
ఢిల్లీ: అగ్ని ప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma)తో పాటు అతని కుటుంబ సభ్యులు ఖండించారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనే ప్రచారం జరగడం షాకింగ్‌గా ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఢిల్లీ హైకోర్టు సీజేకు లేఖ
ఆ డబ్బులు తన ఇంట్లో దొరకలేదని, ఆ గది తన ప్రధాన నివాసానికి ఏమాత్రం సంబంధలేదని తెలిపారు. ఇంట్లో సహాయకులు మాత్రమే ఆ గదిని వినియోగించుకునే వారని చెప్పారు. ఈ మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు (devendra kumar upadhyaya) జస్టిస్ వర్మ ఒక లేఖ రాశారు.
#BREAKING Video shared by Delhi Police Commissioner regarding the fire at Justice Yashwant Varma’s house, when cash currencies were discovered. pic.twitter.com/FEU50vHwME
— Live Law (@LiveLawIndia) March 22, 2025
ఖండిస్తున్నాను
ఆ లేఖలో ‘నోట్ల కట్టలు దొరికాయని ఆరోపణలు వస్తున్న స్టోర్ రూం నిరుపయోగంగా ఉండేది. పాత ఫర్నిచర్, సీసాలు, వంట సామగ్రి, పరుపులు, పాత స్పీకర్లు, తోట పనికి అవసరమైన సామగ్రి, అలాగే సీపీడబ్ల్యుడి (CPWD) మెటీరియల్ వంటివి అక్కడ నిల్వ ఉంచేవారు. ఇంట్లో సహాయకులకు అందుబాటులో ఉండే గది. నా ఇంటికి దీనికి సంబంధం లేదు. కాని దీనిని నా ఇంటి భాగంగా చూపించడాన్ని నేను ఖండిస్తున్నాను.
బ్యాంక్ ట్రాన్సాక్షన్‌ను పరిశీలించండి
మార్చి 14న నేను, నా సతీమణి మధ్యప్రదేశ్‌లో ఉన్నాం. ప్రమాదం జరిగే సమయంలో తన ఇంట్లో తమ కుమార్తె, తల్లి మాత్రమే ఉన్నారు. మార్చి 15న తాము భోపాల్ నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి తిరిగి వచ్చాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నా కుమార్తె, నా ప్రైవేట్ సెక్రటరీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి కాల్ రికార్డులను పరిశీలించొచ్చు. అయితే, అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చాక అక్కడ నగదు కనిపించలేదు.
నా కుటుంబ సభ్యులెవరూ స్టోర్ రూంలో నగదు ఉంచలేదు. మా డబ్బు లావాదేవీలు అన్ని బ్యాంకింగ్ చానెల్స్ ద్వారానే జరుగుతాయి. యూపీఐ, కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తాం
నాకే షాకింగ్‌గా ఉంది
ఈ సందర్భంగా నాకు షాకింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే? నా ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వెలుగులోకి వచ్చిన వీడియోలు,ఫొటోలు.. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే కనిపించలేదు. నా మీద కుట్ర జరుగుతోందని నాకు అనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటన నా వ్యక్తిత్వాన్ని, న్యాయవ్యవస్థలో నా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. గతంలో కూడా సోషల్ మీడియాలో నాపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా వాటికి కొనసాగింపు అనేది నా అనుమానం.
నా ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర
నా న్యాయ జీవితంలో, నా న్యాయ నిర్ణయాల్లో ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు, ఆధారాలు లేని ఆరోపణలతో నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నా నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టాలని కోరుతున్నాను’ అని సుదీర్ఘంగా రాసిన లేఖలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కమిటీ
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్ హర్యాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు.
కాగా, ఈ కేసు పరిణామాలు తేలే వరకు జస్టిస్ వర్మకు కొత్త న్యాయపరమైన పనులను కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment