Commission charges
-
జయ, నేను స్నేహానికి ప్రతిరూపాలం!: శశికళ
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తాలూకు అనుమానాల నివృత్తి కోసం ఆమె నెచ్చెలి శశికళపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది. మాజీ ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్, శశికళ బంధువు, వైద్యుడు కేఎస్ శివకుమార్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌లపై కూడా దర్యాప్తు చేయాలని జస్టిస్(రిటైర్డ్) ఎ.ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందే సమర్పించిన ఈ నివేదికను.. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ద్వారా బహిర్గతం చేసింది డీఎంకే ప్రభుత్వం. అయితే.. దర్యాప్తు కమిషన్ తమ నివేదికలో పొందుపర్చిన ఆరోపణలను వీకే శశికళ తోసిపుచ్చారు. జయలలితకు యాంజియోగ్రామ్ అవసరం ఎప్పుడూ తలెత్తలేదని, చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి తాను ఎలాంటి అడ్డుపడలేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న శశికళ.. ‘‘జయ, నేను స్నేహానికి ప్రతీరూపాలం. మమ్మల్ని విడదీయడానికి చేసిన కుట్ర వాస్తవికతను అర్థం చేసుకోవడానికే మేము ఉద్దేశపూర్వకంగా విడిపోయాం. ఆ కుట్ర వెనుక ఉన్న పరిణామాలను అర్థం చేసుకున్నాకే నేను మళ్లీ జయ దగ్గరికి చేరాను’’ అని శశికళ పేర్కొన్నారు. ఇక జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికపై శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథుర పాండియన్ స్పందిస్తూ.. జయలలితకు అందిన చికిత్సతో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూర్తిగా డాక్టర్ల సమక్షంలోనే వైద్యం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎయిమ్స్ వైద్యులు జయలలిత ఆరోగ్యాన్ని చూసుకున్నారు. యాంజియోగ్రామ్ విషయంలోనూ ఆమె ప్రమేయం లేదు అని వెల్లడించారు. జస్టిస్ ఆర్ముగస్వామి సమర్పించిన నివేదికలో.. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామమోహనరావు, ఇద్దరు వైద్యులపైనా విచారణ జరిపించాలని సూచించింది. జయలలితకు చికిత్స జరిగిన అపోలో ఆస్పత్రి చైర్మన్‌ను విచారించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని కమిషన్ అభిప్రాయపడింది. ఆరోగ్యంగా ఉన్న జయలలిత హఠాత్తుగా 2016 సెప్టెంబర్ 22న ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనిపై, ఆమెకు చేసిన చికిత్సలపై, మరణంపై నిజానిజాలను నిర్ధారించేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటవడం తెల్సిందే. శశికళతో సత్సంబంధాలు నెరిపిన జయలలిత 2011 నుంచి ఏడాది పాటు ఆమెను తన నివాసం నుంచి గెంటేసిన అంశాన్ని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది. ‘‘రాజకీయాల్లో కలగజేసుకోనని శశికళ లిఖితపూర్వక హామీ ఇచ్చాకే ఆమెను జయ మళ్లీ చేరదీశారు. జయ హృదయంలో సమస్య ఉందని, ఆమెకు శస్త్రచికిత్స అత్యావశ్యకమని అమెరికాకు చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శమీన్ శర్మ జయను ఆస్పత్రిలో 2016 నవంబర్ 25న హెచ్చరించారు. కానీ, అంత ఇబ్బందేమీ లేదని బ్రిటన్‌కు చెందిన మరో డాక్టర్ వారించారు. ఆమెకు యాంజియోగ్రఫీ కూడా చేయకుండా ‘ఇంకెవరో’ అడ్డుకున్నారు. ఈ అంశంలో అపోలో ఆస్పత్రి డాక్టర్ హస్తముంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరు డాక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఒకే ఒక వ్యక్తి శశికళ’ అని నివేదిక బహిర్గతంచేసింది. ఆగస్ట్ 27న ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఇదీ చదవండి: ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే! -
నా కమీషన్ ఇప్పించండి
లండన్: భారత్‌లో మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల కొనుగోలు మధ్యవర్తి సంజయ్ భండారీ పదేళ్ల క్రితం నాటి తన కమీషన్ సొమ్ము ఇప్పించండంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్–2000 రకం యుద్ధవిమానాల నవీకరణ కాంట్రాక్ట్.. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆయుధాల సంస్థ ‘థేల్స్ గ్రూప్’కు దక్కేలా మధ్యవర్తిగా వ్యవహరించానని ఆయన కోర్టులో పేర్కొన్నారు. 2008 నుంచీ థేల్స్ కోసం పనిచేస్తున్నానని, అధునాతన మిరాజ్ విమానాలను భారత్‌కు విక్రయించేలా మధ్యవర్తిత్వంలో భాగంగా నాటి భారత రక్షణ శాఖ ఉన్నతాధికారితో భేటీని ఏర్పాటుచేశానని పిటిషన్లో ప్రస్తావించారు. భారత్ ప్రతిష్టాత్మంగా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను తయారుచేసే దసాల్ట్ ఏవియేషన్‌కు థేల్స్ సంస్థే కీలకమైన ‘ఏవియోనిక్స్’ ఉపకరణాలను సరఫరా చేస్తుండటం గమనార్హం. 2.4 బిలియర్ యూరోల(దాదాపు రూ.20వేల కోట్ల) విలువైన మిరాజ్ కాంట్రాక్ట్‌లో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మొత్తంగా 2 కోట్ల యూరోలు(దాదాపు రూ.167 కోట్లు) ఇస్తానని థేల్స్ సంస్థ హామీ ఇచ్చిందని, కానీ కేవలం 90 లక్షల యూరోలే(దాదాపు రూ.75 కోట్లు) ఇచ్చి చేతులు దులిపేసుకుందని ఆయన వెల్లడించారు. సంస్థ నుంచి మిగతా కమిషన్ ఇప్పించాలని ఆయన పారిస్ సమీపంలోని నాంటయర్లోని ‘ట్రిబ్యునల్ డీ కామర్స్’ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని బ్రిటన్‌కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. భారత వాయుసేనకు రఫేల్–బి, రఫేల్–సి రకం యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించిన చర్చల్లో ఫ్రాన్స్ కన్షార్షియంలో థేల్స్ ఉంది. యూపీఏ హయాంలో యుద్ధవిమానాల ఆధునికీకరణ ఒప్పందం వేళ భండారీకి, కాంగ్రెస్‌కు సత్సంబంధాలు కొనసాగాయని బీజేపీ ఆరోపించింది. రక్షణ కొనుగోళ్లు జరిగిన ప్రతీసారి ముడుపులపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, భండారీ మంచి మిత్రులని ఆరోపించారు. -
కమీషన్ బకాయి రూ.20 కోట్లు
మోర్తాడ్ (బాల్కొండ): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కమీషన్ బకాయి అందాల్సి ఉంది. సహకార సంఘాలకు కమీషన్ బకాయి వసూలు కాకపోవడంతో సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజను వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అయితే గడచిన ఖరీఫ్, రబీ సీజను నెలల కమీషన్ ఇంతవరకు చెల్లించకపోవడంతో సంఘాలకు బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 87 సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలు కొనసాగాయి. గడచిన ఖరీఫ్, రబీ సీజనులలో భారీ మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రతి క్వింటాలుకు నిర్ణయించిన మేరకు కమీషన్‌ను పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన సహకార సంఘాలకు ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ సీజను కమీషన్ ఆ సీజనులోనే చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు నిధులు కేటాయించకపోవడంతో కమీషన్ బకాయిలు పేరుకుపోయాయి. అనేక సహకార సంఘాలు కొనుగోలు కమీషన్‌ను సిబ్బంది జీత భత్యాలకు చెల్లిస్తున్నాయి. ఒక్కో సహకార సంఘంలో సిబ్బందికి నెలకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఎరువుల విక్రయం ద్వారా లభించే లాభాన్ని సహకార సంఘాల నిర్వహణకు వినియోగిస్తుండగా కొనుగోలు కమీషన్ నుంచి సిబ్బందికి జీత భత్యాలను చెల్లిస్తున్నారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలంగా ఉన్నా కమీషన్ బకాయి పేరుకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్క మోర్తాడ్ సహకార సంఘానికి రూ.30లక్షల కమీషన్ బకాయి అందాల్సి ఉంది. ఇలా జిల్లాలోని ప్రతి సహకార సంఘానికి ఎక్కువ మొత్తంలోనే కమీషన్ రావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కమీషన్ సొమ్మును సహకార సంఘాలకు అందించాలని పలువురు కోరుతున్నారు. కమీషన్ సొమ్ము కోసం ప్రతిపాదనలు పంపాం... సహకార సంఘాలకు కమీషన్ సొమ్ము మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాం. ఈ సీజను కొనుగోళ్లు ముగిసిపోయేలోపు కమీషన్ సొమ్ము మంజూరు అయ్యే అవకాశం ఉంది. – అభిషేక్ సింగ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ -
ఏపీఎంసీ మార్కెట్ యార్డులో కమీషన్ల దందా
కోలారు : జిల్లాలోని ఏపీఎంసీ మార్కెట్ యార్డులో రైతులు విక్రయించే కూరగాయలకు 8 నుంచి 10 రూపాయలు కమీషన్ వసూలు చేస్తున్నారని రైతు సంఘం పుట్టణ్ణయ్య వర్గం జిల్లా సంచాలకుడు కే.శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. చిక్కబళ్లా పురంలో 100 రూపాయలకు 3 రూపాయల కమీషన్ తీసుకుంటుండగా కోలారు జిల్లాలోని అన్ని ఏపీఎంసీ మార్కెట్లలో 100కు 8 నుంచి 10 రూపాయల వరకు కమీషన్లు గుంజుతున్నారని ఆరోపించారు. ఈ కమీషన్ దందాను వెంటనే అడ్డుకుని ఫిర్కాకో రైతు సంతలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగారుణాలు, వ్యవసాయ ఖర్చులను భరించలేకపోతున్నారన్నారు. మార్కెట్ యార్డులో కమీషన్లను అరికట్టాలని పలుమార్లు పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా జాక్ పాట్ పేరుతో 100 కిలోలకు 10 కిలోల చొప్పున తగ్గిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత చేస్తున్నా రాష్ట్రంలో తమ కంటే తక్కువ కమీషన్లు ఎక్కడా తీసుకోవడం లేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మార్కెట్ యార్డులో జరుగుతున్న నిలువు దోపిడీని అడ్డుకోవాలని డిమాండు చేశారు. విలేకరుల సమావేశంలో మరగల్ శ్రీనివాస్, తేర్నహళ్లి వెంకటస్వామిగౌడ పాల్గొన్నారు.