సింగపూర్: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1వ తేదీ తన బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించడం తగిన నిర్ణయం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం అసంతృప్తికి గురిచేసిందన్నారు. ‘‘ద్రవ్య స్థిరీకరణ విషయంలో అటు యూపీఏ కానీయండి... లేదా ఎన్‌డీఏ కానీయండి. ఆర్థికమంత్రులు ప్రతిసారీ ‘విరామ’ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇది తప్పదంటూ తమను తాము సమర్థించుకుంటున్నారు.
ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామంటూనే ఆ బాట తప్పుతున్నారు. ఇది ఆందోళనకరమైన అంశం’’ అని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును ఎంత మేరకు కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని .. 2018–19 బడ్జెట్ కొనసాగించలేకపోతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ అంచనాల ప్రకారం– ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3 శాతానికి తగ్గాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతం లక్ష్యాలనికి బదులు 3.5 శాతంగా ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు అనుకున్న 3 శాతానికి భిన్నంగా 3.3 శాతంగా ఉంటుందని చెప్పారు. కాగా జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రతిపాదన పట్ల దువ్వూరి హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment