కొడనాడు ఎస్టేట్‌లోని జయలలిత నివాసం
అమ్మ మరణించింది. ఆస్తుల కేసులో జైలు శిక్ష తప్పింది. అయితే ఆమెకు విధించిన రూ.100 కోట్ల జరిమానా మాత్రం ఇంకా బతికే ఉంది. జయ శశికళ, ఇళవరసి,సుధాకరన్ కలిసి చెల్లించాల్సిన రూ.130 కోట్ల కోసం వారి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలనుఅనుసరించి ఆరు జిల్లాల్లోని జయలలితకు సొంతమైన ఆస్తులను పరిశీలించి స్వాధీనం చేసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వం త్వరలో ఒక జీవో జారీచేయనుంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో జయలలిత చెల్లించాల్సిన జరిమానా కింద ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని 1991–96 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.66 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు డీఎంకే ప్రభుత్వ హయాంలో జయలలితపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో జయ నెచ్చెలి శశికళ, శశికళ వదిన ఇళవరసి, శశికళ అక్క కుమారుడు, జయ మాజీ దత్తపుత్రుడు సుధాకరన్‌లను కూడా నిందితులుగా చేర్చారు. డీఎంకే హయాంలో ఈ కేసు కొన్నేళ్లు చెన్నై కోర్టులో విచారణ సాగింది. అ తరువాత ఎన్నికల్లో మరలా జయ అధికారంలోకి రావడంతో డీఎంకే వేసిన పిటిషన్‌తో కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. మొత్తం 20 ఏళ్లపాటు ఈ కేసు విచారణ సాగింది. ఎట్టకేలకుగత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జయలలిత సహా నలుగురికి నాలుగేళ్ల శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంతేగాక జయ రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురూ తలా రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పటికే జయ మరణించడంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఏడాదికి పైగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
జరిమానా వసూలుకు పిటిషన్
జయలలిత కన్నుమూసిన కారణంగా ఆమెకు విధించిన రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ గత ఏడాది మార్చి 22వ తేదీన సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది మేలో నలుగురి ఆస్తులను గుర్తించే పనిలో పడింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అనేక ఆస్తులను గుర్తించగా వాటిలో 128 ఆస్తులను జీవోల ద్వారా జప్తుచేశారు. మరో 68 అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. జరిమానా కింద కేసులో పేర్కొని ఉన్న జయకు చెందిన కొడనాడు ఎస్టేట్ తదితర ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కోర్టు తుదితీర్పు వెలువడి ఏడాది దాటినా ఆస్తుల స్వాధీనంపై చర్యలు చేపట్టని తమిళనాడు ప్రభుత్వంలో ఇటీవల కదలిక వచ్చింది. జయ సహా మొత్తం నలుగురికి చెందిన 68 ఆస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరునెల్వేలి, తంజావూరు, నీలగిరి... ఈ ఆరు జిల్లాల్లో ఈ నలుగురికి చెందిన భారీ ఆస్తులను లెక్కకట్టే చర్యలు చేపట్టింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరు జిల్లా కలెక్టర్లకు మార్చిలో ఉత్తరాలు కూడా రాశారు. అయితే ఏ చట్టం కింద ఆస్తులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు సందేహాన్ని వెలిబుచ్చారు. తమిళనాడు ప్రభుత్వ రెవెన్యూ ఆస్తుల స్వాధీనం చట్టం పరిధిలో సదరు ఆస్తులు ఉన్నాయని, ఈ ఆస్తులపై ఎలాంటి పరిశీనలను చేపట్టగలమని ప్రశ్నించారు. రెవెన్యూ ఆస్తుల స్వాధీనం చట్టం కిందనే జయ తదితరుల ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని ఆస్తుల కేసును విచారించిన పోలీసు ఉన్నతాధికారి ప్రభుత్వానికి సలహాఇచ్చారు.
ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతి
శశికళ తదితరుల జరిమానా వసూలు కోసం వారి ఆస్తులను అమ్మకానికి కోర్టు అనుమతిచ్చింది. ప్రత్యేక కోర్టు నడిపిన కర్ణాటక ప్రభుత్వానికి రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. జయ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులను ఎలా అమ్మాలో ఇంకా నిర్ణయం జరగలేదు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయ ఇంటిని స్మారక భవనంగా మారుస్తున్నారు. సదరు 68 ఆస్తులపై హక్కును తమిళనాడు ప్రభుత్వానికి బదలాయించే నిమిత్తం పరిశీలన జరిపేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం అవుతున్నారు. అలాగే మరో ఆరు బినామీ కంపెనీలను సైతం గుర్తించారు. ఆస్తుల స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నా జయ చెల్లించాల్సిన రూ.100 కోట్లకు సమం అవుతుందా అనే సందేహం కూడా ప్రభుత్వంలో నెలకొంది. త్వరలో ఒక జీవో జారీ అయ్యే అవకాశం ఉందని అవినీతి నిరోధకశాఖ పోలీసు అధికారులు చెప్పారు. సదరు ఆస్తులు ప్రభుత్వ పరమైన తరువాత వాటిని ఏం చేయాలనే అంశంపై కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment