సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తాలూకు అనుమానాల నివృత్తి కోసం ఆమె నెచ్చెలి శశికళపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది. మాజీ ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్, శశికళ బంధువు, వైద్యుడు కేఎస్ శివకుమార్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌లపై కూడా దర్యాప్తు చేయాలని జస్టిస్(రిటైర్డ్) ఎ.ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందే సమర్పించిన ఈ నివేదికను.. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ద్వారా బహిర్గతం చేసింది డీఎంకే ప్రభుత్వం. అయితే..
దర్యాప్తు కమిషన్ తమ నివేదికలో పొందుపర్చిన ఆరోపణలను వీకే శశికళ తోసిపుచ్చారు. జయలలితకు యాంజియోగ్రామ్ అవసరం ఎప్పుడూ తలెత్తలేదని, చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి తాను ఎలాంటి అడ్డుపడలేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న శశికళ.. ‘‘జయ, నేను స్నేహానికి ప్రతీరూపాలం. మమ్మల్ని విడదీయడానికి చేసిన కుట్ర వాస్తవికతను అర్థం చేసుకోవడానికే మేము ఉద్దేశపూర్వకంగా విడిపోయాం. ఆ కుట్ర వెనుక ఉన్న పరిణామాలను అర్థం చేసుకున్నాకే నేను మళ్లీ జయ దగ్గరికి చేరాను’’ అని శశికళ పేర్కొన్నారు.
ఇక జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికపై శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథుర పాండియన్ స్పందిస్తూ.. జయలలితకు అందిన చికిత్సతో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూర్తిగా డాక్టర్ల సమక్షంలోనే వైద్యం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎయిమ్స్ వైద్యులు జయలలిత ఆరోగ్యాన్ని చూసుకున్నారు. యాంజియోగ్రామ్ విషయంలోనూ ఆమె ప్రమేయం లేదు అని వెల్లడించారు.
జస్టిస్ ఆర్ముగస్వామి సమర్పించిన నివేదికలో.. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామమోహనరావు, ఇద్దరు వైద్యులపైనా విచారణ జరిపించాలని సూచించింది. జయలలితకు చికిత్స జరిగిన అపోలో ఆస్పత్రి చైర్మన్‌ను విచారించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని కమిషన్ అభిప్రాయపడింది. ఆరోగ్యంగా ఉన్న జయలలిత హఠాత్తుగా 2016 సెప్టెంబర్ 22న ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనిపై, ఆమెకు చేసిన చికిత్సలపై, మరణంపై నిజానిజాలను నిర్ధారించేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటవడం తెల్సిందే. శశికళతో సత్సంబంధాలు నెరిపిన జయలలిత 2011 నుంచి ఏడాది పాటు ఆమెను తన నివాసం నుంచి గెంటేసిన అంశాన్ని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది.
‘‘రాజకీయాల్లో కలగజేసుకోనని శశికళ లిఖితపూర్వక హామీ ఇచ్చాకే ఆమెను జయ మళ్లీ చేరదీశారు. జయ హృదయంలో సమస్య ఉందని, ఆమెకు శస్త్రచికిత్స అత్యావశ్యకమని అమెరికాకు చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శమీన్ శర్మ జయను ఆస్పత్రిలో 2016 నవంబర్ 25న హెచ్చరించారు. కానీ, అంత ఇబ్బందేమీ లేదని బ్రిటన్‌కు చెందిన మరో డాక్టర్ వారించారు. ఆమెకు యాంజియోగ్రఫీ కూడా చేయకుండా ‘ఇంకెవరో’ అడ్డుకున్నారు. ఈ అంశంలో అపోలో ఆస్పత్రి డాక్టర్ హస్తముంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరు డాక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఒకే ఒక వ్యక్తి శశికళ’ అని నివేదిక బహిర్గతంచేసింది. ఆగస్ట్ 27న ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే.
ఇదీ చదవండి: ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment