ఇంత మొత్తం సంపాదించాలని ప్రభాకర్ లక్ష్యం
100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ..
ఈ మేరకు అతడి ఛాతీపై రెండు పచ్చ బొట్టు
స్నేహితుల పేర్లతో హైఎండ్ కార్లు ఖరీదు
వెలుగులోకి వస్తున్న దోపిడీ దొంగ వ్యవహారం
గచ్చిబౌలి: ఎప్పటికైతే తాను రూ.333 కోట్లు సంపాదిస్తాడో అప్పటి నుంచి నేరాలు మానేయాలని భావించాడు బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టూ. దీంతో పాటు తన జీవితంలో 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ మేరకు కొన్నేళ్ల క్రితమే తన ఛాతీపై రెండు వైపులా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపింది ఇతగాడే. సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా..
చదివింది ఎనిమిదో తరగతి..
పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయసు నుంచే చోరీల బాట పట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్‌లో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులున్న ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారుపేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్‌కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
రూ.3 వేల చోరీతో మొదలుపెట్టి...
బత్తుల ప్రభాకర్ ఛాతీ భాగంలో కుడి వైపు 3, ఎడమ వైపు 100 అంకెలు, మధ్యలో సిలువ టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై పోలీసులు అతగాడిని ప్రశ్నించారు. కొన్నేళ్ల క్రితం తన నేర జీవితం రూ.3 వేల నుంచి చోరీ మొదలైందని, అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ‘3’ టాటూ వేయించుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రూ.333 కోట్ల సంపాదన లక్ష్యంగా చేసుకున్నానని బయటపెట్టాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాస వంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 అలా ఉన్నట్లు చెప్పాడు.
గేటెడ్ కమ్యూనిటీలో నివాసం..
అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇతగాడు గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముసుగులో ఆ రంగానికి చెందిన వారితో కలిసి మైండ్‌స్పేస్ సమీపంలోని ఫ్లాట్‌లో ఉన్నాడు. ప్రస్తుతం నార్సింగి పరిధిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఒడిశాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమె సొంత ఊరుకు వెళ్లింది. పోలీసులు నిందితుడి ఫ్లాట్‌ను తనిఖీ చేసినప్పుడు రూ.50 వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ లభించింది. ప్రతిరోజూ ఉదయం జిమ్‌కు వెళ్లడం, వీకెండ్స్‌లో పబ్స్‌లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్.. సెకండ్ హ్యాండ్ వాటిని స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు.
స్నేహితులకూ భారీగా ముట్టచెబుతూ...
ఫ్లాట్‌లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ చేసిన నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్‌తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment