
గంటన్నరపాటు ఇంట్లోనే తిరిగిన దుండగుడు
ఆదివారం తెల్లవారుజామున ఘటన
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్/పాలమూరు: బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు. అరుణ బెడ్‌రూమ్ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు.
గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. దుండగుడు ఓ బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి కొన్ని సామాన్లు కూడా మూటగట్టాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో డీకే అరుణ ఇంట్లో పనిచేసి మానేసిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులేమీ పోలేదని డ్రైవర్ లక్ష్మణ్ తన ఫిర్యాదులో తెలిపాడు.

డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు
ఈ ఘటనపై డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తన ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ డీకే అరుణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment