హైదరాబాద్: అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను మంత్రి డీకే అరుణ ప్రారంభించారు. నవంబరు 14 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ఈ సందర్బంగా మంత్రి అరుణ మాట్లాడుతూ అంతర్జాతీయ బాలాల దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
18వ అంతర్జాతీయ బాలల చలన చిత్ర పండుగ-2013 నిర్వహణకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో దాదాపు 1000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రదర్శించే బాలల చిత్రాలను ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే పిల్లలు చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నగరంలోని ప్రధాన థియేటర్లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పరిధిలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో బాలల చిత్రాలను ప్రదర్శిస్తారు. శారీరక వైకల్యంగల విద్యార్థులు అధిక సంఖ్యలో చిత్రాలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.