- తొలిరోజు మార్కెట్‌పై జీఎస్టీ ప్రభావం
- కాఫీ నుంచి చెప్పుల వరకు రేట్లు పెంపు
- పలుచోట్ల మూతబడిన దుకాణాలు
- పాత సరుకుపై కొత్త పన్ను చేర్పు
- జీఎస్టీ లేనివాటిపై వ్యాపారుల దోపిడీ
- అవగాహనలేక నష్టపోతున్న ప్రజలు
తిరుపతిలోని ఓ చిన్న హోటల్‌లో రోజూ రూ.పది విలువ చేసే వడను జీఎస్టీ అమల్లోకి వచ్చిందంటూ రూ.12కు విక్రయించారు. చిత్తూరులోని ఓ మాల్‌లో రోజూ శీతల పానీయాలపై ఎమ్మార్పీ కంటే 2 శాతం తక్కువకు విక్రయించే వారు. ఇప్పుడు ఎమ్మార్పీకి తగ్గదని అమ్ముతున్నారు. ఎప్పుడో ఉత్పత్తి అయిన చెప్పులపై రూ.500 ధర దాటిందని మదనపల్లెలో 18 శాతం ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. అడిగితే జీఎస్టీ ప్రభావమని చెబుతున్నారు. తొలిరోజు మార్కెట్‌లో గందరగోళం ఏర్పడింది.
సమస్యా.. ఫోన్ చేయండి 8978500223
జీఎస్టీ పేరు చెప్పి ఇçష్టప్రకారం వస్తువుల రేట్లు పెంచేస్తే ఒప్పుకునేదిలేదు. అసలు ఏయే వస్తువులపై ఎంతెంత ధరలు పెరిగాయో దుకాణాల వద్ద బోర్డులు పెట్టాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు వస్తువులు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సమస్యలుంటే మా ఫోన్ నంబరుకు ఫిర్యా దు చేయండి.
– కిరణ్‌చౌదరి, సహాయ కమిషనర్, వాణిజ్య పన్నులశాఖ, చిత్తూరు.
సాక్షి, తిరుపతి/చిత్తూరు (అర్బన్) : జీఎస్టీ అమలులోకి వచ్చాక తొలిరోజు (శనివారం) మార్కెట్లో సామాన్యులకు, వ్యాపారులకు చుక్కలు కని పించాయి. ఈ పన్నుపై అవగాహన లేకపోవడంతో కొంద రు వ్యాపారులు ధరలు పెంచి విక్రయించారు. కొన్నిచోట్ల షాపులు మూతబడ్డాయి. మరికొన్ని వెలవెల బోయాయి. జిల్లాలో జీఎస్టీ పరిధిలో 14 వేల మంది వ్యాపారులున్నా రు. రూ.20 లక్షల వార్షిక లావాదేవీలు కలిగి ఉన్న వ్యాపారులు మాత్రమే దీని పరిధిలోకి వస్తారు. వీరంతా వాణిజ్య పన్నుల శాఖలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. పరిధిలోకి రాని వ్యాపారుల సంఖ్య రెండు లక్షలుంటుంది. ప్రస్తుత వ్యాపారాల్లో సింహభాగం వీరిదే. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికే దుకాణాల్లోని పాత ఉత్పత్తులపై ధరలను పెంచకూడదు. పాత స్టాకు పూర్తయ్యి జూలై 1 నుంచి ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెట్‌లోకి వస్తే మాత్రమే జీఎస్టీ ధరల శ్లాబులు వర్తిస్తాయి. కానీ జిల్లాలోని పెద్ద పెద్ద మాల్స్ నుంచి చిన్నపాటి చిల్లర దుకాణాల్లో కూడా జీఎస్టీ పేరు చెప్పి వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు.
అవగాహన లేమి..
జీఎస్టీపై చాలామందికి ఇప్పటివరకూ పూర్తి్త స్థాయిలో అవగాహన రాలేదు. ఇదే వ్యాపారులకు లాభం తెచ్చిపెడుతోంది. జీఎస్టీలో ఏయే వస్తువుల ధరలు పెరిగాయో చూపెడుతూ వాటిపై ధరలు పెంచేస్తున్నారు. ఇదే సమయంలో ధరలు తగ్గిన వాటిపై మాత్రం ఎలాంటి తగ్గింపు ఇవ్వడంలేదు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై జీఎస్టీపై ఫిర్యాదుల విభాగం, టోల్‌ఫ్రీ నంబర్లు పెడితే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి వ్యాపారికీ కంప్యూటర్ తప్పనిసరి..
జీఎస్టీతో ప్రతి వ్యాపారికీ కంప్యూటర్ తప్పని సరైంది. చిరు, మధ్యతరగతి వ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయి. రోజుకు రూ.60వేల నుంచి రూ.70వేలు సగటున టర్నోవర్ ఉన్న వ్యాపారి రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. బిల్లులు, అకౌంట్స్ నిర్వహణ తప్పనిసరి. ప్రహసనంతో కూడుకున్న పని కావటంతో గతంలో వలే వ్యాపారులు చిట్టా పద్దులు పుస్తకంలో రాసుకుంటే కుదరదు. తప్పనిసరిగా కంప్యూటర్ కొనుగోలు చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకుని కన్సల్‌టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు రూ.10వేలు అదనపు భారం పడే అవకాశం ఉంది. వ్యాపారి ఎక్కడైనా పొలం కౌలుకు అప్పగించి ఉంటే అదనపు ఆర్థిక భారం తప్పేట్టు లేదు. జీఎస్టీ నిబంధనల ప్రకారం ఈ రెండింటి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని తప్పనిసరి పన్ను చెల్లించాల్సి ఉంటుం దని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దుకాణాలన్నీ వెలవెలబోవటం కనిపించింది.