ఆదాయానికి గండి | Wonders in the commercial tax department | Sakshi
Sakshi News home page

ఆదాయానికి గండి

Published Wed, Mar 1 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

Wonders in the commercial tax department

వ్యాపారులకు అధికారుల ‘సహకారం’
లెక్కల విషయంలో ఉదాసీనత
అడ్రస్‌లేని చాలన్ల రిజిస్టర్‌
ఏళ్లుగా నమోదును మరిచిన అధికారులు
వాణిజ్య పన్నుల శాఖలో వింతలు


వరంగల్‌ : వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇదే తరహా వ్యవహారాలు వరంగల్‌ వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌లోనూ కొన్నిచోట్ల జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య పన్నులను వంద శాతం వసూలు చేసేందుకు రూపొందించిన వ్యవస్థను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌ పరిధిలో 11 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వరంగల్, బీట్‌ బజార్, రామన్నపేట, ఫోర్టు రోడ్డు, మహబూబాబాద్, జనగామ, నర్సంపేట, ఖమ్మం–1, ఖమ్మం– 2, ఖమ్మం–3, కొత్తగూడెం సర్కిళ్లు ఉన్నాయి. వీటికి కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి(సీటీఓ) నేతృత్వం  వహిస్తారు. సర్కిళ్ల పరిధిని బట్టి ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీటీవోలు, నలుగురు నుంచి ఆరుగురు వరకు అసిస్టెంట్‌ సీటీవోలు పనిచేస్తారు. మొత్తంగా వరంగల్‌ డివిజన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయ స్థాయిలో ఆదాయం రావాల్సి ఉంది. కానీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తీరుతో ఆశించిన ఆదాయం రావడంలేదు. వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది వ్యాపారస్తులకు ‘సహకారం’ అందిస్తుండడంతో ఈ డివిజన్‌లో జరుగుతున్న వ్యాపారానికి, ఆదాయానికి పొంతన కుదరడం లేదు.

చాలన్ల రూపంలో పన్నులు
వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారస్తులు చెల్లించే పన్ను మొత్తాన్ని చాలన్ల రూపంలో ఇస్తారు. వాణిజ్య పన్నుల శాఖలో చాలన్లు ఇవ్వడంతోపాటు ఈ మొత్తాన్ని ఖాజానా శాఖ కార్యాలయంలో చెల్లింపులు జరపాలి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు... చాలన్లను, ఖాజానాలో చెల్లించే మొత్తాన్ని సరిచూసి ప్రతి నెలా ప్రభుత్వానికి వివరాలు పంపాలి. ఖజానా శాఖ అధికారి ధ్రువీకరించిన వివరాల ప్రకారం... వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపారుల వారీగా చెల్లింపులను పరిశీలించి బకాయిలు ఉంటే ప్రత్యేక జాబితా రూపొందించాలి. బకాయిలు ఉన్న వ్యాపారులకు నోటీసులు పంపి ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, వాణిజ్య పన్నుల శాఖలో బకాయిల వివరాలను నమోదు చేయకుండా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. వ్యాపారులు సమర్పించిన చెక్కులు బౌన్స్‌ అయిన సందర్భాల్లో వారిపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా ఇది కూడా జరగడం లేదని తెలుస్తోంది. వ్యాపారుల వారీగా ఆధారిత పన్ను(వ్యాట్‌), సీఎస్‌టీ (సెంట్రల్‌ సేల్‌ ట్యాక్స్‌) వివరాలను నిర్ధారించేటప్పుడు రికార్డులు పరిశీలించకుండానే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వ్యాపారులు చెప్పిన లెక్కలనే అధికారులు నమోదు చేసి వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తక్కువగా నమోదు చేసిన అధికారులను వ్యాపారులు బాగా చూసుకుంటున్నారు. అధికారులు, వ్యాపారులు కలిసి చేస్తున్న వ్యవహారాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో భారీగా కోత పడుతోంది.

ఏళ్లుగా ఇదే...
వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయానికి సంబంధించిన గణాంకాలను పేర్కొనే వ్యవస్థ కొన్ని సంవత్సరాలుగా గాడి తప్పిందని తెలుస్తోంది. వ్యాపారుల వారీగా సమర్పించిన చాలన్లు వివరాలను ప్రతీరోజు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రత్యేక రిజిస్టర్‌(పుస్తకం)లో నమోదు చేయాలి. చాలన్ల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయడం వల్ల ట్రెజరీలో సమర్పించిన మొత్తాన్ని సరిచూసే అవకాశం ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌లో కొన్నేళ్లుగా చాలన్ల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసే ప్రక్రియ జరగడం లేదని తెలిసింది. డివిజన్‌ పరిధిలోని మొత్తం 11 సర్కిల్‌ కార్యాలయాల్లోనూ చాలన్ల నమోదు రిజిస్టర్లు సైతం లేవని తెలుస్తోంది. చాలన్ల నమోదు రిజిస్టర్‌ లేకపోవడంతో వ్యాపారులు ఖజానా శాఖలో చెల్లించే మొత్తం, వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించే చాలన్లలో పేర్కొనే మొత్తానికి భారీగా వ్యత్యాసం ఉంటోందనే అభిప్రాయం ఉంది. ఖాజానా శాఖలో జమ అయిన మొత్తం ఎంతనేది పరిశీలించకుండానే చాలన్లను ఆమోదిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ బోధన్‌ సర్కిల్‌లో జరిగిన వ్యవహారంతో వెలుగు చూసింది. ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. పాత వివరాలను సరిచేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement