
వైఎస్ జగన్ రాకతో కిక్కిరిసిన విజయవాడ గాంధీనగర్
బారికేడ్లు తోసుకొని మరీ వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు
కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పోలీసులు
అందరినీ పలకరించిన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభిమాన నేత వస్తున్నారని తెలిసి విజయవాడ గాంధీనగర్ జనంతో పోటెత్తింది. అక్రమ కేసులో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలుసుకొనేందుకు గాంధీనగర్‌లోని జైలు వద్దకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూసేందుకు బెజవాడ మొత్తం తరలివచ్చిందా అన్నంతగా జనం వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఉదయం 10 గంటలకే గాంధీనగర్ కిక్కిరిసిపోయింది. దీంతో పోలీసులు జైలు ప్రాంగణానికి అన్ని వైపులా 100 మీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు.
అయినా అభిమాన నేత వైఎస్ జగన్ వచ్చే వరకు బారికేడ్ల ముందే జనం నిరీక్షించారు. ఆయన జైలు పరిసరాల్లోకి చేరుకోగానే అభిమానులు, మహిళలు జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకురికారు. బారికేడ్లను తోసుకొని జైలు ప్రాంగణానికి నలువైపులా ఉన్న దారుల్లోకి చొచ్చుకొచ్చారు. ఊహించనంతగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, జగన్ అభిమానులు రావడంతో పోలీసులు వారిని నియంత్రించలేక చేతులెత్తేశారు.
వైఎస్ జగన్ వాహనంలో నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేయగానే కేరింతలు కొట్టారు. వంశీతో ములాఖత్ అనంతరం తిరిగి వెళ్లే సమయంలోనూ జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు తోసుకురావడంతో వాహనం ముందుకు కదలడం కూడా కష్టంగా మారింది. ఓ దశలో జగన్ సెక్యూరిటీ కూడా వారిని నియంత్రించడానికి తీవ్రంగా కష్ట పడాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వారందరినీ ఓపిగ్గా పలకరిస్తూ ముందుకు కదిలారు.

Comments
Please login to add a commentAdd a comment