పెంబర్తిలోని కంబాల చెరువులో చేప పిల్లలను వదిలి పెడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్
సాక్షి, జనగామ: పట్టణ, విలీన గ్రామాల్లోను సబ్సిడీ గొర్రెల పథకం అమలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జనగామ జిల్లాలోని పెంబర్తి, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో శనివారం చేప పిల్లలు, పాడి పశువులు, గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివాసంలో విలేకరులతో.. ఆ తర్వాత ఆయా సభల్లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రూ.80 కోట్ల విలువైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
పాడి రైతులకు రూ. 4 ప్రోత్సాహకం, 50 శాతంపై పాడి పశువులను అందిస్తున్నామని వివరించారు. 70 లక్షల గొర్రెలు ఇస్తే 35 లక్షల పిల్లలు పుట్టాయన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు రూ. 4 వేల పంట పెట్టుబడి పథకం ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. కొన్ని రోజులు పాలు పోసి మానేసిన రైతులకు పాడి పశువులను అందించే విషయం ఆలోచిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కోదండరాం రాజకీయ నిరుద్యోగిగా మారి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఈసారి బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి జోస్యం చెప్పారు.
ఔను బెదిరిస్తాం.. తప్పేముంది?
దేవాలయం కట్టిస్తే కబ్జా చేశాడని, అధికారి ఇంటికి వెళితే బెదిరించారని ముత్తిరెడ్డిపై విమర్శలు చేయ డం సరికాదని తలసాని పేర్కొన్నారు. అవసరమైతే బెదిరిస్తామని అందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గొర్లకాపరుల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment