
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన అక్రమ్ అని, దేశ రాజధానిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయ్యాడని.. ఇప్పుడు హైదరాబాద్‌కు మకాం మార్చడాన్ని వెల్లడించారు.
వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్రమ్ మీద 2004 నుంచి ఇప్పటిదాకా 17 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. గుడిమల్కాపూర్ ఏరియాలో రెండు రోజులు రెక్కీ చేశాడు. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంటి సమీపంలో చోరీ చేయాలనుకున్నాడు. అయితే..
దొంగతనానికి ఎంపీ ఇంటినే ఎంచుకున్నాడు. ఆ ఇంట్లోకి దూరి ఈజీగా చోరీ చేయొచ్చని భావించాడు. ఒకవేళ తేడాలొచ్చి దొరికినా.. వెనకాల ఉన్న రోడ్డు నుంచి పారిపోవచ్చని ప్లాన్ వేశాడు. ఎంపీ ఇంటి కిచెన్ కిటికీ గుండా లోపలికి ప్రవేశించిన అక్రమ్.. మాస్క్ వేసుకుని లోపలే గంటన్నరపాటు ఉండిపోయాడు.
అక్రమ్ ధనవంతుల ఇళ్లు మాత్రమే టార్గెట్ చేస్తాడు. నగదు మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగల జోలికి పోడు. ఎందుకంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు’’ అని డీసీపీ విజయ్ వెల్లడించారు. ఇక.. వీఐపీ నివాస ప్రాంతాలతో పాటు నగరంలో పలు ఏరియాల్లో చోరీలు జరగడంపై ఆందోళన వ్యక్తం కావడం తెలిసిందే. అయితే.. ఇక నుంచి ఎలాంటి నేరాలు జరగకుండా పోలీస్ భద్రతను పెంచుతున్నాం అని పోలీసులు ప్రకటించారు.
జరిగింది ఇదే..
డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు.
చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు. అరుణ బెడ్‌రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారామె. ఈ ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారామె.
Comments
Please login to add a commentAdd a comment