
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శనివారం కాషాయవర్ణ శోభితమైంది. హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్‌బంద్ హనుమాన్ దేవాలయం వరకు భారీఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ప్రదర్శనకు నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో రహదారులు కిక్కిరిసాయి. గౌలిగూడ, కోఠి, ఆబిడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ తదితర మార్గాల్లో శోభాయాత్ర సాగింది. డీజే ఏర్పాటుకు పోలీసులు నిరాకరించడంతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాపిక్ స్తంభించింది. ఆబిడ్స్, కోఠి మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 3 గంటలకుపైగా అంతరాయం ఏర్పడింది.
చివరకు పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గమనించిన ఉన్నతాధికారులు డీజేకు అనుమతినివ్వడంతో మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రా బ్యాంకు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో భజరంగదళ్ నేతలు ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని, అందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాడ్‌బంద్ హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకలకు భక్తులు పోటెత్తారు. భక్తుల దర్శనం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యులు పాండు యాదవ్, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తదితరులు వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment