నేటినుంచి బాలల చిత్రోత్సవం
ఈ నెల 20 వరకూ 198 చిత్రాల ప్రదర్శన
మొదటిసారిగా 3డి చిత్రాలు కూడా
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి: మంత్రి డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: రాజధానికి బాలల సినిమా పండుగ వచ్చేసింది. నేటి నుంచి వారం రోజుల పాటు జరగనున్న 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితాకళా తోరణంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ఈ ఉత్సవం జరుగుతుంది. తొలిసారిగా ఈ చలనచిత్రోత్సవంలో 3డి సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల నుంచి 894 ఎంట్రీలు రాగా అందులో 48 దేశాలకు చెందిన 198 చిత్రాలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని 12 సినిమా థియేటర్లలో రోజూ 30 సినిమాల చొప్పున ప్రదర్శిస్తారు. బెర్లిన్, టొరెంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలతో పాటు కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించిన 20 ప్రముఖ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.
ఈ చిత్రోత్సవాల్లో మొదటిసారి దక్షిణ అమెరికా, ఆస్ట్రియా, లెబనాన్, స్కాట్లాండ్, మలేిసియా తదితర దేశాలు పాల్గొంటున్నాయి. చిత్రోత్సవాల్లో భాగంగా యానిమేషన్, స్క్రిప్టు రచన తదితర వాటితో పాటు బాల కళాకారుల హక్కులు, భారతీయ యానిమేషన్, బాలల సినిమాల్లో బాలికల ఆవశ్యకత తదితర వాటిపై చర్చావేదికలు నిర్వహిస్తున్నారు. లలితాకళా తోరణంలో గురువారం జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ రానున్నారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రముఖ రచయిత, దర్శకులు గుల్జార్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తదితరులు హాజరవుతున్నారు.
అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ
అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ చెప్పారు. సినిమాల ప్రదర్శన, అతిథులకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. దేశం నలుమూలల నుంచి బాలబాలికలు వస్తున్నారని, ఇక్కడ ప్రదర్శించే అత్యున్నత చిత్రాలను తిలకించే అవకాశం వారికి దక్కుతుందని చెప్పారు. యానిమేషన్ చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన చిత్రాలకు వివిధ కేటగిరీల్లో ఉత్తమ బహుమతులు, జ్ఞాపికలను ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళుతుండటంతో చలనచిత్రోత్సవ వేడుకలకు హాజరు కావడం లేదని తెలిసింది.
బాలలే భవిష్యత్ ఆశాజ్యోతులు: ముఖ్యమంత్రి
నేటి బాలలే భవిష్యత్ ఆశాజ్యోతులని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి నగరంలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ఆయన బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ తొలి ప్రధాని, నవభారత నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశమైనా, రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే చిన్నారుల సంపూర్ణ అభివృద్ధి అవసరమని ఆయన చెప్పారు.