
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని గణనీయంగా పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31 నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్(కంపెన్సేషన్ సెస్-రాష్ట్రాలకు చెల్లించె పన్ను విధానం)ను దశలవారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత పన్నులు ఇలా..
ప్రస్తుతం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు విధిస్తున్నారు. దాంతో మొత్తం పన్ను భారం 53 శాతంగా ఉంది. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 75% పన్ను విధానం కంటే తక్కువగానే ఉంది. ఈ ఉత్పత్తులపై 5 శాతం జోడించే పరిహార సెస్‌ను నిలిపివేయాలని యోచిస్తున్నారు. అదే సమయంలో మరింత భారీగా పన్నులు విధించాలని చూస్తున్నారు.
ప్రతిపాదిత మార్పులు
పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. పరిహార సెస్ నిలిపేసిన తర్వాత ఈ ఉత్పత్తుల నుంచి పన్ను ఆదాయం తగ్గకుండా ఇది తోడ్పడుతుంది. 2026 అనంతరం పరిహార సెస్ పరిస్థితులను సమీక్షించడానికి, ప్రత్యామ్నాయ పన్ను పద్ధతులను అన్వేషించడానికి కౌన్సిల్ ఇప్పటికే మంత్రుల బృందాన్ని నియమించింది. ఈ బృందం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
ప్రజారోగ్యం, ఆర్థిక ప్రభావం
పొగాకు ఉత్పత్తులను ‘హానికారక వస్తువులు’గా పరిగణిస్తున్నారు. వీటిపై అధిక పన్నులు విధిస్తే వినియోగం తగ్గుతుందనేది ప్రభుత్వం భావన. కాగా, పొగాకు, పొగాకు ఉత్పత్తుల ద్వారా 2022-23లో ప్రభుత్వానికి రూ.72,788 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నులు మరింత పెంచితే ఆదాయం కూడా అధికమవుతుంది. ప్రతిపాదిత పన్ను పెంపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా పొగాకు వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
సవాళ్లు ఇవే..
ప్రభుత్వం పన్నులను పెంచడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పొగాకు పరిశ్రమ, దానిపై ఆధారపడిన కార్మికుల స్థితిగతులు, వారి ఉపాధి ప్రభావితం చెందుతుందనే ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త సెస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సంకోచిస్తున్నాయి. జీఎస్టీను పరిగణించి పోగాకు ధరలు పెంచాలంటే సెస్‌ల విధింపే కీలకం కానుంది. దాంతో ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment