నా కమీషన్‌ ఇప్పించండి | Sanjay Bhandari Sues French Arms Company Over Unpaid Commission in 2011 IAF Deal | Sakshi
Sakshi News home page

నా కమీషన్‌ ఇప్పించండి

Published Wed, Jan 12 2022 5:12 AM | Last Updated on Wed, Jan 12 2022 5:17 AM

Sanjay Bhandari Sues French Arms Company Over Unpaid Commission in 2011 IAF Deal - Sakshi

లండన్‌: భారత్‌లో మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల కొనుగోలు మధ్యవర్తి సంజయ్‌ భండారీ పదేళ్ల క్రితం నాటి తన కమీషన్‌ సొమ్ము ఇప్పించండంటూ బ్రిటన్‌ కోర్టును ఆశ్రయించారు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్‌–2000 రకం యుద్ధవిమానాల నవీకరణ కాంట్రాక్ట్‌.. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆయుధాల సంస్థ ‘థేల్స్‌ గ్రూప్‌’కు దక్కేలా మధ్యవర్తిగా వ్యవహరించానని ఆయన కోర్టులో పేర్కొన్నారు.

2008 నుంచీ థేల్స్‌ కోసం పనిచేస్తున్నానని, అధునాతన మిరాజ్‌ విమానాలను భారత్‌కు విక్రయించేలా మధ్యవర్తిత్వంలో భాగంగా నాటి భారత రక్షణ శాఖ ఉన్నతాధికారితో భేటీని ఏర్పాటుచేశానని పిటిషన్‌లో ప్రస్తావించారు. భారత్‌ ప్రతిష్టాత్మంగా కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధ విమానాలను తయారుచేసే దసాల్ట్‌ ఏవియేషన్‌కు థేల్స్‌ సంస్థే కీలకమైన ‘ఏవియోనిక్స్‌’ ఉపకరణాలను సరఫరా చేస్తుండటం గమనార్హం.

2.4 బిలియర్‌ యూరోల(దాదాపు రూ.20వేల కోట్ల) విలువైన మిరాజ్‌ కాంట్రాక్ట్‌లో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మొత్తంగా 2 కోట్ల యూరోలు(దాదాపు రూ.167 కోట్లు) ఇస్తానని థేల్స్‌ సంస్థ హామీ ఇచ్చిందని, కానీ కేవలం 90 లక్షల యూరోలే(దాదాపు రూ.75 కోట్లు) ఇచ్చి చేతులు దులిపేసుకుందని ఆయన వెల్లడించారు. సంస్థ నుంచి మిగతా కమిషన్‌ ఇప్పించాలని ఆయన పారిస్‌ సమీపంలోని నాంటయర్‌లోని ‘ట్రిబ్యునల్‌ డీ కామర్స్‌’ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని బ్రిటన్‌కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్‌’ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది.

భారత వాయుసేనకు రఫేల్‌–బి, రఫేల్‌–సి రకం యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించిన చర్చల్లో ఫ్రాన్స్‌ కన్షార్షియంలో థేల్స్‌ ఉంది. యూపీఏ హయాంలో యుద్ధవిమానాల ఆధునికీకరణ ఒప్పందం వేళ భండారీకి, కాంగ్రెస్‌కు సత్సంబంధాలు కొనసాగాయని బీజేపీ ఆరోపించింది. రక్షణ కొనుగోళ్లు జరిగిన ప్రతీసారి ముడుపులపై కాంగ్రెస్‌ దృష్టిపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా, భండారీ మంచి మిత్రులని ఆరోపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement