పెనం మీంచి పొయ్యిలోకి...
ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? ప్రజల కొనుగోలు శక్తి పెరగనిదే వ్యవసాయ, తయారీ వస్తు గిరాకీ ఎలా పెరుగుతుంది? ఎనిమిది శాతం వృద్ధి రేటు ఎలా అందుకుంటారు?
పదేళ్ల యూపీఏ పాలనలో చితికి పోయిన ప్రజలకు ‘మంచి రోజులు’ తెస్తామనే వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం అందలమెక్కింది. అది ప్రవేశపెట్టిన తొలి బడ్టెట్ ఆ ‘మంచి రోజుల’ కోసం కనీసం మరో మూడు నాలుగేళ్లు, కనీసం 2016-2017 బడ్జెట్ వరకు పడిగాపులు పడాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 4.7 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును (జీడీపీ) 7 నుంచి 8 శాతానికి చేర్చడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వృద్ధి రేటు పుంజుకునే వరకు ఉపాధి కల్పన వృద్ధి నత్తనడకన సాగక తప్పదని ఆయన అనలేదు. కానీ ఆయన బడ్జెట్‌లోని ప్రాధాన్యాలను జాగ్రత్తగా గమనిస్తే అదే దాని అసలు సారాంశమని వెల్లడవుతుంది.
ప్రాధాన్యం కోల్పోయిన ఉపాధి
భారత్ ఉపాధి రహిత వృద్ధి సమస్యను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్ధిక మందగమనం వలన 2011లో 3.5 శాతంగా ఉన్న దేశ నిరుద్యోగిత వృద్ధి రేటు 2012లో 3.6 శాతానికి, 2013లో 3.7 శాతానికి పెరిగింది. 2014లో 3.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 18-59 వయో బృందంలోని యువత నైపుణ్యతలున్నా నిరుద్యోగానికి ఎక్కువగా గురవుతున్నారని ఐఎల్‌ఓ ఆందోళన వెలిబుచ్చింది. 15-59 వయస్కులైన ఉద్యోగులలో 21.2 శాతానికి (2011-12) మాత్రమే క్రమబద్ధమైన వేతన ఉపాధిని కలిగినవారని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని మొత్తం కార్మిక జనాభాలో 94 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారనేది మరింత ఆందోళనకరమైన వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథ కానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. కానీ ‘మంచి రోజులు’ తెస్తానన్న కొత్త ప్రభుత్వం తాత్కాలిక ఉపాధితో ఊరట కల్పించే ఆ పథకానికి సైతం గండి కొట్టింది. యూపీఏ ప్రభుత్వం 2012-13, 13-14 బడ్జెట్లలో ఎలాంటి మార్పూ లేకుండా రూ. 33,000 కోట్ల రూపాయలను కేటాయించింది. జైట్లీ అతి ఉదారంగా దాన్ని రూ. 34,000 కోట్లకు పెంచామంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను, జనాభాను దృష్టిలో ఉంచుకుంటే 2012తో పోలిస్తే జైట్లీ వాస్తవంగా ఉపాధి హామీ కేటాయింపులకు భారీ కోత విధించినట్టే అవుతుంది. అరకొర నిధులతో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నామని అనిపించుకోడానికి విఫలయత్నం చేశారు.
ద్రవ్యలోటు తగ్గింపే ప్రధాన లక్ష్యం
ఇదంతా జైట్లీ ద్రవ్యలోటు తగ్గింపునకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ఫలితం. 2011-12లో జీడీపీలో 5.7 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2013-14 నాటికి 4.5 శాతానికి తగ్గింది. ఈ తగ్గుదలంతా ప్రభుత్వ వ్యయాల్లో విధించిన కోతల వల్ల సాధించినదేననీ, ప్రభుత్వ రాబడి పెరుగుదల వల్ల కాదనీ జైట్లీయే చెప్పారు. సరిగ్గా ఈ 2012-14 మధ్య కాలంలోనే ఆందోళనకరమైన స్థాయిలో మన జీడీపీ వృద్ధి మందగించింది. 2010-11లో 9.3 శాతంగా ఉన్న వృద్ధి 2012-13లో 6.2 శాతానికి, 2013-14లో 4.5 శాతానికి పడిపోయింది. కాబట్టి 2012-14 మధ్య కాలంలోనే ప్రభుత్వ వ్యయాల కోతల వల్ల ద్రవ్యలోటు తగ్గడమే అదే కాలంలో వృద్ధి రేటు ఆందోళనకరంగా పడిపోవడానికి ఒక ప్రధాన కారణమని అనిపించడం పొరపాటు కాదు. 2014-15లో ద్రవ్యలోటును 4.1 శాతానికి, 2015-16లో 3.6 శాతానికి పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి అంటున్నారు. అంటే ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కిస్తామంటూ యూపీఏ లాగే దేశాన్ని మరింత మాంద్యంలోకి నెట్టే మార్గాన్ని ఎంచుకున్నారు. ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి?
మోడీ మార్కు ‘హరిత విప్లవం’
పాలకుల నిరాదరణతో, వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో పడ్డ వ్యవసాయరంగంపై సబ్సిడీల కోతలు పడనున్నాయి. ఈ బడ్జెట్ ప్రకటించిన నూతన యూరియా విధానం ప్రకారం యూరియా సబ్సిడీలకు చరమ గీతం పాడేయనున్నారు. ఈ వార్త వెలువడటంతోనే ఫెర్టిలైజర్ పరి శ్రమ షేర్ల ధరలు ఎగిరి గంతులేశాయి. ఆ పరిశ్రమాధిపతులు దీన్ని స్వాగతించారు. సాగు బరువై రోజురోజుకూ అప్పులతో కుంగిపోతున్న చిన్న, సన్న, సాధారణ రైతాంగానికి ఇది మరో పెద్ద దెబ్బ. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం మరో హరిత విప్లవాన్ని ప్రకటించింది. ఇది మొత్తంగా రైతాంగాన్ని దివాలా తీయించి, ఆహార ధరలను స్పెక్యులేటర్ల చేతుల్లో పెట్టే కార్పొరేట్ వ్యవసాయమేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత దీనావస్థలో ఉన్నా నేటికీ ప్రధాన ఉపాధి రంగంగా ఉన్నది వ్యవసాయరంగమే. కార్పొరేట్ వ్యవసాయ విస్తరణతో పాటే గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం అనివార్యం. మరో హరిత విప్లం కోసం ‘‘వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల సృష్టి అంటే... వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్ల రంగ ప్రవేశమే. దీంతో వ్యవసాయ కార్మికుల అవసరం తగ్గిపోతుంది’’ అని ఢిల్లీకి చెందిన ఒక విధాన విభాగ కేంద్రం డెరైక్టర్ యామినీ అయ్యర్ ‘మింట్’ పత్రికలో రాశారు. అదే విషయాన్ని ఆర్థిక మంత్రి ఇలా సెలవిచ్చారు; ‘‘వ్యవసాయ సాంకేతిక వృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెంచాల్సిన తక్షణ అవసరం ఉంది. వ్యవసాయ వాణిజ్య రంగంలోని మౌలిక వసతులను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.’’ ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధిస్తూ వ్యవసాయ రంగంలోని ప్రభు త్వ పెట్టుబడుల పెంపుదల గురించి మాట్లాడడం విచిత్రం. అసలు సంగతి ప్రైవేటు పెట్టుబడులకు, కార్పొరేట్ వ్యవసాయానికి ప్రో త్సాహమే. వ్యవసాయ సబ్సిడీల ఉపసంహరణ, ఉపాధి హామీకి తూట్లు వంటి చర్యలు చేపడుతూ 4 శాతం వ్యవసాయ వృద్ధి లక్ష్యం గా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే కార్పొరేట్ వ్యవసాయం ద్వారా ఉపాధి రహిత వృద్ధిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడమే.
కార్పొరేట్ కుబేరులకు, స్పెక్యులేటర్లకు పండుగ
దశాబ్దాల తరబడి యావత్ భారత ప్రజల శ్రమ, ధనాదులను వెచ్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆస్తులను కార్పొరేట్ కుబేరులకు కట్టబెట్టే ప్రయత్నం ఈసారి కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా సుమారు రూ. 63,425 కోట్ల రాబడిని ఆశిస్తున్నారు. ఇది గత ఏడాది యూపీఏ అమ్ముకున్న వాటాల విలువ (రూ.25,841 కోట్లు) కంటే 145 శాతం ఎక్కువ! పొదుగు కోసి పాలు తాగే విద్యలో యూపీఏ కంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎన్డీయే బడ్జెట్ చాటి చెప్పింది. జూలై 10న బడ్జెట్ సమర్పిస్తుండగానే షేర్‌మార్కెట్ స్పెక్యులేటర్లు (మాయా జూదర్లు) తొలుత షేర్ల విలువను పడగొట్టి, ఆ తదుపరి ఎగదోసి రెండు చేతులా చేసుకున్న లాభాల పండగే బడ్జెట్ దిశకు సరైన సూచిక కావచ్చు. చివరకు షేర్ల విలువతో గరిష్టంగా లబ్ధిని పొందిన రంగాలను బట్టే ఈ బడ్జెట్ అసలు స్వభావం వెల్లడవుతుంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రంగాలు భారీగా లాభపడ్డాయి. షేర్ మార్కెట్ జూదంతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేరు. వ్యవసాయ, వస్తుతయారీ రంగాలలోని వస్తు గిరాకిని పెంచలేరు. అది జరగనిదే నిజమైన పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదు. జైట్లీ దేశ ఆర్థిక రంగం పగ్గాలను షేర్ మార్కెట్ జూదర్లుగా మారిన కార్పొరేట్ అధిపతులకు అప్పగించి... మంచి రోజులు తెస్తారని ఆశించి అధికారం కట్టబెట్టినవారి కోసం అట్టహాసంగా 29 పథకాలు ప్రకటించారు. 120 కోట్ల జనాభా గల దేశంలో ఒక్కో పథకానికి ముచ్చటగా రూ. 100 కోట్లు కేటాయించారు. ఆ మెతుకులు ఏరుకుంటూ మరో నాలుగేళ్లు గడిపేస్తే బొందితోనే స్వర్గానికి చేర్చేస్తాం ఎదురు చూడమని తేల్చి చెప్పారు.
(వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) - డి.పాపారావు