సాక్షి, చెన్నై: రాష్ట్రంలో గతంలో కోతల మోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది చివర్లో కొత్త ప్రాజెక్టులు చేతికి అంది రావడంతో ఉత్పత్తి మెరుగు పడింది. దీంతో కోతలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. అయితే, నెలకోసారి మరమ్మతుల పేరిట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాంతాల వారీగా సరఫరాను నగరాల్లో నిలుపుదల చేస్తూ వచ్చారు. గ్రామాల్లో రోజు ఏదో ఒక సమయంలో గంటో అరగంటో విద్యుత్ సరఫరా ఆగేది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వారంలో రాష్ట్రంలో ఉన్నట్టుండి విద్యుత్ సంక్షోభం నెలకొంది. వేసవి దృష్ట్యా, విద్యుత్ వాడకం పెరిగింది. అయితే, గతంలో మాదిరిగా గ్రామాలు అంధకారంలో మునిగే రీతిలో కోతల మోత విధిస్తుండడంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఎన్నికల్లో ఈ కోతలు ఎక్కడ తమ అభ్యర్థుల ఓట్లకు గండి కొడుతాయోనన్న బెంగతో, ఈ కోతల వెనుక కుట్ర ఉందని సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోపించారు.
కేంద్రం వాటా ఉన్నట్టుండి తగ్గడం, రోజు మార్చి రోజు అన్నట్టుగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని యూనిట్లు మరమ్మతులకు గురి కావడం ఆమె అనుమానాలకు బలం చేకూర్చినట్టు అవుతోంది. రంగంలోకి ఇంటెలిజెన్స్: కుట్ర జరుగుతోందన్న అనుమానాలను సీఎం జయలలిత వ్యక్తం చేయడంతో విచారణకు ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. రహస్యంగా విచారణ చేపట్టే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్‌ను ఆదేశించడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తూత్తుకుడి, ఉత్తర చెన్నై థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ బృందం పరిశీలనలో పడింది. రోజు మార్చి రోజు అన్నట్టుగా యూనిట్లలో సాంకేతిక సమస్య తలెత్తడం వెనుక కారణాలను సేకరిస్తున్నది. ఆ సమయాల్లో అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగ, సిబ్బంది వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.
ఓ యూనిట్ మరమ్మతులకు గురి కావడం, అది సరికాగానే, మరో యూనిట్ మరమ్మతులకు గురవుతోంది. ఇందుకు గల కారణాలను పూర్తి వివరాలతో సేకరిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో చేపట్టిన సమగ్ర పరిశీలన మేరకు త్వరలో రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా కుట్ర జరిగిందా? లేదా సాంకేతిక లోపమా? అన్నది తేలనున్నది. సాంకేతిక లోపం తలెత్తిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ, ఈ రాజకీయాలకు తమ మీద వేటు పడుతుందేమోనన్న బెంగ వారిలో నెలకొంది.
ఖండించిన కాంగ్రెస్: జయలలిత ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. కేంద్రం వాటా తగ్గిందని ఆమె పేర్కొనడం ఆధార రహిత ఆరోపణ అని కేంద్ర సహాయ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ పేర్కొన్నారు. ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ వాటాను తగ్గించి కుట్రలు చేయాల్సిన అవసరం కేంద్రానికి లేదన్నారు. తమిళనాడుకు నైవేలి, తదితర కేంద్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థల నుంచి సక్రమంగానే విద్యుత్ వాటా దక్కుతోందని, అయితే, జయలలిత తప్పుడు సంకేతాలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.