కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే వృద్ధి | Indias federal system has stood the test of time | Sakshi
Sakshi News home page

కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే వృద్ధి

Published Sat, Feb 1 2025 4:06 AM | Last Updated on Sat, Feb 1 2025 4:06 AM

Indias federal system has stood the test of time

రాజ్యాంగం ప్రవచించిన భారత సమాఖ్య విధానం కాల పరీక్షకు తట్టుకుని దృఢంగా నిలిచింది. అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయవ్యవస్థవంటివి సమాఖ్య లక్షణాలు. వీటిని బల మైన కేంద్ర ప్రభుత్వం, అత్యవసర సంద ర్భాలకు అనువైన నిబంధనలు, కేంద్ర నియమిత గవర్నర్ల వ్యవస్థలతో అనుసంధానం చేశారు. ఎంతో నేర్పుగా జరిగిన ఈ మేళవింపు ఒక అద్భుతం. కాబట్టే... పలు ప్రాంతీయ అస్తిత్వాలు, మరెన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఇంత పెద్ద దేశ పరిపాలన సుసాధ్యమైంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించగలిగాం. 

ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ...
కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఉద్రిక్తతలు లేవని కాదు. ఉన్నాయి. అయితే ఏ సమాఖ్య దేశంలో ఇవి లేవు? కెనడాలో సుదీర్ఘకాలంనుంచీ క్యుబెక్‌ వేర్పాటు ఉద్యమం నడుస్తోంది. క్యాటలన్‌ స్వాతంత్య్ర ఉద్యమంతో స్పెయిన్‌ సతమతమవుతోంది. అమెజాన్‌ అడవుల నరికివేత సమస్య బ్రెజిల్‌ కేంద్ర–రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తోంది. 

ఇక నైజీరియా, ఇథియోపియాలు అక్కడి జాతుల ఘర్షణతో అట్టుడికి పోతున్నాయి. వనరుల పంపకంలో తలెత్తిన అసంతృప్తి జ్వాలలు చివరకు ఇండోనేషియా నుంచి ఈస్ట్‌ తిమోర్‌  వేరుపడేందుకు దారి తీశాయి. వీటితో పోల్చి చూసుకుంటే, మన ఉద్రిక్తతలు అదుపు తప్ప కుండా మనం సర్దుకుపోగలుగుతున్నాం. మన రాజ్యాంగం ఏర్పర చిన ‘చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌’ ఇందుకు కారణం. 

మన సమాఖ్య విధానం కాలానుగుణ మార్పులను తనలో ఇముడ్చుకుంటూ సాగిపోతోంది. అయితే, మన సహకార సమాఖ్య విధానం... పోరాట సమాఖ్య విధానం దిశగా జరిగిపోయింది. ఇదొక అపశ్రుతి. తమ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ప్రాంతీయ పార్టీలు, జాతీయ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు భావిస్తు న్నాయి. కేంద్ర వైఖరి పట్ల అక్కడ వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇది రాజకీయ కోణం.    

ఆర్థిక కోణం నుంచి చూస్తే, ఈ చీలిక మరీ తీవ్రంగా ఉంది.కేంద్ర నిధుల బదలాయింపులు తగినంతగా ఉండటం లేదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తమ సొంత ఆదాయాలకు తమ వ్యయ బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరుతున్నాయి. అంతేకాదు, కేంద్రం ఇచ్చే నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశంలో వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండటం లేదు. దీనికి తోడు, అవి ఎంత అప్పు చేయాలో, ఎవరి నుంచి తీసుకోవాలో కూడా కేంద్రం నిర్ణయిస్తోంది. 

రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు!
ఈ వాదన చర్చనీయం. ఆర్థిక సమాఖ్య విధానం అత్యుత్తమ మైంది కాదనుకున్నా, నిధుల బదిలీ ఏర్పాట్లు రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయనడం సరికాదు. ఎలానో ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రాజ్యాంగం ఒరిజినల్‌గా నిర్దేశించిన ప్రకారం, రాష్ట్రాలకు రెండే రెండు కేంద్ర పన్నుల్లో వాటా లభించాల్సి ఉంటుంది.. ఒకటి వ్యక్తిగత ఆదాయ పన్ను, రెండు కేంద్ర ఎక్సయిజ్‌ సుంకాలు. 

2000 సంవత్సరంలో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఏర్పాటును రాష్ట్రాలకు అనుకూల రీతిలో మార్చారు. దీని ప్రకారం, కేవలంరెండు పన్నుల్లోనే కాకుండా కేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో వాటికి వాటా దక్కింది. అలాగే, ప్రణాళికా సంఘం రద్దుతో రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సైతం పెరిగింది. 

వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి రావడంతో మరో యుద్ధానికి తెరలేచింది. తమ ప్రయోజనాలను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ దీన్ని తీసుకు వచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది. కొత్త పన్నులు వేయడంలో వాటికి ఉన్న స్వేచ్ఛను కొంత కోల్పోయిఉండొచ్చు. కేంద్రం కూడా అలాగే కోల్పోయిందని గుర్తుంచుకోవాలి. క్రమేణా, జీఎస్టీ వల్ల పన్ను పరిధి విస్తరిస్తుంది. ఎగవేతలకు బ్రేక్‌ పడుతుంది. తద్వారా కేంద్రం, రాష్ట్రాలు రెండూ ప్రయోజనంపొందుతాయి.
 
ఆర్థిక సమాఖ్య విధానం నిబంధనలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయన్న రాష్ట్రాల భావన వాస్తవం కాదు. అదే సమయంలో, రాష్ట్రాల ఆర్థిక సవాళ్ల పట్ల కూడా కేంద్రం ఎంతో సానుభూతి కనబరచాలి, వాటితో సంప్రదింపులకు ఎఫ్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే ఇలా జరుగుతోందా? ఉదాహరణకు, కేంద్రం పన్నులుపెంచడానికి బదులు సెస్సులు, సర్‌ఛార్జ్‌లు పెంచుకుంటూపోతోంది. 

కేంద్రం విధించే అన్ని పన్నుల నుంచీ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటూ 2000 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి జాతీయ పన్ను ఆదాయంలో న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.

2047 గేమ్‌ ప్లాన్‌?
ఆర్థిక గురుత్వ కేంద్రం రాష్ట్రాల దిశగా జరిగిందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఉజ్జాయింపు అంచనా ప్రకారం, కేంద్రం ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు (కేంద్రం, రాష్ట్రాలవి కలిపి) 60 శాతంఉండగా, ఉమ్మడి వ్యయాల్లో కేంద్రం వాటా 40 శాతం మాత్రమే ఉంటోంది. రాష్ట్రాల విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగు తోంది. వాటన్నిటి ఉమ్మడి రెవెన్యూ వసూళ్లు కలిసి 40 శాతం కాగా, ఖర్చు మాత్రం 60 శాతం చేస్తున్నాయి. దీని అర్ధం ఏమిటంటే, దేశ స్థూల ఆర్థిక సుస్థిరత, తద్వారా పెట్టుబడులు పెంచే సామర్థ్యం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. 

2047లో మనం వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటాం. అప్పటికి ఇండియా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరుతున్నాం. ఆ స్థాయికి చేరడానికి మన ముందున్న ఎజెండా కూడా అంత పెద్దది, సంక్లిష్టమైంది. కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడి వ్యూహంతో ముందడుగు వేస్తే తప్ప మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించలేం. ఆర్థిక వ్యవస్థ ఉత్పా దకతను మెరుగు పరచుకోవడానికి అవసరమైన రెండో తరం సంస్క రణలను అమలు చేయడం మన గేమ్‌ ప్లాన్‌లో భాగం అయితీరాలి. 

1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. ఇవన్నీ తన పరిధిలోనివే కాబట్టి, వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్ర దించాల్సిన అవసరం లేకపోయింది. రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన ఈ సంస్కరణలు భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతి మాత్రమే కాదు, అమలులో చురుకైన భాగస్వామ్యం కూడా కావాలి. రాజ్యాంగం ద్వారా మన కోసం మనం చేసిన ప్రతిజ్ఞ నెర వేరాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్య కీలకం.

» వ్యాసకర్త భారత రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్,యేల్‌ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ఫెలో(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

»  2000లో చేసిన రాజ్యాంగ సవరణ వల్ల, రెండు (వ్యక్తిగత ఆదాయ పన్ను, ఎక్సయిజ్‌ సుంకాలు) పన్నుల్లోనే కాకుండాకేంద్రం వసూలు చేసే అన్ని పన్నుల్లో రాష్ట్రాలకు వాటా దక్కింది.

»  రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, కేంద్రం పరిమితంగానే సెస్సులు, సర్‌ఛార్జ్‌లు విధిస్తుందని భావించారు. అందుకు విరు ద్ధంగా జరుగుతోంది. వాటిలో తమకు వాటా రాదు కాబట్టి, ఇది తమను మోసం చేయడమేనని రాష్ట్రాలు బాధపడుతున్నాయి.

»  1990ల తొలితరం సంస్కరణలు పెట్టుబడులు, వాణిజ్యం, ఫైనాన్స్ రంగాల సరళీకరణపై దృష్టి సారించాయి. వీటిని ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవ సరం లేకపోయింది. కానీ రెండో తరం సంస్కరణలు అలా కాదు. ఇవి భూమి, కార్మికులు, పన్నులతో ముడిపడి ఉంటాయి. వీటికి రాష్ట్రాల సమ్మతే కాదు, వాటి చురుకైన భాగస్వామ్యం కూడా కావాల్సి ఉంటుంది.

» వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం తమ ప్రయోజనా లను హరించివేయడానికి తమ మెడలు వంచి మరీ తెచ్చారని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది వాటి హ్రస్వదృష్టి అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement