సాక్షి ప్రతినిధి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖ అధికారుల భారీ అవినీతి కేసులో ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసింది. దీన్లో భాగంగానే ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నలుగురు ఉద్యోగుల ఇళ్లతోపాటు పరారీలో ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణకు చెందిన ఇళ్లల్లో మంగళవారం ఏకకాలంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రెండు ఇళ్లు, కృష్ణాజిల్లా కానూరులో రెండు, గుడివాడలో ఒక ఇల్లు, హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఒక ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం, సిటీ టాస్‌్కఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించారు. కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లతోపాటు జీఎస్టీ అధికారులు బలిజేపల్లి మెహర్‌కుమార్, కంచర్లకోట సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కావూరి వెంకటచలపతి, సబార్డినేట్ మరీదు సత్యనారాయణ ఇళ్లల్లో ఈ సోదాలు చేశారు. వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదుతో గత నెలలో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది.
ఈ ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.. నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, వారికి కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే. ఈ నలుగురు అధికారులు పాల్పడిన వందల కోట్ల రూపాయల అవినీతి వెనుక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆయనపైనా కేసు నమోదు చేశారు.
విలువైన ఆస్తిపత్రాలు, ఫైళ్లు, సొత్తు స్వాదీనం
విజయవాడ సత్యనారాయణపురం పాపరాజు వీధిలోగల సాయిరత్న టవర్స్‌లోని బలిజేపల్లి మెహర్‌కుమార్ ఫ్లాట్‌లో, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఆశ్రిషి రెసిడెన్సిలోని కంచర్లకోట సంధ్య ఫ్లాట్‌లో, గుడివాడ సమీపంలోని బేతపూడి గ్రామంలో కావూరి వెంకటచలపతి ఇంట్లోను, కానూరులో మరీదు సత్యనారాయణ ఇంట్లోను, విజయవాడ సత్యనారాయణపురంలోను, హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లల్లో సోదాలు చేశారు.
డీసీపీ విశాల్‌గున్ని పర్యవేక్షణలో సెంట్రల్ ఏసీపీ పి.భాస్కరరావు నేతృత్వంలో ఆరు బృందాలు ఈ తనిఖీలు చేశాయి. ఐదుగురు నిందితులు అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు, విలువైన సమాచారం ఉన్న ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, వాణిజ్యపన్నుల కార్యాలయంలో కనిపించకుండాపోయిన ఫైళ్ల వివరాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. మరిన్ని విలువైన ఆస్తిపత్రాలు, కేసుకు సంబంధించిన మరిన్ని ఫైళ్ల కోసం సోదాలు కొనసాగిస్తామని చెప్పారు.
సోదాల్లో స్వాదీనం చేసుకున్న సొత్తును న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు రిమాండ్‌లో ఉండగా.. కీలక సూత్రధారి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూర్యనారాయణ పాల్పడిన అవినీతే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment