సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రభాకర్ నుంచి ఘటన స్థలంలోనే రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో బస చేసిన ప్రభాకర్.. వైజాగ్ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. జైలులో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్ర పన్నినట్లు సమాచారం.
కాగా, కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి బుల్లెట్ గాయమైంది. ఏపీలోని చిత్తూరు జిల్లా సోముల గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్.. ఏపీ, తెలంగాణలో అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అతడిపై రెండు రాష్ట్రాలలో 70కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: 13 ఏళ్లకు పట్టుబడ్డాడు!
సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే 16 చోరీ కేసులున్నాయి. 2023 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రభాకర్ తరచు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌కు వెళ్తున్నాడని గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకట్‌రెడ్డి, వీరస్వామి, ప్రదీప్‌రెడ్డి ప్రిజం పబ్ వద్ద కాపు కాశారు. ప్రభాకర్ పబ్ వద్దకు రాగానే నిర్బంధించేందుకు ప్రయత్నించాడు.
దీంతో అతడు తనవద్ద ఉన్న దేశీయ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ వెంకట్‌రెడ్డి ఎడమ పాదంలోంచి దూసుకెళ్లింది. అయినా వెనుకడుగు వేయకుండా పబ్‌లోని బౌన్సర్ల సాయంతో మిగిలిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ప్రభాకర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వినీత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment