విద్యుత్ సంక్షోభం
Published Thu, Nov 21 2013 1:44 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
సాక్షి, చెన్నై:రాష్ర్టంలో రోజుకు విద్యుత్ వినియోగం పదకొండు వేల మెగావాట్లు. దానికి తగినట్లు ఉత్పత్తి లేకపోవటంతో కొన్నేళ్లుగా కోతలు విధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం పతనానికి ఈ కోతలు ప్రధాన కారణమయ్యాయి. అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే విద్యుత్ ప్రాజెక్టుల మీద దృష్టి సారిం చింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది. సెప్టెంబర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిం చడంతో క్రమంగా కోతల్ని తగ్గించారు. అక్టోబరు నుంచి పూర్తిగా కోతల్ని ఎత్తి వేశారు. పరిశ్రమలకు విధించిన విద్యుత్ ఆంక్షల్ని తగ్గించారు.
నెల రోజులకు పైగా సంపూర్ణ విద్యుత్
అందడంతో సర్వత్రా ఆనందం వ్యక్తం చేశారు. ముగింపు దశలో ఉన్న మరి కొన్ని ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభిస్తే మరి కొద్ది రోజుల్లో మిగులు విద్యుత్‌ను రాష్ట్రం చూడబోతోందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, దురదృష్ట వశాత్తు రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో కొద్ది రోజులుగా అనధికారిక కోతల్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ సంక్షోభానికి కారణంగా కొత్త ప్రాజెక్టుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, జల విద్యుత్, పాత విద్యుత్ కేంద్రాల్లోని యూనిట్లు మరమ్మతులకు గురి కావడమే.
విద్యుత్ కేంద్రాలు
రాష్ట్ర విద్యుత్ శాఖ నేతృత్వంలో ఎన్నూర్, ఉత్తర చెన్నై, తూత్తుకుడి, మెట్టూరు థర్మల్ కేంద్రాలు ఉన్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో వళ్లూరులో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఎన్నూర్ కేంద్రంలో 220 మెగావాట్లు, ఉత్తర చెన్నైలో 1,230, మెట్టూరులో 1440, తూత్తుకుడిలో 1050 మెగావాట్లు ఉత్పత్తి అవుతోన్నది. మొత్తంగా రోజుకు 4,600 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఇక నీలగిరి కందా డివిజన్‌లో ఉన్న జల విద్యుత్ కేంద్రం నుంచి 880, కడంబారైలో 595, ఈరోడ్ కేంద్రంలో 423, తిరునల్వేలిలో 338 మెగావాట్ల చొప్పున మొత్తం 2,236 మెగావాట్ల ఉత్పత్తి అవుతోంది. గాలుల ప్రభావం బట్టి పవన విద్యుత్ ఉత్పత్తి, కేంద్రం వాటా, బయటి నుంచి కొనుగోళ్లతో విద్యుత్‌ను రాష్ట్రంలో సరఫరా చేస్తున్నారు.
ఆగిన ఉత్పత్తి:
ఉత్తర చెన్నైలో ఏర్పాటు చేసిన రెండు కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి హఠాత్తుగా ఆగింది. తూత్తకుడిలోని మూడు యూనిట్ల బ్రాయిలర్లు తరచూ పంక్చర్ అవుతోండటంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వళ్లూరులోలోనూ ఉత్పత్తి ఆగింది. ఇలా మొత్తం 1910 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో, ఆభారాన్ని కోతల రూపంలో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రుతుపవనాల చురుగ్గా లేకపోవడంతో జలాశయాల్లో నీటి మట్టం తగ్గుతోంది. సాగుకోసం నీటిని పొలాలకు తరలిస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీళ్లు అందడం లేదు. దీంతో జల విద్యుత్ కేంద్రాల ద్వారా 1200 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోరుుంది. రోజుకు మూడు వేల మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది,
తాత్కాలికమే
ఈ సంక్షోభం తాత్కాలికమేనని విద్యుత్ బోర్డు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రతి ఏటా అక్టోబరు చివరి వారం నుంచి డిసెంబరు నెలఖారు వరకు విద్యుత్ యూనిట్ల పరిశీలన, మరమ్మతులు జరగడం పరిపాటేనన్నారు. అయితే దురదృష్టవశాత్తు పక్కపక్కనే ఉన్న యూనిట్లు మరమ్మతులకు గురి కావడంతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన యూనిట్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు ఉత్పత్తిని నిలుపుదల చేశామని, డిసెంబరు నెలాఖరకు అన్నీ సర్దుకుంటాయని చెప్పడం గమనార్హం.
Advertisement
Advertisement