D.Paparao
-
ట్రంప్ లక్ష్యం ఉపాధి కల్పనేనా?
సందర్భం నేడు ఆయా దేశాలలో పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్య నేపధ్యంలోనే బ్రిట న్లో ‘‘బ్రెగ్జిట్’’, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు, ఫ్రాన్స్ వంటి దేశాలలో అనేక చోట్ల మితవాద నేతలూ, పార్టీల ఎదుగుదల జరుగుతున్నాయి. ధనిక దేశాలలోని ఈ నిరుద్యోగ సమస్యకు అక్కడికి వలస వచ్చిన విదేశీయులూ, లేదా తమ తమ దేశాలనుంచి ఉద్యో గాలు చైనా, భారత్, మెక్సికోల వంటి తక్కువ వేతనాలు ఉన్న దేశాలకు ‘‘అవుట్ సోర్సింగ్’’ రూపంలో తరలిపోవడం కారణ మని ఈ మితవాద పార్టీలూ, నేతలూ ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో ట్రంప్, ఆయన విధానాల సారాంశాన్నీ అర్థం చేసుకోగలిగితే, మిగతా ప్రపంచంలో జరుగుతున్న పరిణామా లను సులువుగా అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో నిరుద్యోగం పెరగటానికి ప్రవాసితులూ, అవుట్ సోర్సింగ్లే కారణమనేది ట్రంప్‌లాంటి వారి వాదన. కాబట్టి కొత్తగా వచ్చే ప్రవాసితులను అడ్డుకుంటే, ఇప్పటికే అక్కడ ఉన్న వారిని ఏదో ఒక సాకుతో స్వదేశాలకు పంపేస్తే అమెరికాలో ‘‘స్థానికులకు’’ భారీగా ఉద్యో గాలు వస్తాయనీ, తద్వారా తన ఘనమైన గతాన్ని అమెరికా తిరిగి పొందుతుందనేది ట్రంప్ వాదనల సారాంశం. నిజానికి అమెరికాలో, బ్రిటన్‌లో లేదా ఫ్రాన్స్‌లోని సాధారణ జనాలలో కూడా తమ నిరుద్యోగానికి ప్రవాసితులే కారణం అనే దురభిప్రాయం నెలకొని ఉంది. అయితే, ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. నేడు నిరుద్యోగ సమస్య తాలూకు తీవ్రత పెరగటం అనేది, కాస్తో కూస్తో తేడాలతో ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిణామమే! భారత్‌లో కూడా 2013, 2014 సంవత్సరాలలో సుమారుగా 4,30,000 మందికి ఉపాధి కల్పన జరిగింది. కాగా, ‘మేకిన్ ఇండియా’ (2014, సెప్టెంబర్) కాలంలో 2015లో కల్పించిన ఉపాధిSకేవలం 1,35,000 మాత్రమే! 2016 పరిస్థితీ ఆశావహంగా లేదు. నిజానికి నేడు సగటున రోజుకు 550 ఉద్యోగాలను మన దేశం కోల్పోతోంది. కాగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశా లలో లాగా, మన దేశంలోకి ప్రవాసితులెవ్వరూ ఉపాధికోసం రావడం లేదు. అలాగే, విదేశీయులకు ఉద్యోగాలను కల్పించని చైనాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా గత కొన్నేళ్లుగా ఎంతో కొంతమేర నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. ఇలాగే అనేకానేక ఇతర అభివృద్ధి చెందుతోన్న దేశాలలో కూడా జరుగుతోంది. కాబట్టి నేడు నిరుద్యోగ సమస్య పెరుగుదల అనేది ఏ ఒక్క ప్రత్యేక దేశం తాలూకు విడి సమస్య కాదు. ఇది, తీవ్రతలో కాస్తో కూస్తో తేడాలతో అన్ని దేశాలలోనూ జరుగుతోన్న పరిణామమే! నిజానికి ఈ సమస్య మూలం ప్రవాసితులలోనో, కేవలం అవుట్ సోర్సింగ్లోనో కాకుండా వేగం పుంజుకుంటున్న యాంత్రీకరణ, పారిశ్రామిక రోబోట్ల వినియోగంలోనూ ఉంది. ఒక సర్వే ప్రకారం నేడు అమెరికాలో మిగిలివున్న ఉద్యోగాలలో 47% రాబోయే దశాబ్ద కాలంలో, యాంత్రీకరణ వలన పోతాయి. అలాగే భార త్లో ఈ సంఖ్య 69%గా ఉంది. అదీ కథ! మరి పెట్టుబడిదారుల లాభాల వేటలో జరుగుతోన్న యాంత్రీకరణ వలన పెరిగిపోతోన్న, నిరుద్యోగ సమస్యకు భారత్, చైనా, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల నుంచి వస్తోన్న ప్రవాసితులే కారణమని ట్రంప్ వంటి వారు ఎందుకు చెబుతోన్నట్టు? ముఖ్యంగా ధనిక దేశాలలోని సామాన్య ప్రజలు మెల్ల మెల్లగా పెద్ద ఎత్తున కార్పొరేట్ ధనవంతులూ, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ‘‘మేము 99% మందిమి’’ వంటి నినాదంతో ‘‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’’ వంటి ఉద్యమాలలో మమేకం అవుతూ ఉండడమే! 2011లో అమెరికాలో జరిగిన ఈ ఆక్యుపై ఉద్యమం, కేవలం 1% మందిగా ఉన్న అమెరికా కార్పొరేట్ ధన వంతుల వల్లే తమ సమస్యలు పెరుగుతున్నాయన్న, 99% మంది అమెరికా సామాన్య జనం తాలూకు ఆక్రోశానికి ప్రతిబింబంగా ఉంది. ఈ ఉద్యమం నాడు ప్రపంచంలోని 800 నగరాలకు విస్తరిం చింది. మన ముంబైలో కూడా ‘‘ఆక్యుపై దలాల్ స్ట్రీట్’’ పేరిట చిన్న స్థాయిలోనైనా ఈ ఉద్యమ ప్రతిధ్వని వినపడింది. ఇక ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ప్రభావం 2016 నవంబర్‌లో జరిగిన అమెరికా ఎన్నికల క్రమంలో డెమోక్రటిక్ పార్టీలో అభ్యర్థి అయిన సోషలిస్ట్ బెర్నీ శాండర్స్ రూపంలోనూ కనపడింది. నిజానికి, అమెరికా యువ జనులలోని 80% మంది ఆకాంక్షలకు బెర్నీ శాండర్స్ ప్రతినిధి అనీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు, హిల్లరీ క్లింటన్ కంటే శాండర్సే మెరుగైన అభ్యర్థి అనీ, నాడు అమెరికా పత్రికలే పలుమార్లు చెప్పాయి. ఇదీ విషయం!!! ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్లూ, బ్రెగ్జి ట్లూ, ఫ్రాన్స్ వంటి దేశాల మితవాదులూ అందరి టార్గెట్ ఒకటే. తమ తమ దేశాలలోని సామాన్య ప్రజలు కార్పొరేట్లకూ, ధనవంతులకూ వ్యతిరేకంగా జమవుతోన్న పరిణామాన్ని నిరో ధించటమే. ఆ ప్రజల ఐక్యతని విచ్ఛిన్నం చేయటమే. తద్వారా ప్రపంచంలో పెరిగిపోతోన్న ఆర్థిక అసమానతలూ, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి వారిమధ్య జాతి వైషమ్యాలూ, దేశీయ విదేశీ ఉద్యోగులూ వంటి విద్వేషాలను రెచ్చగొట్టటమే. కాబట్టి జనాలు తమ సమ స్యలకు అసలు కారణం నుంచి దృష్టిని మళ్ళిస్తే అది వారు తమ వేలితో తమ కన్నే పొడుచుకున్నట్లుగా అవుతుంది. - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ మెుబైల్ : 98661 79615 -
టార్గెట్ నల్ల డబ్బేనా..?
సందర్భం కార్పొరేట్ రంగంలోని రుణ ఎగవేతదారులపై ఆస్తుల జప్తువంటి కఠినచర్యలకు బదు లుగా పెద్ద నోట్ల రద్దు చర్య కొద్ది స్థాయిలో నల్లడబ్బును వెలికి తీయగలిగినా, అంతిమంగా అది ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇల్లు తగులబెట్టే’ తీరుగానే ఉంటుంది. పెద్దనోట్లను రద్దుచేస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మిక ప్రకటన చేశారు. దీని ఉద్దేశ్యం దేశంలో గుట్టలుగా పేరుకుపో యిన నల్లడబ్బును వెలికి తీయటం కోసమేనని ఒక సాధా రణ అభిప్రాయం, ఎక్కువమంది ప్రజలలో ఉంది. అయితే, ఈ క్రమంలో నల్లడబ్బును కలలో కూడా చూడలేని సామాన్య జనాలు పెద్ద స్థాయిలో ఇక్కట్ల పాలవుతున్నారనేది, ప్రజల ప్రధాన ఆరోపణ. నిజానికి ఈ రూ. 500, 1000 నోట్ల రద్దు వెనుకన, నల్లడబ్బును అరికట్టడానికి మించిన ఇతరేతర ఆలోచనలు ఉన్నాయి. దేశీయ ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్లది కేవలం 10% వాటాయేననేది నిజం. పైగా, దేశంలోని నల్లడబ్బు నగదు రూపంలోనే కాకుండా, విదేశీ కరెన్సీ, విదేశీ బ్యాంకు అకౌంట్లు, బంగారం వంటి ఇతరేతర వనరుల రూపంలో కూడా పెద్ద స్థాయిలో ఉంది. కానీ నల్లధనానికి సంబంధిం చిన చర్చలు, కేవలం కరెన్సీనోట్ల చుట్టూనే తిరుగాడుతుం డటం గమనించాల్సిన విషయం. ఈ నేపధ్యంలో ఈ కరెన్సీ నోట్ల రద్దు చర్య సారం, అసలు ఉద్దేశాలూ ఏమిటి? దీనికి సమాధానాన్ని దేశీయ ద్రవ్యలోటులో వెతకాలి. ఈ ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్యన వ్యత్యాసం) తగ్గించుకోవటం, మన ప్రభుత్వాలన్నింటి అంతిమ లక్ష్యంగా ఉంది. ప్రస్తుత పెద్దనోట్ల రద్దు చర్య సుమారు 30 బిలియన్ల మేరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూరు స్తుందని అంచనా. ఫలితంగా, ద్రవ్యలోటు తగ్గి దేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గగలదు. ఇది, విదేశీ ఫైనాన్స్ పెట్టు బడులకు ఆకర్షణీయమైన స్థితి. ప్రస్తుత నోట్ల రద్దుతో బ్యాంకు డిపాజిట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా రూ. 2 లక్షల కోట్ల మేరన అదనపు డిపాజిట్లు బ్యాంకులకు వచ్చి చేరాయనేది అంచనా. ఫలితంగా, కార్పొరేట్ రంగానికి విచ్చలవిడిగా రుణాలిచ్చి, నేడు మెుండి బకాయిలతో సత మతమవుతున్న బ్యాంకులకు ద్రవ్య లభ్యత కూడా పెరుగు తుంది. ఈ క్రమంలోనే బ్యాంకుల వడ్డీ, డిపాజిట్ల రేట్లు కూడా తగ్గుతాయి. దీని వలన ఈ డబ్బు ఇతరేతర మదుపు మార్గాలకు మళ్లు తుంది. కానీ, గతంలో పెద్ద ఎత్తున జరిగినట్లు, ఈ మదు పులు రియల్ ఎస్టేట్ దిశగా సాగవు. అలాగే, ఇక బంగారంలో పెట్టు బడుల దిశగా ఈ డబ్బు వెళ్లే అవకాశం లేదు. ఎందు చేతనంటే బంగారం అనేది కేవలం అలంకారప్రాయమైన సంపద మాత్రమే. దానిని పెట్టుబడిగా మార్చలేము. ఇక ఈ పరిస్థితిలో ప్రజల వద్ద ఉన్న సంపద అనివార్యంగా షేర్మార్కెట్లు, బాండ్ల దిశగా మరలుతుందనేది ఒక అంచనా. అతి శక్తివంతమైన అంత ర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడుల చిరకాల డిమాండ్ ఇదే మరి. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం మన దేశ ప్రజలలో బంగారం కొనుగోళ్ల పట్ల ఉన్న మక్కువను తప్పుపడుతూ, ఈ పెట్టుబడులు మెరుగైన ఆదాయాల కోసం షేర్మార్కెట్ల దిశగా వెళితే మెరుగు అన్నట్లుగా చెబుతూవచ్చారు. పైగా, భారతీయులు ప్రధానంగా ఫైనాన్షియల్ సంపదకంటే, భౌతిక రూపంలోని (బంగారం, రియల్ఎస్టేట్ వంటివి) సంపదకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం కూడా, ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడులకు జో హుకుం చేస్తోన్న మన పాల కులకు రుచించడం లేదు. అంతిమంగా, దేశీయ ఫైనాన్స్ పెట్టుబడులకు ఊతాన్ని ఇవ్వడమే అటు యు.పి.ఎ., ఇటు ఎన్డీఏ పక్షాల ప్రధాన లక్ష్యంగా ఉంది. అందుచేతనే 2008 సంక్షోభానంతరం ధనిక దేశాల షేర్మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ కుదేలవ్వడంతో, మదుపు అవకాశాలను కోల్పో యిన అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకు మన దలాల్ స్ట్రీట్‌ను గమ్యంగా మార్చాలనే ఆలోచన వచ్చింది. అయితే, నేటి కరెన్సీ నోట్ల రద్దు ఫలితంగా.. మార్కెట్ లో ద్రవ్యచలామణీని తగ్గించడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గిపోవడం, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గటం తదితర పరిణామాలు జరుగుతాయి. అంటే, ఇప్ప టికే అంతంత మాత్రంగా ఉన్న, మన ఆర్థిక వృద్ధిరేటు, ప్రజల కొనుగోలు శక్తిని పణంగా పెట్టైనా సరే, దేశీయ షేర్ మార్కెట్ల దిశగా పెట్టుబడులు ప్రవహించేలా చేయటం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లుగా కనపడుతోంది. దీనివలన లబ్ధి పొందేది విదేశీ ఫైనాన్స్ పెట్టుబడులే! ఫలితంగా షేర్ మార్కెట్ల ఒడిదుడుకుల క్రమంలో మన దేశ సామాన్య జనం, మధ్యతరగతుల జీవితాలు కుదేలవుతాయి. కాబట్టి నల్లధనం నివారణ పేరిట పెద్దనోట్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయించడం అత్యధిక సంఖ్యలో అమాయకు లైన జనసామాన్యాన్ని ఇక్కట్ల పాలు చేసే విధంగానే ఉంది. అంతేకాకుండా, దేశీయ నల్లధనంలోని సింహభాగం కార్పొరేట్ల వద్దనే ఉందనేది కఠోర వాస్తవం. పైగా, నేడు మన బ్యాంకింగ్ రంగంలో ఆందోళనకర స్థాయిలో మెుండి బకాయిలు పేరుకు పోవడానికి మూలకారణం కూడా ఈ కార్పొరేట్ రంగంలోని ఒక పెద్ద విభాగమే. కాబట్టి, వారిలోని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా, ప్రస్తుత తరహాలో పెద్ద నోట్ల రద్దుచర్యల వంటివి కొద్దిపాటి స్థాయిలో నల్లడబ్బును వెలికితీయగలిగినా, అంతిమంగా అది ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇల్లు తగులబెట్టే’ తీరుగానే ఉంటుంది. ఇప్ప టికే విదేశాలలోని నల్లడబ్బును తిరిగి తేవడంలో మన కేంద్ర ప్రభుత్వపు వైఫల్యం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి పరిస్థితిలో ‘ఏనుగులు పోయే దారులను వదిలేసి, ఎలుకలు పోయే కలుగులను పూడ్చే’ తీరుగా సాగుతోన్న కేంద్రప్రభుత్వ చర్యలు దేశీయ సామాన్యజనం, మధ్యతరగతిలో మరింత అసంతృప్తిని రగల్చడం ఖాయం. వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు ‘ 98661 79615 డి. పాపారావు -
బ్యాంకులకు చిట్కా వైద్యమా?
సందర్భం జనసామాన్యానికి అండగా బ్యాంకులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. కానీ 1990 లలో ప్రబలిన నయా ఉదారవాద ప్రపంచీకరణ నేపథ్యంలో జాతీయ బ్యాంకులు, ఈ లక్ష్యాన్ని పూర్తిగా మరిచిపోయాయి. అమెరికా కేంద్రంగా 2008 సెప్టెంబర్‌లో ప్రపంచ ఫైనా న్స్, ఆర్థిక సంక్షోభాలు మొద లయ్యాయి. కానీ, నాడు ఈ సంక్షోభ ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థను పెద్దగా తాక లేదు. ఈ కారణం చేతనే 2009వ సంవత్సరంలో నాటి మన కేంద్ర ఆర్థిక మంత్రి, వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ - దేశ ఆర్థిక వ్యవస్థ అంత ర్గత బలానికి కారణాలలో మన జాతీయం చేయబడిన బ్యాంకుల పాత్రను ప్రధానంగా పేర్కొన్నారు. కాగా, ఇది నిన్నటి మాట! నేడు, మన దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడి కింద ఉన్నాయి. ఈ బ్యాంకులలో-మొండి బకా యిలు భారీగా పెరిగిపోయి 2013-14 నాటికి 2.16 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీనితో, ఈ బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మన దేశంలో కూడా అమెరికా తరహాలో సబ్-ప్రైమ్ సంక్షో భం ఏర్పడుతుందా? అనే భయాందోళనలు పెరిగిపోసా గాయి. ప్రభుత్వం పూనుకొని ఈ బ్యాంకులకు మూల ధన మొత్తాన్ని సమకూర్చవలసిన అగత్యం ముందు కొచ్చింది. ఈ నేపథ్యంలోనే 2019 ఆర్థిక సంవత్సరం వరకూ - అంటే 2015-16 నుంచీ 4 సంవత్సరాల కాలంలో ఈ బ్యాంకులకు 70 వేల కోట్ల రూపాయల మేర మూలధనాన్ని అందించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగానే, రానున్న నెల రోజుల కాలంలో (ఆగస్టు 15 నుంచీ మొదలుకొని) 13 జాతీయ బ్యాంకులకు, 20 వేల 88 కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ జరిగిన కథ ఇది. కానీ, అసలీ బ్యాంకులు 2008-09 నాటి పటి ష్టస్థితి నుంచి ఎందుకు ప్రస్తుత ఇబ్బందులలో పడిపో యాయి? ఈ మౌలిక లోపాలను సరిదిద్దుకునే దిశగా ప్రభుత్వం లేదా బ్యాంకులు ఎంత మేర కృషి చేస్తున్నా యి? అనేవి ఇక్కడి ప్రశ్నలు. బ్యాంకుల మొండి బకాయిలలో సింహభాగం మన దేశ కార్పొరేట్ రంగానిదే అన్నది ఇక్కడ గమనా ర్హం. కాగా, నేటి మన ఈ పరిస్థితికి గత 3-4 ఏళ్లుగా మన దేశ ఆర్థిక పరిస్థితిలో కూడా ఏర్పడిన మందగింపు కొంత మేరకు కారణంగానే ఉంది. దేశీయ బ్యాంకుల వడ్డీరేట్లు బాగా పెరిగిపోవడం, ఆర్థిక మందగింపు వల న రుణాల చెల్లింపు కార్పొరేట్లకు పెనుభారంగా మారిం దన్నది కూడా సత్యమే! కానీ, ఈ స్థితికి దీనికి మించిన ఇతరేతర మౌలిక కారణాలు కూడా ఉన్నాయి. 2008 అనంతరం పలు దఫాలు, మన దేశం ‘అగ్రరాజ్యం’ కాబోతుందనే, నేల విడిచి సాము చేసే ఆశలను మన పాలకులు పెంచి పోషించారు. ప్రపంచ ధనిక దేశాలలో ఏర్పడిన ఫైనాన్స్ సంక్షోభం నేపథ్యంలో, మన దేశం అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులూ, సట్టా వ్యాపారా నికి (రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటివి) కేంద్రం కావడం ద్వారా, మనం ఈ ‘అగ్రరాజ్య’ స్థాయిని చేరు తామనేది దీని వెనుకన ఉన్న తర్కం. దీనికి తోడుగా 2004-08 కాలంలో రియల్ ఎస్టేట్ వంటి సట్టా వ్యాపా రాలు కేంద్ర బిందువుగా మన దేశం భారీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే మన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ముందూ వెనుకా చూసుకోకుండా రుణ వితరణ జరిపాయి. నిజానికి, 1969లో మన బ్యాంకుల జాతీయీకరణ జరగడం వెనుకన ఉన్న ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధంగా నేటి మన ప్రభుత్వరంగ బ్యాంకుల తీరు ఉంది. దేశం లోని జనసామాన్యానికి అండగా, వెన్నుదన్నుగా బ్యాం కులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. కానీ కాలక్రమంలో, మరీ ముఖ్యంగా 1990 లలో దేశంలో నయా ఉదారవాద ప్రపంచీకరణ క్రమం నేపథ్యంలో జాతీయ బ్యాంకులు, ఈ లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాయి. వాటి పని తీరు కార్పొరేట్ సంస్థలూ, ధనికులకూ అనుకూలమైన దిశలోకి మళ్లింది. కానీ, స్వయాన మన కేంద్ర ఆర్థిక మంత్రులు కూడా తమ ప్రసంగాలలో అడపాదడపా - బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాలను చెల్లించటంలో, సామాన్యులే (ధని కులు, కార్పొరేట్ల కంటే!) ఎక్కువ నిజాయితీగా ఉన్నా రని చెప్పడం ఇక్కడ గమనార్హం. దీనంతటితో పాటుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశీ య వ్యవసాయ రంగంలో కంటే కూడా, చాలా పెద్ద స్థాయిలో కార్పొరేట్ రంగంలోనే ఈ మొండి బకాయి లూ ఉన్నాయనేది కఠిన వాస్తవం. అంతకుమించి, నేడు మన జాతీయ బ్యాంకులు తమ రుణ వితరణలో వ్యవ సాయ రంగం పట్ల చిన్నచూపు చూపడం వలన కూడా మన వ్యవసాయదారులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు అనేకం! కాబట్టి, మన ప్రభుత్వరంగ బ్యాంకులు తమ తీరు తెన్నులను, విధానాలనూ సరైన దిశగా సవరించు కోకుండా ప్రభుత్వాలు వాటిని ఎంతగా ఆదుకున్నా ఫలి తం పెద్దగా ఉండదు. మన దేశ పాలకులు 1990ల నుం చీ తలకెత్తుకున్న ఉదారవాద ప్రపంచీకరణ విధానాలే ఈ పరిస్థితి అంతటికీ మూలకారణంగా ఉన్నాయి. ధనవంతులూ, కార్పొరేట్ల సేవలో తరించేందుకు గాను ‘మరో ప్రత్యామ్నాయం లేదు’ అనే పేరిట - బ్రిటన్‌లో మార్గరెట్ థాచర్, అమెరికాలో రోనాల్డ్ రీగన్ల కాలంలో తెరపైకి వచ్చిన - ఈ విధానాలే అమెరికాలోని నిన్నటి ఆర్థిక సంస్థల, బ్యాంకుల పతనానికీ, నేటి మన దేశీయ బ్యాంకుల సమస్యలకూ, స్థూలంగా నేటి ప్రపంచంలోని ఆర్థిక మాంద్య స్థితికీ అసలైన కారణం! ఈ విధానాలను మార్చుకోకుండా, వాటి కారణంగా నష్టాల బాటను పట్టిన మన బ్యాంకులను ‘ఆదుకునేందుకు’ ప్రభుత్వా లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, వాస్తవ స్థితిలో మాత్రం మార్పు ఉండదు!!! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్: 9866179615. -
పెనం మీంచి పొయ్యిలోకి...
ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? ప్రజల కొనుగోలు శక్తి పెరగనిదే వ్యవసాయ, తయారీ వస్తు గిరాకీ ఎలా పెరుగుతుంది? ఎనిమిది శాతం వృద్ధి రేటు ఎలా అందుకుంటారు? పదేళ్ల యూపీఏ పాలనలో చితికి పోయిన ప్రజలకు ‘మంచి రోజులు’ తెస్తామనే వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం అందలమెక్కింది. అది ప్రవేశపెట్టిన తొలి బడ్టెట్ ఆ ‘మంచి రోజుల’ కోసం కనీసం మరో మూడు నాలుగేళ్లు, కనీసం 2016-2017 బడ్జెట్ వరకు పడిగాపులు పడాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 4.7 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును (జీడీపీ) 7 నుంచి 8 శాతానికి చేర్చడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వృద్ధి రేటు పుంజుకునే వరకు ఉపాధి కల్పన వృద్ధి నత్తనడకన సాగక తప్పదని ఆయన అనలేదు. కానీ ఆయన బడ్జెట్లోని ప్రాధాన్యాలను జాగ్రత్తగా గమనిస్తే అదే దాని అసలు సారాంశమని వెల్లడవుతుంది. ప్రాధాన్యం కోల్పోయిన ఉపాధి భారత్ ఉపాధి రహిత వృద్ధి సమస్యను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్ధిక మందగమనం వలన 2011లో 3.5 శాతంగా ఉన్న దేశ నిరుద్యోగిత వృద్ధి రేటు 2012లో 3.6 శాతానికి, 2013లో 3.7 శాతానికి పెరిగింది. 2014లో 3.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 18-59 వయో బృందంలోని యువత నైపుణ్యతలున్నా నిరుద్యోగానికి ఎక్కువగా గురవుతున్నారని ఐఎల్ఓ ఆందోళన వెలిబుచ్చింది. 15-59 వయస్కులైన ఉద్యోగులలో 21.2 శాతానికి (2011-12) మాత్రమే క్రమబద్ధమైన వేతన ఉపాధిని కలిగినవారని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని మొత్తం కార్మిక జనాభాలో 94 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారనేది మరింత ఆందోళనకరమైన వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథ కానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. కానీ ‘మంచి రోజులు’ తెస్తానన్న కొత్త ప్రభుత్వం తాత్కాలిక ఉపాధితో ఊరట కల్పించే ఆ పథకానికి సైతం గండి కొట్టింది. యూపీఏ ప్రభుత్వం 2012-13, 13-14 బడ్జెట్లలో ఎలాంటి మార్పూ లేకుండా రూ. 33,000 కోట్ల రూపాయలను కేటాయించింది. జైట్లీ అతి ఉదారంగా దాన్ని రూ. 34,000 కోట్లకు పెంచామంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను, జనాభాను దృష్టిలో ఉంచుకుంటే 2012తో పోలిస్తే జైట్లీ వాస్తవంగా ఉపాధి హామీ కేటాయింపులకు భారీ కోత విధించినట్టే అవుతుంది. అరకొర నిధులతో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నామని అనిపించుకోడానికి విఫలయత్నం చేశారు. ద్రవ్యలోటు తగ్గింపే ప్రధాన లక్ష్యం ఇదంతా జైట్లీ ద్రవ్యలోటు తగ్గింపునకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ఫలితం. 2011-12లో జీడీపీలో 5.7 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2013-14 నాటికి 4.5 శాతానికి తగ్గింది. ఈ తగ్గుదలంతా ప్రభుత్వ వ్యయాల్లో విధించిన కోతల వల్ల సాధించినదేననీ, ప్రభుత్వ రాబడి పెరుగుదల వల్ల కాదనీ జైట్లీయే చెప్పారు. సరిగ్గా ఈ 2012-14 మధ్య కాలంలోనే ఆందోళనకరమైన స్థాయిలో మన జీడీపీ వృద్ధి మందగించింది. 2010-11లో 9.3 శాతంగా ఉన్న వృద్ధి 2012-13లో 6.2 శాతానికి, 2013-14లో 4.5 శాతానికి పడిపోయింది. కాబట్టి 2012-14 మధ్య కాలంలోనే ప్రభుత్వ వ్యయాల కోతల వల్ల ద్రవ్యలోటు తగ్గడమే అదే కాలంలో వృద్ధి రేటు ఆందోళనకరంగా పడిపోవడానికి ఒక ప్రధాన కారణమని అనిపించడం పొరపాటు కాదు. 2014-15లో ద్రవ్యలోటును 4.1 శాతానికి, 2015-16లో 3.6 శాతానికి పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి అంటున్నారు. అంటే ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కిస్తామంటూ యూపీఏ లాగే దేశాన్ని మరింత మాంద్యంలోకి నెట్టే మార్గాన్ని ఎంచుకున్నారు. ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? మోడీ మార్కు ‘హరిత విప్లవం’ పాలకుల నిరాదరణతో, వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో పడ్డ వ్యవసాయరంగంపై సబ్సిడీల కోతలు పడనున్నాయి. ఈ బడ్జెట్ ప్రకటించిన నూతన యూరియా విధానం ప్రకారం యూరియా సబ్సిడీలకు చరమ గీతం పాడేయనున్నారు. ఈ వార్త వెలువడటంతోనే ఫెర్టిలైజర్ పరి శ్రమ షేర్ల ధరలు ఎగిరి గంతులేశాయి. ఆ పరిశ్రమాధిపతులు దీన్ని స్వాగతించారు. సాగు బరువై రోజురోజుకూ అప్పులతో కుంగిపోతున్న చిన్న, సన్న, సాధారణ రైతాంగానికి ఇది మరో పెద్ద దెబ్బ. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం మరో హరిత విప్లవాన్ని ప్రకటించింది. ఇది మొత్తంగా రైతాంగాన్ని దివాలా తీయించి, ఆహార ధరలను స్పెక్యులేటర్ల చేతుల్లో పెట్టే కార్పొరేట్ వ్యవసాయమేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత దీనావస్థలో ఉన్నా నేటికీ ప్రధాన ఉపాధి రంగంగా ఉన్నది వ్యవసాయరంగమే. కార్పొరేట్ వ్యవసాయ విస్తరణతో పాటే గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం అనివార్యం. మరో హరిత విప్లం కోసం ‘‘వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల సృష్టి అంటే... వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్ల రంగ ప్రవేశమే. దీంతో వ్యవసాయ కార్మికుల అవసరం తగ్గిపోతుంది’’ అని ఢిల్లీకి చెందిన ఒక విధాన విభాగ కేంద్రం డెరైక్టర్ యామినీ అయ్యర్ ‘మింట్’ పత్రికలో రాశారు. అదే విషయాన్ని ఆర్థిక మంత్రి ఇలా సెలవిచ్చారు; ‘‘వ్యవసాయ సాంకేతిక వృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెంచాల్సిన తక్షణ అవసరం ఉంది. వ్యవసాయ వాణిజ్య రంగంలోని మౌలిక వసతులను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.’’ ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధిస్తూ వ్యవసాయ రంగంలోని ప్రభు త్వ పెట్టుబడుల పెంపుదల గురించి మాట్లాడడం విచిత్రం. అసలు సంగతి ప్రైవేటు పెట్టుబడులకు, కార్పొరేట్ వ్యవసాయానికి ప్రో త్సాహమే. వ్యవసాయ సబ్సిడీల ఉపసంహరణ, ఉపాధి హామీకి తూట్లు వంటి చర్యలు చేపడుతూ 4 శాతం వ్యవసాయ వృద్ధి లక్ష్యం గా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే కార్పొరేట్ వ్యవసాయం ద్వారా ఉపాధి రహిత వృద్ధిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడమే. కార్పొరేట్ కుబేరులకు, స్పెక్యులేటర్లకు పండుగ దశాబ్దాల తరబడి యావత్ భారత ప్రజల శ్రమ, ధనాదులను వెచ్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆస్తులను కార్పొరేట్ కుబేరులకు కట్టబెట్టే ప్రయత్నం ఈసారి కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా సుమారు రూ. 63,425 కోట్ల రాబడిని ఆశిస్తున్నారు. ఇది గత ఏడాది యూపీఏ అమ్ముకున్న వాటాల విలువ (రూ.25,841 కోట్లు) కంటే 145 శాతం ఎక్కువ! పొదుగు కోసి పాలు తాగే విద్యలో యూపీఏ కంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎన్డీయే బడ్జెట్ చాటి చెప్పింది. జూలై 10న బడ్జెట్ సమర్పిస్తుండగానే షేర్‌మార్కెట్ స్పెక్యులేటర్లు (మాయా జూదర్లు) తొలుత షేర్ల విలువను పడగొట్టి, ఆ తదుపరి ఎగదోసి రెండు చేతులా చేసుకున్న లాభాల పండగే బడ్జెట్ దిశకు సరైన సూచిక కావచ్చు. చివరకు షేర్ల విలువతో గరిష్టంగా లబ్ధిని పొందిన రంగాలను బట్టే ఈ బడ్జెట్ అసలు స్వభావం వెల్లడవుతుంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రంగాలు భారీగా లాభపడ్డాయి. షేర్ మార్కెట్ జూదంతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేరు. వ్యవసాయ, వస్తుతయారీ రంగాలలోని వస్తు గిరాకిని పెంచలేరు. అది జరగనిదే నిజమైన పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదు. జైట్లీ దేశ ఆర్థిక రంగం పగ్గాలను షేర్ మార్కెట్ జూదర్లుగా మారిన కార్పొరేట్ అధిపతులకు అప్పగించి... మంచి రోజులు తెస్తారని ఆశించి అధికారం కట్టబెట్టినవారి కోసం అట్టహాసంగా 29 పథకాలు ప్రకటించారు. 120 కోట్ల జనాభా గల దేశంలో ఒక్కో పథకానికి ముచ్చటగా రూ. 100 కోట్లు కేటాయించారు. ఆ మెతుకులు ఏరుకుంటూ మరో నాలుగేళ్లు గడిపేస్తే బొందితోనే స్వర్గానికి చేర్చేస్తాం ఎదురు చూడమని తేల్చి చెప్పారు. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) - డి.పాపారావు -
సాగుతోనే సమగ్రాభివృద్ధి
వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే పారిశ్రామిక వస్తువులకు దేశీయ డిమాండు పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వృద్ధి పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి క్రమంగా దిగజారిపోతోంది. ఆ ఏడాదిలోనూ, గత ఏడాదిలోనూ రూపాయి విలువ తీవ్రంగా పతనమైంది. గ్రామీణ ఉత్పత్తి సూచీలు కూడా అధోముఖంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం తీవ్ర సమస్యగా ఉంది. నిన్నమొన్నటి వరకూ విదేశీ వాణిజ్యలోటు ఆందోళన కలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి అతి వేగంగా దిగజారి 4.7 శాతం వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సహజంగానే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరమైంది. స్థూలంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్‌లోకి (ధరలు పెరిగిపోతుండగా ఉత్పత్తి స్తం భించి ఉండే పరిస్థితి)దిగజారింది. ఇందుకు కారణమేమిటి? మూలాలు ఎక్కడున్నాయి? గత కొన్ని దశాబ్దాల కాలంలో నేటి ఆర్థిక రంగ దుస్థితికి పునాదులు పడ్డాయి. ఏ దేశ ఆర్థిక రంగంలోనైనా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం మూడూ కీలకమైనవి. ఈ మూడు రంగాల నడుమ సమతూకం లోపించడమే నేటి మన ఆర్థిక దుస్థితికి ప్రధాన కారణం. సమతూకం లోపించడమే సమస్య సాధారణంగా ఏ దేశమైనా తన అభివృద్ధి క్రమంలో తొలుత పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ఎదుగుదలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. మన కళ్ల ముందే చైనా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆ విధంగానే వృద్ధి చెందాయి. చైనా పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో అద్భుత ప్రగతిని సైతం సాధించగలిగింది. కానీ మన దేశం ఆర్థిక రంగం ‘ఎదుగుదల’ అందుకు భిన్నంగా సాగింది. వ్యవసాయ ఆధార దేశంగా ఉన్న స్థితి నుంచి ఒకే గంతులో మనం సేవా రంగంపై ఆధారపడే స్థితికి చేరలేం. అందుకోసం ప్రయత్నించడమే గాక పారిశ్రామిక వస్తు ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేశాం. నేడు మన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా 14 నుంచి 15 శాతం మాత్రమే. సేవా రంగం వాటా 55 శాతం పైగానే ఉంది. వ్యవసాయ రంగంపై పాలకుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా జీడీపీలో ఆ రంగం వాటా 14 శాతంగానే ఉంది. కాగా 55 నుంచి 60 శాతం ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ఈ అసమతూకమే అన్ని సమస్యలకు మూలం. 2008 సెప్టెంబర్‌లో బద్దలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ సంక్షోభంతో సంపన్న దేశాల ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. దీంతో విదేశీ ఎగుమతులు, కాంట్రాక్టులపై ఎక్కువగా ఆధారపడ్డ మన సేవా రంగం స్థితిగతులు దిగజారాయి. ఫలితంగా గత పది నెలలుగా సేవారంగ ఉత్పత్తి కుంచించుకుపోతోంది. ఆ రంగంలోని కార్యకలాపాల సూచీ 2014లో 48.5కు పడిపోయింది. ప్రధాన రంగంగా మారిన సేవారంగ పతనానికి అది సంకేతం. సేవా రంగంలోని కీలకమైనదైన ఐటీ రంగం 2012-13 కాలంలో సుమారు 66,000 మందికి ఉపాధిని కల్పించింది. అది 2013-14లో 33,000కు పడిపోయింది. ఈ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి మందగించిపోవడంతో విదేశీ కాంట్రాక్టులు తగ్గాయి. పైగా ఈ రంగంలో ఆటోమేషన్ పెరిగి గతంలో ముగ్గురు ఉద్యోగులు చేయగల పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. పారిశ్రామిక క్షీణత పారిశ్రామిక, వస్తు ఉత్పత్తి రంగం గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. అంతర్జాతీయ పోటీ తీవ్రంగా ఉన్న ఈ రంగంలో గత ఏడాది 0.9 శాతంగా ఉంది. నేడు 0.2 శాతానికి దిగజారింది. మొత్తం దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో దిగుమతుల వాటా 15 శాతం మాత్రమే. మన సరుకులను దిగుమతి చేసుకునే ధనిక దేశాలలోని క్షీణ ఆర్థిక స్థితి వల్ల కూడా మన ఎగుమతులకు అవకాశాలు సన్నగిల్లాయి. పైగా పాలకుల విధానాలవల్ల మన ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయింది. దీంతో పారిశ్రామిక వస్తువులకు దేశంలో సైతం గిరాకీ చాలా వరకు తగ్గిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పడు పారిశ్రామిక రంగ పురోగతికి పెద్ద పీట వేస్తామంటున్నారు. అందులో భాగంగా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ వంటి ప్రయత్నాలు మొదలెట్టారు. చైనాలో వేతనాలు పెరగడం వల్ల సంపన్న దేశాల పరిశ్రమలు అక్కడి నుంచి మన దేశానికి తరలి వస్తాయని ఆశ. వేతనాల పెరుగుదల వల్ల చైనాలో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని మనవాళ్ల అంచనా. మన దేశంలో వేతనాలు చైనా కంటే బాగా తక్కువగా ఉండటమే మన ఆశలకు పునాది. అయితే చైనా నుంచి ధనిక దేశాలకు దిగుమతులు తగ్గుముఖం పట్టడానికి పెరిగిన ఉత్పత్తి వ్యయాలు మాత్రమే కారణం కాదు. ధనిక దేశాల ప్రజల కొనుగోలు స్థితి దిగజారి ఉండటమే అందుకు ప్రధాన కారణం. అలాగే చైనా కోల్పోయే మార్కెట్ మనకే దక్కుతుందనుకోవ డం పొరపాటు. వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి పలు అల్ప వేతన దేశాల నుంచి మనకు గట్టి పోటీ తప్పదు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని మరచి హఠాత్తుగా మన దేశం పెద్ద పారిశ్రామిక దేశంగా ఎదుగుతుందనుకోవడం భ్రమ. సగానికి పైగా దేశ జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం నేడు దయనీయంగా ఉంది. వ్యవసాయం చేయడం ఇక తమ వల్ల కాదనే స్థితికి చేరిన రైతాంగం సంఖ్య 42 శాతానికి పైగా ఉండగా నేడది 75 శాతానికి పెరిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో అప్పులపాలై, దివాలా తీసి లక్షల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా 2018-19 నాటికి మన దేశ జీడీపీలో చెప్పుకోదగిన వృద్ధిని సాధించలేమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా. ఎంత భారీగా ఆర్థిక సంస్కరణలను అమలు జరిపినా మన వృద్ధి రేటు 7-8 శాతం స్థాయిని ఇప్పట్లో మించలేదని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ అంచనా. కాబట్టి సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవనేది స్పష్టం. పాలకులు మారడమే కాదు, విధానాలలో కూడా సహేతుకమైన మార్పులు రావడం తప్పనిసరి. ప్రధానంగా విదేశీ డిమాండుపై ఆధారపడిన సేవా రంగం గానీ, దేశీయ డిమాండుపై ఆధారపడిన పారిశ్రామిక రంగంగానీ ఆదుకోలేవు. అత్యధిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, దేశీయ డిమాండును పెంచగల వ్యవసాయ రంగంలో మాత్రమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అది తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1985 నాటికి మన జీడీపీలో సుమారు 1.4 శాతాన్ని మాత్రమే మన ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ఖర్చు పెడుతున్నాయి. 2010 నాటికి ఈ వ్యయం 0.60 శాతానికి తగ్గిపోయింది. వ్యవసాయ రంగంపై చైనా నేడు ఏటా జీడీపీలో 5 శాతం మేరకు ఖర్చు చేస్తోంది. ఈ ఒక్క గణాంకమే మన వ్యవసాయ రంగాన్ని ఆవహించిన దుస్థితిని సూచించగలదు. వ్యవసాయంపై కేంద్రీకరణే పరిష్కారం అందుచేత వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే దేశీయ డిమాండు పెరుగుతుంది. వ్యవసాయదారుల ఆదాయాలు పెరిగి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశంలోని సగానికి పైగా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయాధార పారిశ్రామిక ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఇది పట్టణాల్లో కూడా ఆర్థిక పునరుజ్జీవనాన్ని పెంపొందింపజేస్తుంది. నిరుద్యోగ సమస్య గణనీయంగా తగ్గుతుంది. దేశీయంగా డిమాండు కుంచించుకుపోయిన పరిస్థితికి పరిష్కారం లభిస్తుంది. మన ఆర్థిక సమస్యలకు ఇదే ఏకైక పరిష్కారం. అందుకోసం వ్యవసాయరంగంపై వెచ్చిస్తున్న మొత్తాలు పెరగాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి ఉత్పదకాలపై సబ్సిడీలను అందించాలి. సాగుకు అవసరమైన నీటి పారుదల సదుపాయాలను భారీగా విస్తరించాలి. వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచితంగా లేదా చౌకగా విద్యుత్తును అందించాలి. విధానపరమైన ఈ మౌలిక మార్పు మాత్రమే సమస్యల విషవలయంలో చిక్కుకున్న ఆర్థిక రంగాన్ని గట్టెక్కించగలదు. అలాంటి విధాన ప్రత్యమ్నాయాన్ని అనుసరించని ఏ ప్రభుత్వమైనా దేశ ప్రజల సమస్యలను పరిష్కరించలేదనడం నిస్సందేహం. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) డి. పాపారావు