వాణిజ్య పన్నుల సర్కిళ్ల పునర్విభజన
♦ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
♦ పన్ను వసూళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి
♦ వృద్ధి రేటులో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు దేశంలో రెండో స్థానం
♦ మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం ఉన్న సర్కిళ్లను పునర్విభజించి, కొత్తగా మరికొన్నింటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఆధునికీకరించిన కాన్ఫరెన్స్ హాలును శనివారం ప్రారంభించిన ఆయన 2015-16 సంవత్సరంలో పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులను సన్మానించారు. అనంతరం అధికారులతో వార్షిక ఫలితాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడంలో వాణిజ్యపన్నుల విభాగమే ప్రధాన మైందని అన్నారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ. 32,492 కోట్ల ఆదాయాన్ని సాధించిన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ వృద్ధి రేటులో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఇది ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి విజయమని పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ. 43,115 కోట్లుగా నిర్ధేశించామని తెలిపారు, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలన్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని క్షేత్రస్థాయిలో ఆడిట్‌లు నిర్వహించడం, స్ట్రీట్ సర్వేల ద్వారా కొత్త రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్‌లను తనిఖీ చేయడం ద్వారా సరుకు రవాణా లీకేజీలను అరికట్టడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. వినోదపు పన్ను, వృత్తిపన్ను, హోటళ్ల నుంచి రావలసిన వ్యాట్, లగ్జరీ పన్నులను సక్రమంగా వసూలు చేయాలని, పన్ను చెల్లింపునకు, జరిగే వ్యాపారానికి సంబంధించి ఇతర శాఖల ద్వారా తె ప్పించిన సమాచారంతో సరిపోల్చుకోవాలని సూచించారు. కోర్టుల్లో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
అన్ని జిల్లాల్లో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లోనూ పెంచే యోచన ఉందని, సర్కిళ్లను కూడా పెంచి, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన టి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌గౌడ్, పి.లక్ష్మి, కిషోర్ కుమార్, నారాయణరెడ్డి సత్కారం అందుకున్నారు. మొత్తం 68 మందిని సత్కరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్‌కుమా ర్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్లు రేవతి రోహణి, చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు వేణుగోపాల్, టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.