
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 14వ తేదీ నుంచి 15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం నిర్వహించనున్నట్లు చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ–తెనాలి అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ తెలిపారు. స్థానిక వివేక పబ్లిక్ స్కూలులో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ, వివేక విద్యాసంస్థల సౌజన్యంతో పది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
పది రోజులు వివిధ దేశాల బాలల సినిమాలను ప్రదర్శిస్తామన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు బాలల చిత్రోత్సవం ప్రారంభమవుతుందని, అనంతరం 11 గంటలకు చైనా చిత్రం ‘లిటిల్ బిగ్ సోల్జర్’, ఒంటి గంటకు దక్షిణ కొరియా చిత్రం ‘డాగ్స్’, మధ్యాహ్నం 3 గంటలకు హిందీ సినిమా ‘హమ్ ఔర్ ఆప్’ ప్రదర్శిస్తామని తెలిపారు.
రెండో రోజు మంగళవారం బుర్రిపాలెంరోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూలులో ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. పట్టణంలోని మున్సిపల్, సమీప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం వారి స్కూళ్లలోనే చిత్రాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఏ పాఠశాల నుంచి అయినా ఆహ్వానం వస్తే, అక్కడకి వెళ్లి ఉచితంగా బాలల చిత్రాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఆసక్తిగల ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు 9959431235 నంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment