బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా మీడియా సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి తలసాని. చిత్రంలో నవీన్ మిట్టల్, రమేశ్ ప్రసాద్ తదితరులు
హైదరాబాద్: చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పెంపొందేందుకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం దోహదపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఐమాక్స్ థియేటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 8వ తేదీ సాయంత్రం శిల్పకళా తోరణంలో జరిగే ప్రారంభ వేడుకల్లో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేదికగా ప్రకటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి 300 మంది బాల బాలికలు చైల్డ్ డెలిగేట్స్‌గా పాల్గొంటారని తెలిపారు.
బాలల చలన చిత్రోత్సవంలో భాగంగా నిర్వహించే వర్క్‌షాప్‌లో బాల బాలికలకు చిత్ర నిర్మాణం, కథా రచన, యానిమేషన్ వంటి వివిధ విభాగాల్లో శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 13 థియేటర్లతో పాటు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాలను ప్రదర్శిస్తామని మంత్రి తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో గతంలో కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయని, ముఖ్యంగా లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో పిల్లలే తీసిన చిత్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా సీఈఓ శ్రవణ్ కుమార్ అన్నారు.
92 మంది ప్రఖ్యాతి గాంచిన దర్శకులు, సినిమా రంగంతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బాలల చలన చిత్రోత్సవ ఏర్పాట్లను వివరించారు. బుధవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రారంభ వేడుకలు ఉంటాయని, ఈ సందర్భంగా ప్రదర్శనకు ఎంపికైన ‘స్కూల్ చలేగా’చిత్ర ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐమాక్స్ థియేటర్ యజమాని రమేశ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment