ఏపీఎంసీ మార్కెట్ యార్డులో కమీషన్ల దందా
కోలారు : జిల్లాలోని ఏపీఎంసీ మార్కెట్ యార్డులో రైతులు విక్రయించే కూరగాయలకు 8 నుంచి 10 రూపాయలు కమీషన్ వసూలు చేస్తున్నారని రైతు సంఘం పుట్టణ్ణయ్య వర్గం జిల్లా సంచాలకుడు కే.శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. చిక్కబళ్లా పురంలో 100 రూపాయలకు 3 రూపాయల కమీషన్ తీసుకుంటుండగా కోలారు జిల్లాలోని అన్ని ఏపీఎంసీ మార్కెట్‌లలో 100కు 8 నుంచి 10 రూపాయల వరకు కమీషన్‌లు గుంజుతున్నారని ఆరోపించారు.
ఈ కమీషన్ దందాను వెంటనే అడ్డుకుని ఫిర్కాకో రైతు సంతలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగారుణాలు, వ్యవసాయ ఖర్చులను భరించలేకపోతున్నారన్నారు. మార్కెట్ యార్డులో కమీషన్‌లను అరికట్టాలని పలుమార్లు పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా జాక్ పాట్ పేరుతో 100 కిలోలకు 10 కిలోల చొప్పున తగ్గిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత చేస్తున్నా రాష్ట్రంలో తమ కంటే తక్కువ కమీషన్‌లు ఎక్కడా తీసుకోవడం లేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మార్కెట్ యార్డులో జరుగుతున్న నిలువు దోపిడీని అడ్డుకోవాలని డిమాండు చేశారు. విలేకరుల సమావేశంలో మరగల్ శ్రీనివాస్, తేర్నహళ్లి వెంకటస్వామిగౌడ పాల్గొన్నారు.