Commercial tax department
-
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో భారీ కుంభకోణం
-
టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్‌షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్కు 11 ఫ్రాంచైజ్లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్‌లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇదీ చదవండి: Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
‘వాణిజ్య పన్నుల’ అవినీతి కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖ అధికారుల భారీ అవినీతి కేసులో ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసింది. దీన్లో భాగంగానే ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నలుగురు ఉద్యోగుల ఇళ్లతోపాటు పరారీలో ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణకు చెందిన ఇళ్లల్లో మంగళవారం ఏకకాలంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రెండు ఇళ్లు, కృష్ణాజిల్లా కానూరులో రెండు, గుడివాడలో ఒక ఇల్లు, హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్లో ఒక ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం, సిటీ టాస్‌్కఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించారు. కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లతోపాటు జీఎస్టీ అధికారులు బలిజేపల్లి మెహర్‌కుమార్, కంచర్లకోట సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కావూరి వెంకటచలపతి, సబార్డినేట్ మరీదు సత్యనారాయణ ఇళ్లల్లో ఈ సోదాలు చేశారు. వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదుతో గత నెలలో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.. నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, వారికి కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే. ఈ నలుగురు అధికారులు పాల్పడిన వందల కోట్ల రూపాయల అవినీతి వెనుక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆయనపైనా కేసు నమోదు చేశారు. విలువైన ఆస్తిపత్రాలు, ఫైళ్లు, సొత్తు స్వాదీనం విజయవాడ సత్యనారాయణపురం పాపరాజు వీధిలోగల సాయిరత్న టవర్స్‌లోని బలిజేపల్లి మెహర్‌కుమార్ ఫ్లాట్‌లో, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఆశ్రిషి రెసిడెన్సిలోని కంచర్లకోట సంధ్య ఫ్లాట్‌లో, గుడివాడ సమీపంలోని బేతపూడి గ్రామంలో కావూరి వెంకటచలపతి ఇంట్లోను, కానూరులో మరీదు సత్యనారాయణ ఇంట్లోను, విజయవాడ సత్యనారాయణపురంలోను, హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లల్లో సోదాలు చేశారు. డీసీపీ విశాల్‌గున్ని పర్యవేక్షణలో సెంట్రల్ ఏసీపీ పి.భాస్కరరావు నేతృత్వంలో ఆరు బృందాలు ఈ తనిఖీలు చేశాయి. ఐదుగురు నిందితులు అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు, విలువైన సమాచారం ఉన్న ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, వాణిజ్యపన్నుల కార్యాలయంలో కనిపించకుండాపోయిన ఫైళ్ల వివరాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. మరిన్ని విలువైన ఆస్తిపత్రాలు, కేసుకు సంబంధించిన మరిన్ని ఫైళ్ల కోసం సోదాలు కొనసాగిస్తామని చెప్పారు. సోదాల్లో స్వాదీనం చేసుకున్న సొత్తును న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు రిమాండ్‌లో ఉండగా.. కీలక సూత్రధారి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూర్యనారాయణ పాల్పడిన అవినీతే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. -
వాణిజ్యపన్నుల ఆదాయంలో 4వ స్థానం
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలోను వాణిజ్యపన్నుల శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఆదాయంలో దేశంలో 4వ స్థానంలో నిలిచిందని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో వాణిజ్యపన్నుల శాఖ రూ.55,935.13 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆదాయం 2020–21లో రూ.44,178.51 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం చక్కటి ఫలితాలను ఇస్తోందని, దీనికి మద్యంపై తగ్గుతున్న వ్యాట్ ఆదాయమే నిదర్శనమని పేర్కొన్నారు. 2019–20లో రూ.10,403.84 కోట్లు ఉన్న మద్యంపై వ్యాట్ ఆదాయం 2020–21లో 41 శాతం తగ్గి రూ.6,161.43 కోట్లకు పరిమితమైందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ మార్చి వరకు జీఎస్టీ పాత బకాయిల వసూళ్లకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని, ఈ డ్రైవ్ ద్వారా రూ.1,772 కోట్లు వసూలైందని వివరించారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు, అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. కోవిడ్–19తో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మందగించినప్పటికీ సీఎం జగన్ పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకం రాకుండా చూస్తున్నారని తెలిపారు. వారి కుటుంబంలో సభ్యుడిగా ఆయా పథకాలను వారికి అందిస్తున్న సీఎం జగన్ పేదల పక్షపాతిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. -
నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల టార్గెట్
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్ను శాఖ వసూళ్లలో తెలంగాణ దూసుకుపోతోంది. ఈ నెలలో ఇప్పటికే రూ. 1,070 కోట్లను వాణిజ్య పన్నుశాఖ వసూలు చేసేసింది. ఈ నాలుగురోజుల్లోనూ మరో రూ.300 కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఫోన్ ద్వారానే లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు 1,300 మంది సిబ్బందిని కేటాయించారు. పన్ను వసూళ్ల కోసం తమ శాఖ రూపొందించిన యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో పన్ను వసూళ్లలో సిబ్బంది ఎదుర్కొన్న సవాళ్లను, అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పే అవకాశాన్ని కల్పించారు. పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఆయన అభినందించారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 920 కోట్లు వసూళ్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయి వసూళ్లతో దేశంలోనే అత్యధికంగా వాణిజ్య పన్ను శాఖ ద్వారా ఆదాయాన్ని పొందిన రాష్ట్రంగా తెలంగాణ గౌరవం దక్కించుకుంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ రాబడిని పెంచుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. -
ఏపీ చరిత్రలో అలా దొరకడం ఇదే ప్రథమం
-
గందరగోళం
- తొలిరోజు మార్కెట్‌పై జీఎస్టీ ప్రభావం - కాఫీ నుంచి చెప్పుల వరకు రేట్లు పెంపు - పలుచోట్ల మూతబడిన దుకాణాలు - పాత సరుకుపై కొత్త పన్ను చేర్పు - జీఎస్టీ లేనివాటిపై వ్యాపారుల దోపిడీ - అవగాహనలేక నష్టపోతున్న ప్రజలు తిరుపతిలోని ఓ చిన్న హోటల్లో రోజూ రూ.పది విలువ చేసే వడను జీఎస్టీ అమల్లోకి వచ్చిందంటూ రూ.12కు విక్రయించారు. చిత్తూరులోని ఓ మాల్లో రోజూ శీతల పానీయాలపై ఎమ్మార్పీ కంటే 2 శాతం తక్కువకు విక్రయించే వారు. ఇప్పుడు ఎమ్మార్పీకి తగ్గదని అమ్ముతున్నారు. ఎప్పుడో ఉత్పత్తి అయిన చెప్పులపై రూ.500 ధర దాటిందని మదనపల్లెలో 18 శాతం ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. అడిగితే జీఎస్టీ ప్రభావమని చెబుతున్నారు. తొలిరోజు మార్కెట్లో గందరగోళం ఏర్పడింది. సమస్యా.. ఫోన్ చేయండి 8978500223 జీఎస్టీ పేరు చెప్పి ఇçష్టప్రకారం వస్తువుల రేట్లు పెంచేస్తే ఒప్పుకునేదిలేదు. అసలు ఏయే వస్తువులపై ఎంతెంత ధరలు పెరిగాయో దుకాణాల వద్ద బోర్డులు పెట్టాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు వస్తువులు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సమస్యలుంటే మా ఫోన్ నంబరుకు ఫిర్యా దు చేయండి. – కిరణ్‌చౌదరి, సహాయ కమిషనర్, వాణిజ్య పన్నులశాఖ, చిత్తూరు. సాక్షి, తిరుపతి/చిత్తూరు (అర్బన్) : జీఎస్టీ అమలులోకి వచ్చాక తొలిరోజు (శనివారం) మార్కెట్లో సామాన్యులకు, వ్యాపారులకు చుక్కలు కని పించాయి. ఈ పన్నుపై అవగాహన లేకపోవడంతో కొంద రు వ్యాపారులు ధరలు పెంచి విక్రయించారు. కొన్నిచోట్ల షాపులు మూతబడ్డాయి. మరికొన్ని వెలవెల బోయాయి. జిల్లాలో జీఎస్టీ పరిధిలో 14 వేల మంది వ్యాపారులున్నా రు. రూ.20 లక్షల వార్షిక లావాదేవీలు కలిగి ఉన్న వ్యాపారులు మాత్రమే దీని పరిధిలోకి వస్తారు. వీరంతా వాణిజ్య పన్నుల శాఖలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. పరిధిలోకి రాని వ్యాపారుల సంఖ్య రెండు లక్షలుంటుంది. ప్రస్తుత వ్యాపారాల్లో సింహభాగం వీరిదే. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికే దుకాణాల్లోని పాత ఉత్పత్తులపై ధరలను పెంచకూడదు. పాత స్టాకు పూర్తయ్యి జూలై 1 నుంచి ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెట్లోకి వస్తే మాత్రమే జీఎస్టీ ధరల శ్లాబులు వర్తిస్తాయి. కానీ జిల్లాలోని పెద్ద పెద్ద మాల్స్ నుంచి చిన్నపాటి చిల్లర దుకాణాల్లో కూడా జీఎస్టీ పేరు చెప్పి వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. అవగాహన లేమి.. జీఎస్టీపై చాలామందికి ఇప్పటివరకూ పూర్తి్త స్థాయిలో అవగాహన రాలేదు. ఇదే వ్యాపారులకు లాభం తెచ్చిపెడుతోంది. జీఎస్టీలో ఏయే వస్తువుల ధరలు పెరిగాయో చూపెడుతూ వాటిపై ధరలు పెంచేస్తున్నారు. ఇదే సమయంలో ధరలు తగ్గిన వాటిపై మాత్రం ఎలాంటి తగ్గింపు ఇవ్వడంలేదు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై జీఎస్టీపై ఫిర్యాదుల విభాగం, టోల్‌ఫ్రీ నంబర్లు పెడితే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యాపారికీ కంప్యూటర్ తప్పనిసరి.. జీఎస్టీతో ప్రతి వ్యాపారికీ కంప్యూటర్ తప్పని సరైంది. చిరు, మధ్యతరగతి వ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయి. రోజుకు రూ.60వేల నుంచి రూ.70వేలు సగటున టర్నోవర్ ఉన్న వ్యాపారి రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. బిల్లులు, అకౌంట్స్ నిర్వహణ తప్పనిసరి. ప్రహసనంతో కూడుకున్న పని కావటంతో గతంలో వలే వ్యాపారులు చిట్టా పద్దులు పుస్తకంలో రాసుకుంటే కుదరదు. తప్పనిసరిగా కంప్యూటర్ కొనుగోలు చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుని కన్సల్టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు రూ.10వేలు అదనపు భారం పడే అవకాశం ఉంది. వ్యాపారి ఎక్కడైనా పొలం కౌలుకు అప్పగించి ఉంటే అదనపు ఆర్థిక భారం తప్పేట్టు లేదు. జీఎస్టీ నిబంధనల ప్రకారం ఈ రెండింటి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని తప్పనిసరి పన్ను చెల్లించాల్సి ఉంటుం దని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దుకాణాలన్నీ వెలవెలబోవటం కనిపించింది. -
బోధన్ స్కాంలో రాజకీయ కలవరం!
ప్రస్తుత ఎంపీ అయిన ఓ మాజీ మంత్రి వర్గంలో ఆందోళన సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కుంభకోణం వ్యవహారంలో రాజకీయ కలవరం మొదలైంది. ఈ కేసులో సీఐడీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అయిన ఓ నాయకుడి అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 300 మంది రైస్‌మిల్లర్ల పాత్రపై సీఐడీ విచారణ చేపట్టనున్నట్లు వచ్చిన వార్తలపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆ ఎంపీకి ఈ కేసులో కీలక నిందితుడు శివరాజ్ అత్యంత సన్నిహితుడని తెలిసింది. ఇక ఓ మాజీ ఎంపీకి కూడా శివరాజ్ సన్నిహితుడని.. దీంతో ఈ ఇద్దరు నాయకుల వద్దకు రైస్‌మిల్లర్లు క్యూ కట్టారని సమాచారం. అయితే ఈ నేతలిద్దరిలో మాజీ ఎంపీ పరోక్షంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఎంపీ మాత్రం ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులపై నేరుగా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంలో కల్పించుకుంటున్నట్లు సమాచారం. -
బోధన్ స్కాంపై నేడు సీఎస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: బోధన్ సర్కిల్లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలా న్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ డీజీపీ అనురాగ్ శర్మకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సీఎస్ చాంబర్లో కేసు దర్యాప్తుSపై సమీక్ష జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్‌కుమార్ సూచించారు. కేసు దర్యా ప్తులో ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారి స్థానంలో మరొకరిని నియమిం చారు. అదనపు ఎస్పీని ఎప్పటికప్పుడు కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకుంటూ ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై కూడా సీఎస్ సమీక్ష జరప నున్నారు. అటు కమర్షియల్ శాఖలోనూ పలువురు అధికారుల పాత్రపై సీఐడీ నివేదిక రూపొందించినట్టు తెలిసింది. -
పోలీసుల అదుపులో కీలక నిందితుడు!
‘బోధన్’ కుంభకోణంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం సాక్షి, హైదరాబాద్: బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఒక్కసారిగా వేగం పెంచింది. నిందితుల ఆచూకీని పసిగట్టి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ కేసులో ప్రమేయమున్నట్లుగా ఆరోపణలున్న నిజామాబాద్ ఏసీటీవో విజయ్‌కృష్ణ సోమవారం బోధన్ కోర్టులో లొంగిపోయాడు. ప్రధాన నిందితుడిగా ఉన్న టాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌ను సీఐడీ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి ద్వారా మిగిలిన సూత్రధారుల వివరాలను సీఐడీ అధికారులు రాబడుతున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల్లోనూ వణుకు మొదలైంది. ప్రధానంగా శివరాజ్‌తో లావాదేవీలు నడిపిన ఇద్దరు జాయింట్ కమిషనర్లు, నలుగురు సీటీవోలు, ఆరుగురు డీసీటీవోలకు సంబంధించి ఇప్పటికే సీఐడీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
ఆదాయానికి గండి
వ్యాపారులకు అధికారుల ‘సహకారం’ లెక్కల విషయంలో ఉదాసీనత అడ్రస్‌లేని చాలన్ల రిజిస్టర్ ఏళ్లుగా నమోదును మరిచిన అధికారులు వాణిజ్య పన్నుల శాఖలో వింతలు వరంగల్ : వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇదే తరహా వ్యవహారాలు వరంగల్ వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్‌లోనూ కొన్నిచోట్ల జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య పన్నులను వంద శాతం వసూలు చేసేందుకు రూపొందించిన వ్యవస్థను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్ పరిధిలో 11 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వరంగల్, బీట్ బజార్, రామన్నపేట, ఫోర్టు రోడ్డు, మహబూబాబాద్, జనగామ, నర్సంపేట, ఖమ్మం–1, ఖమ్మం– 2, ఖమ్మం–3, కొత్తగూడెం సర్కిళ్లు ఉన్నాయి. వీటికి కమర్షియల్ ట్యాక్స్ అధికారి(సీటీఓ) నేతృత్వం వహిస్తారు. సర్కిళ్ల పరిధిని బట్టి ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీటీవోలు, నలుగురు నుంచి ఆరుగురు వరకు అసిస్టెంట్ సీటీవోలు పనిచేస్తారు. మొత్తంగా వరంగల్ డివిజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయ స్థాయిలో ఆదాయం రావాల్సి ఉంది. కానీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తీరుతో ఆశించిన ఆదాయం రావడంలేదు. వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది వ్యాపారస్తులకు ‘సహకారం’ అందిస్తుండడంతో ఈ డివిజన్లో జరుగుతున్న వ్యాపారానికి, ఆదాయానికి పొంతన కుదరడం లేదు. చాలన్ల రూపంలో పన్నులు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారస్తులు చెల్లించే పన్ను మొత్తాన్ని చాలన్ల రూపంలో ఇస్తారు. వాణిజ్య పన్నుల శాఖలో చాలన్లు ఇవ్వడంతోపాటు ఈ మొత్తాన్ని ఖాజానా శాఖ కార్యాలయంలో చెల్లింపులు జరపాలి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు... చాలన్లను, ఖాజానాలో చెల్లించే మొత్తాన్ని సరిచూసి ప్రతి నెలా ప్రభుత్వానికి వివరాలు పంపాలి. ఖజానా శాఖ అధికారి ధ్రువీకరించిన వివరాల ప్రకారం... వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపారుల వారీగా చెల్లింపులను పరిశీలించి బకాయిలు ఉంటే ప్రత్యేక జాబితా రూపొందించాలి. బకాయిలు ఉన్న వ్యాపారులకు నోటీసులు పంపి ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, వాణిజ్య పన్నుల శాఖలో బకాయిల వివరాలను నమోదు చేయకుండా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. వ్యాపారులు సమర్పించిన చెక్కులు బౌన్స్ అయిన సందర్భాల్లో వారిపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా ఇది కూడా జరగడం లేదని తెలుస్తోంది. వ్యాపారుల వారీగా ఆధారిత పన్ను(వ్యాట్), సీఎస్టీ (సెంట్రల్ సేల్ ట్యాక్స్) వివరాలను నిర్ధారించేటప్పుడు రికార్డులు పరిశీలించకుండానే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వ్యాపారులు చెప్పిన లెక్కలనే అధికారులు నమోదు చేసి వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తక్కువగా నమోదు చేసిన అధికారులను వ్యాపారులు బాగా చూసుకుంటున్నారు. అధికారులు, వ్యాపారులు కలిసి చేస్తున్న వ్యవహారాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో భారీగా కోత పడుతోంది. ఏళ్లుగా ఇదే... వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయానికి సంబంధించిన గణాంకాలను పేర్కొనే వ్యవస్థ కొన్ని సంవత్సరాలుగా గాడి తప్పిందని తెలుస్తోంది. వ్యాపారుల వారీగా సమర్పించిన చాలన్లు వివరాలను ప్రతీరోజు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రత్యేక రిజిస్టర్(పుస్తకం)లో నమోదు చేయాలి. చాలన్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయడం వల్ల ట్రెజరీలో సమర్పించిన మొత్తాన్ని సరిచూసే అవకాశం ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్లో కొన్నేళ్లుగా చాలన్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసే ప్రక్రియ జరగడం లేదని తెలిసింది. డివిజన్ పరిధిలోని మొత్తం 11 సర్కిల్ కార్యాలయాల్లోనూ చాలన్ల నమోదు రిజిస్టర్లు సైతం లేవని తెలుస్తోంది. చాలన్ల నమోదు రిజిస్టర్ లేకపోవడంతో వ్యాపారులు ఖజానా శాఖలో చెల్లించే మొత్తం, వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించే చాలన్లలో పేర్కొనే మొత్తానికి భారీగా వ్యత్యాసం ఉంటోందనే అభిప్రాయం ఉంది. ఖాజానా శాఖలో జమ అయిన మొత్తం ఎంతనేది పరిశీలించకుండానే చాలన్లను ఆమోదిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో జరిగిన వ్యవహారంతో వెలుగు చూసింది. ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. పాత వివరాలను సరిచేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
244 కొలువులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 244 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ పంపించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థిక శాఖ ప్రస్తుత అవసరాల మేరకు ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ, నియామకాల భర్తీకి అవసరమైన షెడ్యూలు జారీ, తదితర చర్యలు చేపట్టే బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. స్థానికత, రోస్టర్ వివరాలు, అర్హత నిబంధనలన్నీ సంబంధిత విభాగం టీఎస్పీఎస్సీకి అందజేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సరి 'కొత్త'గా పాలన!
-
సరి 'కొత్త'గా పాలన!
విజయదశమి రోజున కొత్తగా 21 జిల్లాలకు అంకురార్పణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలపైనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతమున్న పది జిల్లాలకు తోడు ఈ నెల 11న విజయదశమి రోజున కొత్తగా 21 జిల్లాలకు అంకురార్పణ జరుగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. చాలా చోట్ల ప్రస్తుతమున్న ప్రభుత్వ కార్యాలయాలనే కలెక్టరేట్లుగా మార్చగా.. కొన్ని చోట్ల మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలను కలెక్టర్ కార్యాలయాలుగా సిద్ధం చేసింది. సదుపాయాలను బట్టి ప్రస్తుతం ఆయా భవనాల్లోనే అన్ని శాఖలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర శాఖల అధిపతులకు నూతన భవనాల నిర్మాణానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అప్పటిదాకా తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు కానున్నాయి. ఇక కొత్త జిల్లాల్లో ఆయా శాఖలకు అధిపతులుగా కింది కేడర్ల అధికారులకు అవకాశం లభిస్తోంది. మొత్తంగా కొన్ని శాఖలను కలిపేయడం, మరికొన్ని శాఖలకు సిబ్బందిని కుదించడం వంటి చర్యలతో ప్రభుత్వం కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటును పూర్తి చేసింది. గత 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ దీనిపైనే దృష్టిని కేంద్రీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో ఆయా శాఖల స్వరూపం ఎలా ఉండనుంది, శాఖలకు అధిపతులుగా ఎవరు ఉంటారు, పరిపాలనా విధానం తదితర అంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. జిల్లా పోలీస్ బాస్‌లుగా ఐపీఎస్‌లే! - పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీసు శాఖ ఏర్పాట్లు - 24 పోలీస్ సబ్ డివిజన్లు,28 సర్కిళ్ల ఏర్పాటు పోలీసు శాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రస్తుత విధానమే కొనసాగనుంది. జిల్లా పోలీస్ బాస్‌లుగా ఐపీఎస్ అధికారులనే నియమిస్తారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నాటికి కొత్త జిల్లాల పోలీస్ బాస్‌ల నియామకాన్ని పూర్తి చేసేందుకు వీలుగా పోలీసు శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో పరిపాలన విభాగం, నేరాలకు సంబంధించిన బాధ్యతలను అదనపు ఎస్పీ పర్యవేక్షించేవారు. ఇప్పుడు వారి స్థానంలో సీనియర్ డీఎస్పీ అధికారులను నియమించనున్నారు. ప్రస్తుతమున్న ఎస్పీలను అదే స్థానాల్లో కొనసాగించి.. నూతనంగా ఏర్పాటయ్యే జిల్లాల్లో కొత్త వారిని నియమిస్తారు. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీస్స్టేషన్లు, సర్కిళ్లు, సబ్ డివిజన్లలోనూ మార్పులు చేర్పులు చేశారు. నూతనంగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా పోలీసుశాఖ కూడా కొత్తగా 24 సబ్ డివిజన్లను, 28 సర్కిళ్లను ఏర్పాటు చేస్తోంది. నూతన మండలాలకు అనుగుణంగా కొత్తగా 56 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు పోలీసుశాఖలో కీలకమైన సీఐడీకి సంబంధించి మరో రెండు ప్రాంతీయ యూనిట్లను ఏర్పాటు చేయాలని హోంశాఖ భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకటి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో ప్రాంతీయ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ, సైనిక సంక్షేమానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించనున్నారు. కొత్త కమిషనరేట్లకు ఎస్పీలే బాసులు మరోవైపు ఐపీఎస్‌ల కొరత కారణంగా నూతన జిల్లాలకు బాసుల నియామకంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో గ్రేహౌండ్స్, సీఐడీ, ట్రాఫిక్, సీసీఎస్ వంటి విభాగాల నుంచి కొంత మంది ఐపీఎస్‌లను తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ నిర్ణయించారు. కొంత మంది సీనియర్ ఏఎస్పీలకు అడ్హాక్ ప్రమోషన్లు కల్పించి నూతన జిల్లాల బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక 16 మంది అదనపు ఎస్పీలను నాన్ కేడర్ ఎస్పీలుగా నియమించనున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు నూతనంగా ఏర్పడనున్న కమిషనరేట్లకు ఐజీ స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎస్పీలనే కొనసాగించాలని హోంశాఖ భావిస్తోంది. కొత్త జిల్లాల్లో ‘డీఈవో అండ్ డీపీవో’ - ఎస్ఎస్ఏ డీపీవో, డిప్యూటీ ఈవో పోస్టులు రద్దు! - ఖరారైన విద్యా శాఖ సమగ్ర స్వరూపం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పాఠశాల విద్యా శాఖ సమగ్ర స్వరూపం ఖరారైంది. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాల్లో సర్దుబాటు చేసింది. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇపుడున్న విభాగాలను సగానికి కుదించి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు అన్నీ సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో వేర్వేరుగా ఉన్న డీఈవో, సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ (డీపీవో) కార్యాలయాలను విలీనం చేస్తోంది. కొత్త జిల్లాల్లో ఇక డీఈవో పరిధిలోనే అన్ని కార్యక్రమాలూ కొనసాగుతాయి. ఈ రెండింటిలోని సిబ్బందిని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న డీఈవో కార్యాలయాల్లోని స్ట్రక్చర్ రూపురేఖలను మార్చేసింది. ఎస్ఎస్ఏ డీపీవోను రద్దు చేసి, కొత్త జిల్లాల్లో డీఈవో అండ్ డీపీవోగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విద్యా శాఖకు జిల్లాల్లో 961 మంజూరైన పోస్టులుండగా, 761 మంది పని చేస్తున్నారు. మిగతావి ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాల్లో 969 పోస్టులు కావాలని లెక్కలు తేల్చింది. ప్రస్తుతానికి ఉన్న సిబ్బందినే అన్ని జిల్లాలకూ సర్దుబాటు చేసింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) పోస్టులను రద్దు చేసింది. 120 కొత్త మండలాల్లో ఎంఈవో పోస్టులను సృష్టించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకున్న వ్యవస్థ ఇదీ.. ఇప్పుడు డీఈవో కార్యాలయాల్లో డీఈవో కింద డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీ), అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వ పరీక్షల విభాగం (ఏసీజీ), అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో), డిప్యూటీ ఈవో (ఆర్‌ఎంఎస్‌ఏ) ఉన్నారు. ఇక ఏడీ కింద సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, లాస్ట్‌గ్రేడ్ సర్వీసెస్ స్వరూపాలు ఉండగా, ఎస్ఎస్ఏ డీపీవో కింద సెక్టోరియల్ ఆఫీసర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఉన్నారు. సెక్టోరియల్ ఆఫీసర్ కింద అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్, మినిస్టీరియల్ స్టాఫ్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ స్వరూపం ఉంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కింద సీనియర్ అకౌంటెంట్ ఉండగా, ఈఈ కింద డిప్యూటీ ఈఈ ఉన్నారు. కొత్త డీఈవో కార్యాలయాల స్వరూపం ఇలా.. ► కొత్త జిల్లాల్లో డీఈవో అండ్ డీపీవో ఒకరే ఉంటారు. వీరి కింద ఏడీ, ఏసీజీఈ, ఫైనాన్స్ ఏవో ఉంటారు. ఏడీ కింద సూపరింటెండెంట్, సీని యర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, లాస్ట్‌గ్రేడ్ సర్వీసెస్ ఉంటాయి. ఎఫ్ఏవో కింద సీనియర్ అకౌంటెంట్ ఉంటారు. ► ప్రస్తుతం ఉన్న డీఈవోలతో పాటు డిప్యూటీ ఈవో, ఏడీలనే డీఈవో ఆండ్ డీపీవోగా నియమిస్తారు. 31 జిల్లాల్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం పనులను ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల్లోని ఏసీజీసీలకు అప్పగిస్తారు. ప్రస్తుత ఆర్‌ఎంఎస్‌ఏ పరిధిలోని 10 మంది ఎఫ్ఏవోలు, 10 మంది ఏవోలు, ఎస్ఎస్ఏ పరిధిలోని 7 మంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లను అన్ని డీఈవో కార్యాలయాలకు సర్దుబాటు చేస్తున్నారు. ఇంటర్‌కు జిల్లాల్లో అధికారి ఒక్కరే ఇంటర్మీడియట్ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవీఈవో), ఇంటర్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించే రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐవో) వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త జిల్లాల్లో ఈ రెండింటిని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) పేరుతోనే కొత్త కేడర్‌ను సృష్టించి, అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డీఐఈవో పరిధిలోనే జిల్లాల్లోని ఇంటర్ విద్య, ఇంటర్ బోర్డు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం 11 మంది ఆర్ఐవోలు (ప్రిన్సిపల్ కేడర్), 7 మంది డీవీఈవోలు మొత్తంగా 18 మంది ఉన్నారు. మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న 18 మందిని 18 జిల్లాల్లో డీఐఈవోలుగా నియమించి, మిగతా జిల్లాలను వారి పరిధిలోకే తీసుకురానున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ కమిటీకి ఇంటర్మీడియట్ విద్య శాఖ, ఇంటర్ బోర్డు అందజేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా కొనసాగుతున్న 13 మంది ఇకపై 13 జిల్లాల్లో డీఐఈవోలకు సహాయకులుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరుతో పని చేస్తారు. మిగతా 18 జిల్లాల్లో సూపరింటెండెంట్లు డీఐఈవోలకు సహాయకులుగా ఉంటారు. ఏవోలకు సీనియర్ అసిస్టెంట్లు సహాయకులుగా ఉంటారు. మొత్తానికి ఇంటర్మీడియట్ విద్య, బోర్డు కార్యకలాపాలను.. ప్రస్తుతమున్న 78 మందితోనే కొత్త జిల్లాల్లోనూ కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎంవీఐలే జిల్లా అధికారులు రవాణాశాఖకు సంబంధించి ప్రతి జిల్లాకు ఒక అధికారి ఉంటారు. ప్రస్తుతమున్న జిల్లాల్లో పలుచోట్ల జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు, మరికొన్నిచోట్ల డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు, ఇంకొన్ని చోట్ల మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)లు జిల్లాస్థాయి అధికారులుగా ఉన్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ఎక్కువ జిల్లాలకు ఎంవీఐలే జిల్లా అధికారులుగా వ్యవహరించనున్నారు. రవాణాశాఖలో సిబ్బంది కొరత ఉంది. దీంతో కొత్త జిల్లాల్లో పని ప్రారంభించేం దుకు పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ కోరినా.. ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వనపర్తి, నాగర్‌కర్నూలు, వికారాబాద్, భూపాలపల్లిలో మినహా అన్ని కొత్త జిల్లాల్లో రవాణాశాఖకు కార్యాలయాలున్నాయి. ఈ నాలుగు చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యాలయం, జిల్లా స్థాయి కార్యాలయాల నుంచి కంప్యూటర్ల తరలింపు ఇప్పటికే పూర్తయింది. ఇక ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్లు బుక్ చేసుకున్న కొత్త జిల్లాల పరిధిలోని వారికి దసరా నుంచి కొత్త కార్యాలయాల్లోనే సేవలు అందిస్తారు. ఇప్పటికే స్లాట్లను వాటి పరిధిలోకి బదిలీ చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో సిబ్బందిలో గందరగోళం లేకుండా ఉండేందుకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాలకు రిజిస్ట్రేషన్ కోడ్ల కేటాయింపుపై ఆదివారం స్పష్టత రానుంది. ఆర్టీసీలో జిల్లా అధికారులుగా డీవీఎంలు ఆర్టీసీలో ఒక్క హైదరాబాద్ జోన్ మినహా మిగతా చోట్ల పాలనా వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక జిల్లాను రీజియన్‌గా పరిగణిస్తూ రీజనల్ మేనేజర్ పర్యవేక్షణలో ఉండగా.. ఈ అధికారి కింద ఇద్దరు డీవీఎం కేడర్ అధికారులు ఉన్నారు. వీరిలో ఒకరు డిప్యూటీ సీటీఎంగా ఆపరేషన్స్‌ను, మరొకరు డిప్యూటీ సీఎంఈగా మెయింటెనెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేశారు. డిప్యూటీ సీటీఎం, డిప్యూటీ సీఎం ఈలను డీవీఎంగానే మార్చేసి.. కొత్త జిల్లాలకు అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. రెండు రకాల విధులనూ వారే పర్యవేక్షిస్తారు. ఒక జిల్లా నాలుగు కొత్త జిల్లాలుగా మారిన చోట ఒక్కో అధికారికి రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 17 మంది డీవీఎం స్థాయి అధికారులు ఉండగా... గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాలుపోగా మిగతా జిల్లాల బాధ్యతలను వారికి అప్పగించారు. అంటే ఎనిమిది మందికి ఒక్కో జిల్లా చొప్పున, మరో ఎనిమిది మందికి రెండు జిల్లాల చొప్పున బాధ్యతలు ఇవ్వగా.. ఒక అధికారికి 3 జిల్లాల బాధ్యత అప్పగించారు. హా ఆదిలాబాద్, నిర్మల్‌కు సంబంధించి నిర్మల్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లి కలిపి కరీంనగర్లో.. వరంగల్, భూపాలపల్లి కలిపి వరంగల్‌లో.. వరంగల్ రూరల్, మహబూబాబాద్ కలిపి హన్మకొండలో.. మహబూబ్‌నగర్, వనపర్తి కలిపి మహబూబ్‌నగర్‌లో.. నల్లగొండ, సూర్యాపేట కలిపి నల్లగొండలో.. మెదక్, సంగారెడ్డి కలిపి సంగారెడ్డిలో.. హైదరాబాద్, శంషాబాద్, మేడ్చల్(మల్కాజిగిరి) కలిపి హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాలు ఉంటాయి. మిగతావి ఏ జిల్లా కేంద్రంలో ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఉం టాయి. శంషాబాద్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తారు. హా సిద్దిపేట, జగిత్యాల, సూర్యాపేటల్లో సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు సమకూర్చుకున్నారు. కొత్తగూడెంలో బస్టాండ్‌పైన ఉన్న భవనాన్ని కార్యాలయంగా మార్చారు. హా మెదక్, జనగామ, యాదాద్రి, భూపాలపల్లిలలో ఒకే డిపో చొప్పున ఉన్నాయి. ఆర్అండ్బీ అధికారులుగా ఈఈలు రోడ్లు భవనాల శాఖలో ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారిగా సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఉండగా.. ఇకపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారులు ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. మూడు, నాలుగు జిల్లాలకు కలిపి పర్యవేక్షణాధికారిగా ఎస్ఈ వ్యవహరిస్తారు. ఇక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ) పెద్ద జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిన్న జిల్లాల్లో ఇద్దరు చొప్పున ఉంటారు. కొత్తగా ఏర్పడేవి సహా అన్ని జిల్లాల్లో ఆర్అండ్బీ కార్యాలయాలున్నందున వాటి ద్వారానే పాలన ప్రారంభిస్తారు. ఈఈ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున కొత్తగా 4 పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్‌అండ్‌బీకి సంబంధించి న కొందరు ఈఈ స్థాయి అధికారులు డిప్యుటేషన్‌పై వేరే శాఖల్లో పనిచేస్తున్నారు. కొందరు సెలవుల్లో ఉన్నారు. వారితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక ఈ శాఖ పరిధిలో మూడు సర్కిళ్ల హెడ్క్వార్టర్లను మార్చనున్నారు. ములుగు నుంచి భూపాలపల్లికి, మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు, కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూలుకు మారుస్తారు. కొత్తగా మూడు సీటీవో కార్యాలయాలు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌లలో సీటీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఉప్పల్‌లో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేస్తారు. -
దుకాణం మూసేసినా.. పన్ను కట్టాల్సిందే!
* పాత బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయం * వచ్చే నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ * పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.5,200 కోట్లు * మూతపడ్డ పరిశ్రమలు, సంస్థలపై సర్కార్ దృష్టి * వసూళ్లపై సీటీవోలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: మూతపడ్డ సంస్థల నుంచి రావలసిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాత బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఉన్న సంబంధిత సంస్థలు, వ్యక్తుల నుంచి దాదాపు పదేళ్ల నుంచి రూ.5,200 కోట్లు బకాయిల రూపంలో రావలసి ఉందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఈ మేరకు మూతపడ్డ సంస్థలు, పరిశ్రమలతో పాటు దేశంలోని వివిధ కంపెనీలతో లావాదేవీలు జరిపి చేతులెత్తేసిన డీలర్ల వివరాలను సర్కిళ్ల వారీగా సంపాదించేందుకు ఇప్పటికే సీటీవోలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు సర్కిళ్లలోని సీటీవోల ద్వారా బకాయిలు వసూలు చేయాల్సి ఉంటుంది. కాగా రూ.5,200 కోట్ల బకాయిల్లో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు రూ.4వేల కోట్ల వరకు రావలసి ఉందని సమాచారం. వ్యాట్‌కు ముందు.. తరువాత... దేశవ్యాప్తంగా 2005 ఏప్రిల్ నుంచి విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులోకి వచ్చింది. అంతకు ముందు అమ్మకపు పన్ను వసూలు చేసేవారు. అయితే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ అమలైన సమయంలో అప్పటి వరకు ఉన్న బకాయిల గురించి అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. కొందరు డీలర్లు కూడా వ్యాట్ పరిధిలోకి రావడం ఇష్టం లేక వ్యాపారాలను మూసేసినట్లు ప్రకటించి, బకాయిలు చెల్లించలేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలు తమ లావాదేవీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకుండా పన్ను ఎగవేతకే ప్రాధాన్యమిచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ద్వారా లావాదేవీలు జరిపిన వేలాది మంది డీలర్లు కూడా మూతపడ్డ కంపెనీ (క్లోజ్డ్ కేస్) ఖాతాలో చేరిపోయారు. మూతపడ్డ, ఖాయిలా పరిశ్రమల విషయంలో వాణిజ్యపన్నుల శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్‌కు ముందు, తరువాత ఇప్పటి వరకు మూతపడ్డ కేసుల ఖాతాలో రూ. 5,200 కోట్ల మేర పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పాత బకాయిలపై అధికారులు సమీక్షించి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల రావలసిన బకాయిలు మరో రూ. 4,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తాం: కమిషనర్ వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, ఇతర పన్నుల రూపంలో రావలసిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. మూతపడ్డ వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలకు సంబంధించి బకాయిలు ఉన్నవారు వెంటనే సంబంధిత సీటీవోలను సంప్రదించి, పన్నులు చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. -
దూసుకుపోతున్న వాణిజ్యపన్నుల శాఖ
- 3 నెలల్లో రూ. 8,484 కోట్ల రెవెన్యూ - గత ఏడాది కన్నా 14.6 శాతం వృద్ధి - మద్యం అమ్మకాలపై పన్నులో 24 శాతం వృద్ధి - ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43,115 కోట్ల లక్ష్యం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వాణిజ్యపన్నుల శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాల దిశగా పరుగెడుతోంది. ఈ సంవత్సరం తొలి త్రైమాసిక ం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లో 2015-16 కన్నా 14.6 శాతం వృద్ధిరేటుతో రూ. 8,484 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇది గత సంవత్సరం మూడు నెలల్లో సాధించిన రెవెన్యూ కన్నా రూ. 1,077 కోట్లు అధికం. మద్యం అమ్మకాల పై వచ్చే పన్ను ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇక డివిజన్లలో కూడా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ప్రతి నెలా రూ. 2,800 కోట్ల సగటుతో వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం సమకూర్చుకుంటోంది. 83 శాతం వసూలు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 43,115 కోట్ల రెవెన్యూ సాధించాలని వాణిజ్యపన్నుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది గత ఏడాది (2015-16) కన్నా రూ. 11,997 కోట్లు అధికం. కాగా తొలి మూడు నెలల్లో రూ. 10,266 కోట్లు లక్ష్యం కాగా, 3 నెలల్లో రూ. 8,484 కోట్లతో 83 శాతం లక్ష్యా న్ని సాధించింది. ఇందులో మద్యం అమ్మకాలపై 24 శాతం వృద్ధిరేటుతో మూడు నెలల్లో రూ. 2,290 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులపై రూ.1,810 కోట్లు (వృద్ధిరేటు 7.68 శాతం) రాగా, 12 డివిజన్ల నుంచి 4,383 కోట్లు (వృద్ధి రేటు 13 శాతం) వచ్చింది. వ్యాట్, సీఎస్టీ ద్వారా 97 శాతం రెవెన్యూ.. వాణిజ్యపన్నుల శాఖ వసూలు చేసే పన్నులు ఏడు రకాలుగా ఉండగా, కేవలం విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ) ద్వారానే 97 శాతానికి పైగా రెవెన్యూ రావడం విశేషం. మూడు నెలల్లో మొత్తం వసూలైన రూ. 8,484 కోట్లలో 8,261 కోట్ల రూపాయలు కేవలం వ్యాట్, సీఎస్‌టీల ద్వారానే రాగా, మరో రూ. 222 కోట్లు మాత్రమే ఇతర పన్నుల ద్వారా సమకూరాయి. వృత్తిపన్ను ద్వారా రూ. 85.97 కోట్లు, వినోదపు పన్ను ద్వారా రూ. 33.11 కోట్లు, లగ్జరీ పన్ను ద్వారా రూ. 25.68 కోట్లు, ఆర్డీ సెస్ ద్వారా రూ.64 కోట్లు, ప్రవేశపన్ను కింద రూ. 1.41 కోట్లు, గుర్రపు పందాలు, బెట్టింగుల ద్వారా రూ. 12.15 కోట్లు సమకూరాయి. -
పన్ను చెల్లించని హోం డెలివరీ హోటళ్లకు కళ్లెం!
- 55 హోటళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు - రూ.30 కోట్ల టర్నోవర్ జరిగినట్లు నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: నగరంలో పన్ను చెల్లించకుండా హోం డెలివరీ వ్యాపారం చేస్తున్న హోటళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని 55 హోటళ్లపై దాడులు చేసింది. ఇవి పన్ను చెల్లించకుండా హోం డెలివరీ ద్వారా ఏడాది కాలంలో రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఆర్జించినట్టు గుర్తించింది. వీటికి నోటీసులు పంపించింది. రాజధానిలో ఇటీవల హోండెలివరీ ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేసే హోటళ్లకు బాగా ఆదరణ పెరిగింది. ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకు పైగా ఈ తరహా వ్యాపారం జరిగి నట్టు అంచనా. దీనిపై 14.5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాల్సి ఉంది. అయితే స్టార్ హోటళ్లు, పేరున్న రెస్టారెంట్లు మినహా మరే హోటల్ యజమానులూ పన్ను చెల్లించకుండా జీరో దందా చేస్తున్నట్లు తేలింది. 2015-16లో స్విగ్గీ, ఫుడ్ పాం డా, ఫుడ్ మానియా, జొమాటో, బిహంగ్రీ, గెట్ మై ఫుడ్ వంటి హోండెలివరీ సర్వీస్ ప్రొవైడర్ల రికార్డులను అధికారులు పరిశీలించగా... రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు గుర్తించారు. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, ఈసీఐఎల్, ఉప్పల్ వంటి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు ఉన్న ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌ల్లోని హోటళ్ల నుంచి ఎక్కువ వ్యాపారం జరిగినట్లు తేల్చారు. పన్ను చెల్లించని 55 హోటళ్లపైన దాడులు చేశారు. వీటిలో 15 హోటళ్లకు ఇప్పటి వరకు టిన్, వ్యాట్ రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ 55 హోటళ్ల నుంచే ఏడాది కాలంలో రూ.30 కోట్లకు పైగా విలువైన వ్యాపారం జరిగినట్లు లెక్కగట్టారు. జరిగిన వ్యాపారానికి 14.5 శాతం పన్ను, అపరాధ రుసుము విధించారు. ఇప్పటి వరకు కోటి రూపాయల వరకు వసూలు చేశారు. వెబ్ డేటా షేరింగ్: హోటళ్ల జీరో దందాను అరికట్టేందుకు ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లతో వాణిజ్య పన్నుల శాఖ అనుసంధానం కావాలని నిర్ణయించింది. ఆయా వెబ్సైట ్లకు వచ్చిన ఫుడ్ ఆర్డర్, ఏ హోట ల్ నుంచి సరఫరా జరుగుతుందనే డేటా ఎప్పటికప్పుడు శాఖకు చేరేలా ‘వెబ్ డేటా షేరింగ్’ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. వ్యాట్ చెల్లించని, టిన్ నంబర్ లేని హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ తీసుకోవద్దని కమిషనర్ అనిల్‌కుమార్ ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను త్వరలోనే అమలు చేయనున్నట్లు అదనపు కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) రేవతి రోహిణి తెలిపారు. -
మంత్రి.. ఉన్నతాధికారి.. అండా దండా!
వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌పై సీఎం వరకు ఫిర్యాదులు ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరోపణలు మంత్రి వ్యతిరేక వర్గం పక్కా వ్యూహం ఏసీబీ సోదాలతో చర్చనీయాంశం విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖ డివిజన్-2 డిప్యూటీ కమిషనర్ శీతలం శేఖర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి తెలిపారు. ఆయన ఇంట్లో రూ.3 లక్షల నగదు, అర కిలో బంగారంతో పాటు వైజాగ్‌లో ఒక జీ+3 భవనం డాక్యుమెంట్లు లభించాయని ఆమె చెప్పారు. శేఖర్ ఇంటి వద్దే కాకుండా కార్యాలయానికి కూడా ఏసీబీ అధికారులు వచ్చి తనిఖీ చేశారని వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది తెలిపారు. ఆయన కార్యాలయంపై దాడులు జరగడం ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ తదితర ప్రాంతాల్లోని శేఖర్ బంధువుల ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిపై ఏసీబీ సోదాలు జరగటం ఇదే ప్రథమం. డీలర్లతో వివాదాలు... శేఖర్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వారు. ఆయన గతంలో విజయనగరం, విశాఖపట్నం, కర్నూలులో పనిచేసేటప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కర్నూలులో పనిచేసేటప్పుడు డీలర్లతో వివాదం జరిగితే ఏకంగా ఆ జిల్లా మంత్రి వరకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన్ను అక్కడ నుంచి అప్పటికప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు సమాచారం. అయినా తన పరపతిని ఉపయోగించుకుని విజయవాడ డివిజన్-2 డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతిపై వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత తనకు అనుకూలంగా ఒక వర్గాన్ని తయారు చేసుకుని అవినీతికి పాల్పడేవారని వాణిజ్య పన్నుల శాఖలో చర్చ జరుగుతోంది. దీంతో మిగిలిన సిబ్బంది ఆయనకు దూరమయ్యారు. నగరంలోని కొంతమంది డీలర్లతోనూ వివాదాలు ఏర్పడ్డాయని తెలిసింది. ఒక జేబులో మంత్రి.. మరో జేబులో ఉన్నతాధికారి... డిప్యూటీ కమిషనర్ శేఖర్‌కు ఉన్నతస్థాయిలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ఆయనకు ఒక జేబులో మంత్రి, మరో జేబులో వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నతాధికారి ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్జీవో సంఘ నేతల నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారు నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించేవారని ఆయన వ్యతిరేక వర్గం చెబుతోంది. వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో తన మార్క్ చూపించేందుకు శేఖర్ ప్రయత్నించారని తెలిసింది. వాస్తవంగా వాణిజ్య పన్నుల శాఖలో రెండు మూడేళ్లు దాటగానే బదిలీ చేస్తారు. విజయవాడలోని రెండు డివిజన్ల డిప్యూటీ కమిషనర్లను మూడేళ్లు దాటినా బదిలీ చేయకుండా అక్కడే కొనసాగించడం గమనార్హం. తన బదిలీని ఆపేందుకే గాక ఆదాయం వచ్చే డివిజన్లను తనకు అనుకూలంగా ఉండే డీసీలకు ఇప్పించేందుకు ప్రయత్నించడంతో ఆయన కంటే సీనియర్లు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి నుంచి పూర్తిస్థాయి అండదండలు లభించడంతో ఆయన అనుకున్నట్లుగా సాగేదని సమాచారం. డిప్యూటీ కమిషనర్ శేఖర్‌కు విశాఖపట్నంలో 2200 చదరపు గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో స్థలాలు, హైదరాబాద్ మాదాపూర్, కొండాపూర్ వంటి చోట స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఆయన స్వస్థలం తాడేపల్లిగూడెం, శ్రీకాకుళంలో ఆస్తులు కూడబెట్టినట్లు వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు మంత్రితో ఉన్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యతిరేక వర్గం ఆయన కార్యకలాపాలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో ఏసీబీ దాడి చేసినట్లు సమాచారం. నీరుగార్చేందుకు యత్నాలు! డిప్యూటీ కమిషనర్-2 శేఖర్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి సోదాలు చేసినప్పటికీ కేసు కట్టలేదని తెలిసింది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో దాడి నిర్వహిస్తే ప్రభుత్వోద్యోగిపై సాధారణంగా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. అయితే శేఖర్‌పై కేసు కట్టడం లేదని తెలిసింది. దీని వెనుక పెద్ద మంత్రాంగమే నడిచినట్లు సమాచారం. శేఖర్ అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకి సమీప బంధువు. దాడుల ఘటనతో అప్రమత్తమైన ఆయన తనకు అనుకూలంగా ఉండే మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సాయంత్రం ఐదు గంటలకు ఆ శాఖ ముఖ్య అధికారి ఒకరు, ఏపీ ఎన్జీవోస్ ముఖ్య నేత, మరో ముగ్గురు సీటీవోలు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. అప్పటికే ఇద్దరు మంత్రులు సీఎం వద్ద చక్రం తిప్పారని వాణిజ్య పన్నుల శాఖలో బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మంత్రుల సిఫార్సు మేరకు శేఖర్‌పై కేసు నమోదు చేయబోమని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. కొనసాగుతున్న సోదాలు విజయవాడ (ఆటోనగర్) : డిప్యూటీ కమిషనర్ శీతలం శేఖర్ నివాసంలో గురువారం ఉదయం మొదలైన సోదాలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కించిన ఆస్తుల విలువ రూ 1.50 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.10 కోట్లపైనే ఉంటుందని సమాచారం. సోదాలు పూర్తయ్యాక శేఖర్‌ను అరెస్ట్ చేస్తామని ఏసీబీ డిఎస్పీ ఎ.రమాదేవి తెలిపారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సోదాల్లో పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటి డాక్యుమెంట్లు శేఖర్ నివాసంలోనే లభ్యమైనట్లు సమాచారం. సోదాలు జరిగే సమయంలో శేఖర్ ఆయన నివాసంలోనే ఉంటడంతో ఆస్తుల వివరాలను ఆయన్నే అడిగి ధృవీకరిస్తున్నారు. మిగతా ప్రదేశాలలో కూడా ఆస్తులున్నాయో లేదో విచారిస్తున్నారు. -
లక్ష్యం చేరాల్సిందే!
- ఈ ఏడాది వాణిజ్యపన్నుల శాఖ - టార్గెట్ రూ.43 వేల కోట్లు - బకాయిలు, ఎగవేతలపై సీఎం సీరియస్ - క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్నిపటిష్టం చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సర్కారు ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్యపన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచిసంస్కరించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సమకూరుతున్న పన్నులకు తోడు అధికార యంత్రాంగం పనితీరును మెరుగుపరిచి వసూళ్లు పెంచాలన్నది సీఎం ఆలోచన. ఇందులో భాగంగానే ఈ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం శనివారం వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వచ్చే పన్ను మీదే ఆధారపడకుండా మొండి బకాయిల వసూళ్లు, కోర్టు కేసుల పరిష్కారం, జీరో దందాను అరికట్టే విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏయేటికాయేడు 20 శాతం అదనపు రెవెన్యూ రాబడి లక్ష్యంగా పన్నులు వసూలు చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ.. జీరోదందాను అరికట్టి, అక్రమ వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప సత్ఫలితాలు సాధించలేదన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్దేశించుకున్న రూ. 43,115 కోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయాల్సిందేనని, అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. దీంతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా టార్గెట్లు నిర్దేశించి పన్ను వసూళ్లలో వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. మద్యం, పెట్రో ఉత్పత్తులపై రూ. 15 వేల కోట్లుపైనే.. 2015-16 సంవత్సరంలో రూ. 33,965 కోట్ల పన్ను వసూలు లక్ష్యాన్ని పెట్టుకున్న వాణిజ్యపన్నుల శాఖ రూ. 32,492 కోట్లు సాధించింది. 96 శాతం లక్ష్యాన్ని సాధించినప్పటికీ, ఇందులో సగం పన్ను కేవలం మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారానే సమకూరింది. సుమారు రూ. 17వేల కోట్లు మాత్రమే మిగతా వస్తువుల మీద పన్ను రూపంలో సమకూరింది. వాణిజ్యపన్నుల శాఖ పన్ను వసూళ్ల డిమాండ్ నోటీస్ ఇవ్వగానే కోర్టులను ఆశ్రయించే బడా బాబుల నుంచి రావలసిన మొత్తమే రూ. 3,600 కోట్లు ఉంది. కోర్టు కేసులతో సంబంధం లేకుండా రావలసిన మొండి బకాయిలు మరో 2వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా. కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయవాదులను నియమించుకొని ఆదాయాన్ని రాబట్టుకోవాలని గతంలో సీఎం ఆదేశించినా, ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. శనివారం నాటి సమావేశంలో బకాయిల వసూళ్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పన్ను విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి వ్యాట్‌తో పాటు గుర్రపు పందాల పన్ను, వినోద పు పన్ను, లగ్జరీ ట్యాక్స్ వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. అలాగే పన్ను విధానంలో మార్పులు చేయడం, ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై నిఘా పెంచడం, చెక్‌పోస్టుల ఆధునీకరణతో పాటు జిల్లాల వారీగా డివిజన్ల ఏర్పాటు, సర్కిళ్ల పెంపు, అధికారుల నియామకం తదితర అంశాలను కూడా సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. సంస్కరణలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. -
పన్ను ఎగవేతలను అరికట్టండి: కేసీఆర్
- వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కేసీఆర్ ఆదేశం - బకాయిల వసూలుకు పటిష్ట కార్యాచరణ అవసరం సాక్షి, హైదరాబాద్: పన్నుల వసూళ్లలో వినూత్న ఆలోచనలు చేయాలని, ఎగవేతలను పూర్తిస్థాయిలో అరికట్టాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. పన్నులు సక్రమంగా చెల్లించే వారిని ప్రోత్సహిస్తూ, ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న అధికారుల వెన్నుతట్టేలా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న పన్నులు, ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ ద్వారా వస్తున్న ఆదాయం, ఎగవేత దారులు, బకాయిలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖను పటిష్టం చేసుకోవాలని, అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఖాళీలను భర్తీ చేసి, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలన్నారు. ఆదాయంపై దృష్టి పెట్టండి వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సినంత ఆదాయం వస్తున్నదా, లేదా? అనే అంశాన్ని శాస్త్రీయంగా బేరీజు వేసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. పన్నులు సక్రమంగా చెల్లించే వ్యక్తులు, సంస్థలను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. రూ.3,600 కోట్ల బకాయిలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా జరిపే అన్ని కొనుగోళ్లపై టీడీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే పదవీ విరమణ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు. బడ్జెట్, బడ్జెటేతర వ్యయం ద్వారా రాష్ట్రంలో భారీగా పనులు జరుగుతున్నాయని... ఫలితంగా పన్నులు అదనంగా వసూలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చెక్‌పోస్టుల ఆధునీకరణ, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల నిర్మాణం, నెలకో అంశాన్ని తీసుకొని అక్రమార్కులపై దాడులు చేయడం తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి తదితరులు పాల్గొన్నారు. -
అధి‘కార్ల’ వైభోగం!
వాణిజ్య శాఖ కమిషనర్ ఆంక్షలు పర్యవేక్షణ బాధ్యతలు సీటీవోలకు.. విజయవాడ సిటీ : వాణిజ్య పన్నుల శాఖలో అద్దె కార్ల వినియోగంపై ఆ శాఖ కమిషనర్ ఆంక్షల కొరఢా ఝలిపించారు. అనర్హులు సైతం అడ్డగోలుగా కార్లను వినియోగిస్తూ..శాఖాపరమైన అవసరాలకు అందుబాటులో ఉంచకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిషనర్ జె.శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆడిట్ అవసరం కోసం మాత్రమే వాహనాలు వినియోగించాల్సిన డీసీటీవోలు సొంత పనులకు కార్లను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించారు. వాహనాల తనిఖీలకు వెళ్లేందుకు అవసరమైన వాహనాలు లేవంటూ ఏసీటీవో స్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దీనిపై దృష్టిసారించారు. సంఖ్యాపరంగా అద్దె కార్లు ఉన్నప్పటికీ..వాహనాలు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన ఆయన 17వతేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఆయా సర్కిల్ పరిధిలో ఉండే వాహనాలు వాణిజ్య పన్నుల అధికారి(సీటీవో) పర్యవేక్షణలోనే శాఖాపరమైన విధులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆయా వాహనాల వినియోగానికి సంబంధించి ప్రత్యేక రికార్డు(లాగ్‌బుక్) నిర్వహించాలని ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్లకు స్పష్టం చేశారు. 50కి పైగా అద్దె వాహనాలు... జిల్లా వాణిజ్య శాఖలో ఇద్దరు ఉప కమిషనర్లు(డీసీ), ఒక అదనపు ఉప కమిషనర్(ఏడీసీ), నలుగురు సహాయ కమిషనర్లు(ఏసీ), 20మంది సీటీవోలు, 40మంది డీసీటీవోలు ఉన్నారు. వీరికి ఉద్యోగ అవసరాల కోసం శాఖాపరంగా తగినన్ని సొంత వాహనాలు లేవు. కేవలం 10 జీపులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కండిషన్లో లేకపోవడం, డ్రైవర్లు పదవీ విరమణ చేయడంతో అద్దె కార్ల వినియోగానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఉన్నతాధికారులతో పాటు డీసీటీవో స్థాయి అధికారులు ఆడిట్‌కు వెళ్లేందుకు,సీటీవో, ఏసీటీవో స్థాయి అధికారులు వాహనాల తనిఖీలు చేసేందుకు వీటిని వినియోగించాలి. నిబంధనలు ఇవీ... అద్దె ప్రాతిపదికన తీసుకునే కార్లకు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.25వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.24వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. ప్రతి వాహనం నెలకు 2500 కిలో మీటర్లు తిరగాలి. రవాణాశాఖ నిబంధనల ప్రకారం నాలుగేళ్ల లోపు కొనుగోలు చేసిన వాహనాలను మాత్రమే అద్దెకు తీసుకోవాలి. ఇందుకయ్యే ఇంధనం, మరమ్మతులు సహా అన్ని ఖర్చులను కారు యజమాని భరించాల్సిందే. ఇక్కడ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కండీషన్లో లేని వాహనాలు తిరుగుతున్నట్టు తెలిసింది. కాదంటే కట్... అద్దె ప్రాతిపదికన తిప్పే వాహనాలను సొంత అవసరాలకు వాడుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఇందుకు అంగీకరించకుంటే వాహనం కాంట్రాక్టు రద్దు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిసింది. టెండర్లు మేలు... ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే టెండర్ల ద్వారా వాహనాలు అద్దెకు తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ఇక్కడి ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పారదర్శకతతో పాటు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాదనేది వీరి అభిప్రాయం. ఉల్లంఘన... జిల్లాలోని వాణిజ్య శాఖలో కొందరు అధికారులు బంధువులు, సన్నిహితుల పేరిట టాక్సీ వాహనాలను కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన తిప్పుతున్నారు. రెండో డివిజన్ పరిధిలోని ఓ ఉన్నత అధికారి తన స్నేహితుడైన బ్యాంక్ అధికారి పేరిట వాహనం కొనుగోలు చేసి అద్దెకు తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నట్టు ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే చెపుతున్నారు. ఇదే డివిజన్లోని కొందరు యూనియన్ నేతలు కూడా తమ సన్నిహితుల పేరిట కార్లను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారు. ఈ వ్యవహారాలు బయటకు రాకుండా చూసేందుకు రెండు డివిజన్లలో వ్యవహారాలు చక్కబెట్టడంలో చేయి తిరిగిన గుమాస్తా, ఓ డీసీటీవో స్థాయి మహిళా అధికారిణికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. వీరు ఒక్కొక్క వాహనానికి రూ.1000 నుంచి రూ.2000 వరకు నెలవారీ మామూళ్ల కింద వసూలు చేస్తున్నట్టు చెపుతున్నారు. కలెక్షన్ ఏజెంట్లుగా... కొందరు అధికారులు ప్రైవేటు కారు డ్రైవర్లను తనిఖీల పేరిట కలెక్షన్లు వసూళ్లకు వినియోగిస్తున్నారు. తనిఖీలు, ఆడిట్ల సమయాల్లో వాహనాలు ఆపడం, బేరసారాలు సాగించడం మొదలు అనధికారిక మామూళ్లను వీరు వసూలు చేసి అధికారులకు ఇస్తున్నారు. గుడివాడ సీటీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో సంబంధిత అధికారి ప్రైవేటు కారు డ్రైవరు వద్ద రూ.2లక్షలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. -
రాష్ట్రంలో యథేచ్ఛగా పప్పు ధాన్యాల బ్లాక్ దందా!
కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా సాగుతున్న అక్రమ రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖకు నిర్దేశిత 5 శాతం పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి జీరో దందా రూపంలో పప్పులను రాష్ట్రానికి తరలిస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు, కాన్వాసింగ్ ఏజెంట్లు, బ్రోకర్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తుల ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.10వేల కోట్ల విలువైన పప్పులు దిగుమతి అవుతుండగా, అందులో 30% సరుకుకే పన్ను వసూలవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని వాంఖిడి, భైంసా, మద్నూర్, చిరాగ్పల్లి చెక్‌పోస్టుల ద్వారానే అక్రమ రవాణా సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పప్పులపై పన్ను (వ్యాట్) లేకపోవడం, మన రాష్ట్రంలో 5 శాతం పన్ను విధిస్తుండడంతో చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని మేనేజ్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయల విలువైన పప్పులను రాష్ట్రానికి తరలిస్తుండడం గమనార్హం. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలివస్తున్న పప్పుల అక్రమ రవాణా వెనుక ప్రధాన హస్తం కమీషన్ ఏజెంట్లదేనని అధికారులు గుర్తించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల దొంగ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లతో రాష్ట్రంలోకి ప్రవేశించే ట్రక్కులు కొన్నైతే, ఎలాంటి కాగితాలు లేకుండానే కంది, మినప, పెసర తదితర పప్పులను రవాణా చేయడం ద్వారా ఏజెంట్లు కోట్లకు పడగలెత్తారు. అక్రమ వ్యాపారంపై అధికారుల కన్ను రాష్ట్రానికి తరలివస్తున్న పప్పు ధాన్యాలకు, మార్కెట్లలోని నిల్వలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో పౌరసరఫరాల శాఖ ఈ ఏడాది మార్చిలో వాణిజ్యపన్నుల శాఖను అప్రమత్తం చేసింది. ఏకంగా మంత్రి ఈట ల రాజేందర్, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో వాణిజ్యపన్నుల శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వినియోగమయ్యే పప్పులకు 5 శాతం పన్ను కింద కనీసం రూ.500 కోట్ల వరకు రావలసి ఉండగా, 2015-16లో కేవలం రూ.163 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఇటీవ ల ఒకేరోజు 60 బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్లపై దాడికి దిగారు. వారి రికార్డులను పరిశీలిస్తే రూ.10వేల కోట్లకు పైగా విలువైన పప్పు ధాన్యాలు రాష్ట్రానికి తరలివచ్చినట్లు ప్రాథమికంగా తేలింది. -
వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో జరిగే వ్యాపారానికి సంబంధించి ఈ-వేబిల్లులను వాణిజ్యపన్నుల శాఖ తప్పనిసరి చేసింది. దొంగ వేబిల్లులతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా యథేచ్చగా సాగుతుండడంతో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే ఈ నిబంధనను అమలులోకి తెచ్చినప్పటికీ, వ్యాపార వర్గాలు ఆచరణలో పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు కమిషనర్ క చ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ-వేబిల్లును రెండు గంటల్లో రద్దు చేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆన్లైన్ లాగిన్ అయ్యేటపుడు డీలర్లందరూ వారి వ్యాపారాలకు సంబంధించి పాన్‌కార్డు వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. -
వాణిజ్య పన్నుల సర్కిళ్ల పునర్విభజన
♦ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ♦ పన్ను వసూళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి ♦ వృద్ధి రేటులో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు దేశంలో రెండో స్థానం ♦ మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు సన్మానం సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం ఉన్న సర్కిళ్లను పునర్విభజించి, కొత్తగా మరికొన్నింటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఆధునికీకరించిన కాన్ఫరెన్స్ హాలును శనివారం ప్రారంభించిన ఆయన 2015-16 సంవత్సరంలో పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులను సన్మానించారు. అనంతరం అధికారులతో వార్షిక ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడంలో వాణిజ్యపన్నుల విభాగమే ప్రధాన మైందని అన్నారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ. 32,492 కోట్ల ఆదాయాన్ని సాధించిన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ వృద్ధి రేటులో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఇది ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి విజయమని పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ. 43,115 కోట్లుగా నిర్ధేశించామని తెలిపారు, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని క్షేత్రస్థాయిలో ఆడిట్లు నిర్వహించడం, స్ట్రీట్ సర్వేల ద్వారా కొత్త రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్లను తనిఖీ చేయడం ద్వారా సరుకు రవాణా లీకేజీలను అరికట్టడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. వినోదపు పన్ను, వృత్తిపన్ను, హోటళ్ల నుంచి రావలసిన వ్యాట్, లగ్జరీ పన్నులను సక్రమంగా వసూలు చేయాలని, పన్ను చెల్లింపునకు, జరిగే వ్యాపారానికి సంబంధించి ఇతర శాఖల ద్వారా తె ప్పించిన సమాచారంతో సరిపోల్చుకోవాలని సూచించారు. కోర్టుల్లో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లోనూ పెంచే యోచన ఉందని, సర్కిళ్లను కూడా పెంచి, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన టి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌గౌడ్, పి.లక్ష్మి, కిషోర్ కుమార్, నారాయణరెడ్డి సత్కారం అందుకున్నారు. మొత్తం 68 మందిని సత్కరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్‌కుమా ర్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్లు రేవతి రోహణి, చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు వేణుగోపాల్, టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వాణిజ్య పన్ను.. రికార్డుపై కన్ను
♦ ఫిబ్రవరి వరకు వసూలైన పన్నులు రూ.28,787 కోట్లు ♦ 2015-16లో రెవెన్యూ లక్ష్యం రూ.32,617 కోట్లు ♦ ఈ నెలలో రూ.4 వేల కోట్లతో 100 శాతం లక్ష్యం పూర్తి! సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నులు రికార్డుస్థాయిలో వసూలవుతున్నాయి. వంద శాతం వసూళ్లకు ఆ శాఖ అడుగుదూరంలో ఉంది. కట్టుదిట్టమైన చర్యలు ఫలిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం, అన్ని డివిజన్ల అధికారుల నిఘా, జీరో దందా వ్యాపారుల నుంచి పన్నులు రాబట్టడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన 2014తో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకుపైగా వాణిజ్య పన్నులు వసూలు కావడం గమనార్హం. 2014 జూన్ నాటికి వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం రూ.18 వేల కోట్లు మాత్రమే. 2015-16 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలో సవరించిన వార్షిక లక్ష్యం రూ.32,617 కోట్లు. ఫిబ్రవరి నెలాఖరుకు రూ.28,787 కోట్లు వసూలు చేసింది. ఈ మార్చిలో మరో రూ.4 వేల కోట్లు వసూలైతే వంద శాతం లక్ష్యానికి చేరుకున్న ప్రభుత్వ విభాగంగా రికార్డు నెలకొల్పనుంది. ఈ నేపథ్యంలో 2016-17 బడ్జెట్లో వాణిజ్య పన్నుల శాఖ పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.42,073 కోట్లుగా నిర్ణయించింది. మద్యం, పెట్రో ఉత్పత్తులపైనే రూ.13,225 కోట్లు వాణిజ్యపన్నుల శాఖ ఆదాయంలో మద్యంతోపాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వచ్చే పన్ను దాదాపు 50 శాతం ఉంది. ఫిబ్రవరి వరకు ఈ రెండింటి ద్వారా రూ.13,225 కోట్లు(మద్యం 7269, పెట్రో 5956) వసూలైంది. పెట్రోల్, డీజిల్ ధరల హెచ్చుతగ్గులు, మద్యం అమ్మకాల్లో ఆశించిన వృద్ధి లేకపోవడంతో గత సంవత్సరం వసూలైన పన్ను(13070) కన్నా ఒక శాతం మాత్రమే ఫిబ్రవరి నెలాఖరు నాటికి అధికంగా వసూలైంది. ఇక సిగరెట్ల అమ్మకాలు, సింగరేణి, బీహెచ్ఈఎల్ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బడా ప్రైవేట్ కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నులతో కలిపి 12 డివిజన్లలో రూ.14,648 కోట్లు వసూలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్టీ బకాయిలు రూ. 913.5 కోట్లు రావడంతో మొత్తం రూ.28,787 కోట్ల ఆదాయం సమకూరింది. పన్ను వసూళ్లలో వాణిజ్యపన్నుల శాఖ ఫిబ్రవరి నాటికే వార్షిక లక్ష్యానికి చేరువ కావడంపట్ల ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అన్ని వ్యాపార సంస్థల నుంచి పన్నులు వ సూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సినిమా థియేటర్లలో ఆన్లైన్ టికెట్ విధానం, విలాసపన్ను వసూళ్లను కట్టుదిట్టం చేయడం వంటి కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయన్నారు. -
‘ఆదాయ’శాఖకు అధికారులు కరువు!
♦ వాణిజ్య పన్నుల శాఖలో 1,106 ఖాళీలు ♦ నేటికీ పాత డివిజన్లు, సర్కిళ్లవారీ పోస్టులు ♦ జీరో దందాపై తగ్గిన నిఘా ♦ కొత్త డీలర్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి ♦ విషయం సీఎం దృష్టికి... కదులుతున్న ఫైలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్నిచ్చే వాణిజ్యపన్నులశాఖకు అధికారులు, సిబ్బంది కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రం లో పోస్టులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజిం చాక అధికారుల సంఖ్య గణనీయంగా తగ్గగా భర్తీ చేసుకునే ప్రయత్నాలేవీ జరగడం లేదు. దీంతో అక్రమ రవాణా, జీరో దందాపై నిఘా తగ్గడంతోపాటు కొత్తగా పన్నులు విధించేందుకు అవకాశాలున్న సంస్థలు, డీలర్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. వాణిజ్యపన్నులశాఖకు ఉమ్మడి రాష్ట్రంలో కమిషనర్, అదనపు కమిషనర్, సంయుక్త కమిషనర్ పోస్టులు కాకుండా 8,882 మంది అధికారులు, ఇతర ఉద్యోగులను కేటాయించారు. రాష్ట్ర విభజన తరువాత జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 3,539 మందిని కేటాయించగా వీరిలో ప్రస్తుతం విధుల్లో 2,433 మందే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సీటీవో, డీసీటీవో, ఏసీటీవో వంటి కీలక పోస్టుల నుంచి ఆఫీస్ సబార్డినేట్ల వరకు 18 విభాగాల్లో ఏకంగా 1,106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియారిటీ జాబితా తయారీలో నిర్లక్ష్యం కారణంగా పదేళ్లుగా పదోన్నతులు లేవు. దీంతో 40 సీటీవో పోస్టులు, 50 చొప్పున డీసీటీవో, ఏసీటీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 298 జూనియర్ అసిస్టెం ట్ పోస్టులు, 158 సీనియర్ అసిస్టెంట్, 254 ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. భారీగా డీలర్లు... పెరగని సర్కిళ్లు వాణిజ్యపన్నులశాఖకు వచ్చే ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ పరిధిలోని 7 డివిజ న్ల నుం చే సమకూరుతోంది. టర్నోవర్ టాక్స్ (టీవోటీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లిస్తున్న టిన్ (టాక్స్ పేయర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్) డీలర్లు హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది టిన్ రిజిస్ట్రేషన్ డీలర్లు ఉండగా వారిలో సికింద్రాబాద్ నోడల్ డివిజన్ (హైదరాబాద్ సిటీ) పరిధిలోని ఐదు డివిజన్లలో ఉన్న 43 సర్కిళ్లలోనే 56,980 మం ది డీలర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది డీలర్లకు ఒక సర్కిల్ ఉండాల్సి ఉండగా హైదర్‌నగర్‌లో 6,086 మంది, మాదాపూర్‌లో 6,323 మంది డీలర్లు రిజిస్టరై ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్‌లో 463 మంది, మహారాజ్‌గంజ్‌లో 468 మంది, రాంగోపాల్‌పేట్‌లో 443 మంది, హిస్సామ్గంజ్లో 496 మంది డీలర్లే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తక్కువ డీలర్లున్న సర్కిళ్లను కలపాలని, ఎక్కువ ఉన్న చోట కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి సీఎం దృష్టికి... రాష్ట్ర ఖజానాకు ఈ వార్షిక సంవత్సరంలో రూ. 36 వేల కోట్ల ఆదాయం అందించాలని పెట్టుకున్న లక్ష్యంలో వాణిజ్యపన్నులశాఖ సుమారు రూ. 28 వేల కోట్లు చేరుకోవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం కూడా రూ. 27 వేల కోట్ల మార్కు వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సంస్థ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు...శాఖలోని పరిస్థితిని మంత్రుల బృందం ముందుకు తీసుకెళ్లారు. ఈ శాఖలోని పరిస్థితి సీఎం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు సర్కార్ కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. -
వాణిజ్యపన్నుల శాఖలో సంస్కరణలు!
ప్రతి జిల్లాకు సొంత భవనం.. జిల్లాకో డిప్యూటీ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు అంతర్గత సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి ఏసీటీవో వరకు పోస్టుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నట్లు ఉన్నత వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ప్రతి జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖకు సొంత భవనం ఏర్పాటు చేయడం, సర్కిళ్లను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖకు 12 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్‌కు సగటున 15 చొప్పున 200 వరకు సర్కిళ్లు ఉన్నాయి. అయితే వీటిలో హైదరాబాద్ పరిధిలోనే 7 డివిజన్లు ఉండడం గమనార్హం. ఈ సర్కిళ్లలో లావాదేవీలు పెరిగిపోవడంతో పన్ను చెల్లించకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ లో ప్రత్యేక డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో మం చిర్యాలను, కరీంనగర్లో రామగుండం, మెదక్‌లో సిద్ధిపేటను డివిజన్లుగా మార్చే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో 4 డివిజన్లను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. డీలర్లు వేలల్లో.. సర్కిళ్లు పదుల్లో... ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని ఏడు డివిజన్లలోని ప్రతి సర్కిల్లోనూ 5 వేలకుపైగానే డీలర్లు ఉన్నారు. వీరి నుంచి సక్రమంగా పన్ను వసూలు చేయడమే గగనమవుతున్న పరిస్థితుల్లో పన్ను ఎగవేతదారులపై దాడులు జరిపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మరిన్ని డివిజన్, సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. అలాగే చెక్‌పోస్టులను కూడా 2 నెలల్లోనే ఆధునీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతస్థాయిలో ఆమో దం లభించినట్లు సమాచారం. సంస్కరణల విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మూలాధారమైన వాణిజ్యపన్నుల శాఖ రెవెన్యూ పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
‘సినిమా’ చూపిస్తున్నారా?
కలెక్షన్లపై వాణిజ్యపన్నుల శాఖ కన్ను థియేటర్లలో రూ.కోట్లు వసూలవుతున్నా... వినోదపు పన్ను లక్షలు దాటట్లేదు టిక్కెట్ల అమ్మకాలకు ఆన్‌లైన్‌తో అనుసంధానం కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో స్పష్టత ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్: ఒక సినిమా వందల కోట్ల రూపాయల క్లబ్బుల్లో చేరినా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లిస్తున్న వినోదపు పన్ను రూ.లక్షలు దాటడం లేదు. థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రేక్షకుల సంఖ్యకు, శాఖకు చూపించే లెక్కలకు పొంతనే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వినోదపు పన్ను వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పెట్టింది. ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ వినోదపు పన్ను వసూళ్ల తీరును చూసి నివ్వెరపోయింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సినిమాల ద్వారా రాష్ట్రం నుంచి ఏటా వందల కోట్ల రూపాయలు వసూలవుతున్నా వినోదపు పన్ను రూ.80 కోట్లు దాటడం లేదు. థియేటర్లలో ప్రదర్శితమయ్యే తెలుగు సినిమాలపై 15 శాతం, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషా చిత్రాలపై 20 శాతం పన్ను వసూలు చే స్తారు. ఆన్లైన్ అనుసంధానంతో... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 532 సినిమా థియేటర్లలో సుమారు 3 లక్షల సీట్లకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు ఆన్లైన్ లింక్ చేయాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. తొలుత గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లు, త దుపరి మునిసిపాలిటీలు, గ్రామ స్థాయికి వె ళ్లాలని నిర్ణయించారు. గ్రామ పంచాయితీల్లో సినిమా టిక్కెట్లతో సంబంథం లేకుండా ఉన్న శ్లాబ్ పన్ను విధానాన్ని తొలగించి, టిక్కెట్ల అమ్మకాల ద్వారానే పన్ను వసూలు చేయనున్నారు. ఆన్లైన్ వెబ్సైట్ లు, థియేటర్లలో జరిగే టిక్కెట్ల అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వాణిజ్యపన్నుల శాఖలో రికార్డ్ అయ్యేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సమన్వయంతో థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాల వివరాలు శాఖకు చేరేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. సెట్‌టాప్ బాక్స్‌తో ఎగవేతలకు చెక్... రాష్ట్రంలో కేబుల్ కనెక్షన్ లేని ఇళ్లు 10 శాతం కూడా ఉండవని ఓ అంచనా. ప్రతి కేబుల్ ఆపరేటర్ వినోదపు పన్నును వేర్వేరు శ్లాబుల్లో చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీలోని కేబుల్ ఆపరేటర్ నెలకు రూ.100 నుంచి రూ. 200 వరకు చెల్లించాలి. ఇక ప్రతి కేబుల్ కనెక్షన్‌కు కార్పొరేషన్లో రూ.5, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలో రూ.4, మొదటి, రెండో గ్రేడ్ మునిసిపాలిటీల్లో రూ.3, ఇతర మునిసిపాలిటీల్లో రూ.2 చొప్పున పన్ను చెల్లించాలి. కానీ ఒక్కో ఆపరేటర్‌కు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయన్న విషయంలోనే స్పష్టత లేదు. కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్స్‌లు అనుసంధానం చేయడం వల్ల ఈ వివరాలు తెలుస్తాయి. హైదరాబాద్ పరిధిలో సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తికాగా, మిగతా చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. -
రూ.14 కోట్ల బంగారు స్వాధీనం - ఒకరి అరెస్ట్
చిత్తూరు జిల్లా పరమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద ఉన్న అంత ర్రాష్ట్ర వాణిజ్యపన్నుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఉదయం రూ.14 కోట్ల విలువైన బంగారంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్‌ను అరెస్ట్‌చేశారు. బెంగుళూరు నుంచి చిత్తూరువైపు వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో 14 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కనుగొన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు. దీంతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్‌ను దుపులోకి తీసుకున్నారు. ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలియజేశారు. ఏస్పీ బలమనేరు బయలుదేరారు. కాసేపట్లో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించనున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తెలియజేశారు. -
రూ. 25 లక్షల కందిపప్పు స్వాధీనం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్‌లోని పలు పప్పు ధాన్యం మిల్లులపై వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆదివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీగా కందిపప్పు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కందిపప్పును స్వాధీనం చేసుకుని... రెండు లారీలను సీజ్ చేశారు. అలాగే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కందిపప్పు విలువ రూ. 25 లక్షలు ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
జోరుగా జీరో
అనధికారికంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయం ఏటా రూ.10 కోట్ల పన్ను ఎగవేత నిద్రావస్థలో వాణిజ్యపన్నుల శాఖ విజయవాడ : జిల్లాలోని పలు పట్టణాల్లో కుప్పలు తెప్పలుగా అనధికారికంగా కంప్యూటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఇళ్లల్లో, అపార్టుమెంట్లలో కంప్యూటర్లు అసెంబ్లింగ్ చేసి కోట్లలో జీరో వ్యాపారం చేస్తున్నారు. సంవత్సర కాలంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల విక్రయం ముమ్మరమైంది. వ్యాపారులు జీరో వ్యాపారం చేసి ఏటా రూ. 10 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను ఎగనామం పెడుతున్నారు. కస్టమర్లు బిల్లు కావాలంటే ఒక రేటు, అక్కర్లేదంటే మరో రేటుకు కంప్యూటర్లు అమ్ముతున్నారు. విషయాలన్నీ తెలిసినా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరానికి రూ.వంద కోట్ల విలువైన కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు జీరో వ్యాపారంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ ఐదు శాతం వ్యాట్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.10 కోట్లపైనే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న జీరో వ్యాపారం లాభసాటిగా ఉండడంతో నగరంలో కంప్యూటర్లు విక్రయించే డీలర్ల సంఖ్య గ ణనీయంగా పెరుగుతోంది. వాడవాడలా కంప్యూటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. అత్యధిక శాతం మంది అనామతుగా ఈ వ్యాపారాన్ని సాగించేస్తున్నారు. రైల్వేపార్శిల్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుల ద్వారా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు బిల్లులు లేకుండా వచ్చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల నుంచి యథేచ్ఛగా కంప్యూటర్ల స్పేర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇళ్లలో, అపార్టు మెంట్లలో అక్రమంగా నిల్వచేసి, అసెంబ్లింగ్ చేస్తున్నారు. చెలరేగిపోతున్న డీలర్లు... ఇటీవల కాలంలో జిల్లాలో ఈ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అన్ని రంగాల్లో కంప్యూటర్ల వాడకం పెరగటంతో లక్షలాది మంది కొనుగోలు చేస్తున్నారు. డీలర్లలో కొందరు జీరో వ్యాపారం చేస్తుండగా, మరి కొందరు నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్నారు. ఈ తరహా వ్యాపారం చేసే వారు ఎందరున్నారు? నెలకు ఎంత మొత్తం అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం వాణిజ్యపన్నుల శాఖ అధికారుల వద్ద లేకపోవటం గమనార్హం. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం... కంప్యూటర్ల జీరో వ్యాపారం విషయమై వాణిజ్యపన్నుల శాఖ -2డివిజన్ డెప్యూటీ కమిషనర్ ఎస్. శేఖర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. దొంగ రవాణాను అరికట్టేందుకు పలు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మకాలు సాగిస్తూ పట్టుపడినవారి నుంచి భారీగా జరిమానా వసూలు చేస్తామని ఆయన హెచ్చరించారు. -
మళ్లీ కాసుల గలగలలు
ప్రభుత్వ ఖజానాకు మళ్లీ పెరిగిన ఆదాయం పుంజుకున్న వాణిజ్య పన్నుల రాబడి ఆగస్టులో లక్ష్యాన్ని మించిన ఆదాయం రాష్ట్ర విభజన తరువాత గాడిలో పడిన పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర విభజనతో తగ్గిన మహానగర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఆగస్టు నెలలో వివిధ పన్నుల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోన్న సంస్థలు పన్నుల చెల్లింపుపై ఆసక్తి కనబర్చక పోవడంతో సగానికిపైగా ఆదాయం పడిపోయింది. కొత్త రాష్ట్రం ఏర్పడినా వ్యాపార లావాదేవీలపై పెద్దగా ప్రభావం లేకపోవడంతో మొదట్లో వెనుకడుగు వేసిన సంస్థలు పన్నుల చెల్లింపులకు సిద్దమయ్యాయి. దీంతో తాజాగా పన్నుల చెల్లింపులు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం అత్యధికంగా వాణిజ్య పన్నుల శాఖ నుంచే సమకూరుతోంది. వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ నగర రాబడి అత్యంత కీలకం. ఉమ్మడి రాష్ట్ర రాబడిలో సైతం 74 శాతం వరకు నగరం నుంచే జమ అయ్యేది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రధానమైనది. ఇదేకాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంతవరకు రాబడి లభిస్తోంది. మొత్తం మీద వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతానికిపైగా, 15 శాతం మిగితా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. నగర రాబడి ఇలా.. తెలంగాణ రాష్ర్ట ఖజానాకు మహానగరం వాణిజ్య పన్నుల శాఖలు కల్పతరువనే చెప్పాలి. నగరంలోని డివిజన్ల నుంచే అత్యధిక రాబడి వస్తోంది. రాష్ట్రం మొత్తంలో 12 డివిజన్లు ఉండగా అందులో ఏడు డివిజన్లు నగర పరిధిలోనే ఉన్నాయి. మొత్తం డివిజన్లకు కలిపి వివిధ పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు) వరకు లభించిన ఆదాయం రూ.3,000.74 కోట్లు కాగా, అందులో నగరంలోని డివిజన్లు నుంచి లభించిన రాబడి మొత్తం రూ.2,493.68 కోట్లకుపైనే. అందులో పంజగుట్ట డివిజన్ నుంచి రూ.500.68 కోట్లు, బేగంపేట నుంచి రూ. 444.02 కోట్లు, అబిడ్స్ నుంచి రూ.421.84 కోట్ల వరకు రాబడి వసూలైనట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతాయి. -
అవినీతి ‘గనులు’
వెంకోజీపాలెం,న్యూస్‌లైన్: గనులు, భూగర్భ శాఖలో ఏసీబీ దాడులు ప్రకంపనలు సృష్టించాయి. గనులు,భూగర్భశాఖ విజిలెన్స్ విభాగ సహాయ సంచాలకుడు సుబ్రహ్మణ్యం అవినీతి నిరోధకశాఖకు చిక్కడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఏసీబీ వలలో పెద్ద చేప చిక్కడంతో అవినీతి అధికారులు గతుక్కుమన్నారు. విశాఖ నగరంలో ఏడీ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. మూడేళ్ల క్రితం అనకాపల్లి ఏడీ ఏసీబీకి చిక్కారు. వివాదాస్పదుడైన సుబ్రహ్మణ్యం ఇక్కడ విధుల్లో చేరగానే తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇసుక లారీలను చూసీచూడనట్టు వదిలేయండని సిబ్బందిని ఆదేశించిన వైనాన్ని ‘సాక్షి’ గతంలో వెలుగులోకి తీసుకు వచ్చింది. అయితే గనులశాఖలో అవినీతి తాండవం బహిరంగ రహస్యమే. గనులు, క్వారీల తవ్వకాల కోసం సంబంధిత శాఖ అనుమతులు అవసరం. ముందుగా తహశీల్దార్ కార్యాలయాల నుంచి ఎన్ఓసీలు తీసుకుని, దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు ఉన్నా సరే గనుల స్థాయి ఆధారంగా ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. లేదంటే దరఖాస్తులు పక్కన పడేసి కొర్రీలు వేస్తుంటారని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. నగరంలో గనులశాఖకు జోనల్ జాయింట్ డెరైక్టర్ ,రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్, విజిలెన్స్ విభాగ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల తరువాత గనుల శాఖ నుంచే అధిక శాతం ఆదాయం వస్తుంది. గనుల శాఖ కాంట్రాక్టర్ల అవసరాలను ఆసరాగా తీసుకుని గనుల శాఖ సిబ్బంది, అధికారులు కాంట్రాక్టర్లను వేధిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టందే ఏ పనీ కాదని బహిరంగంగానే చెబుతారు. క్వారీలు లీజుకు తీసుకున్నాక సరిహద్దులు దాటి తవ్వకాలు సాగించినా చూసీచూడనట్టు వ్యవహరించడానికి కాంట్రాక్టర్లనుంచి ముడుపులు స్వీకరిస్తారని అంటారు. ఏటా గనుల శాఖ, విజిలెన్స్ విభాగం విధించే జరిమానాల కన్నా నిఘా ,అమలు విభాగం (విజిలెన్స్) అధికారులు నమోదు చేసే కేసులే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. గనులశాఖలో ఉన్నతాధికారులతోపాటు ఇతర సిబ్బంది కూడా మామూళ్ల బాట పడుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గనులశాఖ విశాఖ ఏడీ పరిధిలో 22 మండలాలు వున్నాయి. ఈ మండలాలలో ఫాస్పేట్, లేట్రైట్, క్వార్ట్జ్ వంటి ప్రధానమైన ఖనిజ గనులు; నిర్మాణానికి అవసరమయ్యే రాళ్లు, ఇసుక ఇచ్చే మెనర్ మైన్స్ క్వారీలు,గనులు 130కి పైగా ఉన్నాయి. గనులు, క్వారీ లీజుల కోసం ప్రతినెలా పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.లీజు రావాలన్నా, లీజులు కొనసాగించాలన్నా ముడుపులు తప్పనిసరన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపున విశాఖలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా గనులశాఖ అధికారులకు కాసుల పంట పండిస్తోంది. పట్టుకున్న లారీలను వదియాలంటే వేలల్లో లంచాలు ఇవ్వాల్సిందేనన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. -
8వ రోజూ కొనసాగిన ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
కాకినాడ: పట్టణంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమైక్యాంధ్ర ఆందోళనలో 8వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ శిబిరాన్ని సందర్శించారు. ఈ ఉద్యమం ఉద్యోగుల సమస్యలపై కాదని, ప్రజల ఆకాంక్ష ప్రకరమే చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు విజయకుమార్, కోశాధికారి రామనాథం తదితరులు మాట్లాడారు. వాణిజ్య పన్నుల శాఖ నిఘా విభాగం ఉద్యోగులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగ సంఘాలు కూడా తోడవడంతో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు.