DMK Government
-
గౌరవం నిలపాలి!
తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్‌కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది. అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే. గవర్నర్ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్‌భవన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది. తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్‌తాయ్ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు. తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్‌తాయ్ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే. సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు. అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు. ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన. రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది. -
Narendra Modi: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?
సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచి్చన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచి్చన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు ‘అభివృద్ధి చెందిన భారత్’ రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పారీ్టలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పారీ్టల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెరి్మనల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన -
తమిళనాడు గవర్నర్‌పై బీజేపీ చీఫ్ అసంతృప్తి!
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై అక్కడి అధికార పక్షం డీఎంకే తీవ్రస్థాయిలో అసంతృప్తితో రగిలిపోతోంది. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన బాలజీ సెంథిల్‌ను ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మంత్రి పదవి నుంచి తొలగించడం.. అదీ న్యాయపరమైన చిక్కుల్ని తెచ్చిపెట్టే అంశం కావడంతో గవర్నర్ రవి వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత డీఎంకే రోజుకో రీతిలో గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీజేపీకి మేలు చేసేవే అయినప్పటికీ.. అలాంటి ప్రకటనలకు గవర్నర్ దూరంగా ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారాయన. విల్లుపురంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో అన్నామలై పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో.. గవర్నర్ వ్యవహరశైలిపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘‘డీఎంకే సంధించే ప్రతీ ప్రశ్నకు గవర్నర్ రవి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అది ఆయన పని కాదు. ఎందుకంటే ఆయన రాజకీయనేత కాదు. గవర్నర్ ప్రతిదానికీ సమాధానం చెప్పుకుంటూ పోతే.. ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడుతుందా?. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపై ఆయన (రవి) రోజూ ప్రెస్మీట్లు పెడితే ఈ ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఖచ్చితంగా అంగీకరించదు అని అన్నామలై వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమస్యలపై రోజూ మీడియాతో మాట్లాడతారని.. అలాంటప్పుడు తమిళనాడు గవర్నర్ అదే చేస్తే అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. దానికి అన్నామలై సమాధానమిస్తూ.. అలా జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషించే వ్యక్తిని తానేనని, ఎందుకంటే గవర్నర్ అలా మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తే అధికార పక్షం అక్రమాలు బయట పడతాయన్నారు. కానీ.. గవర్నర్ అలా చేయకూడదనే తాను బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ‘‘గవర్నర్ ఉంది రాజకీయాలు చేయడానికి కాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే అది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. గవర్నర్ తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఒకప్పుడు.. గవర్నర్లు ఆరు నెలలు లేదంటే సంవత్సరానికి ఒకసారి వార్తాపత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూశాం. అప్పుడది బాగానే ఉండేది. నేను ఇతర రాష్ట్రాల గవర్నర్లపై వ్యాఖ్యానించదలచుకోలేదు. ఎందుకంటే.. ఎవరి పని తీరు వారిది కాబట్టి. కానీ, తమిళనాడు విషయంలో అధికార డీఎంకే తప్పు చేసినప్పుడు.. ఆ పార్టీని బీజేపీ నేత విమర్శించడానికి.. ఓ గవర్నర్ విమర్శించడానికి తేడా ఉంటుంది కదా. అసెంబ్లీ లోపల గవర్నర్ ప్రభుత్వాలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయవచ్చు. అలా కాకుండా నాలాగే రోజూ ప్రెస్ మీట్ పెట్టడం మొదలుపెడితే గవర్నర్ అనే హోదాకి ఉన్న గౌరవం పోతుంది అని అన్నామలై చెప్పారు. ఇదీ చదవండి: మతతత్వ పార్టీలకు ప్రజాదరణ ఉండదు -
TN: మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్!
చెన్నై: తమిళనాట బుధవారం అర్ధరాత్రి దాకా పొలిటికల్ హైడ్రామా సాగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మంత్రి వీ సెంథిల్ బాలాజీని.. మంత్రి వర్గం నుంచి తొలగించడం, అదీ సీఎం స్టాలిన్‌ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై డీఎంకే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి మంత్రిని సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు.. అందుకోసం గవర్నర్ ఆర్ఎన్ రవి తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లడారు. గవర్నర్‌పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్‌కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. -
RSS March: ఆరెస్సెస్‌కు భారీ ఊరట
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్ భావించింది. అయితే స్టాలిన్ సర్కార్ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్, హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్, పొల్లాచ్చి, నాగర్‌కోయిల్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్‌కు ముందస్తుగా తెలిపింది మద్రాస్ హైకోర్టు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్ నిర్వహించుకోవచ్చని ఆర్ఎస్ఎస్కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. మరోవైపు కొయంబత్తూర్‌లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: పట్టపగలే శివసేన నేత దారుణ హత్య -
జయ, నేను స్నేహానికి ప్రతిరూపాలం!: శశికళ
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తాలూకు అనుమానాల నివృత్తి కోసం ఆమె నెచ్చెలి శశికళపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది. మాజీ ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్, శశికళ బంధువు, వైద్యుడు కేఎస్ శివకుమార్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌లపై కూడా దర్యాప్తు చేయాలని జస్టిస్(రిటైర్డ్) ఎ.ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందే సమర్పించిన ఈ నివేదికను.. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ద్వారా బహిర్గతం చేసింది డీఎంకే ప్రభుత్వం. అయితే.. దర్యాప్తు కమిషన్ తమ నివేదికలో పొందుపర్చిన ఆరోపణలను వీకే శశికళ తోసిపుచ్చారు. జయలలితకు యాంజియోగ్రామ్ అవసరం ఎప్పుడూ తలెత్తలేదని, చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి తాను ఎలాంటి అడ్డుపడలేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న శశికళ.. ‘‘జయ, నేను స్నేహానికి ప్రతీరూపాలం. మమ్మల్ని విడదీయడానికి చేసిన కుట్ర వాస్తవికతను అర్థం చేసుకోవడానికే మేము ఉద్దేశపూర్వకంగా విడిపోయాం. ఆ కుట్ర వెనుక ఉన్న పరిణామాలను అర్థం చేసుకున్నాకే నేను మళ్లీ జయ దగ్గరికి చేరాను’’ అని శశికళ పేర్కొన్నారు. ఇక జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికపై శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథుర పాండియన్ స్పందిస్తూ.. జయలలితకు అందిన చికిత్సతో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూర్తిగా డాక్టర్ల సమక్షంలోనే వైద్యం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎయిమ్స్ వైద్యులు జయలలిత ఆరోగ్యాన్ని చూసుకున్నారు. యాంజియోగ్రామ్ విషయంలోనూ ఆమె ప్రమేయం లేదు అని వెల్లడించారు. జస్టిస్ ఆర్ముగస్వామి సమర్పించిన నివేదికలో.. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామమోహనరావు, ఇద్దరు వైద్యులపైనా విచారణ జరిపించాలని సూచించింది. జయలలితకు చికిత్స జరిగిన అపోలో ఆస్పత్రి చైర్మన్‌ను విచారించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని కమిషన్ అభిప్రాయపడింది. ఆరోగ్యంగా ఉన్న జయలలిత హఠాత్తుగా 2016 సెప్టెంబర్ 22న ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనిపై, ఆమెకు చేసిన చికిత్సలపై, మరణంపై నిజానిజాలను నిర్ధారించేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటవడం తెల్సిందే. శశికళతో సత్సంబంధాలు నెరిపిన జయలలిత 2011 నుంచి ఏడాది పాటు ఆమెను తన నివాసం నుంచి గెంటేసిన అంశాన్ని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది. ‘‘రాజకీయాల్లో కలగజేసుకోనని శశికళ లిఖితపూర్వక హామీ ఇచ్చాకే ఆమెను జయ మళ్లీ చేరదీశారు. జయ హృదయంలో సమస్య ఉందని, ఆమెకు శస్త్రచికిత్స అత్యావశ్యకమని అమెరికాకు చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శమీన్ శర్మ జయను ఆస్పత్రిలో 2016 నవంబర్ 25న హెచ్చరించారు. కానీ, అంత ఇబ్బందేమీ లేదని బ్రిటన్‌కు చెందిన మరో డాక్టర్ వారించారు. ఆమెకు యాంజియోగ్రఫీ కూడా చేయకుండా ‘ఇంకెవరో’ అడ్డుకున్నారు. ఈ అంశంలో అపోలో ఆస్పత్రి డాక్టర్ హస్తముంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరు డాక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఒకే ఒక వ్యక్తి శశికళ’ అని నివేదిక బహిర్గతంచేసింది. ఆగస్ట్ 27న ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఇదీ చదవండి: ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే! -
త్వరలో ఉద్యోగులకు సీఎం స్టాలిన్ శుభవార్త?
సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మరి కొద్దిరోజుల్లో శుభవార్తను అందించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి తగిన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2003లో అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కారణంగా అనేక రాయితీలను ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ గత 19 సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాడుతూనే ఉన్నారు. కొత్త విధానం కారణంగా పదవీ విరమణ పెన్షన్‌ను, వైద్య భీమాను కోల్పోయామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితులు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలు కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానం మీద దృష్టి పెట్టాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఉద్యోగుల సంఘం ప్రభుత్వం ముందు తమ విజ్ఞప్తిని ఉంచుతూ లేఖాస్త్రం సందించింది. ఇందుకు ఆర్థిక కార్యదర్శి గోపాలకృష్ణన్ సమాధానం ఇస్తూ పేర్కొన్న అంశాలు ఉద్యోగుల్లో ఆశలు రెకెత్తించారు. 19 సంవత్సరాల పాటుగా జరిగిన పోరాటానికి ఫలితం దక్కబోతోందన్న ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: హనుమాన్ శోభాయాత్రలో హింస గోపాల కృష్ణన్ పంపిన ప్రకటనలో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్టు, పాత పెన్షన్ విధానం అమలుకు తగ్గట్టుగా పరిశీలన జరుగుతున్నట్లు వివరించారు. పాత పెన్షన్ విధానం అమలుకు తగ్గ సాధ్యాసాధ్యాల పరిశీలనకు నియమించిన కమిటీ తన సిఫారసుల్ని సీఎం స్టాలిన్‌కు సమర్పించినట్టు వివరించారు. త్వరలో మంచి నిర్ణయం ఉంటుందని, ఇందుకు తగ్గ ఉత్తర్వులు జారీ అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొనడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఎదురుచూపులు పెరిగాయి. -
లావణ్య సూసైడ్ కేసు.. స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
తమిళనాడును కుదిపేసిన విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకు అప్పగించాలన్న మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించాలన్న డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సాక్షి, న్యూఢిల్లీ: తంజావూర్ విద్యార్థిని లావణ్య(17) బలవన్మరణ ఉదంతం తమిళనాడును, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీ సీఐడీ లేదంటే సమానమైన దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలంటూ లావణ్య తండ్రి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో ఏకీభవించిన జస్టిస్ జీఎస్ స్వామినాథన్.. జనవరి 1న కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించారు. అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై నేడు(సోమవారం) విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేం కాదంటూ..) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది బెంచ్. అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధురై బెంచ్ ఏం చెప్పిందంటే.. తంజావూర్ మైకేల్పట్టీలో నివాసం ఉండేది లావణ్య కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య.. పదిరోజుల తర్వాత కన్నుమూసింది. స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా.. మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో.. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్. అదే టైంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది. -
తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం
-
తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలో వీవీఐపీలను మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14 శాతం ఓట్లు సాధించింది. స్టాలిన్ కేబినెట్లో 34 మందికి చోటు దక్కింది. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్ అవకాశం ఇచ్చారు. దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్విళి సెల్వరాజ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే! -
MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే!
చెన్నై: తమిళనాడు శాసనసభా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుతీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రేపు ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 34 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రాజ్‌భవన్‌కు అందిన అధికారిక సమాచారం ప్రకారం మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. 1. ఎంకే స్టాలిన్: ముఖ్యమంత్రి 2. దురైమురుగన్: జల వనరులు 3. కేఎన్ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు 4. ఐ. పెరియసామి: సహకార శాఖ 5. ఎన్. పొన్ముడి: ఉన్నత విద్య 6. ఈవీ వేలు: పబ్లిక్ వర్క్స్ 7. ఎంఆర్కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం 8. కేకేఎస్‌ఆర్ రామచంద్రన్: రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ 9. తంగం థెన్నరసు: పరిశ్రమల శాఖ 10. ఎస్ రఘుపతి: న్యాయ శాఖ 11. ఎస్. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి 12. కేఆర్ పెరియకరుప్పన్: గ్రామీణాభివృద్ధి శాఖ 13. టీఎం అంబారసన్: గ్రామీణ పరిశ్రమలు 14. ఎంపీ సామినాథన్: సమాచార, ప్రచార శాఖ 15. పి. గీతాజీవన్: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత 16. అనిత ఆర్ రాధాకృష్ణన్: మృత్స్యకార, జంతు పరిరక్షణ 17. ఎస్ఆర్ రాజకన్నప్పన్: రవాణా శాఖ 18. కే రామచంద్రన్: అటవీ శాఖ 19. ఆర్ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా 20: వీ. సెంథిల్ బాలాజీ: విద్యుత్, ప్రొబిషన్, ఎక్సైజ్ 21. ఆర్ గాంధీ: చేనేత, టెక్స్టైల్స్ శాఖ 22. ఎంఏ సుబ్రమణియన్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ 24. ఎస్ఎస్ శివశంకర్: బీసీ సంక్షేమం 25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ 26. పళనివేల్ త్యాగరాజన్: ఆర్థిక, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 27. ఎస్ఎమ్ నాజర్: పాలు, డెయిరీ డెవలప్మెంట్ 28. జిగ్నీ కేఎస్ మస్తాన్: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం 29. అన్బిల్ మహేశ్ పొయ్యమొళి: పాఠశాల విద్య 30. శివ వీ మెయ్యనాథన్: పర్యావరణ శాఖ 31. సీవీ గణేశన్: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ 32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 33. ఎం మతివెంతన్: పర్యాటక శాఖ 34. ఎన్కే సెల్వరాజ్: ఆది ద్రవిడ సంక్షేమం -
అధికారంలోకి వస్తే మిస్టరీ ఛేదిస్తాం
♦ శశికళ, పన్నీరుపై విచారణ కమిషన్ ♦జయలలిత మరణంపై స్టాలిన్ వ్యాఖ్య ♦జాలర్లతో సమావేశం సాక్షి, చెన్నై : తాము అధికారంలోకి రాగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటామని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శశికళ, పన్నీరుసెల్వంపై విచారణ కమిషన్ వేస్తామని ప్రకటించారు. ఆర్కేనగర్లో జాలర్ల సమస్యలపై జరిగిన సమావేశానికి స్టాలిన్ హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మనకు.. మనమే నినాదంతో స్టాలిన్ రాష్ట్ర పర్యటన సాగించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ, వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆ పర్యటనలో ముందుకు సాగారు. ఈ పర్యటనకు అమిత స్పందన రావడంతో ప్రస్తుతం మళ్లీ అన్ని వర్గాల సమస్యల అధ్యయనం మీద స్టాలిన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్కేనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో జాలర్లతో ఆయన సమావేశం అయ్యారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు, జాలర్ల కుటుంబాలు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. తమ సమస్యలను స్టాలిన్‌కు వివరించారు. సాగరంలో సాగుతున్న దాడులను, తమకు కరువు అవుతోన్న భద్రతను ఏకరువు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు సందించిన ప్రశ్నలకు స్టాలిన్ సమాధానాలు ఇచ్చారు. ఈసందర్భంగా స్టాలిన్ తన ప్రసంగంలో జాలర్ల సంక్షేమం లక్ష్యంగా గతంలో డీఎంకే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. నిఘా పెంచాలి : ఆర్కేనగర్లో ఎన్నికల యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఫిర్యాదుల్ని తక్షణం పరిశీలించి చర్యలు తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెండాకుల గుర్తు తన రూపంలో అన్నాడీఎంకేకు దురమైనట్టు టీటీవీ దినకరన్ చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించ దలచుకోలేదన్నారు. ఇలాంటి వారిపై విమర్శలు గుప్పించి తన స్థాయిని దిగజార్చుకోదలచుకోలేదని వ్యాఖ్యానించారు. జల్లికట్టు మద్దతు ఉద్యమకారుల్ని అణచి వేయడానికి పోలీసులు సాగించిన తీరు సర్వత్రా ఖండించ దగ్గ విషయమేనని స్పందించారు. ఆ సమయంలో విద్యార్థుల్ని పోలీసుల నుంచి రక్షించేందుకు అండగా నిలిచింది జాలర్ల కుటుంబాలకు చెందిన తల్లులేనని అభినందించారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని ఓ పన్నీరుసెల్వం, ఇప్పుడు స్పందిస్తున్న తీరు హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, డీఎంకే అధికార పగ్గాలు చేపట్టగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు తగ్గ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శశికళ, పన్నీరు సెల్వంSపై విచారణ కమిషన్ వేస్తామని, న్యాయ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
జయలలిత ఇక లేరు!
-
తలైవీ.. సెలవ్
తమిళ ప్రజల ‘అమ్మ’ జయలలిత అస్తమయం - శోకసంద్రంలో తమిళనాడు..రాష్ట్రమంతటా ఉద్రిక్తత - పరిస్థితిని ప్రధానికి వివరించిన వెంకయ్య - ఆస్పత్రి వేదికగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల భేటీ -ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ! - అవాంఛనీయ ఘటనలక తావివ్వకుండా సెల్ నెట్వర్క్ నిలుపుదల - రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడికక్కడ ఆగిపోయిన బస్సు సర్వీసులు - భద్రత దళాల గుప్పిట్లో రాష్ట్రం తమిళనాట ‘అమ్మ’ శకం ముగిసింది... విప్లవ నాయకి (పురచ్చి తలైవీ) విశ్రమించింది... 74 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ధీర నాయకి దిగంతాలకు చేరింది... ‘పురచ్చి తలైవీ’గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన తమిళనాడు సీఎం జయరాం జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న ఆమె ఆసుపత్రిలో చేరారు. జయ కోలుకున్నారని, రేపోమాపో డిశ్చార్జి అవుతారని కొద్దిరోజుల క్రితమే వైద్యులు ప్రకటించారు. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. లండన్ నుంచి వచ్చిన రిచర్డ్‌తో సహా ఎయిమ్స్ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి తీవ్ర ఉత్కంఠ మధ్య ‘అమ్మ ఇక లేరు’ అంటూ వైద్యులు ప్రకటించారు. దీంతో ‘అమ్మ’ అభిమానుల గుండెలు పగిలాయి. రోదనలు మిన్నంటారుు. ముందస్తు చర్యగా తమిళనాడు రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర సీఎంగా పన్నీర్ సెల్వం, మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయ నెచ్చెలి శశికళకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోరుుంది. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం అర్ధరాత్రి పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో 74 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. మూడు వారాల క్రితం డిశ్చార్జ్ దశకు చేరుకున్న దశలో ఈనెల 4వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో యాజమాన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఆమె ఇక లేరన్న వార్త వినాల్సివచ్చింది. అంతకు ముందు అమ్మకు ఏమైంది.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని చర్చించుకుంటున్న తరుణంలో ‘అమ్మ లేదిక’ అంటూ సోమవారం సాయంత్రం టీవీ మాధ్యమాల్లో వదంతులు ప్రసారం కావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఈడ్చి పారేసి లోపలకు చొరబడే ప్రయత్నం చేశారుు. మహిళా కార్యకర్తలు గుండెలవిసేలా రోదించారు. దుకాణలన్నీ మూతపడ్డారుు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఈ పరిస్థితిలో ‘వదంతులు నమ్మవద్దు.. అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారు’ అంటూ అపోలో యాజమాన్యం ప్రకటించడంతో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంది. జయకు వైద్యం కొనసాగుతుండగానే మరో వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉదయం, రాత్రి రెండు దఫాలుగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళకు పగ్గాలు అప్పగించే దిశగా పరిణామాలు మారిపోయారుు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందును బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు, సమావేశాలు కొనసాగాయి. ఆసుపత్రి వద్ద అభిమానుల రోదనలు అమ్మ ఇకలేరని తెలియగానే రాష్ట్రమంతటా ఒకటే ఆందోళన. ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా అపోలో ఆసుపత్రికి పరుగులు పెట్టారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో యాజమాన్యం ప్రకటించిన తరువాత.. ఈ 74 రోజుల కాలంలో ఆమె అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అపోలో ముంగిటే గడుపుతున్న మహిళా కార్యకర్తల ముఖాల్లో విషాదఛాయలు అలుముకున్నారుు. కన్నీటి పర్యంతమవుతూ గుండెలవిసేలా రోదించారు. రోజంతా ఉత్కంఠ సోమవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక బులిటెన్ విడుదల అవుతుందని అంతా ఉత్కంఠతో గడిపారు. ఇదే సమయంలో అపోలో ఆసుపత్రిలోని నర్సులను హడావుడిగా ఇంటికి పంపించేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆపోలోకు చేరుకున్నారు. మంత్రులతో కొద్దిసేపు సమావేశమై రాజ్‌భవన్‌కు చేరుకున్న తర్వాత కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అపోలో ఆసుపత్రి వైపునకు దారితీసే అన్ని మార్గాల్లో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు తలెత్తడంలో సిటీ బస్సులను నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు విముఖత చూపారు. తిరునెల్వేలీలో ప్రభుత్వ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఎక్మో చికిత్స గుండెపోటుకు గురైన ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డు నుంచి అత్యవసర వార్డుకు తరలించిన అపోలో వైద్యులు సోమవారం తెల్లవారుజామున శస్త్రచికిత్స చేసి ఎక్మో (ఎక్స్ ట్రాకోర్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) అనే వైద్య పరికరాన్ని ఆమె గుండెకు అమర్చారు. ఈ పరికరం గుండె, శ్వాసకోస సమస్యలను అధిగమించేలా చేస్తుంది. ఆగిపోరుున గుండెను తిరిగి పనిచేరుుంచే సామర్థ్యం కలిగిన ఎక్మో పరికరాన్ని ఆమర్చినా పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. సోమవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో యాంజియోగ్రామ్ కూడా చేశారు. ‘అమ్మ కోలుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.. ప్రజలు సైతం ఆమె కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ అపోలో మేనేజింగ్ డెరైక్టర్ సంగీత రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. సర్వశక్తులూ ఒడ్డాం: డాక్టర్ రిచర్డ్ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదట పడేలా చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డినట్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సోమవారం తెలిపారు. లండన్‌లో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వైద్య శాస్త్రంలోని అన్నింటిని ఆమె కోసం వినియోగించామని, అరుుతే ఎవ్వరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఆమె గుండెపోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీ నుంచి ఐదుగురితో కూడిన ఎరుుమ్స్ వైద్యుల బృందం చెన్నైకి చేరుకుని చికిత్స ప్రారంభించింది. రాత్రి 11.30 గంటల అనంతరం వారు తిరిగి వెళ్లారు. అంతకు ముందు.. ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా ట్వీట్ చేశారు. జయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్, పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీ, తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు తిరునావుక్కరసర్ అపోలోకు వచ్చి సీఎం క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. జయ కోలుకోవాలని ఆకాంక్షింస్తున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ అన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి అంతకంతకూ విషమించిన నేపథ్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన చెన్నైకి చేరుకోవాలని ఆదివారం రాత్రే అందరికీ సమాచారం ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో శశికళకు కేటారుుంచిన గదికి సోమవారం ఉదయం 6 గంటలకు మంత్రులు పన్నీర్ సెల్వం, ఎడపాడి పళనిస్వామి వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు, జైళ్ల శాఖ మాజీ అధికారి రామానుజం తదితరులు శశికళతో గంటపాటు సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమై పలు విషయాలపై గంటన్నరపాటు చర్చించారు. పార్టీ శాసన సభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వంవైపు మొగ్గు చూపినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి గా శశికళను ఎన్నుకోవాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. జయ ఆరోగ్యంపై మోదీకి వెంకయ్య సమాచారం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి వెంకయ్య నాయుడు అపోలోకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. తదుపరి మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పోయారు. కాసేపటి తర్వాత జయలలిత ఆరోగ్యం, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తి వివరాలను ఫోన్ ద్వారా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. నేటి సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం చెన్నైలోని మెరీనా బీచ్‌లో జయలలిత అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు, ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. స్తంభించిన జన జీవనం రాష్ట్రంలో ఒక వైపు కరెన్సీ కష్టాలు.. మరో వైపు సీఎం ఆరోగ్యం విషమించడంతో జనజీవనం దాదాపుగా స్తంభించిపోరుుంది. ముఖ్యమంత్రికి సంబంధించిన బులిటిన్ విడుదల కాకముందే జాగ్రత్త పడేందుకు ప్రజలు పెట్రోలు బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విద్యాశాఖ ఆ తరువాత మళ్లీ ఉపసంహరించుకుంది. విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకుండా సెల్ నెట్ వర్క్ సేవలను నిలుపుదల చేసేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలుప్రాంతాల్లో సెల్ఫోన్లు పనిచేయలేదు. చెన్నైలోని ఆమెరికా రాయబార కార్యాలయం వీసా జారీ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వీసాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నేతలంతా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ప్రజలు సైతం రాత్రివేళ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. రాష్ట్రమంతటా భారీ బందోబస్తు.. రాష్ట్రమంతటా దాదాపు హై అలర్ట్ ప్రకటించినట్లుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ఇద్దరు ఐజీలను నియమించారు. కేంద్రం పంపిన 900 పారా మిలటరీ దళాలు సోమవారం ఎనిమిది విమానాల్లో చెన్నై చేరుకున్నారుు. ఎరుుర్‌ఫోర్స్, నౌకాదళాలు కూడా అవసరమైతే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారుు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందారుు. సెలవులో వున్న పోలీసులంతా విధులకు హాజరు కావాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవు పెట్టరాదని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక పోలీసు ఉన్నతాధికారి ఆదివారం నాడు జరిగిన తన కుమారుని నిశ్చితార్థాన్ని సైతం వదలుకుని విధులకు హాజరయ్యారు. అమెరికా రాయబారి కార్యాలయానికి మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంకే ప్రముఖ నేతల ఇళ్ల వద్ద సాయుధ పోలీసులను ఉంచారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు పదే పదే హెచ్చరికలు జారీ అవుతున్నారుు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి గవర్నర్ విద్యాసాగరరావు తెలియజేశారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని సీఎం నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధం చేశారు. కర్ణాటక, కేరళ, ఏపీల మధ్య బస్సుల రాకపోకలను సరిహద్దుల్లోనే నిలిపి వేయడంతోపాటూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులను నియమించారు. -
నా జీవితమే పోరాటాలమయం...
ఎన్నడూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని జయలలిత కొన్ని సందర్భాల్లో పలువురు విలేకరులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారిలో సిమి గరేవాల్, కరణ్ థాపర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని అంశాలు... సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ... ప్రశ్న: ఎన్నో ఏళ్ల నుంచి మీ రాజకీయ జీవితాన్ని చూస్తున్నాను. గ్రేట్ జర్నీ. సినిమా కథలకంటే నాటకీయతతో కూడుకున్నది కదా? జయ: అవును. చాలా ఆందోళనకరమైన జీవితమే.. రాజకీయాలు మిమ్మల్ని కఠినంగా మార్చాయా? అవును. రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు చాలా బెరుగ్గా ఉండేదానిని. బిడియం ఎక్కువ. సమావేశాల్లో మాట్లాడాలంటే బాగా భయపడేదాన్ని. ఇప్పుడున్న స్థానానికి చేరుకుంటారని ఎప్పుడైనా ఊహించారా? లేదు. ముందు ఏం జరుగుతుందో తెలియకపోవడం కూడా మనకు మంచే చేస్తుంది. ముందే తెలిస్తే భయం వేసేది. మీ జీవితంలో అత్యంత కఠిన సమయమేది? ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో నా ప్రాధాన్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్లడమే నా జీవితంలో అత్యంత కఠిన సమయం. అప్పుడు నాకు కొనసాగాలనిపించలేదు. ఎందుకు మీకు కొనసాగాలనిపించలేదు? ఆ సమయంలో నేను చాలా అవమానాలెదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లు నన్ను అనుమానంతో చూశారు. నటులను, డాక్టర్లను, లాయర్లను, వేరే రంగాల్లో ఉన్నవారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంతో గౌరవంతో చేస్తారు. కానీ రాజకీయనాయకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఎంతో అవమానకరమైన ప్రశ్నలు అడుగుతారు. మనల్ని ఒక్కసారి కూడా కలవని వ్యక్తులు మన జీవితంలోని తప్పులను ఎత్తిచూపిస్తారు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. మీడియాలో నా గురించి వచ్చే వార్తలు నన్ను చాలా బాధ పెట్టాయి. మీరంటే కొందరు ఎందుకు భయపడతారు? నాకున్న పేరు వల్లేనేమో!(నవ్వుతూ). ఇంతకు ముందున్న జయలలిత వేరు. తను ఎప్పుడూ అందరితో కలిసేది కాదు. భయం భయంగా ఉండేది. ఎవరైనా నిలదీసినా తిరిగి సమాధానం చెప్పలేని భయస్తురాలు. ఎవరైనా అవమానిస్తే ఇంటికి వెళ్లి తలుపులు మూసుకుని ఏడ్చేది. ఆ జయలలిత ఇప్పుడు లేదు. నేను మారిన విధానాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. శశికళతో మీ సాన్నిహిత్యంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు? తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం నాపై తనకున్న విధేయత కారణంగానే చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తను వెనక్కి తగ్గలేదు. తను ఏడాది పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఎంతో బాధపడింది. అవినీతి కేసులతో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదు. నా మీద పెట్టిన అవినీతి కేసులన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవే. మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇదంతా ఎందుకు అని మీకు ఎప్పుడూ అనిపించలేదా? మార్చి 25, 1989న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో నాపై దాడి జరిగింది. వారి పార్టీలోని వాళ్లంతా చేతికి దొరికిన దాంతో నాపై దాడిచేశారు. అప్పుడు స్పీకర్ టేబుల్ మీద పెద్ద గాజు గంట ఉండేది. దాంతో నా తల మీద కొట్టాలని వారు ప్రయత్నించారు. అదే జరిగుంటే నేను ఇప్పుడు బతికుండే దాన్ని కాదేమో. వారిలో ఒకరు నా చీర లాగడానికి కూడా ప్రయత్నించారు. నన్ను చెప్పులతో కొట్టారు. అది అత్యంత దారుణమైన అనుభవం. నేను జైలుకు వెళ్లడం నా జీవితంలోనే అత్యంత బాధాకర సంఘటన. కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో... కరణ్ థాపర్: మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీ ముందు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు? జయ: ఇది అందరు రాజకీయ నాయకులకు జరిగేదే. డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరుణానిధికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ వారు మనుషులు.. (మధ్యలో కలుగజేసుకుని) నా చుట్టూ జరిగిన చిన్న విషయమైనా అతిగానే కనిపిస్తుంది. పెద్దవారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకోవడం భారతీయ సాంప్రదాయం. కానీ వారు రాష్ట్ర మంత్రులు.. జయ: నేను వారిని అలా చేయవద్దని చెప్పాను. వారు మీ మాట వినడం లేదా? వారు వింటారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రజల మధ్య అలా చేయడం మానేశారు. మీకు సమయం లేదని చెబుతున్నప్పుడు మీరు కక్ష అనే పదం వాడారు. మీ ముందున్న ముఖ్యమంత్రిపై ఒక రోజు ముందే కేసు నమోదైనా శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన్ను అరెస్టు చేయించారు.. (మధ్యలో కలుగజేసుకుని) నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. నేను ప్రశ్న పూర్తి చేశాక మాట్లాడండి. మీరేం అడుగుతున్నారో నాకు అర్థమైంది. డీఎంకే ప్రభుత్వం నా మీద అక్రమకేసులు బనారుుంచి నన్ను జైలుకు పంపింది. నేను 28 రోజులు ఆ కేసులో జైల్లో ఉండి... అంటే అది వ్యక్తిగత కక్షా? కరుణానిధి ఈ పని చేసినప్పుడు మీడియా ‘చెడుపై విజయం’ అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేసింది. అప్పుడు కరుణానిధి నాపై పన్నిన పన్నాగాన్ని కనిపెట్టిన ప్రజలు నన్ను 2001 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ మీరు ఆయన్ని అరెస్టు చేసినప్పుడు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి అవినీతి కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబ చానెల్ అరుున సన్‌టీవీ ఎంతో తెలివిగా ఎడిట్ చేసిన ఫుటేజ్‌తో ప్రజలను మాయ చేయాలని ప్రయత్నించారు. మీరు 77 సంవత్సరాల వయసున్న వ్యక్తిని అరెస్టు చేయించారు. అవినీతికి, వయసుకీ సంబంధం లేదు. అంటే అది వ్యక్తిగత కక్షా? అది వ్యక్తిగత కక్ష కాదు. అవినీతి కేసు. ముక్కుసూటితనం మీకు వ్యతిరేకంగా పనిచేస్తోందా? నేను నిజాయితీపరురాలిని. ఇప్పుడు మీతో కూడా నిజాయితీతో వ్యవహరించనివ్వండి. అలాగే ముక్కుసూటిగా నిజాలు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను. మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వాటిని ఖండిస్తాడు. పోటీపడుతూ ప్రకటనలు జారీ చేస్తారు. ఇతరులపై అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఖండించిన రాజకీయ నేత ఇప్పటివరకూ ఎవరూ లేరు. బాధ్యులెవరు, బాధితులెవరు? అన్న విషయాలకు అతీతంగా ఇలాంటి ఉన్మాద చర్యలను అందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. మైనారిటీలపై జరిగే వాటినే నేరాలుగా చూడటం సరికాదు. ఇలాంటి సంఘటనలు మొత్తం మానవత్వంపై జరిగిన దాడిగానే చూడాలి. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు మాత్రమే కాదు.. మెజారిటీ వర్గాల వారికీ హక్కులున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - మార్జి 1, 2002 (గోద్రా మారణ కాండ సమయంలో) నా జీవితంపై ఎంజీఆర్ ప్రభావం చాలా ఎక్కువ. కాదనను. అయితే ఇప్పుడు నేను.. నేనే! నా ఆలోచనలు, చర్యలన్నింటినీ ప్రభావం చేయగల వ్యక్తి మరొకరు ఇకపై ఉండరు. ఇతరుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రకటనలు చేయడమూ జరగదు. ఇకపై నేను సమాధానం చెప్పుకోవాల్సింది నాకు మాత్రమే. -మే 4, 1998 (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నేను మీ అమ్మను... బిడ్డలకు ఏది మంచిదో తల్లికే బాగా తెలుస్తుంది. మీ సంక్షేమమే నాకు సంతోషం. - ఎన్నికల ర్యాలీల్లో జయలలిత రాజకీయాల్లో నా తీరే వేరు. రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కొన్ని నాటకాలు తప్పనిసరి.. నాకు సినిమాల్లో కెమెరా ముందు నటించిన అనుభవం ఉండనే ఉంది. అరుుతే నిజ జీవితంలో నటించడం మాత్రం నాకు రాదు. పురుషాధిక్య రాజకీయ రంగంలో సొంతబలంపై పైకి ఎదిగిన మహిళను నేను. మహిళా నేతగా ఇందిరాగాంధీ ఉన్నత స్థారుుకి చేరినప్పటికీ ఆమెకు నెహ్రూ కుటుంబంలో పుట్టడమన్న అనుకూలత ఉంది’’ ప్రతి పోలీసు అధికారి ప్రతి సాధారణ పౌరుడు సురక్షింతంగా ఉంచడం కోసమే పనిచేయాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యాలను పొందేలా శిక్షణను పొంది ఉండాలి. సవాళ్లను ఎదుర్కొన్న వారే ప్రతిభావంతులుగా తయారవుతారు. ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి చక్కటి ఉదాహరణగా సినిమాలు ఉండాలి. చదువు.. నీ ప్రశ్నకు సమాధానాన్ని మాత్రమే ఇస్తుంది. సంస్కృతి అనేది మనిషిగా జీవించడానికి అతి ముఖ్యమైనది. ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలను వ్యతిరేకించినవారంతా ప్రతిపక్షం కాదు. వారు ప్రభుత్వ మంచి, చెడులను చెప్పి ఉత్తమ ఫలితాలను తీసుకురాగలరు. ఇదే ప్రతిపక్ష పార్టీ ప్రధాన ఉద్ధేశం. -
తెలుగుకు వెలుగునివ్వండి
తమిళనాడులోని తెలుగువారి పిల్లలు తమ మాతృభాషను అభ్యసించేలా మరికొంత కాలం వెసులుబాటు కల్పించాలని తదితర డిమాండ్లపై చెన్నైలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి బాలకృష్ణారెడ్డిని మంగళవారం కలిశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై:డీఎంకే ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన నిర్బంధ తమిళ చట్టం రాష్ట్రంలోని మైనార్టీ భాషల విద్యార్థుల పాలిట గుదిబండగా మారింది. పదోతరగతి పరీక్షల్లో విధిగా తమిళ పరీక్ష రాయాలన్న నిబంధనతో కూడిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని, కొన్నేళ్లపాటు వెసులుబాటు కల్పించాలని కోరుతూ చెన్నైలోని తెలుగు సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. చివరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి. 2015-16 విద్యాసంవత్సర పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా నిర్బంధ తమిళం చట్టంకు గురి అయ్యే ప్రమాదం నుండి మద్రాసు హైకోర్టు కాపాడింది. అయితే మళ్లీ ఈ విద్యాసంవత్సరంలో మైనార్టీ భాషల విద్యార్థులు నిర్బంధ తమిళం చట్టం చట్రంలో చిక్కుకోకుండా తెలుగు సంఘాలు అప్రమత్తమైనాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి కోటాలో హోసూరు నుండి అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణారెడ్డిని చెన్నైలోని ప్రభుత్వ అతిధి గృహంలో తెలుగు సంఘాల ప్రతినిధులు మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా వివిధ కోర్కెల వినతిపత్రాన్ని ద్రవిడ దేశం అధ్యక్షులు వి కృష్ణారావు, అఖిలభారత తెలుగు సమాఖ్య, లింఫాట్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి మంత్రికి అందజేశారు. నిర్బంధ తమిళం చట్టాన్ని రద్దు చేయాలని లేదా మరో నాలుగేళ్లపాటు మాతృభాషల్లోనే పది పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, తమిళ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, మైనార్టీ మాతృభాషల సిలబస్‌లో చేర్చి 1-9 తరగతుల వరకు నామమాత్ర మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆంధ్రప్రదేశ్లోలా మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి బాలకృష్ణారెడ్డి తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని సీఎంకే రెడ్డి, కృష్ణారావు మీడియాకు తెలిపారు. 2006లో ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టం అమలులో విఫలమైందని మంత్రి కూడా అంగీకరించారని తెలిపారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం..ఈ నాలుగు భాషలను తమ ప్రభుత్వం ద్రవిడ భాషలుగా పరిగణిస్తూ సమభావంతో చూస్తున్నదని మంత్రి అన్నారని తెలిపారు. మైనార్టీ సంఘాల కోర్కెలను ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళుతానని మంత్రి హామీ ఇచ్చారని వారు వివరించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, ప్రముఖ గాయకులు ఘంటసాల రత్నకుమార్, మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి మాడభూషి సంపత్‌కుమార్, ఉర్దూ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం యతిరాజులు, ఎస్ గజేంద్రబాబు, టీ బాబు, పీఆర్ కేశవులు, గంగన్న మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. -
అమ్మపై స్టాలిన్ ధ్వజం
* ప్రజల కష్టాలు తెలియవని విమర్శ * నియోజకవర్గాల్లో ప్రచారం టీనగర్: హెలికాప్టర్లో పయనించే జయలలితకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ధ్వజమెత్తారు. విల్లుపురం జిల్లాలో గురువారం రెండో రోజుగా స్టాలిన్ ప్రచారం జరిపారు. శంకరాపురంలో డీఎంకే అభ్యర్థి ఉదయసూర్యన్కు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన రిషివంద్యం అభ్యర్థి వసంతం కార్తికేయన్, తిరుక్కోవిలూరు అభ్యర్థి పొన్ముడి, చెంజి అభ్యర్థి మస్తాన్‌లకు మద్దతుగా ప్రచారం చేసి రాత్రి దిండివనంలో డీఎంకే అభ్యర్థి సీతాపతి చొక్కలింగంకు మద్దతుగా వండిమేడు ప్రాంతంలో ఓపెన్ టాప్ వ్యానులో ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ మే16వ తేదీన జరుగనున్న ఎన్నికలతో రాష్ట్రానికి విమోచన లభిస్తుందన్నారు. జయలలిత పురుషాధిక్య పాలన అంతమొందాలని, కరుణానిధి ఉన్నతమైన పరిపాలన రావాలని ఆకాంక్షించారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల ప్రయోజనాల కోసం డీఎంకే పోరాటాలు సాగిస్తూ వస్తోందన్నారు. 2006 ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా రైతుల సహకార బ్యాంకు రుణాలు ఏడు వేల కోట్ల రూపాయలను డీఎంకే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, గత ఐదేళ్లలో 2,400 మంది ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి రాష్ట్రంలో అధ్వానమైన ప్రభుత్వం నడుస్తోందన్నారు. గత 10వ తేదీన డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదలైందని, అందులో రైతులకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపామన్నారు. పంట రుణాలను మాఫీ చేస్తామని, వరికి రూ.2,500, చెరకుకు రూ.3.500 కొనుగోలు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతు బజార్లను విస్తృతం చేస్తామని, ఇది రైతులకు, పట్టణ ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. కొత్త విద్యుత్ మోటార్లు కొనుగోలు చేసేందుకు రూ.10 వేలు సబ్సిడీ, పంచాయతీలు అన్నింటిలోను ధాన్యం సేకరించేందుకు గోదాములు ఏర్పాటవుతాయన్నారు. మరక్కాణంలో చేపల ఓడరేవును ఏర్పాటుచేస్తామని, దిండివనం ప్రజల చిరకాల స్వప్నం అత్యాధునిక బస్టాండును నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అత్యాధునిక చికిత్సలు అందజేసే విధంగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. పారిశ్రామిక వాడలను పునర్మిస్తామని, దీని ద్వారా అనేక వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జయకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? హెలికాప్టర్లో పయనించే జయలలితకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని స్టాలిన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల సభల్లో అబద్ధాలు ఏకరువు పెడుతున్నారని విమర్శించారు. ఆమె సేలంలో ప్రసంగిస్తుండగా ఇద్దరు మృతిచెందారని, విరుదాచలంలో మాట్లాడుతుండగా ఇద్దరు చనిపోయారన్నారు. మండే ఎండల్లో ప్రజల్ని హింసిస్తున్నారని, నీళ్లు తాగేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదన్నారు. టాస్మాక్ దుకాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేయడమే ఆమె సాధన అంటూ ఎద్దేవా చేశారు. చెంబరంబాక్కం చెరువును తెరచి అనేక వేల మంది ప్రాణాలను బలిగొన్నారని, వేలాది మంది ప్రజలు ఇళ్లు, వస్తువులు కోల్పోయి నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎంకే అధికారంలోకి వస్తే టాస్మాక్ దుకాణాలను మూసివేస్తామని, లోకాయుక్త చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు. -
కాంగ్రెస్‌పై మరో మచ్చ
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రత్యేక ఈలంను కోరుతున్న అక్కడి తమిళులను శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోసింది. వేలాది మంది ప్రాణాలు హరించిపోగా, స్త్రీలు ధన, మాన ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై భారత్‌లో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. శ్రీలంక మారణకాండ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం తగినరీతిలో స్పందించలేదు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో ఘోరపరాజయం కావడం ద్వారా డీఎంకే భారీ మూల్యమే చెల్లించుకుంది. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధనేరస్తుడిగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ ముందు నిలబెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా తమిళులు భారతదేశాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతేగాక శ్రీలంక దేశానికి చెందిన ఎవరినీ దేశంలో కాలుమోపనీయకుండా నిరసనలు చేపడుతున్నారు. తమిళనాడుకు వచ్చిన వారిని తరిమి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐరాస మానవహక్కుల కౌన్సిల్లో శ్రీలంక వైఖరిని నిరసిస్తూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానికి 23 దేశాలు మద్దతు పలకగా, 12 దేశాలు వ్యతిరేకించాయి, 11 దేశాలు అభిప్రాయాన్ని తెలపకుండా పరోక్షంగా ఆమెరికా తీర్మానాన్ని తిరస్కరించాయి. ఈ 11 దేశాల్లో భారత్ కూడా ఉండడం తమిళుల ఆగ్రహానికి కారణమైంది. భారత్ మద్దతు తెలపాల్సింది : పి చిదంబరం శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని కేంద్రం బలపరిచి ఉండాల్సిందని కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్మానం విషయంలో అన్నాడీఎంకే అమెరికాకు వ్యతిరేకంగానూ, డీఎంకే అనుకూలంగా వ్యవహరించడం వల్లనే కేంద్రం తటస్థంగా ఉండిపోయిందని అన్నారు. శ్రీలంక తీరును నిలదీసేందుకు ఐరాస మాత్రమే కాదు ఇంకా అనేక అంతర్జాతీయ వేదికలు ఉన్నాయని, అపుడు ఒత్తిడితేవచ్చన్నారు. అయినా ఈ విషయం విదేశాంగ మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుందని తప్పించుకున్నారు. తమిళుల ఆవేదన : కరుణానిధి శ్రీలంకపై భారత్ ఉదాసీన వైఖరిని అవలంభించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు ఆవేదన చెందారని డీఎంకే అధినేత కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. భారత ప్రభుత్వమే దేశంలోని తమిళుల మనోభావాలను కాలరాసిందని అన్నారు. తమిళుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు అంగీకరించరని విమర్శించారు. దేశవ్యాప్త సమస్యలను పక్కనపెడితే రాష్ట్ర స్థాయిలో జఠిలంగా మారిన సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్ర బిందువుగా మారింది. శ్రీలంక యుద్ధం, తమిళ జాలర్లకు ఆ దేశం వల్ల వేధింపులు, రాజీవ్ హంతకులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను అడ్డుకోవడం కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయి. వీటికి అదనంగా అమెరికా తీర్మానం మచ్చ పడింది. -
విద్యుత్ సంక్షోభం
సాక్షి, చెన్నై:రాష్ర్టంలో రోజుకు విద్యుత్ వినియోగం పదకొండు వేల మెగావాట్లు. దానికి తగినట్లు ఉత్పత్తి లేకపోవటంతో కొన్నేళ్లుగా కోతలు విధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం పతనానికి ఈ కోతలు ప్రధాన కారణమయ్యాయి. అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే విద్యుత్ ప్రాజెక్టుల మీద దృష్టి సారిం చింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది. సెప్టెంబర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిం చడంతో క్రమంగా కోతల్ని తగ్గించారు. అక్టోబరు నుంచి పూర్తిగా కోతల్ని ఎత్తి వేశారు. పరిశ్రమలకు విధించిన విద్యుత్ ఆంక్షల్ని తగ్గించారు. నెల రోజులకు పైగా సంపూర్ణ విద్యుత్ అందడంతో సర్వత్రా ఆనందం వ్యక్తం చేశారు. ముగింపు దశలో ఉన్న మరి కొన్ని ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభిస్తే మరి కొద్ది రోజుల్లో మిగులు విద్యుత్‌ను రాష్ట్రం చూడబోతోందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, దురదృష్ట వశాత్తు రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో కొద్ది రోజులుగా అనధికారిక కోతల్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ సంక్షోభానికి కారణంగా కొత్త ప్రాజెక్టుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, జల విద్యుత్, పాత విద్యుత్ కేంద్రాల్లోని యూనిట్లు మరమ్మతులకు గురి కావడమే. విద్యుత్ కేంద్రాలు రాష్ట్ర విద్యుత్ శాఖ నేతృత్వంలో ఎన్నూర్, ఉత్తర చెన్నై, తూత్తుకుడి, మెట్టూరు థర్మల్ కేంద్రాలు ఉన్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో వళ్లూరులో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఎన్నూర్ కేంద్రంలో 220 మెగావాట్లు, ఉత్తర చెన్నైలో 1,230, మెట్టూరులో 1440, తూత్తుకుడిలో 1050 మెగావాట్లు ఉత్పత్తి అవుతోన్నది. మొత్తంగా రోజుకు 4,600 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఇక నీలగిరి కందా డివిజన్లో ఉన్న జల విద్యుత్ కేంద్రం నుంచి 880, కడంబారైలో 595, ఈరోడ్ కేంద్రంలో 423, తిరునల్వేలిలో 338 మెగావాట్ల చొప్పున మొత్తం 2,236 మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. గాలుల ప్రభావం బట్టి పవన విద్యుత్ ఉత్పత్తి, కేంద్రం వాటా, బయటి నుంచి కొనుగోళ్లతో విద్యుత్‌ను రాష్ట్రంలో సరఫరా చేస్తున్నారు. ఆగిన ఉత్పత్తి: ఉత్తర చెన్నైలో ఏర్పాటు చేసిన రెండు కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి హఠాత్తుగా ఆగింది. తూత్తకుడిలోని మూడు యూనిట్ల బ్రాయిలర్లు తరచూ పంక్చర్ అవుతోండటంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వళ్లూరులోలోనూ ఉత్పత్తి ఆగింది. ఇలా మొత్తం 1910 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో, ఆభారాన్ని కోతల రూపంలో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రుతుపవనాల చురుగ్గా లేకపోవడంతో జలాశయాల్లో నీటి మట్టం తగ్గుతోంది. సాగుకోసం నీటిని పొలాలకు తరలిస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీళ్లు అందడం లేదు. దీంతో జల విద్యుత్ కేంద్రాల ద్వారా 1200 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోరుుంది. రోజుకు మూడు వేల మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది, తాత్కాలికమే ఈ సంక్షోభం తాత్కాలికమేనని విద్యుత్ బోర్డు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రతి ఏటా అక్టోబరు చివరి వారం నుంచి డిసెంబరు నెలఖారు వరకు విద్యుత్ యూనిట్ల పరిశీలన, మరమ్మతులు జరగడం పరిపాటేనన్నారు. అయితే దురదృష్టవశాత్తు పక్కపక్కనే ఉన్న యూనిట్లు మరమ్మతులకు గురి కావడంతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన యూనిట్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు ఉత్పత్తిని నిలుపుదల చేశామని, డిసెంబరు నెలాఖరకు అన్నీ సర్దుకుంటాయని చెప్పడం గమనార్హం.