
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలోను వాణిజ్యపన్నుల శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఆదాయంలో దేశంలో 4వ స్థానంలో నిలిచిందని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో వాణిజ్యపన్నుల శాఖ రూ.55,935.13 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆదాయం 2020–21లో రూ.44,178.51 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం చక్కటి ఫలితాలను ఇస్తోందని, దీనికి మద్యంపై తగ్గుతున్న వ్యాట్ ఆదాయమే నిదర్శనమని పేర్కొన్నారు. 2019–20లో రూ.10,403.84 కోట్లు ఉన్న మద్యంపై వ్యాట్ ఆదాయం 2020–21లో 41 శాతం తగ్గి రూ.6,161.43 కోట్లకు పరిమితమైందని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ మార్చి వరకు జీఎస్టీ పాత బకాయిల వసూళ్లకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని, ఈ డ్రైవ్ ద్వారా రూ.1,772 కోట్లు వసూలైందని వివరించారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు, అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. కోవిడ్–19తో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మందగించినప్పటికీ సీఎం జగన్ పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకం రాకుండా చూస్తున్నారని తెలిపారు. వారి కుటుంబంలో సభ్యుడిగా ఆయా పథకాలను వారికి అందిస్తున్న సీఎం జగన్ పేదల పక్షపాతిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment