Duvvuri Subbarao
-
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
అంతర్జాతీయ షాక్‌లను తట్టుకోగలం
ముంబై: భారత్‌కు ఉన్న బలమైన విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ షాక్‌ల నుంచి రక్షణగా నిలవలేవు కానీ.. వాటిని ఎదుర్కోవడానికి సాయపడతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్‌కు బలమైన విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, అవి అంతర్జాతీయ కుదుపులకు రక్షణ అన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ షాక్‌ల (సంక్షోభాలు) నుంచి మనకేమీ రక్షణ లేదు. అంతర్జాతీయ షాక్‌ల ప్రభావం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కాకపోతే మనకున్న విదేశీ మారక నిల్వలతో వాటిని ఏదుర్కొని నిలబడొచ్చు. ఆ ఒత్తిళ్లను అధిగమించడానికి అవి సాయపడతాయంతే’’అని సుబ్బారావు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మానిటరీ పాలసీ సాధారణ స్థితికి చేరితే.. పెద్ద ఎత్తున విదేశీ నిధులు తిరిగి వెళ్లిపోతాయని చెప్పారు. అప్పుడు మారక రేటు అస్థిరతలను నియంత్రించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చన్నారు. నాస్డాక్లో హెల్త్‌కేర్ ట్రయాంగిల్ లిస్టింగ్ ముంబై: క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సెక్యూర్‌క్లౌడ్ టెక్నాలజీస్ తాజాగా తమ అనుబంధ సంస్థ హెల్త్‌కేర్ ట్రయాంగిల్‌ను అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజీ నాస్డాక్లో లిస్ట్ చేసింది. టెక్నాలజీ సంస్థలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజీలో లిస్ట్ కావడం వల్ల తమ సంస్థ ప్రాచుర్యం, విశ్వసనీయత మరింత పెరగగలవని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ త్యాగరాజన్ తెలిపారు. పబ్లిక్ ఇషఅయూ ద్వారా హెల్త్‌కేర్ ట్రయాంగిల్ 15 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు సెక్యూర్‌క్లౌడ్, హెల్త్‌కేర్ ట్రయాంగిల్ చైర్మన్ సురేష్ వెంకటాచారి తెలిపారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా పెట్టుబడుల అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైలో రిజిస్టరై, సిలికాన్ వేలీ కేంద్రంగా పనిచేస్తున్న సెక్యూర్‌క్లౌడ్ దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో చాలా కాలం క్రితమే లిస్టయ్యింది. లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలకు సేవలు అందించేందుకు 2019లో కాలిఫోరి్నయా ప్రధాన కార్యాలయంగా హెల్త్‌కేర్ ట్రయాంగిల్‌ను ప్రారంభించింది. బీఎస్ఈలో బుధవారం సెక్యూర్‌క్లౌడ్ షేరు 1.3 శాతం క్షీణించి రూ. 216 వద్ద క్లోజయ్యింది. -
తప్పని పరిస్థితుల్లోనే నగదు ముద్రణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నగదును ప్రత్యక్షంగా ముద్రించి ప్రభుత్వానికి ద్రవ్య పరమైన మద్దతు అందించవచ్చని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అయితే ఇక ప్రత్యామ్నాయంలేని తప్పని పరిస్థితుల్లోనే ఈ తరహా ప్రత్యక్ష నగదు ముద్రణ విధానాన్ని అవలంభించాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా పరిస్థితిని భారత్ ఎప్పుడూ ఎదుర్కొనలేదని కూడా వివరించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ బాండ్ల జారీ అంశాన్ని కేంద్రం పరిశీలించవచ్చని సూచించారు. దేశం కరోనా సవాళ్లలో ఉన్న నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి అభిప్రాయాలు ఇవీ... కోవిడ్ బాండ్లతో ప్రయోజనం ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం కరోనా బాండ్ల జారీ ద్వారా రుణ సమీకరణ అంశాన్ని పరిశీలించవచ్చు. బడ్జెట్లో పేర్కొన్న రుణ సమీకరణ ప్రణాళికకు అదనంగా... ‘కోవిడ్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణగా’ దీనిని పరిగణించవచ్చు. మార్కెట్ సమీకరణలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కోవిడ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లకు స్వల్పంగా అదనపు వడ్డీ ఇవ్వడం ద్వారా పొదుపరులను కోవిడ్ బాండ్లతో ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. మనీ సప్లై, ఆర్బీఐ ద్రవ్య లభ్యతా చర్యలకు దీనివల్ల ఎటువంటి అవరోధం ఏర్పడదు. ‘లాభాలు’... ఆర్బీఐ ధ్యేయం కాదు ప్రభుత్వ ద్రవ్య ఒత్తిడులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ మరిన్ని లాభాలను ఆర్జించడంపై దృష్టి పెట్టవచ్చు అనుకోవడం సరికాదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య సంస్థ కాదు. లాభార్జన దాని ధ్యేయాల్లో ఒకటి కాదు. తన కార్యకలాపాల్లో భాగంగానే ఆర్బీఐ కొంత లాభాలను ఆర్జిస్తుంది. ఇందులో తన వ్యయాలు పోను ‘మిగిలిన లాభాన్ని’’ కేంద్రానికి బదలాయిస్తుంది. తన వద్ద ఎంత మొత్తం ఉంచుకోవాలన్న అంశాన్ని బిమల్ జలాన్ కమిటీ సూచించింది. 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి రెండు రెట్లు రూ.99,122 కోట్లను కేంద్రానికి ఆర్బీఐ బదలాయించిన సంగతి తెలిసిందే. మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆర్బీఐ గడచిన ఏడాదిగా క్రియాశీలంగా, వినూత్నంగా వివిధ చర్యలను తీసుకుంటోంది. ఇప్పుడు ముద్రణ జరుగుతోంది, కానీ.. తన లోటును ప్రభుత్వం తగిన మార్గాల ద్వారా భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉత్పన్నమయినప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రత్యక్ష నగదు ముద్రణ వైపు మొగ్గుచూపవచ్చు. అయితే భారత్ ఎప్పుడూ ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి ఆర్బీఐ నగదు ముద్రణ చేయాలనే వారు ఒక విషయాన్ని గుర్తించడంలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు కూడా నగదు ముద్రణ జరుపుతోంది. అయితే ఇది పరోక్ష నగదు ముద్రణా విధానం. ఉదాహరణకు ఆర్బీఐ తన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎంఓ) కింద బ్యాంకర్ల నుంచి బాం డ్లను కొనుగోలు చేస్తుంది. లేదా విదేశీ మారకద్రవ్య నిల్వల(ఫారెక్స్) ఆపరేషన్ల కింద డాలర్లను కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులకు ఆర్బీఐ ముద్రణ జరుపుతుంది. ప్రత్యక్ష మనీ ప్రింట్‌తో ఇబ్బందులు ఇక ప్రభుత్వ ద్రవ్య లోటును భర్తీ చేయడానికి కరెన్సీ ప్రత్యక్ష ముద్రణకు పైన పేర్కొన్న దానితో పూర్తి వైరుధ్యం ఉంది. ఇక్కడ కరెన్సీ ముద్రణ ఎప్పుడు ఎంత జరగాలన్న అంశం ప్రభుత్వ రుణ ప్రణాళిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య సరఫరాపై ఆర్బీఐ తన నియంత్రణలను కోల్పోతుంది. దీనితోపాటు అటు ఆర్బీఐ ఇటు ప్రభుత్వ విశ్వసనీయ పరిస్థితులు కోల్పోయే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి కీలక మౌలిక ఆర్థిక గణాంకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫెడ్, ఈసీబీలతో పోల్చకూడదు... సవాళ్లను ఎదుర్కొనడంలో ఆర్బీఐ వంటి వర్థమాన దేశాల సెంట్రల్ బ్యాంకులకు, అమెరికా ఫెడరల్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి ధనిక దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒక సమస్యను ఎదుర్కొనడానికి ప్రత్యక్ష మనీ ప్రింట్‌సహా ఎటువంటి సాంప్రదాయేత నిర్ణయమైనా తీసుకోగలుగుతాయి. మనకు అటువంటి సౌలభ్యమైన పరిస్థితి ఉండబోదు. దీనికితోడు వర్థమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న మితిమీరిన నిర్ణయాలను మార్కెట్లు సహించబోవు. -
మొండి పద్దులు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. చాలా మటుకు బాకీలను దివాలా చట్టం వెలుపలే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీ మొండిబాకీల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు తప్పనిసరైన అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘అత్యంత జాగ్రత్తగా రూపొందించిన, విజయవంతంగా నిర్వహిస్తున్న బ్యాడ్ బ్యాంకులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో మలేషియాకు చెందిన దానహర్త కూడా ఒకటి. మనకంటూ బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకునే క్రమంలో దానహర్త మోడల్‌ను అధ్యయనం చేయవచ్చు’ అని దువ్వూరి చెప్పారు. దివాలా చట్టం (ఐబీసీ) కోడ్ కింద కేసులు ఇప్పటికే పేరుకుపోయాయని, కొత్తగా వచ్చేవి న్యాయస్థానాలపై మరింత భారంగా మారతాయని తెలిపారు. కాబట్టి ఐబీసీ పరిధికి వెలుపలే చాలా మటుకు బాకీల పరిష్కారం చోటు చేసుకోవాల్సి రావచ్చని పేర్కొన్నారు. దివాలా చట్టంతో మొండిబాకీల సమస్య పరిష్కారం కాగలదని, బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉండదని గతంలో భావించానని దువ్వూరి చెప్పారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ అభిప్రాయం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు. -
ఇది యాంత్రిక రికవరీయే..!
న్యూఢిల్లీ: ఆర్థిక రంగం కోలుకోవడం అన్నది యాంత్రికంగా చోటు చేసుకుంటున్నదే కానీ.. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థితికి చేరుకుంటున్నాయని ప్రభుత్వం భావించడం సరికాదంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి భారత్ వృద్ధి అవకాశాలు చూడ్డానికి బలహీనంగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. కరోనా వైరస్ రావడానికి పూర్వమే మన దేశ వృద్ధి రేటు 2017–18లో ఉన్న 7 శాతం నుంచి 2019–20లో 4.2 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘మీరు పేర్కొంటున్న ఆర్థిక రికవరీ సంకేతాలను లాక్ డౌన్ నాటి క్షీణించిన పరిస్థితుల నుంచి యాంత్రికంగా జరిగే రికవరీగానే మేము చూస్తున్నాము. దీన్ని మన్నికైన రికవరీగా చూడడం పొరపాటే అవుతుంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కనుక స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉండనున్నాయి. మహమ్మారి సమసిపోయిన తర్వాత (దీన్ని త్వరలోనే చూస్తామన్నది నా ఆశాభావం) ఈ సమస్యలు మరింత పెద్దవి కానున్నాయి. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోనుంది. రుణ భారం కూడా భారీగానే ఉంటుంది. ఆర్థిక రంగం దారుణ పరిస్థితులను చూస్తుంది. ఈ సవాళ్లను ఏ విధంగా పరిష్కరించుకుంటామన్న దానిపైనే మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ సుబ్బారావు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశావహం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా కోలుకోవడాన్ని సానుకూల సంకేతంగా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్యగా పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువ మంది గుర్తించిన మరో సానుకూల అంశంగా చెప్పారు. 4 కోట్ల మంది పట్టణ కార్మికులు కరోనా లాక్ డౌన్ల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని, అయినప్పటికీ అక్కడ భారీ కేసులు ఏమీ లేకపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చే వృద్ధి చోదకం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులను ఖర్చు చేయడం లేదన్న విమర్శలకు సుబ్బారావు స్పందిస్తూ.. రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదన్నారు. ‘‘ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కూడా మందగించి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత ఖర్చు చేయకపోతే మొండి బకాయిలు సహా పలు సమస్యలు ఆర్థిక వ్యవస్థను చుట్టుముడతాయి’’ అని సుబ్బారావు చెప్పారు. అయితే, కేంద్రం రుణాలకు పరిమితి మాత్రం ఉండాలన్నారు. -
ఆర్బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నేతృత్వంలోని బిమల్‌జలాన్ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి సీఎఫ్ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది. ► సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది. ► ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులతో ఆర్బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్‌లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు. ► అటు ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్స్‌తో ఇటు సెంట్రల్బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్‌ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు. ట ఆర్బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం. ► ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా. నిధుల బదిలీ అంశమై బిమల్ జలాన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్‌లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్ కమిటీ, 2013లో మాలేగామ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్బీఐ 12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. -
ఇకపై ఆకర్షణీయం కాదు
సింగపూర్: భారత్ ద్రవ్యలోటు లక్ష్యం పట్ల ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరిక జారీ చేశారు. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత్ ఇకపై ఎంత మాత్రం ఆకర్షణీయం కాదన్నారు. 2018–19 కేంద్ర బడ్జెట్లో దిగుమతుల సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత్‌లో తయారీకి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 1991లో భారత్ చెల్లింపుల పరంగా ఎదుర్కొన్న సంక్షోభం, 2013లో మరోసారి సంక్షోభం వరకూ వెళ్లడం అన్నవి నియంత్రణ లేని ఆర్థిక దుబారాల వల్లేనన్నారు. సింగపూర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో ‘ప్రపంచీకరణలో భారత్’ అనే అంశంపై మాట్లాడుతూ దువ్వూరి ఈ విషయాలు చెప్పారు. పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపును దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. భారత్‌లో తయారీకి తగినంత ఆసరా ఇవ్వకుండా ఈ విధంగా రేట్లు పెంచితే అది దేశ తయారీ రంగానికి తగదన్నారు. -
ద్రవ్యలోటు బాట తప్పరాదు
సింగపూర్: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1వ తేదీ తన బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించడం తగిన నిర్ణయం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం అసంతృప్తికి గురిచేసిందన్నారు. ‘‘ద్రవ్య స్థిరీకరణ విషయంలో అటు యూపీఏ కానీయండి... లేదా ఎన్డీఏ కానీయండి. ఆర్థికమంత్రులు ప్రతిసారీ ‘విరామ’ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇది తప్పదంటూ తమను తాము సమర్థించుకుంటున్నారు. ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామంటూనే ఆ బాట తప్పుతున్నారు. ఇది ఆందోళనకరమైన అంశం’’ అని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును ఎంత మేరకు కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని .. 2018–19 బడ్జెట్ కొనసాగించలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ అంచనాల ప్రకారం– ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3 శాతానికి తగ్గాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతం లక్ష్యాలనికి బదులు 3.5 శాతంగా ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు అనుకున్న 3 శాతానికి భిన్నంగా 3.3 శాతంగా ఉంటుందని చెప్పారు. కాగా జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రతిపాదన పట్ల దువ్వూరి హర్షం వ్యక్తం చేశారు. -
రుణమాఫీలతో ఒరిగేదేమీలేదు: దువ్వూరి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న రైతు రుణ మాఫీ పథకాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం రైతులకు ఏ మాత్రం ఉపయోగపడదన్నారు. పైగా ఈ రుణ మాఫీ వల్ల వ్యతిరేక పరిణామాలు సంభవిస్తాయన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి, వారి ఈ స్థితికి దిగజారడానికి గల కారణాలు తెలుసుకుని, వారిని గట్టెక్కించడానికి ఇతర పరిష్కారమార్గాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని ఆయన అన్యాపదేశంగా సూచించారు. శుక్రవారం ఇక్ఫాయ్ విద్యార్థులతో మాట్లాడుతూ 100 కోట్ల మంది ప్రజలు చెల్లించిన పన్నులను ఇలా రుణ మాఫీ పథకం కింద రైతులకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. ‘మీరు, మేము చెల్లించిన పన్నులతో రుణాలను ఎలా రద్దు చేస్తారని’ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ రైతు రుణ మాఫీ భారాన్ని భరిస్తున్న 100 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ సొమ్ము ఏ విధంగా వృథా అవుతున్నది తెలియకపోవడం దారుణమన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని తగ్గించుకుంటూ రెండంకెల వృద్ధిపై దృష్టిసారించాలన్నారు. జనధన యోజన కింద కేవలం బ్యాంకు అకౌంట్లు తెరిపించడమే కాకుండా పేదలకు రుణాలు, లావాదేవీలు అందుబాటులోకి తెచ్చే విధంగా చూడాలన్నారు. -
రిజర్వు బ్యాంకుపై దువ్వూరి ముద్ర
యాగా వేణుగోపాలరెడ్డి తర్వాత రిజర్వు బ్యాంకు పగ్గాలు చేపట్టిన మరో తెలుగువాడు.. దువ్వూరి సుబ్బారావు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ల పరిస్థితిలో ఉన్న తరుణంలో అత్యంత కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన.. ధరలను ఆదుపులో ఉంచడం, కరెంటు ఖాతా లోటును పూడ్చడం, ద్రవ్యలోటును అదుపులోకి తీసుకురావడం వంటి అనేక ఘన విజయాలు సాధించారు. రిజర్వు బ్యాంకుకు 22వ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. తన వారసత్వాన్ని రఘురామ్ రాజన్‌కు అప్పగించి విశ్రాంతి తీసుకున్నారు. గతంలోనే ఆయనకు పదవీ విరమణ వయస్సు వచ్చినా, ప్రభుత్వ కోరిక మేరకు నాలుగేళ్ల పాటు అదనంగా సేవలు అందించారు. మరికొంత కాలం మీరే ఉండాలని సర్కారు పెద్దలు కోరినా, సున్నితంగా తిరస్కరించి, తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పిన నిరాడంబరుడు. తిరుమలలో మర్యాదలకు నో గతంలో ఓసారి తిరుమల వెళ్లినప్పుడు కూడా ఆయన ఆలయ మర్యాదలను పక్కన పెట్టి, సామాన్య భక్తుడిలా కాలినడకనే దర్శనానికి వెళ్లారు. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లడమే కాక, తిరిగి వెళ్లేటప్పుడు కూడా కాలినడకనే అలిపిరి చేరుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనను సుపథం మార్గం నుంచి అతి దగ్గర క్యూలైనులో ఆలయంలోకి తీసుకెళ్లాలని చూసినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రత్యేక దర్శనం కోసం 300 రూపాయల టికెట్లు కొనుక్కుని భక్తులందరితో పాటే వెళ్లారు. అందరితో మహాలఘు దర్శనమే చేసుకున్నారు తప్ప, అధికారులు మరికొంతసేపు ఉండాలని కోరినా వినిపించుకోలేదు. ఏలూరు నుంచి హస్తిన వరకు.. దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగస్టు 11న జన్మించారు. అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్. పట్టా పొందిన ఆయన, 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శిగాను పనిచేశాడు. తర్వాత జాతీయ సర్వీసులకు వెళ్లి, చాలా కాలం పాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. యాగా వేణుగోపాలరెడ్డి పదవీ విరమణ చేయగానే స్వతహాగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ చూపు దువ్వూరిపైనే పడింది. బాల్యం, విద్యాభ్యాసం దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగస్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన మల్లికార్జునరావుకు మూడో సంతానం. కోరుకొండ సైనిక పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తిచేసి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ చదివారు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచారు. రూపాయి పతనంపై ఒంటరి పోరు రోజురోజుకూ పతనమవుతున్న రూపాయిపై దువ్వూరి ఒంటరిపోరు సాగించారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బ్యాంకులు విచ్చలవిడి స్పెక్యులేషన్‌కు పాల్పడుతుండటంతో దాన్ని నిరోధించేందుకు ఈ ఏడాది జూలై 15న ఒక్కసారిగా బ్యాంక్ రేటును 2 శాతానికి పైగా పెంచేశారు. అది సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో, పెంపు తాత్కాలికమేనంటూ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తిరిగి రూపాయిని పడేసింది. ఆర్థికాభివృద్ధే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం కావాలని, ధరల అదుపు అంశం అందులో ఒక భాగమేనని ఒక పక్క చిదంబరం అంటుంటే, ధరల కట్టడే తమ లక్ష్యమంటూ దువ్వూరి పేదల పక్షపాతి అనిపించుకున్నారు. చిదంబరంతో ఢీ అంటే ఢీ అనేకసార్లు తనపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆర్థికమంత్రి చిదంబరానికి దువ్వూరి పరోక్షంగానే సమాధానమిచ్చారు. కానీ ఇటీవల పదవీ విరమణకు ముందు ప్రత్యక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆర్బీఐ ఉండటం వల్లే దేశం బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనేరోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు చిదంబరం సైతం ‘నేను మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయా. ఎంతలా అంటే... అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నా. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది... అనే రోజు వస్తుంది’ అంటూ జర్మనీ మాజీ చాన్స్‌లర్ గెరార్డ్ ష్రోడర్‌ను ఉటంకించారు దువ్వూరి. నిర్వహించిన పదవులు 1988-93 కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీ 1993-98 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి 1998-04 ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం 2004-08 కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా 2008-13 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇతరాలు అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంఘంలో దువ్వూరి సుబ్బారావు కూడా సభ్యుడు. ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి ఈయనే. -
రేపు ఆర్బీఐ పగ్గాలు చేపట్టనున్న రాజన్
ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ముంబై నగరంలోని మింట్ రోడ్డులోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు నుంచి రాజన్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు పాతాళానికి పడిపోవడం, ప్రస్తుత ఖాతా లోటు తదితర పరిస్థితలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదెలు అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థను రాత్రికి రాత్రే కొత్త పుంతలు తొక్కించేందుకు తన వద్ద మంత్రదండం ఏమి లేదని ఆర్బీఐ గవర్నర్ పదవికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన సమయంలో రాజన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ముఖ్య ఆర్థికవేత్తగా పని చేసిన అపార అనుభవం రాజన్ సొంతం. అలాగే భారత ఆర్థిక మంత్రికి ముఖ్య సలహాదారునిగా రాజన్ గత ఆగస్టులో నియమితులయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు తన పదవి కాలం రేపటితో ముగియనుంది. -
ధరలపై పోరు ... దువ్వూరి సారు !
సాక్షి, బిజినెస్ డెస్క్:భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా దువ్వూరి సుబ్బారావు పగ్గాలు చేపట్టేనాటికి పశ్చిమ దేశాల ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చెక్కుచెదరని చిరునవ్వు... ఆత్మవిశ్వాసంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దువ్వూరి... ఆ సంక్షోభ ఛాయలు మన బ్యాంకులపై పడకుండా చూశారు. నాటి నుంచి ద్రవ్యోల్బణంతో ఐదేళ్లుగా పోరాడుతూనే వచ్చారు. ప్రధాని, ఆర్థిక మంత్రితో సహా అంతా వృద్ధి గురించే మాట్లాడుతుండగా... ధరల్ని అదుపు చేయాలంటే కొంత వృద్ధిని త్యాగం చేయాల్సిందేనన్నారు దువ్వూరి. బుధవారంతో పదవీ విరమణ చేస్తున్న ఈ 1972 సివిల్స్ టాపర్ ఐదేళ్ల ప్రస్థానమిదీ... ధరల కట్టడికే ప్రాధాన్యం... ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌తో సహా పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకులు ప్యాకేజీలంటూ వ్యవస్థలోకి ద్రవ్య సర ఫరాను పెంచాయి. దీంతో చమురు, లోహాల ధరలకు రెక్కలొచ్చాయి. వాటి దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌లో ధరలు నింగినంటాయి. ఇటు దేశంలో పంటల దిగుబడి పెరగడానికి, వాటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి తగు ప్రోత్సాహకాలు, చర్యలు లేకపోవటంతో ఆహారోత్పత్తుల ధరలూ పెరిగిపోయాయి. ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాలు రెండంకెల స్థాయికి చేరి పేద, మధ్యతరగతి ప్రజల్ని బెంబేలెత్తించాయి. ఈ ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయడమే తమ ప్రాధాన్యతంటూ... 2010 మార్చి నుంచి దువ్వూరి ఏకంగా 13 దఫాలు వడ్డీ రేట్లు పెంచారు. వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లను పక్కనబెట్టారు. టోకు ద్రవ్యోల్బణం రేటును 10 నుంచి 4 శాతానికి దించగలిగారు. అయితే ఆర్బీఐ చర్యలతో సంబంధం లేని, కేవలం ప్రభుత్వ విధానాల మీదే ఆధారపడే రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం ఇంకా గరిష్టస్థాయిలోనే సెగలు కక్కుతోంది. రూపాయిపై ఒంటరి పోరు... అంతలోనే రూపాయి పతనం మొదలైంది. సబ్సిడీలకు తోడు అస్తవ్యస్త విధానాల వల్ల కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చే డాలర్లు మైనస్ వెళ్లే డాలర్లు) పెరిగిపోయింది. ఈ ప్రమాదంపై గతేడాది ప్రథమార్ధంలోనే దువ్వూరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా విదేశీ మారక నిల్వలు పెంచేలా, లేదా విదేశీ మారక ఖర్చు తగ్గించేలా కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కరెంటు ఖాతా లోటు 4.8 శాతానికి చేరింది. ఫలితంగా గడిచిన ఏడాదిలో 20 శాతానికి పైగా రూపాయి విలువ పతనమైంది. దాంతో దిగుమతుల కోసం ఎక్కువ రూపాయల్ని వెచ్చించాల్సి వచ్చింది. ముడిచమురు, బంగారం, బొగ్గు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటంతో రూపాయి పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమయింది. ద్రవ్యోల్బణంపై పోరులో ఆర్బీఐ చేయగలిగింది చేస్తోందని, దానికి ప్రభుత్వ చర్యలు తోడవ్వాలని దువ్వూరి అదేపనిగా చెప్పారు. కానీ భారత్‌లో పెట్టుబడులకు ప్రపంచమంతా ఆసక్తిగా వున్నపుడు కీలక నిర్ణయాల్ని వాయిదా వేస్తూ రావడంతో రూపాయి అదుపు తప్పిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు విసిగిపోయిన సమయంలో కొన్ని రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచినా లాభం లేకపోయింది. దాంతో రూపాయిపై దువ్వూరి ఒంటరిపోరు సాగించారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బ్యాంకులు విచ్చలవిడి స్పెక్యులేషన్‌కు పాల్పడుతుండటంతో దాన్ని నిరోధించేందుకు ఈ ఏడాది జూలై 15న ఒక్కసారిగా బ్యాంక్ రేటును 2 శాతంపైగా పెంచేశారు. అది ఫలితాల్నిస్తున్న సమయంలో... పెంపు తాత్కాలికమేనంటూ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తిరిగి రూపాయిని పడేసింది. ఆర్థికాభివృద్ధే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం కావాలని, ధరల అదుపు అంశం అందులో ఒక భాగమేనని ఒక పక్క చిదంబరం అంటుంటే, ధరల కట్టడే తమ ప్రాధాన్యతా లక్ష్యమంటూ దువ్వూరి పేదల పక్షపాతి అనిపించుకున్నారు. చిదంబరం x దువ్వూరి అనేకసార్లు తనపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆర్థికమంత్రి చిదంబరానికి దువ్వూరి పరోక్షంగానే సమాధానమిచ్చారు. కానీ ఇటీవల పదవీ విరమణకు ముందు ప్రత్యక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆర్బీఐ ఉండటం వల్లే దేశం బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు చిదంబరం సైతం ‘నేను మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయా. ఎంతలా అంటే... అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నా. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది... అనే రోజు వస్తుంది’ అంటూ జర్మనీ మాజీ చాన్స్‌లర్ గెరార్డ్ ష్రోడర్‌ను ఉటంకించారు దువ్వూరి. బ్యాంకింగ్ లెసైన్స్‌ల విషయంలోనూ ఇద్దరి మధ్యా మాటలు పేలాయి. ‘కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లకు పరిమితి ఉండకపోవచ్చు. దరఖాస్తు చేసిన కంపెనీలకు అర్హతలుంటే ఎన్ని లెసైన్స్‌లైనా ఇవ్వొచ్చు. పల్లెలన్నిటికీ బ్యాంకింగ్ సేవలు అందాలంటే భారీ సంఖ్యలో బ్యాంకులు కావాలి’ అని చిదంబరం చెప్పిన రెండు రోజులకే దువ్వూరి స్పందించారు. ‘అర్హతలున్న కంపెనీలన్నింటికీ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడం సాధ్యం కాదు’ అని తేల్చిచెప్పారు. ఒక స్థాయిలో ధరలు పెరగడం ఆర్థికాభివృద్ధికి చిహ్నమే. కొన్ని దేశాల్లో డిమాండ్ తగ్గి మందగమన పరిస్థితిల్లో నెగెటివ్ ద్రవ్యోల్బణం నెలకొంది. మనం మాత్రం ద్రవ్యోల్బణం పెరిగి ఇబ్బంది పడుతున్నాం. నేను కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లను కలిసినప్పుడు వారు.. మీ ద్రవ్యోల్బణంలో కొంత ఇవ్వరాదూ!! అని అడుగుతున్నారు - 2011 జనవరి 17న కొందరు విద్యార్థులతో... ‘‘ఈ ద్రవ్యోల్బణం లెక్కలేంటో నాకు ఒకపట్టాన అర్థం కావడంలేదు. 20 ఏళ్ల క్రితం హెయిర్ కటింగ్‌కు నేను రూ.25 ఇచ్చాను. తర్వాత నా జుట్టు పలుచబడినా కటింగ్ ఖర్చు మాత్రం రూ.50కి పెరిగింది. ఇప్పుడు జుట్టు రావటం లేదు. అయినా హెయిర్‌కట్‌కు రూ.150 ఇస్తున్నాను. ద్రవ్యోల్బణం ఎంత? రావడం ఆగిపోయిన జుట్టుకు కటింగ్ కోసం నేను చెల్లిస్తున్న ప్రీమియం ఎంత? ఇవి నాకు అర్థం కావటం లేదు’’ - 2012 జూలై 17న యూసీబీ గణాంకాల శాఖ ఉన్నతాధికారులతో... నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వద్దని ఎన్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి అంటారు. దానిని కొనసాగించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వాదిస్తారు. అందుకని ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ గత రాత్రి సంతకాలు చేశా. సీఆర్ఆర్ ఉండాలా వద్దా అన్నది ఈ కమిటీ తేలుస్తుంది. దీన్లో డాక్టర్ చక్రవర్తి, ప్రతీప్ చౌదరి సభ్యులుగా ఉంటారు. దీనిపై ఒక అంగీకారానికి వచ్చేదాకా వారినొక గదిలో పెట్టి తాళం వేస్తాం. నా పదవీకాలం పూర్తయ్యేలోపు వారు నివేదిక సమర్పించాల్సిన పనిలేదు’’ - 2012 సెప్టెంబర్ 4న జరిగిన బ్యాంకర్లు సదస్సులో దేశీయంగా, అటు అంతర్జాతీయంగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దువ్వూరి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఆయనకంటే వేరెవ్వరూ మెరుగ్గా చేయలేరన్నదే నా ఉద్దేశం. - శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకుంటూ దువ్వూరి తనేంటో నిరూపించుకున్నారు. అందుకే ఆయనంటే అమితమైన గౌరవం. జ్ఞానం, అనుభవం వల్ల ఎవరి సత్తాఏంటో తేలిపోతుంది. దువ్వూరి సమర్థంగా పనిచేశారు. - అదిత్య పురి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఈ ఐదేళ్లలో దువ్వూరి నగదు నిల్వల నిష్పత్తి, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తులను చెరో 4% చొప్పున తగ్గించారు. నా దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. ఆర్థిక వ్యవస్థలో కొద్దోగొప్పో సానుకూల ధోరణి ఉదంటే ఇదే కారణం. - ప్రతీప్ చౌదరి, ఎస్బీఐ చైర్మన్ -
దండిగా ఫారెక్స్ నిల్వలు కరెన్సీ హెచ్చుతగ్గుల కట్టడిపై దృష్టి: దువ్వూరి
న్యూఢిల్లీ: రూపాయి అసాధారణ పతనం, పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్) సమస్యలను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద తగినంతగా విదేశీమారక (ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ దువ్వురి సుబ్బారావు చెప్పారు. దేశీ కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా కట్టడి చేసేందుకు ఇటీవల తీసుకున్న చర్యలు.. రూపాయి స్థిరపడే దాకా కొనసాగుతాయని గురువారం ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఈ చర్యలను పునఃసమీక్షిస్తామన్నారు. ఆగస్టు 9తో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ నిల్వలు 277.17 బిలియన్ డాలర్ల నుంచి 278.60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కరెన్సీని బలపర్చేందుకు, జూలై 15-ఆగస్టు 23 మధ్య ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. క్యాడ్‌ను భర్తీ చేసుకునే ప్రయత్నాలు: క్యాడ్‌ను భర్తీ చేయాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మొదలైన రూపాల్లో వచ్చే నిధులు పెరగాల్సి ఉంటుందని దువ్వూరి చెప్పారు. ఈలోగా స్థిరం గా వచ్చే పెట్టుబడుల నిధులతో క్యాడ్‌ను భర్తీ చేసుకునేందుకు కృషి చేయాల్సి ఉందని, ప్రస్తుతం అవే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గందరగోళ సంకేతాలు ఎందుకంటే.. ఇటీవల తీసుకుంటున్న చర్యలతో మార్కెట్లకు గందరగోళ సంకే తాలు వెళుతున్నాయన్న వాదనలతో సుబ్బారావు ఏకీభవించారు. ‘మన చేతుల్లో లేని విదేశీ పరిణామాల కారణంగా దేశీయంగా పరిస్థితులు ప్రతి రోజూ చాలా వేగంగా మారిపోతున్నాయి. కొంత మేర వాటికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు పరిణామాలను ముందస్తుగా అంచనా వేసి చర్యలు తీసుకుంటుండగా.. కొన్నిసార్లు ప్రతిస్పందనగా తీసుకోవాల్సి వస్తోంది’ అని దువ్వూరి చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఈ పరిస్థితి తప్పదన్నారు. ద్రవ్యోల్బణం..రూపాయికి లింకు.. రూపాయి క్షీణించే కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఈ ప్రభావం ఈ మధ్య మరింత ఎక్కువైందని దువ్వూరి చెప్పారు. ఈసారి వర్షపాతం మెరుగ్గానే ఉన్నప్పటికీ, రూపాయి అదే పనిగా పతనమవుతున్న కారణంగా.. ఆ సానుకూల ప్రయోజనాలు పొందలేకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో హెచ్చరించింది. -
ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్
రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. దువ్వూరి ఐదేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. ఆర్బీఐ గవర్నర్ పదవిలో రఘురామ్ జి రాజన్ మూడేళ్ల పాటు కొనసాగుతారని అధికార ప్రకటనలో తెలిపారు. రాజన్ ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనను గతేడాది ఆగస్టులో ఈ పదవిలో నియమించింది. గతంలో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రధానికి గౌరవ ఆర్థిక సలహాదారుగానూ కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పలు సవాళ్లు ఎదుర్కొనున్నారు. రూపాయి పతనం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ-అహ్మదాబాద్, ఐఐటీ-ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాజన్ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా ఊహించారు.