International childrens film festival
-
నేటి నుంచి 15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 14వ తేదీ నుంచి 15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహించనున్నట్లు చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ–తెనాలి అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ తెలిపారు. స్థానిక వివేక పబ్లిక్ స్కూలులో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ, వివేక విద్యాసంస్థల సౌజన్యంతో పది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పది రోజులు వివిధ దేశాల బాలల సినిమాలను ప్రదర్శిస్తామన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు బాలల చిత్రోత్సవం ప్రారంభమవుతుందని, అనంతరం 11 గంటలకు చైనా చిత్రం ‘లిటిల్ బిగ్ సోల్జర్’, ఒంటి గంటకు దక్షిణ కొరియా చిత్రం ‘డాగ్స్’, మధ్యాహ్నం 3 గంటలకు హిందీ సినిమా ‘హమ్ ఔర్ ఆప్’ ప్రదర్శిస్తామని తెలిపారు. రెండో రోజు మంగళవారం బుర్రిపాలెంరోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూలులో ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. పట్టణంలోని మున్సిపల్, సమీప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం వారి స్కూళ్లలోనే చిత్రాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఏ పాఠశాల నుంచి అయినా ఆహ్వానం వస్తే, అక్కడకి వెళ్లి ఉచితంగా బాలల చిత్రాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఆసక్తిగల ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు 9959431235 నంబరులో సంప్రదించాలని కోరారు. -
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తెనాలి మునిసిపాలిటీ సహకారంతో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న రెండురోజుల చలన చిత్రోత్సవాన్ని స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో ఎమ్మెల్యే శివకుమార్‌తోపాటు చైర్పర్సన్ సయ్యద్ ఖాలీదా నసీమ్, బాలనటుడు మాస్టర్ భానుప్రకాష్, సినీ దర్శకుడు నాగమురళి తెడ్ల అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ సభకు ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. ఈ చలన చిత్రోత్సవం స్ఫూర్తితో తెనాలిలో ఇదే కళాక్షేత్రంలో ప్రతినెలా ఓ ఆదివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ బాలల సినిమాలను ప్రదర్శింపజేస్తామని చెప్పారు. తెనాలి మునిసిపాలిటీ, ఫిలిం సొసైటీ పెద్దల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. -
బుడుగుల సినిమా పండుగకు రండి
తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో అంతర్జాతీయ బాలల సినిమా పండుగకు వేళయింది. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సహకారంతో ఆది, సోమవారాల్లో అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. తెనాలిలోని వివేక పబ్లిక్ స్కూలు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.రామరాజు వివరాలను తెలియజేశారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ్ ముఖ్యఅతిథిగా, బాలల చిత్రాల దర్శకుడు నాగమురళి తెడ్ల, ప్రముఖ బాల నటుడు ఎ.భానుప్రకాష్ తదితరులు హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి బాలల చిత్రాల ప్రదర్శన ఉంటుంది. ఫిలిం ఫెస్టివల్ రెండోరోజు సోమవారం తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా కార్యదర్శి బీహెచ్ఎస్ఎస్ ప్రకాష్‌రెడ్డి, సినిమా దర్శకుడు ఎ.సురేష్ పాల్గొంటారు. రెండు రోజుల్లో వివిధ దేశాలకు చెందిన మొత్తం 11 బాలల సినిమాలను ప్రదర్శిస్తారు. తెనాలిలో రెండురోజుల ప్రదర్శనలకే పరిమితం కాకుండా మరో అయిదు రోజులపాటు జిల్లాలోని వివిధ పట్టణాల్లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నామని చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ వీరనారాయణ చెప్పారు. సమావేశంలో కనపర్తి రత్నాకర్ రూపొందించిన సంస్థ లోగో, ప్రదర్శించనున్న సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించే బాలల సినిమాలు ఇవే.. ఆదివారం: ‘ది సాంగ్ స్పారో’ (ఇరాన్), చార్లీ చాప్లిన్ సినిమా, తెనాలి నటులు నటించిన ‘రా.. కిట్టు’ (తెలుగు), దాదా (ఉజ్బెకిస్తాన్), చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (ఇరాన్). సోమవారం: మెల్బోర్న్ (ఇరాన్), మిస్టర్ బోన్స్ (సౌతాఫ్రికా), ‘దారి’ (లఘుచిత్రం), కలర్ ఆఫ్ పారడైజ్ (ఇరాన్), గుబ్బచ్చి గలు (కన్నడ), చార్లీ చాప్లీన్ నటించిన ‘ది ఛాంపియన్ అండ్ ఏ విమెన్’. -
కోల్కత్తా చిత్రోత్సవాల్లో అప్పూ
ఏనుగుని చూడాలనే చిన్న కోరిక కలుగుతుంది అప్పూకు. కానీ అది తీర్చే తీరిక వాళ్ల తల్లిదండ్రులకు ఉండదు. దాంతో స్నేహితులతో కలసి అప్పూ చేసిన సాహసం ఏంటి? అనేది ‘అప్పూ’ చిత్రకథ. పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే ఏం జరుగుతుంది? అనే కథాంశంతో తెరకెక్కింది. కె. లక్ష్మీ సమర్పణలో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై కె. మోహన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మాస్టర్ సాయి శ్రీవంత్ (యశస్వి) టైటిల్ రోల్ పోషించిన ఈ బాలల చిత్రం 8వ కోల్కత్తా అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత మోహన్ మాట్లాడుతూ – ‘‘కోల్కత్తా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మా సినిమా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉంది. ఈ నెల 20 నుంచి 27 వరకూ జరిగే ఈ చిత్రోత్సవాల్లో 22న మా ‘అప్పూ’ చిత్రం ప్రదర్శిస్తారు. 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో మా చిత్రం ప్రదర్శితమైంది. ఇప్పుడు కోల్కత్తా చిత్రోత్సవాల్లో 35 దేశాల నుంచి వచ్చిన 200పై చిలుకు చిత్రాల్లో మా ‘అప్పూ’ ఉండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. -
‘చిత్రోత్సవం’తో బాలల్లో సృజనాత్మకత
హైదరాబాద్: చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పెంపొందేందుకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం దోహదపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఐమాక్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 8వ తేదీ సాయంత్రం శిల్పకళా తోరణంలో జరిగే ప్రారంభ వేడుకల్లో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేదికగా ప్రకటిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి 300 మంది బాల బాలికలు చైల్డ్ డెలిగేట్స్‌గా పాల్గొంటారని తెలిపారు. బాలల చలన చిత్రోత్సవంలో భాగంగా నిర్వహించే వర్క్‌షాప్‌లో బాల బాలికలకు చిత్ర నిర్మాణం, కథా రచన, యానిమేషన్ వంటి వివిధ విభాగాల్లో శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 13 థియేటర్లతో పాటు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాలను ప్రదర్శిస్తామని మంత్రి తెలిపారు. ఈసారి ఉత్సవాల్లో గతంలో కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయని, ముఖ్యంగా లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో పిల్లలే తీసిన చిత్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా సీఈఓ శ్రవణ్ కుమార్ అన్నారు. 92 మంది ప్రఖ్యాతి గాంచిన దర్శకులు, సినిమా రంగంతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బాలల చలన చిత్రోత్సవ ఏర్పాట్లను వివరించారు. బుధవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రారంభ వేడుకలు ఉంటాయని, ఈ సందర్భంగా ప్రదర్శనకు ఎంపికైన ‘స్కూల్ చలేగా’చిత్ర ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐమాక్స్ థియేటర్ యజమాని రమేశ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పూః ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రతిరోజూ ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలు... ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ ఏదొక హడావుడి! మరి, పిల్లలతో కాస్త సమయం గడిపే వీలుంటుందా? వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే తీరికుందా? అసలు, చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను పెద్దలు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన బాలల సినిమా ‘అప్పూ’. ది క్రేజీ బాయ్.. అనేది ఉపశీర్షిక. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్లో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత కె. మోహన్ మాట్లాడుతూ – ‘‘ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో మా సినిమా ఎంపిక కావడం హ్యాపీగా ఉంది. సాయి శ్రీవంత్తో పాటు బాల తారలు సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాంలు నటించారు. యాక్టర్స్ జాకీ, లోహిత్ కుమార్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి, ఫణి అద్భుతంగా నటించారు. మంచి సందేశంతో అందర్నీ అలరించేలా ఈ సినిమా ఉంటుంది. చిన్నారులతో పాటు తల్లిదండ్రులందరూ చూడాల్సిన చిత్రం’’ అన్నారు. -
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంపై తలసాని సమీక్ష
హైదరాబాద్: నవంబర్ 14 నుంచి 20 వరకూ నిర్వహించనున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. బాలల చిత్రోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై శాఖల సమన్వయం కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేయనున్నట్టు తెలిపారు. చలనచిత్ర పరిశ్రమకు అవసమరమైన అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పుణె, చెన్నైలలో ఉన్న చలనచిత్ర శిక్షణ సంస్థలను హైదరాబాద్‌లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తలసాని చెప్పారు. గ్రామజ్యోతి, వాటర్‌గ్రిడ్ లాంటి పథకాలు జనంలోకి వెళ్లేలా చలనచిత్ర పరిశ్రమ సహకరించాలని తలసాని కోరారు. -
నేటినుంచి బాలల చిత్రోత్సవం
ఈ నెల 20 వరకూ 198 చిత్రాల ప్రదర్శన మొదటిసారిగా 3డి చిత్రాలు కూడా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి: మంత్రి డీకే అరుణ సాక్షి, హైదరాబాద్: రాజధానికి బాలల సినిమా పండుగ వచ్చేసింది. నేటి నుంచి వారం రోజుల పాటు జరగనున్న 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితాకళా తోరణంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ఈ ఉత్సవం జరుగుతుంది. తొలిసారిగా ఈ చలనచిత్రోత్సవంలో 3డి సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల నుంచి 894 ఎంట్రీలు రాగా అందులో 48 దేశాలకు చెందిన 198 చిత్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని 12 సినిమా థియేటర్లలో రోజూ 30 సినిమాల చొప్పున ప్రదర్శిస్తారు. బెర్లిన్, టొరెంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలతో పాటు కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించిన 20 ప్రముఖ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రోత్సవాల్లో మొదటిసారి దక్షిణ అమెరికా, ఆస్ట్రియా, లెబనాన్, స్కాట్లాండ్, మలేిసియా తదితర దేశాలు పాల్గొంటున్నాయి. చిత్రోత్సవాల్లో భాగంగా యానిమేషన్, స్క్రిప్టు రచన తదితర వాటితో పాటు బాల కళాకారుల హక్కులు, భారతీయ యానిమేషన్, బాలల సినిమాల్లో బాలికల ఆవశ్యకత తదితర వాటిపై చర్చావేదికలు నిర్వహిస్తున్నారు. లలితాకళా తోరణంలో గురువారం జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ రానున్నారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రముఖ రచయిత, దర్శకులు గుల్జార్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తదితరులు హాజరవుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ చెప్పారు. సినిమాల ప్రదర్శన, అతిథులకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. దేశం నలుమూలల నుంచి బాలబాలికలు వస్తున్నారని, ఇక్కడ ప్రదర్శించే అత్యున్నత చిత్రాలను తిలకించే అవకాశం వారికి దక్కుతుందని చెప్పారు. యానిమేషన్ చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన చిత్రాలకు వివిధ కేటగిరీల్లో ఉత్తమ బహుమతులు, జ్ఞాపికలను ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళుతుండటంతో చలనచిత్రోత్సవ వేడుకలకు హాజరు కావడం లేదని తెలిసింది. బాలలే భవిష్యత్ ఆశాజ్యోతులు: ముఖ్యమంత్రి నేటి బాలలే భవిష్యత్ ఆశాజ్యోతులని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి నగరంలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ఆయన బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ తొలి ప్రధాని, నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశమైనా, రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే చిన్నారుల సంపూర్ణ అభివృద్ధి అవసరమని ఆయన చెప్పారు. -
బాలల చిత్రోత్సవాలను ప్రారంభించనున్న రణబీర్ కపూర్
18వ బాలల చలన చిత్రోత్సవాన్ని హైదరాబాద్ లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రారంభించనున్నారు. అమీర్ ఖాన్ రూపొందించిన 'తారే జమీన్ పర్' నటించి అందర్ని ఆకట్టుకున్న దర్శీల్ సఫారీ, బాల హస్యనటుడు సలోని దైనీలు ఈ చిత్రోత్సవాలకు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రోత్సవాలలో హోస్ట్ లుగా ఉండటానికి బాల నటులే సమంజసమని భావించాము. చిన్నతనంలో చిత్రాల్లో నటించిన వీరికి.. చిత్రోత్సవాలను కూడా నిర్వహించే సత్తా ఉంటుంది అని మేము బలంగా నమ్ముతున్నాం అని చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా సీఈఓ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ చిత్రోత్సవాలను రణబీర్ కపూర్ ప్రారంభిస్తారని.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆడియో విజువల్ ప్రదర్శన ద్వారా సహకారం అందిస్తారని తెలిపారు. 'చిల్లర్ పార్టీ' చిత్రంతో రణబీర్, సల్మాన్ లకు అనుబంధమున్నందున.. కావున వారిని ఈ చిత్రోత్సవాలకు సహకారం అందిస్తే.. పిల్లలకు అవగాహన కలుగుతుంది అని అన్నారు. ఈ సంవత్సరం 48 దేశాలకు చెందిన 200 చిత్రాలను ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. -
14 నుంచి బాలల సినిమా పండగ: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు సాగే 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. దేశవిదేశాల నుంచి మొత్తం 550 మంది బాల ప్రతినిధులు హాజరుకానున్న ఈ ఉత్సవాలలో 196 ఉత్తమ బాలల చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రపంచ దేశాల్లో నిర్మితమైన స్ఫూర్తిదాయక చలన చిత్రాలను ప్రదర్శించి బాలల్లో సృజనాత్మకతను ఇనుమడింపజేయడమే ఉత్సవాల ప్రధానోద్దేశమని సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ విలేకరులతో చెప్పారు. తొలిసారిగా ఈ ఏడాది 3డి సినిమాలను ప్రదర్శించనున్నారు. బాల ప్రతినిధులకు ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి అరుణ చెప్పారు. 12 విభాగాల్లో మొదటి బహుమతులు, 6 విభాగాల్లో ద్వితీయ బహుమతులు అందజేస్తామన్నారు. మొదటి బహుమతికి బంగారు ఏనుగు తోపాటు రూ.2 లక్షల నగదు, ద్వితీయ బహుమతిగా రజత ఏనుగు, రూ. లక్ష నగదు అందజేయనున్నట్టు తెలిపారు. లలిత కళాతోరణంలో ఉత్సవాల ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ప్రసాద్ ఐమాక్స్‌లో మూడు తెరలు, కొత్తపేటలో శివాని థియేటర్, మల్కాజ్‌గిరిలో రాఘవేంద్ర, జీడిమెట్లలో రంగ, మాదాపూర్‌లో హైటెక్, అత్తాపూర్‌లో ఈశ్వర్, షాలిబండలో సుధ, సికిందరాబాద్‌లో ప్రశాంతి థియేటర్‌తోపాటు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళా తోరణంలో చిత్రాలను ప్రదర్శించనున్నట్టు మంత్రి తెలిపారు. చిత్రాలు, వేళలు, ఇతర వివరాలు తెలిపే వెబ్సైట్ ను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో సమాచార కమిషనర్ దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ వివరాలతో వెబ్సైట్
హైదరాబాద్: అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను మంత్రి డీకే అరుణ ప్రారంభించారు. నవంబరు 14 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ఈ సందర్బంగా మంత్రి అరుణ మాట్లాడుతూ అంతర్జాతీయ బాలాల దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్ర పండుగ-2013 నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో దాదాపు 1000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రదర్శించే బాలల చిత్రాలను ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే పిల్లలు చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నగరంలోని ప్రధాన థియేటర్లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పరిధిలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో బాలల చిత్రాలను ప్రదర్శిస్తారు. శారీరక వైకల్యంగల విద్యార్థులు అధిక సంఖ్యలో చిత్రాలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.