‌ను వారికెందుకు ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా హాకా.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు నిర్ణయించుకుంటే ఎలాగంటున్నారు. దీనిపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. వేరే డెయిరీల నుంచి కొంటాం: హాకా ఎండీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న హాకా.. పాల మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకుంది. సహకార డెయిరీల నుంచి పాలు కొని అంగన్వాడీలకు సరఫరా చేయడం వల్ల ఏడాదికి రూ. కోటి వరకు ఆర్జించాలని భావిస్తోంది. ఇందుకోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే విజయ డెయిరీ నుంచి టెట్రా ప్యాక్ పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ హాకాకు పాలు సరఫరా చేయబోమని విజయ స్పష్టం చేయడంతో కథ అడ్డం తిరిగినట్లయింది. దీనిపై హాకా ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా.. విజయ యాజమాన్యం ఇలా ఎందుకు అంటున్నదో అర్థం కావడం లేదన్నారు. విజయకు తొలుత ప్రాధాన్యం ఇస్తామని, లేదంటే ఇతర సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. అంగన్వాడీలకు పాలు సరఫరా చేయడానికి ఏర్పాటైన కమిటీ ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. -
ఘనంగా హనుమజ్జయంతి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శనివారం కాషాయవర్ణ శోభితమైంది. హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు భారీఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ప్రదర్శనకు నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో రహదారులు కిక్కిరిసాయి. గౌలిగూడ, కోఠి, ఆబిడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ తదితర మార్గాల్లో శోభాయాత్ర సాగింది. డీజే ఏర్పాటుకు పోలీసులు నిరాకరించడంతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాపిక్ స్తంభించింది. ఆబిడ్స్, కోఠి మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 3 గంటలకుపైగా అంతరాయం ఏర్పడింది. చివరకు పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గమనించిన ఉన్నతాధికారులు డీజేకు అనుమతినివ్వడంతో మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో భజరంగదళ్ నేతలు ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని, అందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకలకు భక్తులు పోటెత్తారు. భక్తుల దర్శనం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యులు పాండు యాదవ్, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తదితరులు వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మత్స్య పరిశ్రమకు సాయం
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆక్వా ఎక్స్పో ఇండియా 2018 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడక ముందు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నోచుకోలేదని, కోస్తా తీర ప్రాంతాల మత్స్యకారులను ఒక రకంగా, తెలంగాణ మత్స్యకారులను మరో విధంగా చూసేవాళ్లని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచితంగా సీడ్‌ను అందిస్తుందన్నారు. చేపల సీడ్ ఇవ్వడం నుంచి, అవి పెరిగాక కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి మంచి ధరకు అమ్మేదాక ప్రభుత్వం మత్స్యకారులకు తోడుగా ఉంటుందన్నారు. టెక్నాలజీని వాడుకుని మత్స్య సంపదను పెంచాలన్నారు. మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి తలసాని అన్నారు. -
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: మాంసం ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మాంసం ఎగుమతి సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. దుబాయ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న గల్ఫుడ్–2018 ఫుడ్ ట్రేడ్ షోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని పాల్గొన్నారు. మాంసం ఉత్పత్తి, పాల ఉత్పత్తి, పౌల్ట్రీరంగాల ఏర్పాటుకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని ప్రతినిధులకు వివరించారు. దాదాపు 100 ఎకరాల్లో మాంసం ఎగుమతి కేంద్రాన్ని నెలకొల్పేందుకు లూలూ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులు సీఈవో సలీం, కో–డైరెక్టర్ విజయ్‌కుమార్‌తో చర్చ సందర్భంగా ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. 5,800 మందికి ఉపాధి.. హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా దాదాపు 800 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సదస్సులో మంత్రితో పాటు డెయిరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి బృందం పాల్గొన్నారు. భారత్ నుంచి మాంసం, చికెన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులకు సంబంధించిన దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అపెడా (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ), అల్‌కబీర్, చెంగిచర్లలోని మహ్మద్ సలీం అండ్ కంపెనీ తదితర సంస్థలు రాష్ట్రం నుంచి స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే మాంసం నాణ్యత విషయంలో అన్నిరకాల నిబంధనలను పాటిస్తామని చెప్పారు. 2017–18 సంవత్సరంలో 420 మెట్రిక్ టన్నుల గొర్రె మాంసం, 59,800 మెట్రిక్ టన్నుల గేదె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మాంసం ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పాలన్న సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. -
‘చిత్రోత్సవం’తో బాలల్లో సృజనాత్మకత
హైదరాబాద్: చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పెంపొందేందుకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం దోహదపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఐమాక్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 8వ తేదీ సాయంత్రం శిల్పకళా తోరణంలో జరిగే ప్రారంభ వేడుకల్లో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేదికగా ప్రకటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి 300 మంది బాల బాలికలు చైల్డ్ డెలిగేట్స్‌గా పాల్గొంటారని తెలిపారు. బాలల చలన చిత్రోత్సవంలో భాగంగా నిర్వహించే వర్క్‌షాప్‌లో బాల బాలికలకు చిత్ర నిర్మాణం, కథా రచన, యానిమేషన్ వంటి వివిధ విభాగాల్లో శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 13 థియేటర్లతో పాటు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాలను ప్రదర్శిస్తామని మంత్రి తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో గతంలో కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయని, ముఖ్యంగా లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో పిల్లలే తీసిన చిత్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా సీఈఓ శ్రవణ్ కుమార్ అన్నారు. 92 మంది ప్రఖ్యాతి గాంచిన దర్శకులు, సినిమా రంగంతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బాలల చలన చిత్రోత్సవ ఏర్పాట్లను వివరించారు. బుధవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రారంభ వేడుకలు ఉంటాయని, ఈ సందర్భంగా ప్రదర్శనకు ఎంపికైన ‘స్కూల్ చలేగా’చిత్ర ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐమాక్స్ థియేటర్ యజమాని రమేశ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు మత్స్య కళాశాలల ఏర్పాటు
మంత్రి తలసాని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2 మత్స్య కళాశాలలు, మత్స్య కార్పొరేషన్‌ను ఏర్పా టు చేస్తామని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మత్స్య పారిశ్రామిక సహకార, మత్స్య సం ఘాల నాయకులు, సభ్యులు బుధవారం ఆయన్ని కలసి సన్మానించారు. హైదరాబా ద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగా రెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి మత్స్యకార సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. తలసాని మాట్లాడు తూ.. గతంలో లేని విధంగా దాదాపు 40 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కు తుందన్నారు. గంగపుత్రులు, ముదిరాజ్ లకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ వారి కుటుంబాలలో వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మం తరావు తదితరులు పాల్గొన్నారు. -
'క్రిస్మస్ పండుగకు దుస్తుల పంపిణీ'
హైదరాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా బన్సీలాల్‌పేట, రాంగోపాల్‌పేట, బేగంపేట డివిజన్లలోని క్రైస్తవులకు ఈ నెల 23న దుస్తుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి నివాసంలో కార్పొరేటర్లు హేమలత, అరుణ్గౌడ్, తరుణి క్రిస్టియన్, మైనారిటీ కార్పొరేషన్ విక్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశమనంతరం తలసాని మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులు పంపిణీచేస్తున్నదని చెప్పారు. -
ఘనంగా తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
ఆశీర్వాదం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సినీ నటులు నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్‌కల్యాన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. - సాక్షి, సిటీబ్యూరో [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: తలసాని
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం సచివాలయం లో బోనాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూలై 10న గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయని, 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లో ఈ పండుగ ఉంటుందని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని, బోనాలకు ఎన్నడూ లేని విధంగా చిన్న, పెద్ద దేవాలయాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మహంకాళి జాతర ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. భక్తులకు ప్రసాదం, మంచినీటి ప్యాకెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవానికి మీడియా సహకరించాలని కోరారు. -
వాణిజ్య పన్నుల సర్కిళ్ల పునర్విభజన
♦ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ♦ పన్ను వసూళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి ♦ వృద్ధి రేటులో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు దేశంలో రెండో స్థానం ♦ మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు సన్మానం సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం ఉన్న సర్కిళ్లను పునర్విభజించి, కొత్తగా మరికొన్నింటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఆధునికీకరించిన కాన్ఫరెన్స్ హాలును శనివారం ప్రారంభించిన ఆయన 2015-16 సంవత్సరంలో పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులను సన్మానించారు. అనంతరం అధికారులతో వార్షిక ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడంలో వాణిజ్యపన్నుల విభాగమే ప్రధాన మైందని అన్నారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ. 32,492 కోట్ల ఆదాయాన్ని సాధించిన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ వృద్ధి రేటులో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఇది ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి విజయమని పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ. 43,115 కోట్లుగా నిర్ధేశించామని తెలిపారు, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని క్షేత్రస్థాయిలో ఆడిట్లు నిర్వహించడం, స్ట్రీట్ సర్వేల ద్వారా కొత్త రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్లను తనిఖీ చేయడం ద్వారా సరుకు రవాణా లీకేజీలను అరికట్టడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. వినోదపు పన్ను, వృత్తిపన్ను, హోటళ్ల నుంచి రావలసిన వ్యాట్, లగ్జరీ పన్నులను సక్రమంగా వసూలు చేయాలని, పన్ను చెల్లింపునకు, జరిగే వ్యాపారానికి సంబంధించి ఇతర శాఖల ద్వారా తె ప్పించిన సమాచారంతో సరిపోల్చుకోవాలని సూచించారు. కోర్టుల్లో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లోనూ పెంచే యోచన ఉందని, సర్కిళ్లను కూడా పెంచి, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన టి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌గౌడ్, పి.లక్ష్మి, కిషోర్ కుమార్, నారాయణరెడ్డి సత్కారం అందుకున్నారు. మొత్తం 68 మందిని సత్కరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్‌కుమా ర్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్లు రేవతి రోహణి, చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు వేణుగోపాల్, టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లు.. రూ. 32,492 కోట్లు
♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 96 శాతం లక్ష్య సాధన ♦ పన్ను వసూళ్ల వృద్ధిలో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం ♦ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పన్ను వసూళ్లలో గణనీయవృద్ధి సాధించి తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని వాణిజ్య పన్నుల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.33,965 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికిగానూ రూ.32.492 కోట్లు సమకూరిందని, 96 శాతం లక్ష్యసాధన అధికార యంత్రాంగం కృషి వల్లనే సాధ్యమైందని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరచడంతో 17.85 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. 2015-16 పన్ను వసూళ్లలో 30 శాతం వృద్ధి సాధించి బిహార్ తొలి స్థానంలో నిలవగా, 16 శాతం వృద్ధితో ఏపీ మూడోస్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో రూ. 18 వేల కోట్ల వార్షిక పన్ను ఆదాయం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లలోపే రూ.32 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూర్చుకోవడం విశేషమన్నారు. ఇదే స్ఫూర్తితో 2016-17 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం రూ.43,115 కోట్లుగా నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. డిఫర్మెంట్ టాక్స్‌ను ముందుగా చెల్లిం చిన వారికి రాయితీలు కల్పించడం, గుర్రపు పం దేలు, బెట్టింగ్ పన్నుల్లో చట్ట సవరణ, కేంద్రీకృత బిల్లింగ్ విధానం అమలు చేయడంతో పాటు శాఖలోని ఖాళీలను భర్తీ చేసి, పన్ను వసూళ్లను కట్టుదిట్టం చేయడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలోని 419 ఉద్యోగ ఖాళీల్లో 110 మంది ఏసీటీవో స్థాయి అధికారులను గ్రూప్-2 ద్వారా నియమించేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. మార్చిలో 74 డీసీటీవో పోస్టులను ఏసీటీవోలకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. చెక్‌పోస్టుల ఆధునీకరణ.. అధికారుల పెంపు రాష్ట్రంలోని 14 సరిహద్దు చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తలసాని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల కోసం రూ. 12 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ వ్యాపారాల ద్వారా రూ.1,657 కోట్ల టర్నోవర్‌కు సంబంధించి పన్ను ఎగవేతను గుర్తించి రూ.115 కోట్ల పన్ను వసూలుకు నోటీసులు జారీ చేసి, రూ.51 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వాహనాలను తనిఖీల ద్వారా రూ.9.70 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రతి జిల్లాకు ఓ డిప్యూటీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డివిజన్లలో అదనంగా డిప్యూటీ కమిషనర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు. -
ఈ గెలుపు బాధ్యత పెంచింది
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన అఖండ విజయం ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మారేడ్‌పల్లిలోని తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చడం వల్లే గ్రేటర్ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోను తమ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సమస్య పరిష్కారానికి రెండు రిజర్వాయర్ల నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచడంతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలూ నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. ఉప ఎన్నికలపై ఏమీ చెప్పలేను తాను స్పీకర్‌కు రాజీనామా సమర్పించానని... దీనిపై ఆయన నిర్ణయం మేరకు చర్యలుంటాయని ఓ ప్రశ్నకు సమాధానంగా తలసాని చెప్పారు. ఉప ఎన్నికల విషయమై తానేమీ చెప్పలేనన్నారు. పక్క రాష్ట్రం వాళ్లకు ఇక్కడేం పని? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే తానే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ఆపేయాలని తలసాని సూచించారు. ఇక్కడేం జరిగినా అరగంటలో వస్తానని చెప్పిన ఆ ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రంలోని తునిలో హింసాత్మక సంఘటనలు జరిగితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ హైదరాబాద్‌లోనే తిష్ట వేశారని విమర్శించారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అభివృద్ధికి వారి సహకారం అవసరం లేదన్న రీతిలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తామే నిధులిస్తున్నామని చెప్పిన బీజేపీ నేతలు ప్రగల్భాలు ఆపాలని హితవు పలికారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... కాంగ్రెస్ దైన్య స్థితికి ఆ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న 30 మంది బడా నేతలను నిలదీయాలని సూచించారు. ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు ఇదే తరహా ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, ఎన్.శేషుకుమారి, ఉప్పాల తరుణి నాయి, కె.హేమలత, అత్తేలి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.