కోతల ఎత్తివేత
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఎత్తివేసినట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలు, పరిశ్రమలతో సహా నిరంతర విద్యుత్ సరఫరాను అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం నాటి శాసనసభ సమావేశంలో డీఎంకే సభ్యులు కేసీ పళనివేలు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది, అయితే... అని కొనసాగిస్తున్న సమయంలో విద్యుత్‌శాఖా మంత్రి నత్తం విశ్వనాథన్ అడ్డుకున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేశామని చెప్పారు. అంతేగాక విద్యుత్ వాడకంలో పరిశ్రమలపై విధించిన ఆంక్షలను సైతం పూర్తిగా తొలగించామని తెలిపారు. మధ్యలో సీఎం జయలలిత జోక్యం చేసుకుని మాట్లాడుతూ, గత డీఎంకే ప్రభుత్వం పారిశ్రామిక వాడలపై
అపరిమితమైన ఆంక్షలను విధించగా తమ ప్రభుత్వం వాటన్నింటినీ తొలగించిందని పేర్కొన్నారు. మళ్లీ మంత్రి నత్తం మాట్లాడుతూ, విద్యుత్ కోతలను ప్రజలకు పరిచయం చేసిన ఘనత డీఎంకేదైతే వాటిని ఎత్తివేసిన ఘనత అన్నాడీఎంకేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడితే అది సాంకేతిక లోపం వల్లనే కానీ, కోతలు కాదని గ్రహించాలని కోరారు. కేంద్రంలోని గత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలపై అనేక అడ్డంకులు సృష్టించినా తమ ప్రభుత్వం వాటిని అధిగమించిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా వాటిల్లో 22 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని, వాటిని సీఎం జయ ప్రారంభించారని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. జపాన్ సౌజన్యంతో రూ.44 కోట్లతో కాంచీపురంలో 230 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు.
ఎంజీఆర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.15 కోట్లు
సినిమా పరిశ్రమలో చోటుచేసుకుంటున్న ఆధునిక విధానాలకు అనుగుణంగా ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ ఫొటోగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు అసెంబ్లీలో జయ ప్రకటించారు. అయితే ప్రస్తుతం డిజిటల్ విధానం అమల్లో ఉన్నందున సినిమా షూటింగ్ శిక్షణ కోసం మరిన్ని ఫ్లోర్లు కావాలని దక్షిణభారత సినీ వాణిజ్యమండలి విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు. వారి విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకుని రూ.15 కోట్లతో రెండు కొత్త ఫ్లోర్ల నిర్మాణానికి సిద్ధమయ్యూమని తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న 2.5 ఎకరాల్లో ఏసీ సౌకర్యంతో ఈ ఫ్లోర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ముద్రణాలయాన్ని సైతం రూ.21 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చు, స్వల్ప వ్యవధిలో ప్రభుత్వానికి కావలసిన అన్ని ముద్రణా పనులు పూర్తయ్యేలా ప్రింటింగ్ ప్రెస్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.