టార్గెట్‌ నల్ల డబ్బేనా..? | Is our target black money | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ నల్ల డబ్బేనా..?

Published Thu, Nov 17 2016 12:35 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

టార్గెట్‌ నల్ల డబ్బేనా..? - Sakshi

టార్గెట్‌ నల్ల డబ్బేనా..?

సందర్భం
కార్పొరేట్‌ రంగంలోని రుణ ఎగవేతదారులపై ఆస్తుల జప్తువంటి కఠినచర్యలకు బదు లుగా పెద్ద నోట్ల రద్దు చర్య కొద్ది స్థాయిలో నల్లడబ్బును వెలికి తీయగలిగినా, అంతిమంగా అది ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇల్లు తగులబెట్టే’ తీరుగానే ఉంటుంది.

పెద్దనోట్లను రద్దుచేస్తూ  దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మిక ప్రకటన చేశారు. దీని ఉద్దేశ్యం దేశంలో గుట్టలుగా పేరుకుపో యిన నల్లడబ్బును వెలికి తీయటం కోసమేనని ఒక సాధా రణ అభిప్రాయం, ఎక్కువమంది ప్రజలలో ఉంది. అయితే, ఈ క్రమంలో నల్లడబ్బును కలలో కూడా చూడలేని సామాన్య జనాలు పెద్ద స్థాయిలో ఇక్కట్ల పాలవుతున్నారనేది, ప్రజల ప్రధాన ఆరోపణ.

నిజానికి ఈ రూ. 500, 1000 నోట్ల రద్దు వెనుకన, నల్లడబ్బును అరికట్టడానికి మించిన ఇతరేతర ఆలోచనలు ఉన్నాయి. దేశీయ ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్లది కేవలం 10% వాటాయేననేది నిజం. పైగా, దేశంలోని నల్లడబ్బు నగదు రూపంలోనే కాకుండా, విదేశీ కరెన్సీ, విదేశీ బ్యాంకు అకౌంట్లు, బంగారం వంటి ఇతరేతర వనరుల రూపంలో కూడా పెద్ద స్థాయిలో ఉంది. కానీ నల్లధనానికి సంబంధిం చిన చర్చలు, కేవలం కరెన్సీనోట్ల చుట్టూనే తిరుగాడుతుం డటం గమనించాల్సిన విషయం.

ఈ నేపధ్యంలో ఈ కరెన్సీ నోట్ల రద్దు చర్య సారం, అసలు ఉద్దేశాలూ ఏమిటి? దీనికి సమాధానాన్ని దేశీయ ద్రవ్యలోటులో వెతకాలి. ఈ ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్యన వ్యత్యాసం) తగ్గించుకోవటం, మన ప్రభుత్వాలన్నింటి అంతిమ లక్ష్యంగా ఉంది. ప్రస్తుత పెద్దనోట్ల రద్దు చర్య సుమారు 30 బిలియన్ల మేరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూరు స్తుందని అంచనా. ఫలితంగా, ద్రవ్యలోటు తగ్గి దేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గగలదు. ఇది, విదేశీ ఫైనాన్స్‌ పెట్టు బడులకు ఆకర్షణీయమైన స్థితి.

ప్రస్తుత నోట్ల రద్దుతో బ్యాంకు డిపాజిట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా రూ. 2 లక్షల కోట్ల మేరన అదనపు డిపాజిట్లు బ్యాంకులకు వచ్చి చేరాయనేది అంచనా. ఫలితంగా, కార్పొరేట్‌ రంగానికి విచ్చలవిడిగా రుణాలిచ్చి, నేడు మెుండి బకాయిలతో సత మతమవుతున్న బ్యాంకులకు ద్రవ్య లభ్యత కూడా పెరుగు తుంది. ఈ క్రమంలోనే బ్యాంకుల వడ్డీ, డిపాజిట్ల రేట్లు కూడా తగ్గుతాయి. దీని వలన ఈ డబ్బు ఇతరేతర మదుపు మార్గాలకు మళ్లు తుంది. కానీ, గతంలో పెద్ద ఎత్తున జరిగినట్లు, ఈ మదు పులు రియల్‌ ఎస్టేట్‌ దిశగా సాగవు.  అలాగే, ఇక బంగారంలో పెట్టు బడుల దిశగా ఈ డబ్బు వెళ్లే అవకాశం లేదు. ఎందు చేతనంటే బంగారం అనేది కేవలం అలంకారప్రాయమైన సంపద మాత్రమే. దానిని పెట్టుబడిగా మార్చలేము.

ఇక ఈ పరిస్థితిలో ప్రజల వద్ద ఉన్న సంపద అనివార్యంగా షేర్‌మార్కెట్లు, బాండ్ల దిశగా మరలుతుందనేది ఒక అంచనా. అతి శక్తివంతమైన అంత ర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడుల చిరకాల డిమాండ్‌ ఇదే మరి. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం మన దేశ ప్రజలలో బంగారం కొనుగోళ్ల పట్ల ఉన్న మక్కువను తప్పుపడుతూ, ఈ పెట్టుబడులు మెరుగైన ఆదాయాల కోసం షేర్‌మార్కెట్ల దిశగా వెళితే మెరుగు అన్నట్లుగా చెబుతూవచ్చారు. పైగా, భారతీయులు ప్రధానంగా ఫైనాన్షియల్‌ సంపదకంటే, భౌతిక రూపంలోని (బంగారం, రియల్‌ఎస్టేట్‌ వంటివి) సంపదకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం కూడా, ప్రపంచ ఫైనాన్స్‌ పెట్టుబడులకు  జో హుకుం చేస్తోన్న మన పాల కులకు రుచించడం లేదు. అంతిమంగా, దేశీయ ఫైనాన్స్‌ పెట్టుబడులకు ఊతాన్ని ఇవ్వడమే అటు యు.పి.ఎ., ఇటు ఎన్డీఏ పక్షాల ప్రధాన లక్ష్యంగా ఉంది. అందుచేతనే 2008 సంక్షోభానంతరం ధనిక దేశాల షేర్‌మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ కుదేలవ్వడంతో, మదుపు అవకాశాలను కోల్పో యిన అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడులకు మన దలాల్‌ స్ట్రీట్‌ను గమ్యంగా మార్చాలనే ఆలోచన వచ్చింది.

అయితే, నేటి కరెన్సీ నోట్ల రద్దు ఫలితంగా.. మార్కెట్‌ లో ద్రవ్యచలామణీని తగ్గించడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గిపోవడం, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గటం తదితర పరిణామాలు జరుగుతాయి. అంటే, ఇప్ప టికే అంతంత మాత్రంగా ఉన్న, మన ఆర్థిక వృద్ధిరేటు, ప్రజల కొనుగోలు శక్తిని పణంగా పెట్టైనా సరే, దేశీయ షేర్‌ మార్కెట్ల దిశగా పెట్టుబడులు ప్రవహించేలా చేయటం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లుగా కనపడుతోంది. దీనివలన లబ్ధి పొందేది విదేశీ ఫైనాన్స్‌ పెట్టుబడులే! ఫలితంగా షేర్‌ మార్కెట్ల ఒడిదుడుకుల క్రమంలో మన దేశ సామాన్య జనం, మధ్యతరగతుల జీవితాలు కుదేలవుతాయి.

కాబట్టి నల్లధనం నివారణ పేరిట పెద్దనోట్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయించడం అత్యధిక సంఖ్యలో అమాయకు లైన జనసామాన్యాన్ని ఇక్కట్ల పాలు చేసే విధంగానే ఉంది. అంతేకాకుండా, దేశీయ నల్లధనంలోని సింహభాగం  కార్పొరేట్ల వద్దనే ఉందనేది కఠోర వాస్తవం. పైగా, నేడు మన బ్యాంకింగ్‌ రంగంలో  ఆందోళనకర స్థాయిలో మెుండి బకాయిలు పేరుకు పోవడానికి మూలకారణం కూడా ఈ కార్పొరేట్‌ రంగంలోని ఒక పెద్ద విభాగమే. కాబట్టి, వారిలోని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా, ప్రస్తుత తరహాలో పెద్ద నోట్ల రద్దుచర్యల వంటివి కొద్దిపాటి స్థాయిలో నల్లడబ్బును వెలికితీయగలిగినా, అంతిమంగా అది ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇల్లు తగులబెట్టే’ తీరుగానే ఉంటుంది. ఇప్ప టికే విదేశాలలోని నల్లడబ్బును తిరిగి తేవడంలో మన కేంద్ర ప్రభుత్వపు వైఫల్యం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి పరిస్థితిలో ‘ఏనుగులు పోయే దారులను వదిలేసి, ఎలుకలు పోయే కలుగులను పూడ్చే’ తీరుగా సాగుతోన్న కేంద్రప్రభుత్వ చర్యలు దేశీయ సామాన్యజనం, మధ్యతరగతిలో మరింత అసంతృప్తిని రగల్చడం ఖాయం.

వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు ‘ 98661 79615
డి. పాపారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement