న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (పీఎన్‌బీ) మోసం చేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి దేశవిదేశాల్లో ఉన్న రూ. 637 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది. భారత్‌తో పాటు బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో స్థిరాస్తులు, జ్యుయలరీ, ఫ్లాట్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌ల రూపంలో ఈ అసెట్స్ ఉన్నట్లు వివరించింది. ఈ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య నానావతిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పీఎన్‌బీని నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలు దాదాపు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. జప్తు చేసిన మోదీ ఆస్తుల్లో న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో రూ.216 కోట్ల విలువ చేసే రెండు అపార్ట్‌మెంట్‌లున్నట్లు ఈడీ పేర్కొంది. ఇథాకా ట్రస్ట్ పేరుతో వీటిని కొనుగోలు చేశారని, దీని లబ్ధిదారు నీరవ్ మోదీ భార్య అమీ మోదీ అని వివరించింది. దుబాయ్, బహమాస్, అమెరికా, సింగపూర్ తదితర దేశాల నుంచి ఈ ట్రస్ట్‌లోకి నిధులు వచ్చాయని తెలిపింది.
మరోవైపు, లండన్‌లోని మెర్లిబోన్‌లో సుమారు రూ. 57 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కూడా అటాచ్ చేసింది. దీనికి మోదీ సోదరి పుర్వి లబ్ధిదారు. వీటితో పాటు దాదాపు రూ. 278 కోట్లు ఉన్న 5 బ్యాంక్ ఖాతాలనూ ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో హాంకాంగ్ నుంచి రూ. 23 కోట్ల వజ్రాభరణాలు భారత్‌కు వెనక్కి తీసుకొచ్చింది. అటు పుర్వి పేరిట ముంబైలోని ఫ్లాట్‌నూ ఈడీ అటాచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment