సాగుతోనే సమగ్రాభివృద్ధి
వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే పారిశ్రామిక వస్తువులకు దేశీయ డిమాండు పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వృద్ధి పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి క్రమంగా దిగజారిపోతోంది. ఆ ఏడాదిలోనూ, గత ఏడాదిలోనూ రూపాయి విలువ తీవ్రంగా పతనమైంది. గ్రామీణ ఉత్పత్తి సూచీలు కూడా అధోముఖంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం తీవ్ర సమస్యగా ఉంది. నిన్నమొన్నటి వరకూ విదేశీ వాణిజ్యలోటు ఆందోళన కలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి అతి వేగంగా దిగజారి 4.7 శాతం వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సహజంగానే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరమైంది. స్థూలంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్‌లోకి (ధరలు పెరిగిపోతుండగా ఉత్పత్తి స్తం భించి ఉండే పరిస్థితి)దిగజారింది. ఇందుకు కారణమేమిటి? మూలాలు ఎక్కడున్నాయి? గత కొన్ని దశాబ్దాల కాలంలో నేటి ఆర్థిక రంగ దుస్థితికి పునాదులు పడ్డాయి. ఏ దేశ ఆర్థిక రంగంలోనైనా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం మూడూ కీలకమైనవి. ఈ మూడు రంగాల నడుమ సమతూకం లోపించడమే నేటి మన ఆర్థిక దుస్థితికి ప్రధాన కారణం.
సమతూకం లోపించడమే సమస్య
సాధారణంగా ఏ దేశమైనా తన అభివృద్ధి క్రమంలో తొలుత పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ఎదుగుదలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. మన కళ్ల ముందే చైనా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆ విధంగానే వృద్ధి చెందాయి. చైనా పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో అద్భుత ప్రగతిని సైతం సాధించగలిగింది. కానీ మన దేశం ఆర్థిక రంగం ‘ఎదుగుదల’ అందుకు భిన్నంగా సాగింది. వ్యవసాయ ఆధార దేశంగా ఉన్న స్థితి నుంచి ఒకే గంతులో మనం సేవా రంగంపై ఆధారపడే స్థితికి చేరలేం. అందుకోసం ప్రయత్నించడమే గాక పారిశ్రామిక వస్తు ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేశాం. నేడు మన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా 14 నుంచి 15 శాతం మాత్రమే. సేవా రంగం వాటా 55 శాతం పైగానే ఉంది. వ్యవసాయ రంగంపై పాలకుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా జీడీపీలో ఆ రంగం వాటా 14 శాతంగానే ఉంది. కాగా 55 నుంచి 60 శాతం ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ఈ అసమతూకమే అన్ని సమస్యలకు మూలం.
2008 సెప్టెంబర్‌లో బద్దలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ సంక్షోభంతో సంపన్న దేశాల ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. దీంతో విదేశీ ఎగుమతులు, కాంట్రాక్టులపై ఎక్కువగా ఆధారపడ్డ మన సేవా రంగం స్థితిగతులు దిగజారాయి. ఫలితంగా గత పది నెలలుగా సేవారంగ ఉత్పత్తి కుంచించుకుపోతోంది. ఆ రంగంలోని కార్యకలాపాల సూచీ 2014లో 48.5కు పడిపోయింది. ప్రధాన రంగంగా మారిన సేవారంగ పతనానికి అది సంకేతం. సేవా రంగంలోని కీలకమైనదైన ఐటీ రంగం 2012-13 కాలంలో సుమారు 66,000 మందికి ఉపాధిని కల్పించింది. అది 2013-14లో 33,000కు పడిపోయింది. ఈ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి మందగించిపోవడంతో విదేశీ కాంట్రాక్టులు తగ్గాయి. పైగా ఈ రంగంలో ఆటోమేషన్ పెరిగి గతంలో ముగ్గురు ఉద్యోగులు చేయగల పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు.
పారిశ్రామిక క్షీణత
పారిశ్రామిక, వస్తు ఉత్పత్తి రంగం గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. అంతర్జాతీయ పోటీ తీవ్రంగా ఉన్న ఈ రంగంలో గత ఏడాది 0.9 శాతంగా ఉంది. నేడు 0.2 శాతానికి దిగజారింది. మొత్తం దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో దిగుమతుల వాటా 15 శాతం మాత్రమే. మన సరుకులను దిగుమతి చేసుకునే ధనిక దేశాలలోని క్షీణ ఆర్థిక స్థితి వల్ల కూడా మన ఎగుమతులకు అవకాశాలు సన్నగిల్లాయి. పైగా పాలకుల విధానాలవల్ల మన ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయింది. దీంతో పారిశ్రామిక వస్తువులకు దేశంలో సైతం గిరాకీ చాలా వరకు తగ్గిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పడు పారిశ్రామిక రంగ పురోగతికి పెద్ద పీట వేస్తామంటున్నారు. అందులో భాగంగా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ వంటి ప్రయత్నాలు మొదలెట్టారు. చైనాలో వేతనాలు పెరగడం వల్ల సంపన్న దేశాల పరిశ్రమలు అక్కడి నుంచి మన దేశానికి తరలి వస్తాయని ఆశ. వేతనాల పెరుగుదల వల్ల చైనాలో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని మనవాళ్ల అంచనా. మన దేశంలో వేతనాలు చైనా కంటే బాగా తక్కువగా ఉండటమే మన ఆశలకు పునాది.
అయితే చైనా నుంచి ధనిక దేశాలకు దిగుమతులు తగ్గుముఖం పట్టడానికి పెరిగిన ఉత్పత్తి వ్యయాలు మాత్రమే కారణం కాదు. ధనిక దేశాల ప్రజల కొనుగోలు స్థితి దిగజారి ఉండటమే అందుకు ప్రధాన కారణం. అలాగే చైనా కోల్పోయే మార్కెట్ మనకే దక్కుతుందనుకోవ డం పొరపాటు. వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి పలు అల్ప వేతన దేశాల నుంచి మనకు గట్టి పోటీ తప్పదు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని మరచి హఠాత్తుగా మన దేశం పెద్ద పారిశ్రామిక దేశంగా ఎదుగుతుందనుకోవడం భ్రమ. సగానికి పైగా దేశ జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం నేడు దయనీయంగా ఉంది. వ్యవసాయం చేయడం ఇక తమ వల్ల కాదనే స్థితికి చేరిన రైతాంగం సంఖ్య 42 శాతానికి పైగా ఉండగా నేడది 75 శాతానికి పెరిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో అప్పులపాలై, దివాలా తీసి లక్షల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా 2018-19 నాటికి మన దేశ జీడీపీలో చెప్పుకోదగిన వృద్ధిని సాధించలేమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా. ఎంత భారీగా ఆర్థిక సంస్కరణలను అమలు జరిపినా మన వృద్ధి రేటు 7-8 శాతం స్థాయిని ఇప్పట్లో మించలేదని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ అంచనా. కాబట్టి సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవనేది స్పష్టం. పాలకులు మారడమే కాదు, విధానాలలో కూడా సహేతుకమైన మార్పులు రావడం తప్పనిసరి. ప్రధానంగా విదేశీ డిమాండుపై ఆధారపడిన సేవా రంగం గానీ, దేశీయ డిమాండుపై ఆధారపడిన పారిశ్రామిక రంగంగానీ ఆదుకోలేవు. అత్యధిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, దేశీయ డిమాండును పెంచగల వ్యవసాయ రంగంలో మాత్రమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అది తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1985 నాటికి మన జీడీపీలో సుమారు 1.4 శాతాన్ని మాత్రమే మన ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ఖర్చు పెడుతున్నాయి. 2010 నాటికి ఈ వ్యయం 0.60 శాతానికి తగ్గిపోయింది. వ్యవసాయ రంగంపై చైనా నేడు ఏటా జీడీపీలో 5 శాతం మేరకు ఖర్చు చేస్తోంది. ఈ ఒక్క గణాంకమే మన వ్యవసాయ రంగాన్ని ఆవహించిన దుస్థితిని సూచించగలదు.
వ్యవసాయంపై కేంద్రీకరణే పరిష్కారం
అందుచేత వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే దేశీయ డిమాండు పెరుగుతుంది. వ్యవసాయదారుల ఆదాయాలు పెరిగి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశంలోని సగానికి పైగా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయాధార పారిశ్రామిక ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఇది పట్టణాల్లో కూడా ఆర్థిక పునరుజ్జీవనాన్ని పెంపొందింపజేస్తుంది. నిరుద్యోగ సమస్య గణనీయంగా తగ్గుతుంది. దేశీయంగా డిమాండు కుంచించుకుపోయిన పరిస్థితికి పరిష్కారం లభిస్తుంది. మన ఆర్థిక సమస్యలకు ఇదే ఏకైక పరిష్కారం. అందుకోసం వ్యవసాయరంగంపై వెచ్చిస్తున్న మొత్తాలు పెరగాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి ఉత్పదకాలపై సబ్సిడీలను అందించాలి. సాగుకు అవసరమైన నీటి పారుదల సదుపాయాలను భారీగా విస్తరించాలి. వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచితంగా లేదా చౌకగా విద్యుత్తును అందించాలి. విధానపరమైన ఈ మౌలిక మార్పు మాత్రమే సమస్యల విషవలయంలో చిక్కుకున్న ఆర్థిక రంగాన్ని గట్టెక్కించగలదు. అలాంటి విధాన ప్రత్యమ్నాయాన్ని అనుసరించని ఏ ప్రభుత్వమైనా దేశ ప్రజల సమస్యలను పరిష్కరించలేదనడం నిస్సందేహం.
(వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) డి. పాపారావు