సాక్షి, హైదరాబాద్: నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు సాగే 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. దేశవిదేశాల నుంచి మొత్తం 550 మంది బాల ప్రతినిధులు హాజరుకానున్న ఈ ఉత్సవాలలో 196 ఉత్తమ బాలల చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రపంచ దేశాల్లో నిర్మితమైన స్ఫూర్తిదాయక చలన చిత్రాలను ప్రదర్శించి బాలల్లో సృజనాత్మకతను ఇనుమడింపజేయడమే ఉత్సవాల ప్రధానోద్దేశమని సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ విలేకరులతో చెప్పారు. తొలిసారిగా ఈ ఏడాది 3డి సినిమాలను ప్రదర్శించనున్నారు.
బాల ప్రతినిధులకు ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి అరుణ చెప్పారు. 12 విభాగాల్లో మొదటి బహుమతులు, 6 విభాగాల్లో ద్వితీయ బహుమతులు అందజేస్తామన్నారు. మొదటి బహుమతికి బంగారు ఏనుగు తోపాటు రూ.2 లక్షల నగదు, ద్వితీయ బహుమతిగా రజత ఏనుగు, రూ. లక్ష నగదు అందజేయనున్నట్టు తెలిపారు. లలిత కళాతోరణంలో ఉత్సవాల ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ప్రసాద్ ఐమాక్స్‌లో మూడు తెరలు, కొత్తపేటలో శివాని థియేటర్, మల్కాజ్‌గిరిలో రాఘవేంద్ర, జీడిమెట్లలో రంగ, మాదాపూర్‌లో హైటెక్, అత్తాపూర్‌లో ఈశ్వర్, షాలిబండలో సుధ, సికిందరాబాద్‌లో ప్రశాంతి థియేటర్‌తోపాటు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళా తోరణంలో చిత్రాలను ప్రదర్శించనున్నట్టు మంత్రి తెలిపారు. చిత్రాలు, వేళలు, ఇతర వివరాలు తెలిపే వెబ్‌సైట్ ను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో సమాచార కమిషనర్ దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
14 నుంచి బాలల సినిమా పండగ: డీకే అరుణ
Published Fri, Oct 25 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement