సాక్షి, చెన్నై:పదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తాండవం చేస్తోంది. వేళాపాలా లేకుండా అమల్లో ఉన్న విద్యుత్ కోతలతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. డీఎంకే సర్కారు పతనానికి ఈ కోతలే ప్రధాన కారణమయ్యూయి. సంపూర్ణ విద్యుత్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే సర్కారు అందుకు తగ్గ ప్రాజెక్టుల మీద దృష్టి కేంద్రీకరించింది. అయినా, కోతలు మాత్రం తగ్గలేదు. డీఎంకే హయూంలో అమల్లో ఉన్న ఆంక్షలతో పాటుగా మరి కొన్ని ఆంక్షల్ని అన్నాడీఎంకే సర్కారు అమల్లోకి తెచ్చింది. కొత్త ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంతో గత ఏడాది చివర్లో అవి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టుల రూపంలో వచ్చిన విద్యుత్‌తో కొన్నాళ్ల పాటు విద్యుత్ కోతలు తగ్గుముఖం పట్టాయి. క్రమంగా పట్టణాలు, నగరాల్లో కోతలు రద్దయ్యాయి. గ్రామాల్లో ఏదో ఒక సమయంలో గంటో, అరగంటో విద్యుత్ కోతలుండేవి.
మళ్లీ తాండవం: వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి సాగడంతో, ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తరచూ విద్యుత్ ప్రాజెక్టుల్లో తలెత్తే సాంకేతిక లోపంతో తలలు పట్టుకోవాల్సి వచ్చింది. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించే రీతిలో ముందుకు సాగిన అధికార వర్గాల నెత్తిన ఎన్నికల వేళ విద్యుత్ గండం వచ్చి పడింది. అన్నాడీఎంకే సర్కారులో ఈ ప్రభావం గుబులు పుట్టించింది. అయినా ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు. ఎన్నికల కోడ్ సడలించడంతో అధికార బాధ్యతలపై దృష్టి పెట్టిన సీఎం జయలలిత విద్యుత్ గండం నుంచి గట్టెక్కే మార్గాలపై సమీక్షించారు.
సమీక్ష: సచివాలయంలో ఉదయాన్నే మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్య లింగం, ఎడపాడి పళని స్వామి, ఎస్‌పీ వేలుమణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, కార్యదర్శులు కే షణ్ముగం, అపూర్వ వర్మ, కే పణీంద్ర రెడ్డి, ఎస్ సక్సేనా, రాజేష్ లఖాని, విద్యుత్ బోర్డు చైర్మన్ జ్ఞాన దేశికన్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న కోతలు, విద్యుత్ వాడకం, ఉత్పత్తి, కొరత అధిగమించడానికి తీసుకున్న చర్యలు, విద్యుత్ ఆంక్షలపై చర్చించారు. ఈ సమీక్ష అనంతరం జయలలిత ఆదేశాలతో ప్రకటన వెలువడింది. ఇందులో విద్యుత్ కోతలకు మంగళం పాడబోతున్నామన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపించారు. విద్యుత్ ఆంక్షలను ఎత్తివేస్తూ చర్యలు తీసుకున్నారు.
మా ఘనతే: డీఎంకే హయూంలో ఏ మేరకు విద్యుత్ సంక్షోభం తాండవం చేసిందోనన్న విషయాన్ని ఆ ప్రకటనలో గుర్తు చేశారు. విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడం లక్ష్యంగా భగీరథ ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్రంలో ఒక రోజుకు 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరంగా గుర్తు చేశారు. ఉత్పత్తి మాత్రం అందుకు భిన్నంగా ఉందని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, కొత్త ప్రాజెక్టుల గురించి వివరించారు. తమ ప్రయత్నాలతో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 8 వేల మెగావాట్లుగా ప్రకటించారు. అలాగే, కొత్త ప్రాజెక్టులతో 2500 మెగావాట్ల విద్యుత్ దక్కుతోందని పేర్కొన్నారు. అవసరాలకు తగట్టుగా ఐదు వందల మెగావాట్లను కొనుగోలు చేయడం లక్ష్యంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మరో 3300 మెగావాట్ల కొనుగోలు లక్ష్యంగా తాజాగా చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ 3300 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రక్రియ పూర్తి కావచ్చిందని, దశల వారీగా ఈ విద్యుత్ రాష్ట్రానికి అందనుందని ప్రకటించారు. ఐదు రోజులుగా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తెరగాలని సూచించారు.
ఐదు రోజులుగా సంపూర్ణ విద్యుత్‌ను అందిస్తున్నామని, దీన్ని కొనసాగించడం లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రకటించారు. డీఎంకే హయూంలో అమల్లో ఉన్న విద్యుత్ వాడకంలో ఆంక్షలు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు ఉదయం వేళల్లో విధించిన 20 శాతం, సాయంత్రం వేళల్లో విధించిన 90 శాతం విద్యుత్ వాడకంలో ఆంక్షలను ఎత్తి వేస్తున్నామని వివరించారు. అన్ని రకాల ఆంక్షలు జూన్ ఒకటో తేదీ నుంచి ఎత్తి వేస్తున్నామని ప్రకటిస్తూ, మిగులు విద్యుత్‌ను రాష్ట్రం చూడబోతోందని, కోతల రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దబోతున్నామని సీఎం జయలలిత ఆ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. జూన్‌లో పవన విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుందని, ఈ విద్యుత్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ప్రస్తుతానికి ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా, ఏదేని సాంకేతిక సమస్యలతో విద్యుత్ ప్రాజెక్టులు మొరాయించిన పక్షంలో మళ్లీ కోతలు అమలయ్యేనా? అన్నది వేచి చూడాల్సిందే!
కోత’లుండవ్
Published Tue, May 27 2014 11:18 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement