
టెన్త్, ఇంటర్ మార్కుల పర్సంటేజీ తొలగింపు
కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య పరిష్కారం
డిగ్రీలో 35 శాతం మార్కులున్నా దరఖాస్తు అప్‌లోడ్‌కు అవకాశం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్, ఇంటర్ మార్కుల పర్సంటేజీ సీలింగ్ తొలగించింది. డీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం ‘మెగా అగచాట్ల డీఎస్సీ’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 45% మార్కులు తప్పనిసరి చేసింది.
ఎస్జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50, 45 శాతం మార్కులు నిర్ణయించింది. అయితే, ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్‌ఏలకు పదో తరగతి, ఇంటర్‌లోను అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచి్చన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే, బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్‌కు అర్హత కల్పించారు.
అయితే, వెబ్‌సైట్‌లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూలింగ్‌లో పది, ఇంటర్ పూర్తిచేసిన వారికీ ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితోపాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్‌లైన్‌లో మార్పులు చేశారు.
డిగ్రీలో 35 మార్కులకూ అప్‌లోడ్‌పై ఆశ్చర్యం
ఎస్జీటీ రాసేవారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50, 45 శాతం, పీజీటీలకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55, 50 శాతంగా మార్కుల సీలింగ్ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కులు కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. కానీ, శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 35 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.