Confiscation of assets
-
రూ.1,460 కోట్ల బాండ్ సమర్పించిన ట్రంప్
న్యూయార్క్: ఆస్తులను ఎక్కువ చేసి చూసి రుణాలు, బీమాలు పొంది బ్యాంక్‌లు, బీమా సంస్థలను మోసం చేశారన్న కేసులో కోర్టు ఆదేశాల మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా రూ.1,460( 17.5 కోట్ల డాలర్లు) విలువైన ష్యూరిటీ బాండ్‌ను న్యూయార్క్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో గతంలో రూ.3,785 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు గతంలో ట్రంప్‌కు సూచించింది. దీనిపై ట్రంప్ పై కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. అయితే ఆలోపు ఆస్తుల జప్తు ఆగాలంటే కనీసం 17.5 కోట్ల డాలర్ల బాండ్‌ను తమకు సమర్పించాలంటూ ట్రంప్‌కు న్యూయార్క్ అప్పీలేట్ కోర్టు 10 రోజుల గడువు ఇచ్చిన తెల్సిందే. దీంతో ట్రంప్ ఎట్టకేలకు అంతటి భారీ మొత్తానికి బాండ్ సమర్పించారు. దీంతో ట్రంప్ ఆస్తుల జప్తు తాత్కాలికంగా ఆగింది. 45.4 కోట్ల డాలర్ల(రూ.3,785 కోట్ల) జరిమానా సంబంధిత ఈ కేసులో ట్రంప్ ఒక వేళ గెలిస్తేనే ఈ రూ.1,460 కోట్ల బాండ్‌ను ఆయనకు తిరిగి ఇస్తారు. ఓడితే ట్రంప్ మొత్తం 45.4 కోట్ల డాలర్ల జరిమానాను రోజువారీ వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. -
G20 Anti-Corruption Meet: నేరగాళ్ల ఆస్తులను జప్తు చేద్దాం
కోల్‌కతా: అవినీతిపై ఉమ్మడిగా పోరాడదామని జీ 20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థిక తదితర నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకునే ఘరానా వ్యక్తుల ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. శనివారం కోల్‌కతాలో జరిగిన జీ 20 అవినీతి నిరోధక మంత్రుల స్థాయి భేటీని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాంటి నేరగాళ్లు విదేశాల్లో కూడబెట్టిన, పోగేసిన అక్రమాస్తులను, చేసిన అక్రమాలను సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నేరగాళ్లను వీలైనంత త్వరగా మాతృ దేశానికి అప్పగించడం కూడా సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతి వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోయేది నిరుపేదలేనని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. -
తిన్నది కక్కిస్తున్నారు
-
జయలలిత ఆస్తులు జప్తు చేశాం: ఐటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులన్నిటినీ జప్తు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ మద్రాసు హైకోర్టుకు తెలిపింది. జయలలితకు రూ.913 కోట్లకు పైగా ఆస్తులున్నాయని, వాటి నిర్వహణ, పర్యవేక్షణపై ఆమె ఎలాంటి వీలునామా రాయనందున హైకోర్టే పర్యవేక్షకుడిని నియమించాలంటూ చెన్నైకు చెందిన అన్నాడీఎంకే నేత పుహళేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం ఈ కేసును జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ శరవణన్ విచారించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శోభ కోర్టుకు హాజరై.. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత బంగ్లాతోపాటు తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న ఇతర ఆస్తులన్నింటినీ తమ శాఖ ఇప్పటికే జప్తు చేసినందున పర్యవేక్షణకు మరొకరిని నియమించాల్సిన అవసరం లేదన్నారు. -
నా ఆస్తుల జప్తు అమానుషం: మాల్యా
ముంబై: ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారికి సంబంధించిన చట్టం (ఎఫ్ఈఓఏ), 2018 కింద తన ఆస్తుల జప్తు అమానుషమని బ్యాంకులకు వేలాదికోట్ల రూపాయలు ఎగొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న విజయ్‌మాల్యా పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన ఆస్తుల జప్తు చేయాలనుకోవడం బ్యాంకులు, రుణదాతలకు ఎటువంటి ప్రయోజనం నెరవేర్చదని కూడా ఆయన బొంబై హైకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. జస్టిస్ ఐఏ మహంతీ, జస్టిస్ ఏఎం బాదర్‌లతో కూడిన ధర్మాసనం ముందు మాల్యా తరఫున ఆయన న్యాయవాది అమిత్ దేశాయ్ తన వాదనలు వినిపిస్తూ, ‘‘ఆస్తుల జప్తు చర్యలు అమానుషం. బ్యాంకులు, రుణ గ్రహీతలతో ప్రస్తుతం ఒక అవగాహన కుదుర్చుకోవడం అవసరం. మాల్యా ఆస్తులను తిరిగి కోరుకోవడం లేదు. ఆస్తుల జప్తు చేయడం వల్ల బ్యాంకులు, రుణ దాతలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదని మాత్రం ఆయన చెప్పదలచుకున్నారు’’ అని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా తప్పుపట్టింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా పడింది. ఎఫ్ఈఓఏ, 2018 సెక్షన్ 12 కింద మాల్యాను ‘‘పారిపోయిన’’ నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్ కోర్ట్ ప్రకటించింది. ఇదే చట్టం కింద మాల్యా ఆస్తుల జప్తునకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను ఈ నెల 8వ తేదీన ప్రత్యేక ఎంఎంఎల్‌ఏ (అక్రమ ధనార్జన) కోర్టు విననుంది. గత ఏడాది జూన్ 22న ఆమోదం పొందిన కొత్త చట్టం కింద ఈ తరహా కేసు విచారణ ఇదే మొదటిసారి. ఈడీ పిటిషన్ ఆమోదం పొందితే, మాల్యాకు చెందిన రూ.12,000 కోట్ల ఆస్తుల జప్తునకు వాటిని విక్రయించి రుణ దాతల బకాయిల చెల్లింపునకు ఈడీకి మార్గం సుగమం అవుతోంది. అయితే తనను ‘‘పారిపోయిన’’ నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్ కోర్ట్ ప్రకటించడాన్ని మాల్యా ముంబై హైకోర్టులో సవాలు చేశారు. -
కార్తీ చిదంబరం ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో దేశ, విదేశాల్లో ఉన్న రూ.54 కోట్ల విలువైన కార్తీ చిదంబరం ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం ప్రకటించింది. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్‌లలో ఉన్న సాగు భూమి, బంగళా, ఢిల్లీలో కార్తీ, అతని తల్లి నళిని పేరిట ఉన్న రూ.16 కోట్ల ఖరీదైన ఫ్లాట్, బ్రిటన్‌లోని సోమర్సెట్లో ఉన్న రూ.8.67 కోట్ల కాటేజీ, ఇల్లు, స్పెయిన్‌లోని బార్సిలోనాలో రూ.14.57 కోట్ల టెన్నిస్ క్లబ్‌లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ప్రకారం జప్తు చేస్తున్నట్లు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై బ్యాంకులోని కార్తీకి, అతనికి చెందినదిగా భావిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్) పేరుతో ఉన్న రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. ’అటాచ్మెంట్ ఉత్తర్వు చట్ట విరుద్ధం..హాస్యాస్పదం, అనాగరికం. వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం పిచ్చి ఊహాగానాలతో తీసుకున్న చర్య. వార్తల్లోకి ఎక్కటమే దీని వెనుక ఉద్దేశం’ అని కార్తీ అన్నారు. -
637 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (పీఎన్బీ) మోసం చేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి దేశవిదేశాల్లో ఉన్న రూ. 637 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది. భారత్‌తో పాటు బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో స్థిరాస్తులు, జ్యుయలరీ, ఫ్లాట్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌ల రూపంలో ఈ అసెట్స్ ఉన్నట్లు వివరించింది. ఈ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య నానావతిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పీఎన్బీని నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలు దాదాపు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. జప్తు చేసిన మోదీ ఆస్తుల్లో న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో రూ.216 కోట్ల విలువ చేసే రెండు అపార్ట్‌మెంట్‌లున్నట్లు ఈడీ పేర్కొంది. ఇథాకా ట్రస్ట్ పేరుతో వీటిని కొనుగోలు చేశారని, దీని లబ్ధిదారు నీరవ్ మోదీ భార్య అమీ మోదీ అని వివరించింది. దుబాయ్, బహమాస్, అమెరికా, సింగపూర్ తదితర దేశాల నుంచి ఈ ట్రస్ట్‌లోకి నిధులు వచ్చాయని తెలిపింది. మరోవైపు, లండన్‌లోని మెర్లిబోన్‌లో సుమారు రూ. 57 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కూడా అటాచ్ చేసింది. దీనికి మోదీ సోదరి పుర్వి లబ్ధిదారు. వీటితో పాటు దాదాపు రూ. 278 కోట్లు ఉన్న 5 బ్యాంక్ ఖాతాలనూ ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో హాంకాంగ్ నుంచి రూ. 23 కోట్ల వజ్రాభరణాలు భారత్‌కు వెనక్కి తీసుకొచ్చింది. అటు పుర్వి పేరిట ముంబైలోని ఫ్లాట్‌నూ ఈడీ అటాచ్ చేసింది. -
గంజాయి, గుట్కాలు విక్రయిస్తే ఆస్తులు సీజ్
విజయనగరం టౌన్ : ఖైనీ, గుట్కాతో పాటూ గంజాయి అక్రమ రవాణా జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. ఒడిశా నుంచి ఖైనీ, గుట్కా, గంజాయి తీసుకువచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అక్రమ రవాణా గుట్టురట్టవుతోంది. ఇటువంటి నిషేధిత వస్తువుల క్రయ, విక్రయాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసి దాడులు చేపట్టింది. అయినప్పటికీ వ్యాపారులు వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా తమ వ్యాపారాలను రహస్యంగా సాగిస్తున్నారు. తరలిపోతుందిలా... ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకువస్తున్న నిషేధిత ఖైనీ, గుట్కాలు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 2017లో జిల్లాలో 529 కేసులు నమోదవ్వగా... ఈ ఏడాది మే 21 నాటికి 57 కేసులు నమోదుచేశారు. వీటితో పాటు విజయనగరం పోలీస్‌లు 86 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 17, 80, 286 విలువైన సరుకు సీజ్ చేశారు. అదేవిధంగా గంజాయి కూడా ఇతర ప్రాంతాల నుంచి మన జిల్లా మీదుగా తరలిపోతుంది. ఇందులో ప్రధానంగా పెదబయలు, మంగబంద, గుంటసీమ, డబ్రిగూడ, అరకు మీదుగా అనంతగిరి, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస మీదుగా విశాఖ తరలిపోతుంటుంది. అదేవిధంగా కొటారుబిల్లి జంక్షన్, గంట్యాడ, తదితర ప్రాంతాల మీదుగా జిల్లాలోకి గంజాయి తరలిస్తున్నారు. ఒడిశాలో కోరాపుట్ నుంచి బరంపురం, సాలూరు మీదుగా విజయనగరంలోకి గంజాయి వస్తోంది. వీటితో పాటు రాయగడ మీదుగా పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి మీదుగా విజయనగరం మీదుగా విశాఖ, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు. చెక్ పడేనా.. ? గంజాయి, ఖైనీ, గుట్కా వంటి నిషేధిత వస్తువుల రవాణాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. 24 గంటలూ తనిఖీలు చేపడుతున్నందున 2017లో 63 మందిని, 2018 ఇప్పటి వరకు 21 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్దన నుంచి ఆరువేలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి రవాణా కొనసాగిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించే సమయాల్లో కొంతమంది పోలీసులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఆస్తులు సీజ్ చేస్తాం ఖైనీ, గుట్కా, గంజాయిలను విక్రయిస్తూ పట్టుబడితే వారి ఆస్తులు జప్తు చేస్తాం. ఒక కేసు కంటే ఎక్కువ ఉన్న వారిని గుర్తిస్తున్నాం. నాలుగు కంటే ఎక్కువ కేసులుంటే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం. –జి.పాలరాజు, ఎస్పీ, విజయనగరం. -
జయ ఆస్తుల జప్తు?
అమ్మ మరణించింది. ఆస్తుల కేసులో జైలు శిక్ష తప్పింది. అయితే ఆమెకు విధించిన రూ.100 కోట్ల జరిమానా మాత్రం ఇంకా బతికే ఉంది. జయ శశికళ, ఇళవరసి,సుధాకరన్ కలిసి చెల్లించాల్సిన రూ.130 కోట్ల కోసం వారి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలనుఅనుసరించి ఆరు జిల్లాల్లోని జయలలితకు సొంతమైన ఆస్తులను పరిశీలించి స్వాధీనం చేసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వం త్వరలో ఒక జీవో జారీచేయనుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో జయలలిత చెల్లించాల్సిన జరిమానా కింద ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని 1991–96 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.66 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు డీఎంకే ప్రభుత్వ హయాంలో జయలలితపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో జయ నెచ్చెలి శశికళ, శశికళ వదిన ఇళవరసి, శశికళ అక్క కుమారుడు, జయ మాజీ దత్తపుత్రుడు సుధాకరన్‌లను కూడా నిందితులుగా చేర్చారు. డీఎంకే హయాంలో ఈ కేసు కొన్నేళ్లు చెన్నై కోర్టులో విచారణ సాగింది. అ తరువాత ఎన్నికల్లో మరలా జయ అధికారంలోకి రావడంతో డీఎంకే వేసిన పిటిషన్‌తో కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. మొత్తం 20 ఏళ్లపాటు ఈ కేసు విచారణ సాగింది. ఎట్టకేలకుగత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జయలలిత సహా నలుగురికి నాలుగేళ్ల శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంతేగాక జయ రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురూ తలా రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పటికే జయ మరణించడంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఏడాదికి పైగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జరిమానా వసూలుకు పిటిషన్ జయలలిత కన్నుమూసిన కారణంగా ఆమెకు విధించిన రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ గత ఏడాది మార్చి 22వ తేదీన సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది మేలో నలుగురి ఆస్తులను గుర్తించే పనిలో పడింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అనేక ఆస్తులను గుర్తించగా వాటిలో 128 ఆస్తులను జీవోల ద్వారా జప్తుచేశారు. మరో 68 అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. జరిమానా కింద కేసులో పేర్కొని ఉన్న జయకు చెందిన కొడనాడు ఎస్టేట్ తదితర ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కోర్టు తుదితీర్పు వెలువడి ఏడాది దాటినా ఆస్తుల స్వాధీనంపై చర్యలు చేపట్టని తమిళనాడు ప్రభుత్వంలో ఇటీవల కదలిక వచ్చింది. జయ సహా మొత్తం నలుగురికి చెందిన 68 ఆస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరునెల్వేలి, తంజావూరు, నీలగిరి... ఈ ఆరు జిల్లాల్లో ఈ నలుగురికి చెందిన భారీ ఆస్తులను లెక్కకట్టే చర్యలు చేపట్టింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరు జిల్లా కలెక్టర్లకు మార్చిలో ఉత్తరాలు కూడా రాశారు. అయితే ఏ చట్టం కింద ఆస్తులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు సందేహాన్ని వెలిబుచ్చారు. తమిళనాడు ప్రభుత్వ రెవెన్యూ ఆస్తుల స్వాధీనం చట్టం పరిధిలో సదరు ఆస్తులు ఉన్నాయని, ఈ ఆస్తులపై ఎలాంటి పరిశీనలను చేపట్టగలమని ప్రశ్నించారు. రెవెన్యూ ఆస్తుల స్వాధీనం చట్టం కిందనే జయ తదితరుల ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని ఆస్తుల కేసును విచారించిన పోలీసు ఉన్నతాధికారి ప్రభుత్వానికి సలహాఇచ్చారు. ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతి శశికళ తదితరుల జరిమానా వసూలు కోసం వారి ఆస్తులను అమ్మకానికి కోర్టు అనుమతిచ్చింది. ప్రత్యేక కోర్టు నడిపిన కర్ణాటక ప్రభుత్వానికి రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. జయ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులను ఎలా అమ్మాలో ఇంకా నిర్ణయం జరగలేదు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయ ఇంటిని స్మారక భవనంగా మారుస్తున్నారు. సదరు 68 ఆస్తులపై హక్కును తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించే నిమిత్తం పరిశీలన జరిపేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం అవుతున్నారు. అలాగే మరో ఆరు బినామీ కంపెనీలను సైతం గుర్తించారు. ఆస్తుల స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నా జయ చెల్లించాల్సిన రూ.100 కోట్లకు సమం అవుతుందా అనే సందేహం కూడా ప్రభుత్వంలో నెలకొంది. త్వరలో ఒక జీవో జారీ అయ్యే అవకాశం ఉందని అవినీతి నిరోధకశాఖ పోలీసు అధికారులు చెప్పారు. సదరు ఆస్తులు ప్రభుత్వ పరమైన తరువాత వాటిని ఏం చేయాలనే అంశంపై కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనం
న్యూఢిల్లీ: దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకేచెప్పింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును మార్చి 12నే లోక్‌సభలో ప్రవేశపెట్టినా ప్రతిష్టంభన వల్ల గట్టెక్కలేదు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వ్యాపారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి సంతకం చేశాక అమల్లోకి వస్తుంది. విచారణ కోసం భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరించే, అరెస్ట్ వారెంట్ జారీ అయిన, రూ.100 కోట్లకు పైగా రుణాలు చెల్లించని ఆర్థిక నేరగాళ్లకు ఈ ఆర్డినెన్స్ నిబంధనలు వర్తిస్తాయి. దోషిగా తేలకున్నా జప్తే.. ఆర్డినెన్స్ ప్రకారం నిందితుడు దోషి అని తేలక ముందే అతని ఆస్తులు అమ్మి రుణదాతలకు చెల్లించొచ్చు. ఆ నేరగాళ్లను మనీ ల్యాండరింగ్ వ్యతిరేక చట్టం కింద విచారిస్తారు. సదరు నిందితుడిని పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ విచారణ సంస్థ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాలి. నిందితుడు ఎక్కడున్నదీ, నేరానికి పాల్పడి అతను కూడబెట్టిన ఆస్తులు, స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులు, బినామీ ఆస్తులు, విదేశాల్లోని ఆస్తులు తదితర వివరాలను ఆ దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా తమ ముందు హాజరు కావాలని కోర్టు నిందితుడికి నోటీసులు పంపుతుంది. స్పెషల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయొచ్చు. స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఈ–పరిపాలనకు తీసుకోవాల్సిన చర్యల కోసం సరికొత్తగా తీర్చిదిద్దిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ)కే కేబినెట్ పచ్చజెండా ఊపింది. పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని అమల్లో కేంద్రం, రాష్ట్రాల వాటా 60:40 కాగా ఈశాన్య రాష్ట్రాలకైతే అది 90:10గా నిర్ధారించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రమే 100 శాతం భరిస్తుంది. పథకానికి అయ్యే వ్యయం 7255.50 కోట్లు. -
నీరవ్‌కు చెందిన రూ.26 కోట్ల ఆస్తుల జప్తు
ముంబై/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ముంబైలో మోదీకి చెందిన సముద్ర మహల్ లగ్జరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లలో ఇప్పటివరకూ రూ.26.4 కోట్ల విలువైన ఆభరణాలు, చేతి గడియారాలు, పెయింటింగ్‌లను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎంఎఫ్ హుస్సేన్, కె.కె.హెబ్బర్ తదితరుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఆభరణాల్లో ఓ ఉంగరం విలువే రూ.10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. -
టార్గెట్ నల్ల డబ్బేనా..?
సందర్భం కార్పొరేట్ రంగంలోని రుణ ఎగవేతదారులపై ఆస్తుల జప్తువంటి కఠినచర్యలకు బదు లుగా పెద్ద నోట్ల రద్దు చర్య కొద్ది స్థాయిలో నల్లడబ్బును వెలికి తీయగలిగినా, అంతిమంగా అది ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇల్లు తగులబెట్టే’ తీరుగానే ఉంటుంది. పెద్దనోట్లను రద్దుచేస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మిక ప్రకటన చేశారు. దీని ఉద్దేశ్యం దేశంలో గుట్టలుగా పేరుకుపో యిన నల్లడబ్బును వెలికి తీయటం కోసమేనని ఒక సాధా రణ అభిప్రాయం, ఎక్కువమంది ప్రజలలో ఉంది. అయితే, ఈ క్రమంలో నల్లడబ్బును కలలో కూడా చూడలేని సామాన్య జనాలు పెద్ద స్థాయిలో ఇక్కట్ల పాలవుతున్నారనేది, ప్రజల ప్రధాన ఆరోపణ. నిజానికి ఈ రూ. 500, 1000 నోట్ల రద్దు వెనుకన, నల్లడబ్బును అరికట్టడానికి మించిన ఇతరేతర ఆలోచనలు ఉన్నాయి. దేశీయ ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్లది కేవలం 10% వాటాయేననేది నిజం. పైగా, దేశంలోని నల్లడబ్బు నగదు రూపంలోనే కాకుండా, విదేశీ కరెన్సీ, విదేశీ బ్యాంకు అకౌంట్లు, బంగారం వంటి ఇతరేతర వనరుల రూపంలో కూడా పెద్ద స్థాయిలో ఉంది. కానీ నల్లధనానికి సంబంధిం చిన చర్చలు, కేవలం కరెన్సీనోట్ల చుట్టూనే తిరుగాడుతుం డటం గమనించాల్సిన విషయం. ఈ నేపధ్యంలో ఈ కరెన్సీ నోట్ల రద్దు చర్య సారం, అసలు ఉద్దేశాలూ ఏమిటి? దీనికి సమాధానాన్ని దేశీయ ద్రవ్యలోటులో వెతకాలి. ఈ ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్యన వ్యత్యాసం) తగ్గించుకోవటం, మన ప్రభుత్వాలన్నింటి అంతిమ లక్ష్యంగా ఉంది. ప్రస్తుత పెద్దనోట్ల రద్దు చర్య సుమారు 30 బిలియన్ల మేరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూరు స్తుందని అంచనా. ఫలితంగా, ద్రవ్యలోటు తగ్గి దేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గగలదు. ఇది, విదేశీ ఫైనాన్స్ పెట్టు బడులకు ఆకర్షణీయమైన స్థితి. ప్రస్తుత నోట్ల రద్దుతో బ్యాంకు డిపాజిట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా రూ. 2 లక్షల కోట్ల మేరన అదనపు డిపాజిట్లు బ్యాంకులకు వచ్చి చేరాయనేది అంచనా. ఫలితంగా, కార్పొరేట్ రంగానికి విచ్చలవిడిగా రుణాలిచ్చి, నేడు మెుండి బకాయిలతో సత మతమవుతున్న బ్యాంకులకు ద్రవ్య లభ్యత కూడా పెరుగు తుంది. ఈ క్రమంలోనే బ్యాంకుల వడ్డీ, డిపాజిట్ల రేట్లు కూడా తగ్గుతాయి. దీని వలన ఈ డబ్బు ఇతరేతర మదుపు మార్గాలకు మళ్లు తుంది. కానీ, గతంలో పెద్ద ఎత్తున జరిగినట్లు, ఈ మదు పులు రియల్ ఎస్టేట్ దిశగా సాగవు. అలాగే, ఇక బంగారంలో పెట్టు బడుల దిశగా ఈ డబ్బు వెళ్లే అవకాశం లేదు. ఎందు చేతనంటే బంగారం అనేది కేవలం అలంకారప్రాయమైన సంపద మాత్రమే. దానిని పెట్టుబడిగా మార్చలేము. ఇక ఈ పరిస్థితిలో ప్రజల వద్ద ఉన్న సంపద అనివార్యంగా షేర్మార్కెట్లు, బాండ్ల దిశగా మరలుతుందనేది ఒక అంచనా. అతి శక్తివంతమైన అంత ర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడుల చిరకాల డిమాండ్ ఇదే మరి. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం మన దేశ ప్రజలలో బంగారం కొనుగోళ్ల పట్ల ఉన్న మక్కువను తప్పుపడుతూ, ఈ పెట్టుబడులు మెరుగైన ఆదాయాల కోసం షేర్మార్కెట్ల దిశగా వెళితే మెరుగు అన్నట్లుగా చెబుతూవచ్చారు. పైగా, భారతీయులు ప్రధానంగా ఫైనాన్షియల్ సంపదకంటే, భౌతిక రూపంలోని (బంగారం, రియల్ఎస్టేట్ వంటివి) సంపదకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం కూడా, ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడులకు జో హుకుం చేస్తోన్న మన పాల కులకు రుచించడం లేదు. అంతిమంగా, దేశీయ ఫైనాన్స్ పెట్టుబడులకు ఊతాన్ని ఇవ్వడమే అటు యు.పి.ఎ., ఇటు ఎన్డీఏ పక్షాల ప్రధాన లక్ష్యంగా ఉంది. అందుచేతనే 2008 సంక్షోభానంతరం ధనిక దేశాల షేర్మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ కుదేలవ్వడంతో, మదుపు అవకాశాలను కోల్పో యిన అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకు మన దలాల్ స్ట్రీట్‌ను గమ్యంగా మార్చాలనే ఆలోచన వచ్చింది. అయితే, నేటి కరెన్సీ నోట్ల రద్దు ఫలితంగా.. మార్కెట్ లో ద్రవ్యచలామణీని తగ్గించడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు మరింతగా తగ్గిపోవడం, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గటం తదితర పరిణామాలు జరుగుతాయి. అంటే, ఇప్ప టికే అంతంత మాత్రంగా ఉన్న, మన ఆర్థిక వృద్ధిరేటు, ప్రజల కొనుగోలు శక్తిని పణంగా పెట్టైనా సరే, దేశీయ షేర్ మార్కెట్ల దిశగా పెట్టుబడులు ప్రవహించేలా చేయటం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లుగా కనపడుతోంది. దీనివలన లబ్ధి పొందేది విదేశీ ఫైనాన్స్ పెట్టుబడులే! ఫలితంగా షేర్ మార్కెట్ల ఒడిదుడుకుల క్రమంలో మన దేశ సామాన్య జనం, మధ్యతరగతుల జీవితాలు కుదేలవుతాయి. కాబట్టి నల్లధనం నివారణ పేరిట పెద్దనోట్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయించడం అత్యధిక సంఖ్యలో అమాయకు లైన జనసామాన్యాన్ని ఇక్కట్ల పాలు చేసే విధంగానే ఉంది. అంతేకాకుండా, దేశీయ నల్లధనంలోని సింహభాగం కార్పొరేట్ల వద్దనే ఉందనేది కఠోర వాస్తవం. పైగా, నేడు మన బ్యాంకింగ్ రంగంలో ఆందోళనకర స్థాయిలో మెుండి బకాయిలు పేరుకు పోవడానికి మూలకారణం కూడా ఈ కార్పొరేట్ రంగంలోని ఒక పెద్ద విభాగమే. కాబట్టి, వారిలోని ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా, ప్రస్తుత తరహాలో పెద్ద నోట్ల రద్దుచర్యల వంటివి కొద్దిపాటి స్థాయిలో నల్లడబ్బును వెలికితీయగలిగినా, అంతిమంగా అది ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇల్లు తగులబెట్టే’ తీరుగానే ఉంటుంది. ఇప్ప టికే విదేశాలలోని నల్లడబ్బును తిరిగి తేవడంలో మన కేంద్ర ప్రభుత్వపు వైఫల్యం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి పరిస్థితిలో ‘ఏనుగులు పోయే దారులను వదిలేసి, ఎలుకలు పోయే కలుగులను పూడ్చే’ తీరుగా సాగుతోన్న కేంద్రప్రభుత్వ చర్యలు దేశీయ సామాన్యజనం, మధ్యతరగతిలో మరింత అసంతృప్తిని రగల్చడం ఖాయం. వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు ‘ 98661 79615 డి. పాపారావు -
మలివిడత మాల్యా ఆస్తుల జప్తుపై ఈడీ దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలను చెల్లించకుండా, బ్రిటన్‌లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపార వేత్త విజయ్‌మాల్యాకు సంబంధించి మరిన్ని ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ తన చర్యలను ముమ్మరం చేసింది. మాల్యాపై విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే రూ. 8,041 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ దర్యాప్తు బృందం చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి ముంబై కోర్టు ఆదేశాలను సైతం పొందింది. ఈ సారి అటాచ్మెంట్ చేసే వాటిలో మాల్యా విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ ఈ నెల 3న రెండో విడత మాల్యాకు సంబంధించి రూ.6,630 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మాల్యా అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరిన ఈడీ తాజా అభియోగాలను నమోదు చేసింది. -
బడుగు రైతుపై మరో పిడుగు
- నిర్బంధ రుణ వసూళ్లకు డీసీసీబీ బరితెగింపు - బకాయిదారులకు నోటీసులు - ఆస్తులు జప్తు చేసి,వేలం వేస్తామంటూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నవ తెలంగాణలో పాత జమానా మొదలైంది. పటేల్, పట్వారీల నాటి పరిస్థితి మళ్లీ వచ్చింది. తలుపులు, కంచం, మంచం గుంజుకుపోయిన పాడురోజులు మళ్లీ రానేవచ్చాయి. అప్పులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేసి వేలం వేస్తామని హెచ్చరిస్తూ అన్నదాతలకు నోటీసులు జారీ చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అన్నంత పని చేయబోతోంది. ఈ నెల 20న మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఐదుగురు రైతులకు చెందిన భూములను జప్తు చేసి వేలం వేయడానికి సిద్ధమైంది. కాలం లేదు.. కనికరించండని కాళ్లు పట్టుకున్నా బ్యాంకోళ్లకు మనసు రాలేదు. జిల్లాలో రెండు వేలమంది రైతులను గుర్తించి ఈ ఏడాది కనీసం 800 మంది నుంచి బకాయిలు వసూలు చేయడమో..! లేదా భూములు వేలం వేయడమో చేయాలని డీసీసీబీ నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రమంతటికి విస్తరించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. రైతులు బిక్కుబిక్కు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు 24 శాఖలు ఉన్నాయి. వీటి నుంచి సగటున ఏడాదికి రూ.250 కోట్లకుపైగా పంట రుణాలు ఇస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 60 వేల మంది రైతులు సుమారు రూ.450 కోట్ల పంట రుణ సహాయం పొందారు. డీసీసీబీ నివేదికల ప్రకారం రెండువేల మంది రైతులు దీర్ఘకాలంగా బకాయిలు పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అధికారులు ఎప్పుడొచ్చి ఇళ్ల మీద పడుతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 20న రంగంపేటలో వేలానికి సిద్ధం.. కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి గతంలో రుణాలు తీసుకొని బకాయిలు పడిన ఐదుగురు రైతుల భూములను జప్తు చేసుకొని ఈనెల 20న వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సమీప గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఆసక్తి కలవారు వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన పురం అంజిరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీని అమ్ముకుని సహకార సంఘం అప్పు చెల్లించాడు. కానీ, సంఘపోళ్లు అప్పులు కట్టమని బెదిరిస్తున్నారు. లేకపోతే ఇంటి దర్వాజలు పీకేస్తామని హెచ్చరించి కాయితం ఇచ్చారని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన పాపోల్ల కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
వొడాఫోన్‌కు మళ్లీ పన్ను నోటీసులు
న్యూఢిల్లీ: వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ మళ్లీ షాకిచ్చింది. హచిసన్ వాంపోవా భారత కార్యకలాపాల కొనుగోలు డీల్‌కు సంబంధించి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ నోటీసులు పంపించింది. చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. 2007లో హచిసన్ వాంపోవాకి చెందిన భారత టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్ 11 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా రూ. 7,990 కోట్లు కట్టాలంటూ అప్పట్లో ఐటీ నోటీసులిచ్చింది. అయితే డీల్ విదేశంలో జరిగినందున భారత్‌లో తాము పన్నులు కట్టనక్కర్లేదంటూ వొడాఫోన్ దీన్ని వ్యతిరేకిస్తోంది. 2012లో సుప్రీం వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ ఆ తర్వాత పన్నుల చట్టాల్లో సవరణలతో వివాదం ఆర్బిట్రేషన్‌కు మళ్లింది. -
‘అక్షయగోల్డ్’ కేసుల్లో రూ.12.2 కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్ సిటీ: ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్షయ గోల్డ్ ఫర్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్, అక్షయ గోల్డ్ రియల్ ఎస్టేట్స్ అండ్ వెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసుల్లో రూ.12.2 కోట్ల స్థిరాస్తుల్ని జప్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సరైన రిజిస్ట్రేషన్లు, టైటిల్ డీడ్స్ లేని ఫ్లాట్ల అమ్మకాలతో పాటు వివిధ స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థలు భారీగా మోసానికి పాల్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 17 కేసులపై దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు డిపాజిట్‌దారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.41.54 లక్షల్ని ఇతర సంస్థలకు మళ్ళించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది నిందితులుగా నిర్థారించిన అధికారులు వారితో పాటు సంస్థల పేరిట ఉన్న స్థిరాస్తుల వివరాలు సేకరించారు. కృష్ణా, గుంటూరు, మెదక్‌లతో పాటు విశాఖపట్నంలో ఉన్న రూ.12.2 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్కారు మధ్యంతర అనుమతిస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీ అదనపు డీజీని ఆదేశించింది.